ధనస్సులోకి
శని ప్రవేశించాడు భాగం - 1
శ్రీ హేమలంబ నామ సంవత్సర కార్తిక మాసం శుక్ల సప్తమి గురువారం తేదీ 26 అక్టోబర్ 2017 మధ్యాహ్నం 3 గంటల 28 నిముషాలకు మూల నక్షత్ర 1వ పాదమైన ధనుస్సు రాశిలోకి శని గ్రహం ప్రవేశించాడు. తిరిగి ధనుస్సు నుంచి 2020 జనవరి 24 వ తేదీ తదుపరి రాశియైన మకరంలోకి ప్రవేశించనున్నాడు. 821 రోజుల పాటు ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడన్నమాట. అయితే ఆయుష్కారకుడైన శని ధనుస్సు రాశి ప్రవేశం చేయగానే, మేష రాశివారికి అష్టమ శని, సింహరాశి వారికి అర్ధాష్టమ శని, తులా రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయిందన్నమాట.
వృషభ రాశివారికి అష్టమ శని, కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని, మకర రాశి వారికి ఏలినాటి శని, ప్రారంభం కాగా వృశ్చిక రాశి వారికి చివరిభాగ (మూడవ భాగం ) ఏలినాటి శని, ధనుస్సు రాశి వారికి మధ్య భాగం (రెండవ భాగం) ఇదే సమయం నుంచే ప్రారంభమయ్యాయి. ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శని అనగానే నూటికి 99 మందికి వెన్నులో చలి పుడుతుంది. ఇంకేముంది శని గ్రహం వచ్చి పడింది. ఇక ఏమి చేసినా పీడ ఏర్పడుతుంది అని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కనుక అలాంటిదేమి ఉండదని ధైర్యంగా ఉంటూ శని ఆయుష్కారకుడని తెలుసుకుని, అంతర్గత శత్రుత్వ పోకడలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటిని అడ్డుకొనగలిగితే సర్వకాల సర్వావస్థలలో విజయకేతనం ఎగరవేయగలరు.
జ్యోతిష శాస్త్ర నిర్ణయం ప్రకారంగా ఆయుష్కారకుడైన శని మకర, కుంభ రాశులకు అధిపతిగా ఉంటూ, ద్వాదశ రాశులు కలిగిన ఈ ఖగోళ మండలాన్ని చుట్టి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ ఖగోళ మండలాన్ని చంద్రుడు చుట్టి రావటానికి 29 రోజుల 12 గంటల 44 నిముషాల 3 సెకన్ల కాలం పట్టును. అంటే ఎంత వేగంగా 12 రాశులను తిరిగి వస్తున్నాడో.. ఈ వేగాన్ని చూస్తే అర్ధమవుతుంది.
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, మనః కారకుడు, శనికి అంతర్గత శత్రువు. ఇట్టి చంద్రుడు, జన్మించిన సమయానికి ఏ నక్షత్రంలో సంచారం ఉండునో ఆ నక్షత్రమే మనకు జన్మ నక్షత్రం అవుతుంది. ఈ జన్మ నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశిని మనం జన్మ రాశిగా పిలుచుకుంటుంటాం. ఇది అసలు కథ.
ప్రణతి టెలివిజన్ ఛానల్ లో ధనుస్సు రాశి శని ప్రవేశం గురించి ఉపోద్ఘాతము మరియు 12 రాశుల వారికి ఫలితాలు, సలహాలు, పరిహారాలు అనేవి చిన్న వీడియోలలో ఇవ్వటం జరిగింది. కానీ ఒక్కో రాశి వారు తెలుసుకోవాల్సిన సమాచారం ఎంతెంతో ఉంది. కారణమేమంటే శనికి అంతర్గత శత్రువైన చంద్రుడు సంచారం చేసే నక్షత్రంలోనే మనం జన్మించాం. మన జన్మ నక్షత్ర జన్మ రాశికి తగినట్లుగా పక్షం పక్షం, మాసం మాసం ఫలితం ఇవ్వాలంటే ఒక్కోసారి సమయాన్ని అత్యధికంగా కేటాయించాలి. అందుకోసంగా ఈ 821 రోజుల సంచారంలో ఏ ఏ రాశికి శని ఎంత దూరంలో ఉంటున్నాడు, ఏమి చేయబోతున్నాడు, చేస్తే ఏమి ఇస్తాడు, ఇస్తే ఉంచుతాడా తిరిగి తీసుకుంటాడా అనే ఆసక్తికరమైన అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా రాశుల వారీగా నక్షత్రాల వారీగా సమయానుకూలంగా తెలియచేస్తుంటే తగిన నిర్ణయాలతో పాఠకులు ముందుకు విజయ పంథాలో వెళ్లగలరనే ఆలోచన నా మదిలో మెదిలింది.
