ధర్మో రక్షతిః రక్షతః’ అన్న సంకల్పంతో సాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక సంస్థ ‘మానవ సేవ’కూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఏడుకొండలవాడికి మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఉచితంగానే అందిస్తోంది. ప్రపంచంలో మరో పుణ్యక్షేత్రమూ సాటిరాని విధంగా యాత్ర సందర్భంగా భక్తులపై ఆర్థిక భారం పడకుండా ఉచితంగా వివిధ రకాల సేవలందిస్తోంది. ప్రతిఏటా ఉచిత సేవల్ని పెంచుతూ సేవాతత్పరతను పెంచుకుంటూ, ఆలయ ప్రతిష్ఠను దశదిశలా చాటుతోంది.
ఉచిత బస్సు (ధర్మరథం)
వివిధ ప్రాంతాల నుండి తిరుపతి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ల లో దిగిన భక్తులు అలిపిరి వరకు, శ్రీవారి మెట్టుమార్గాల వరకు ప్రయాణించేలా టీటీడీ ధర్మరథం పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.
తిరుమలకు చేరిన భక్తులకు ప్రయాణకష్టం తలెత్తకుండా అన్ని కాటేజీలు, అతిథిగృహాలను కలుపుతూ ప్రతి రెండు నిమిషాలకో బస్సు చొప్పున మొత్తం 13 బస్సులు భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి.
కాలిబాటల్లో ఉచిత లగేజీ
ఇక నడిచి వచ్చే భక్తుల లగేజీని కూడా ఉచితంగానే టీటీడీ తిరుమలకు చేరవేస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో ఇందుకోసం ప్రత్యేకంగా లగేజీ కేంద్రాలు ఏర్పాటు చేసి కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు లగేజీ కష్టాలు లేకుండా చేసింది.
ఉచిత తలనీలాల సమర్పణ
శ్రీవారి ప్రధాన కల్యాణ కట్టతోపాటు మినీ కల్యాణకట్టల్లోనూ ఉచితంగా తలనీలాలు సమర్పించవచ్చు. భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా టీటీడీకి ఏటా రూ.100 నుండి రూ.150 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.
ఉచిత అన్నప్రసాదాల వితరణ
1985లో రోజుకు 2 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించే లక్ష్యంతో ఆరంభించిన నిత్యాన్నదాన పథకం ద్వారా నేడు లక్షన్నర మందికి షడ్రుచులతో కూడిన వంటలు వడ్డించే స్థాయికి చేరింది.
ఆకలే అర్హతగా ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎవౖరైనా ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. దీనితోబాటు గత రెండేళ్లుగా ఉదయం వేళలో అల్పాహారం కూడా అందిస్తున్నారు.
స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, వెలుపల క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు రుచికరమైన సాంబారన్నం, పెరుగన్నం, కాఫీ, టీ, చంటిబిడ్డలు – వృద్ధులకు వేడి పాలు అందజేస్తున్నారు.
ఉచిత యాత్రిసదన్లు
తిరుమలలో పరిమిత సంఖ్యలో ఉచిత గదులు మంజూరు చేస్తున్నారు. గదులు లభించని భక్తులకు సుమారు 15 వేల మందికి సరిపడా భారీ స్థాయిలో వసతి సముదాయాలు ఐదు భవంతులు (యాత్రిసదన్) నిర్మించారు. ఇక్కడ ఉచితంగా లాకర్లు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, సేద తీరేందుకు అన్ని వసతులతో కూడిన అతిపెద్ద హాళ్లు (వరండాలు) అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే వృద్ధులకు ప్రత్యేకంగా పడక గదులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మూడు యాత్రీసదన్లు ఉండగా, కొత్తగా నాల్గో యాత్రిసదన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఉచిత బ్యాటరీ వాహనాలు
∙శ్రీవారి దర్శనం కోసం నడవలేని దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. ఎస్‌వీ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్ల వద్ద అందుబాటులో ఉంచారు. ఇక శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు.
అశ్వినీ ఉచిత వైద్యశాల
తిరుమలకు చేరిన భక్తులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు అశ్వినీ ఆస్పత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, ఇతర ప్రాంతాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రులకు అనుబంధంగా అపోలో ఆస్పత్రికి చెందిన హృద్రోగుల ఉచిత ప్రథమ చికిత్సా కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేశారు.
ఉచిత అంబులెన్స్
అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు, తిరుమల ఆలయం వద్ద 24 గంటలూ అందుబాటులో ఉండే ఆరు అంబులెన్స్‌లు భక్తులకు సేవలందిస్తాయి.
