మార్కండేయుడి
తపోవనం వికారాబాద్!
ఎక్కడ ఉన్నది?:
హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ గ్రామం ఉన్నది.
ఎలా చేరుకోవాలి?: హైదరాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా నేరుగా వికారాబాద్ వెళ్లవచ్చు.
విశిష్టత ఏంటి?: ప్రఖ్యాతిగాంచిన అనంతగిరి వికారాబాద్‌లో ఉంది. వికారాబాద్ నుంచి అనంతగిరి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కండేయుడి తపోవనంగా చరిత్రకారులు చెబుతారు.
పేరెలా వచ్చింది?:
క్రీస్తుశకం 1893 కాలంలో ఐదవ పైగా అమీర్ నవాబ్ సర్ వికార్-ఉల్-ఉమ్రా-బహద్దూర్ ఆధీనంలో ఈ ప్రాంతం ఉండేది. ఆయన అక్కడి ప్రజలపై.. పాలనపై తనదైన ముద్ర వేశారు. అందుకే ఈ ప్రాంతానికి వికారాబాద్ అనే పేరొచ్చిందని చెప్తున్నారు గ్రామస్తులు. నాటి కట్టడాలు, వికార్ మంజిల్ ప్యాలెస్, సుల్తాన్‌మంజిల్ ఇప్పటికీ ఉన్నాయి.
ప్రకృతి అందాలు:
వేల సంవత్సరాల నుంచి అనంతగిరి కొండలు వివిధ రకాల ఔషధ, వృక్ష సంపదతో అలరారుతున్నాయి. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణంలో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయంటారు. దేశంలోనే అతిపెద్ద టీబీ శానిటోరియం క్రీస్తుశకం 1945లో ఇక్కడ స్థాపితమైంది. పూర్వకాలంలో రుషులు అనంతగిరి కొండల్లో తపమాచరించేవారు. వివిధ రకాల వనమూలికలను సేకరించి చుట్టు పక్కల ప్రజలకు వైద్యం చేసేవారని అంటారు.
ప్రచారంలో కథ:
వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు శివసాక్షాత్కారం పొందిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి భూమండలంలో ఆదిశేషునకు పుచ్చభాగమైన అనంతగిరులలో ప్రశాంత వాతావరణమని భావించి ఇక్కడ అనంతగిరి కొండల్లో తపమాచరించాడు. అదే సమయంలో ముచకుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. దేవేంద్రునితో ప్రశంసలందుకొని భూలోకమున అలసట తీర్చుకునేందుకు ఇక్కడకు వచ్చాడు. ద్వాపర యుగంలో కాల యవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేసి మధురానగరం స్వాధీన పరుచుకున్నాడు. అతని విజృంభణకు బలరామకృష్ణులు భయపడుతున్నట్టు నటిస్తూ ముచుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండ గుహలోకి వచ్చారు. కాలయవనుడు బలరామ కృష్ణులను ముచకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వచ్చి నిద్రాభంగం కావించాడు. కాలయవనుడిని కోపదృష్టిచే భస్మం కావించాడు. బలరామకృష్ణులు సంతోషించి ముచకుందుడికి సాక్షాత్కరించారు.
దివ్యదర్శనం:
కలియుగ ప్రారంభంలో మార్కండేయ మహామునికి తపోఫలంగా అనంత పద్మనాభుడు దివ్యదర్శనం ఇచ్చాడు. మార్కండేయ క్షేత్రంగా వెలిసింది. మార్కండేయుడు గంగాదేవిని తన సరోవరానికి రప్పించుకున్నాడు. ఇక్కడ గుండాన్ని భవవాసి తీర్థమని పిలుస్తారు. అనంతగిరి క్షేత్ర మహాత్యము విష్ణు పురాణంలో వివరించబడింది. -బక్క బాబూరావు,
ఈ పద్మనాభుడు పవళించడు..!
భక్తుల పాలిట కొంగుబంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు. ఇక్కడ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు. మూసీ నది
జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది.అనంతానంత దేవేశ అనంత ఫలదాయక। అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః।। అంటూ... అనంతమైన సిరిసంపదలు ఇచ్చే ఆ దేవదేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.
స్థలపురాణం
సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.ముచుకుందే మూసీ...
రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలంపాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరవైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించమ’ంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వెళతారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియజేస్తోంది.ఏటా రెండు సార్లు...
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.ఇలా చేరుకోవాలి
అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.
- అన్నెపు దామోదరరావు, ఈనాడు డిజిటల్, వికారాబాద్
ఫొటోలు: సి.బషీర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565