ద్వీపాన్ని తలపించే
కురుమాపుర క్షేత్రం!
దేవుడు ఎక్కడుంటాడు? ఇందుగలడు.. అందుగలడు. ఎందెందు వెతికినా దేవుడు అందందు దర్శనమిస్తాడు. ఒకచోట చెట్టులో వెలుస్తాడు. మరోచోట గుట్టలో వెలుస్తాడు. కానీ.. నీటిలో వెలిసిన ఘటనలు చాలా తక్కువ. అలాంటివాటిలో మహబూబ్‌నగర్ కురుమాపుర క్షేత్రం ఒకటి. నరసింహస్వామి యుక్తవయసులో నడయాడిన పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ద్వీపాన్ని తలపిస్తున్న ఈ నారసింహ దత్తపేఠమే ఈవారం దర్శనం!
-గూరకొండ శ్రీనివాస్,
ఎక్కడ ఉంది?:
మహబూబ్‌నగర్‌జిల్లా మక్తల్ మండలం పస్పుల వద్ద కృష్ణానది మధ్యలో ఉన్నది.
ఎలా వెళ్లాలి?:
జాతీయ రహదారి 167 మీదుగా మహబూబ్‌నగర్ నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో మక్తల్ ఉంటుంది. మక్తల్ నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
విశిష్టత ఏంటి?:
స్వయంభు నరసింహస్వామిగా వెలిశాడు. కృష్ణానది మధ్యలో ద్వీపంలా కనిపించే ప్రదేశం కురుమాపురం. దత్తపీఠంగా కొనియాడుతారు భక్తులు.
ప్రచారంలో ఓ కథ:
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆపడా రాజు, సుమతి దంపతులకు జన్మించిన నరసింహ సరస్వతి తీర్థక్షేత్రాలు చేసేవాడు. ప్రశాంతత చేకూర్చే స్థలం కోసం అన్వేషిస్తున్న క్రమంలో కృష్ణవేణి ప్రవాహం నడుమ ద్వీపంలా ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణానికి స్వామి తన్మయత్వం పొందారు. ఇక్కడే 14 సంవత్సరాల పాటు అనుష్టానం, ధ్యానం చేసిన ప్రదేశంగా కురుమాపురం భాసిల్లుతున్నది.
దత్తాత్రేయుడి మహత్యం:
నది మధ్యలో ఉన్న ద్వీపంలో తపస్సు చేసుకుని కృష్ణా నది ఈవలి ఒడ్డున ఉన్న ప్రదేశంలో రోజూ ఉదయం, సాయంత్రం అనుష్టానాది కార్యక్రమాలు నిర్వహిసుండేవారు. అక్కడికి బట్టలు ఉతకడానికి వచ్చే రజకుడు స్వామివారిని గమనిస్తూ వారి స్నానాంతరం విడిచిన వస్ర్తాలను ఉతికి శుభ్రం చేసేవాడు. చాలాకాలం వరకు స్వామి ఆ రజకుడితో మాట్లాడడం కాని, అతను స్వామివారితో మాట్లాడడం కానీ ఏ సందర్భంలోనూ జరగలేదు. ఒకరికొకరు మౌనంగా ఉంటూనే ఎవరి పనులు వారు చేసుకునే వారు. ఒకసారి కృష్ణానది తీర ప్రాంతానికి ఒక రాజు తన మందిమార్బంలంతో వచ్చినప్పుడు రజకుని మనస్సులో.. ఒక్కరోజైన నేను ఇలాంటి రాజభోగాలు అనుభస్తే ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటాడు. కానీ తనకు అలాంటి అదృష్టం కలగదని భావించి ఊరుకున్నాడు. కొంతకాలం తర్వాత రజకుడు చేస్తున్న నిస్వార్థ సేవలకు కరుణించిన నరసింహ సరస్వతి రజకుడిని ఏదైనా వరం కోరుకోమని అడగడంతో మీ సేవ తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని.. అలాంటి మహాభాగ్యాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండేలా వరం ఇవ్వాలి అని కోరడంతో గతంలో వచ్చే జన్మలో నీవు చక్రవర్తిగా జన్మిస్తావని వరమిచ్చినట్లుగా భక్తులు చెప్పుకుంటారు. ఇప్పటికీ బండరాళ్లు పైన స్వామివారి పాద ముద్రలు, బట్టలు ఆరవేసుకున్న గుర్తులు కనిపిస్తాయి. ఈ ప్రాంత మహిమాన్వితను గుర్తించిన విఠల్‌బాబా కృష్ణానది ఈవలి వైపు నదిఒడ్డున మరో దత్త మందిరాన్ని నిర్మించారు.
కురుమాపురం స్థల మహిమ:
దత్రాక్షేత్ర సంప్రదాయంలో సమాదుల నిర్మాణాలు ఉండవు. స్వామి వారు పాదుక స్వరూపం, పీఠ స్వరూపంగా భక్తులకు, సూక్ష్మ, గుప్త రూపంలో దర్శణమిస్తారని భక్తుల నమ్మకం. 13వ శతాబ్దంలో అంటే దాదాపు 8 వందల సంవత్సరాల క్రితం శ్రీపాద సరస్వతి, శ్రీ వల్లభ నరసింహ వల్లభ పీఠం స్థాపించినట్లు కథలుగా చెబుతున్నారు. స్వామి జన్మస్థానమైన పిఠాపురంలో బాలుడిగా, కురువపురంలో తపస్సు చేసుకుంటూ యువకుడిగా, కర్ణాటక రాష్ట్రంలోని గాగ్నపురంలో వృద్ధాప్య రూపంలో ఇప్పటికీ దర్శనమిస్తుంటారట. ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్‌లాంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. యేటా డిసెంబర్‌లో వచ్చే దత్తజయంతి నాడు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య అర్చకులు (4వ తరానికి చెందిన) మంజునాథభట్ తెలిపారు.
స్వామివారి సేవలోనే:
వంశపారపర్యంగా నాలుగు తరాలనుంచి స్వామివారికి మా కుటుంబం అర్చకులుగా నిత్యం పూజలు చేస్తున్నాం. కృష్ణానది రెండు పాయల మధ్యలో ఉన్న ద్వీపంలో స్వామివారు తపస్సు చేయడంవల్ల ఈ ప్రాంతానికి ఎంతో మహిమాన్వితం లభించింది. స్వామివారికి కలియుగంలో రెండు అవతారాలున్నాయి. 1 శ్రీపాధవల్లభ, 2. నరసింహసరస్వతి. దత్తాక్షేత్ర సంప్రదయంలో సమాది లేదు కాబట్టి స్వామివారు కృష్ణానదిలో అందర్థానం అయ్యారు కనుక ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
-మంజునాథభట్, అర్చకుడు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565