ఉచిత ఆటోక్లీనిక్ వాహనం
కాలిబాటలో ప్రయాణించే వారి వాహనాలు మరమ్మతులకు గురైతే వాటికి ఉచిత సేవలతోపాటు గమ్యస్థానానికి చేర్చేలా ఘాట్‌రోడ్డు మొబైల్ వ్యవస్థ ఏర్పాటు. ఇక అనుకోని ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించేందుకు ఉచిత క్రేన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
ఉచిత లగేజీ సెంటర్లు
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల పాదరక్షలు, సెల్‌ఫోన్లు, లగేజీ భద్రపరుచుకునేందుకు ఉచిత కౌంటర్లు ఏర్పాటు చేశారు. దర్శనానికి వెళ్లే సమయంలో వాటిని భద్రపరచవచ్చు. తిరిగి పాత అన్నప్రసాద కేంద్రం పీఏసీ–4లోని లగేజీ కేంద్రంలో పొందవచ్చు.
కాలిబాట భక్తులకు ఒక ఉచిత లడ్డూ
కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక లడ్డూ (రూ.25 ధర) ఉచితంగా అందజేస్తున్నారు. ఇక ఆలయంలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ అన్నప్రసాదాలు/ 25 గ్రాములు చిన్న లడ్డూ, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
చంటిబిడ్డ తల్లిదండ్రులకు ఉచిత దర్శనం
∙ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డ తల్లిదండ్రులకు సుపథం (రూ.300 టికెట్ల దర్శనంతో కలిపి) ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు.∙ఇటీవల నిర్ణీత వేళల్లో 5 సంవత్సరాల వయసులోని చంటిబిడ్డ తల్లిదండ్రులకు నెలలో రెండుసార్లు, రెండు టైం స్లాట్లలో సుమారు 5వేల మందికి సుపథం నుండే ఉచిత దర్శనం కల్పిస్తున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం
65 ఏళ్లు వయసు నిండిన వృద్ధులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమర యోధులు ఆలయం పక్కనే దక్షిణ మాడ వీధిలోని ప్రత్యేక క్యూలైను ద్వారా మహాద్వారం నుంచి ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు. రోజులో ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 10 గంటలకు అనుమతిస్తారు. ఇక రద్దీ లేని రోజుల్లో నెలలో రెండుసార్లు, రెండు టైం స్లాట్లలో మొత్తం 4 వేల మంది దివ్యాంగులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
తిరుమలలో కొత్త మార్పులివే...!!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందించే సౌకర్యాలను పెంచుతూ, ఎప్పటికప్పుడు కొత్తమార్పులు చేస్తోంది. బస, దర్శనం, లడ్డూలు, గదుల కేటాయింపు.. మంజూరులో కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టింది.
అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల్లో నడిచి శ్రీవారి మొక్కులు చెల్లించే భక్తులకు టైం స్లాట్ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. రోజుకు 20 వేల టికెట్లు ఇస్తున్నారు.. అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టికెట్లు ఇస్తున్నారు. టికెట్లపై నిర్ణయించిన సమయం ప్రకారమే భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
దివ్యాంగులు, వృద్ధుల క్యూలైన్లకూ కొత్తగా టైంస్లాట్ అమలు చేస్తున్నారు. ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు రెండు విడతల్లో 1,500 మందిని స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం భక్తులు ఉదయం 6 గంటల నుండే ఎస్‌వీ మ్యూజియం కౌంటర్ వద్ద ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో స్వామి దర్శనానికి సంబంధించి టైం స్లాట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయానికి భక్తులు స్వామి దర్శనానికి వెళ్లవచ్చు. సర్వదర్శనం కోసం రెండోవైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సి వస్తుండటంతో భక్తులు తమ కుటుంబీకులతో ఫోన్‌లో సంభాషించేందుకు టెలిఫోన్ సౌకర్యం కల్పించారు. భక్తులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ఇక్కడే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ∙ఇక తిరుమలలో కొత్తగా భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్లలో కూడా అన్నప్రసాదాల వితరణ చేస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే చిన్నారుల కోసం అన్నదాన విభాగం పాలసరఫరా చేస్తోంది.
ఇంటర్నెట్ ద్వారా పొందే రూ.300 టికెట్లతోపాటు అదనపు లడ్డూలు కావాలంటే ఒక టికెట్‌పై ఒకరు గరిష్టంగా మరో రెండు లడ్డూలు పొందవచ్చు. 300 టికెట్ ధరతోపాటు లడ్డూల కోసం అదనంగా రూ.50 నగదు చెల్లించాలి. ఎన్ని టికెట్లు తీసుకున్నా అదనంగా రెండేసి లడ్డూలు పొందవచ్చు.∙భక్తులు ఆన్‌లైన్‌లో గదులు ముందస్తుగా రిజర్వు చేసుకున్న తేదీ కంటే 48 గంటల కంటే ముందు రద్దు చేసుకుంటే ఆ గది అద్దె ధర 100 శాతం తిరిగి భక్తుడి ఖాతాకు చేరిపోతోంది. ఇక తిరుమలకు వచ్చిన తర్వాత తీసుకున్న గది గడువు 24 గంటల సమయం కంటే 12 గంటల్లోపు ఖాళీ చేస్తే చెల్లించిన అద్దె ధరలో 50 శాతం, 18 గంటల్లోపు ఖాళీ చేస్తే 25 శాతం నగదు తిరిగి వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
‘
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565