ఈ పరంపరలో ఈ 821 రోజుల ధనూరాశి సమాచారంలో భాగంగా ఆయన ఒక్కొక్క రాశికి ఒక్కో మూర్తిత్వంతో (వేష ధారణతో), ,అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటుంటాడు. జ్యోతిష పరంగా జన్మ రాశి నుంచి 3వ లేక 6వ లేక 11వ స్థానాలలో ఉంటే విశేషతలను ఇస్తాడనేది మొదటి మాట. అంటే జన్మ రాశి నుంచి 1,2,4,5,7,8,9,10,12 వ రాశులలో ఉంటే ఫలితాలు ఏమి ఇవ్వడని నిర్ణయం.
ఈయన సంచారం చేసినంత కాలం 4 రకాల మూర్తిత్వాలతో ఉంటుంటాడు. అవి సువర్ణ మూర్తి, రజత మూర్తి, తామ్ర మూర్తి, లోహ మూర్తి అని పేర్లు. అనుకూలంగా ఉన్న స్థానాలలో సువర్ణ, రజత మూర్తులుగా ఉంటే విశేష ఫలితాలను మరింతగా ఇస్తాడని భావము. అలా కాక అనుకూల ఫలితాలు ఇచ్చే 3, 6 , 11 స్థానాలలో లోహ మూర్తిగా లేక తామ్ర మూర్తిగా ఉంటే ఫలితాలు అనుకూలంగా ఇవ్వడని భావము. అలా కాక వ్యతిరేక స్థానాలలో సువర్ణ, రజత వేష ధారణలు కల్గి ఉంటే అనుకూలంగా ఫలితాలను ఇస్తాడు. ఈ వ్యతిరేక స్థానాలలోనే లోహ తామ్ర మూర్తిత్వాలు ఉన్నాయనుకుంటే ఇంకా వ్యతిరేకతలని అర్థం. ఇప్పుడు చెప్పినదంతా రెండవ మాటగా భావించాలి.
ఇక 3వ మాట ఏమిటంటే స్థానమేదైనా కానీ, రూపం ఏదైనా కానీ ఫలితం అనుకూలంగా వస్తున్నా సమయంలో ఇతర గ్రహాలు ఏవైనా అడ్డు తగిలితే ఫలితం ఆగిపోతుంది. ఒకవేళ చెడు ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే... చెడు ఫలితాలు ఉండవు. అలా కాక మంచి ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే మనం కొంచెం బాధపడాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ తెలియచేస్తాను. సినిమాలలో ఒక వ్యక్తిని తరుముకుంటూ మరో వ్యక్తి కార్ లో వెంబడిస్తుంటాడు. ఇంతలో రైల్వే గేట్ వచ్చింది. మొదటి వ్యక్తి దాటగానే గేట్ పడిపోయింది. తరుముకుంటూ వచ్చే వ్యక్తి గేట్ దగ్గర ఆగిపోయాడు. ఇదే చక్కని ఉదాహరణ. అంటే ప్రతికూలత వెంటాడుతున్న సమయంలో ఆ రైలు గేట్ రక్షణగా కాపాడింది అనుకోవాలి. దీనినే జ్యోతిష పరిభాషలో వేధ అంటారు.
కనుక శని గ్రహం నుంచి అనుకూలతలు మనకు వస్తున్న సందర్భాలలో వేధలు (రైల్వే గేట్ ) లేకుండా ఉంటే బావుండు అనుకుంటారు. అలాగే వ్యతిరేకతలు వచ్చే సందర్భాలలో వేధ ఉంటే బావుండు అనుకుంటారు (ఎందుకనంటే సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఆలోచన అన్నమాట ). కనుక శని గ్రహ అనుగ్రహం గురించి 821 రోజులలో ద్వాదశ రాశులకు ఏయే విధంగా పరిస్థితులు ఉంటాయో అనుకూలతలు ఎలా ఉంటాయో, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, ఎలాంటి పరిహారాలు చేయాలో, ధారావాహిక పోస్టింగ్ లలో ఉంచగలను. కనుక ఈ ధారావాహికలు వరుసగా చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్త జ్యోతిష చరిత్రలో ప్రప్రధమంగా మరింత లోతైన విశ్లేషణతో ప్రతి నెలలో ఉన్న తేదీలతో పాటుగా మరిన్ని అంశాలన్నింటినీ మీకందించబోతున్నాను. ఈ రోజే శని ప్రవేశించాడు, పరిహారం రేపే చేయాలి అని తొందర పడవద్దు. నవంబర్ 17 నుంచి ద్వాదశ రాశుల వారు పరిహారాలు చేయవలసి ఉంటుంది. కనుక నిదానంగా చదవండి, ఆకళింపు చేసుకొని పాటించండి. భయపెట్టే వారిని దూరంగా ఉంచండి.
ఈ విశ్లేషణను నా బ్లాగ్ నుంచి తస్కరించి ముందు మాటలు వెనుక, వెనుక మాటలు ముందు పెట్టి తమ తమ పాండిత్యాన్నంతా ప్రదర్శించే ఘనా పాటీలు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. కనుక గమనించవలసినదిగా కోరుతున్నాను. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ
99/-
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565