మనసు మెచ్చే మెహందీ డిజైన్లు!
గోరింట పూసింది కొమ్మలేకున్నా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగిందా అని పాడుకుంటూ.. మధ్యలో చందమామ.. చేతివేళ్లకు గోరింటాకు పెట్టుకొని ముచ్చటగా మురిసిపోయేవారు ఒకప్పుడు.. కానీ అరబిక్ మెహందీ ప్రవేశించాక గోరింటాకు కొత్త రూపం సంతరించుకొని డిజైన్లుగా మారింది.. రకరకాల డిజైన్లతో ఆడవాళ్ల మనసు దోచుకుంటున్నది మెహందీ.. ఇందులో ఎన్ని రకాల డిజైన్లు.. ఎన్ని రకాల మెహందీలు ఉన్నాయో తెలుసుకోండి.. ఈ రకరకాల డిజైన్‌లతో.. పండుగల్లో.. ఫంక్షన్లలో అందంగా మెరిసిపొండి..
-సౌమ్య పలుస
నెట్ మెహందీ :
ఎవరినైనా ఇట్టే వలలో వేస్తుందీ మెహందీ డిజైన్. వల మాదిరిగానే ఈ డిజైన్ వస్తుంటుంది. ఈ రకం మెహందీ వేయడానికి చాలా ఓపిక అవసరం. ఏ వల కాస్త అటు, ఇటు అయినా డిజైన్ చెదిరిపోతుంది. అన్ని మెహందీ డిజైన్లలో ఇది అందంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
షేడెడ్ మెహందీ :
కళ్లకి ఇంపుగా కనిపించాలంటే ఈ మెహందీ డిజైన్‌లు బాగుంటాయి. రెగ్యులర్ మెహందీ డిజైన్‌లకు ఇవి కాస్త భిన్నంగా స్ట్రోక్స్ ఇస్తూ వేస్తారు. పైగా హెన్నాలో డార్క్, లైట్ కలర్స్ దొరుకుతాయి. ఆ రెండింటీతో కలిపి కూడా ఈ మెహందీ వేస్తే చూడమచ్చటగా ఉంటుంది.
టికీ ైస్టెల్ మెహందీ :
మీరు హెవీ డిజైన్ల మెహందీని ఇష్టపడే వాళ్లు కాదా?! అయితే మీకు ఈ మెహందీ డిజైన్ కచ్చితంగా నచ్చుతుంది. భారతదేశంలో, పాకిస్థాన్‌లో ఈ డిజైన్లు చాలా ఫేమస్. చేతి మధ్యలో ఒక రౌండు వచ్చి దాంట్లో డిజైన్ వస్తుంది. ఆ గుండం చుట్టూ కూడా సింపుల్‌గా డిజైన్లు గీయొచ్చు. ఇందులో చాలా వేరియేషన్‌లు ఉంటాయి. మీకు తొందరగా పూర్తయ్యే మెహందీ డిజైన్ కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. మిగతా డిజైన్లతో పోలిస్తే దీనికి పెద్దగా టైమ్ పట్టదు.
బొమ్మల మెహందీ :
పెళ్లికూతురు చేతులకు మెహందీ లేకుండా ఊహించుకోలేం. అయితే అందరిలా పెళ్లికూతురు మెహందీ వేసుకుంటే ఏం కొత్తదనం ఉంటుంది. అందుకే భర్త బొమ్మనే చేతి మీద మెహందీలా వేయించుకుంటే?! ఈ ఆలోచనే కొత్తగా ఉంది కదూ! అయితే దీనికి మూడు నాలుగు రోజుల ముందే ఫొటోని ఆర్టిస్టులకు చూపించాలి. వాళ్లు దాన్ని స్కెచ్ గీసుకుంటారు. ఆ తర్వాత కానీ చేయిమీద ఆ బొమ్మ అంత అందంగా చిత్రించలేరు. కావాలనుకుంటే ఇద్దరి బొమ్మలనూ వేయించుకోవచ్చు. మనకు నచ్చిన వాళ్లను అలా చేతి మీద చూసుకుంటే ఆ ఆనందమే వేరు.
మెరిసే మెహందీ :
మనం మామూలుగా మెహందీ ఏదైనా పెట్టించుకుంటే కడిగేయగానే కొందరికీ మామూలుగా పండొచ్చు. కొందరికీ నల్లగా అయిపోవచ్చు. కానీ స్పెషల్‌గా కనిపించేందుకు ఏమీ ఉండదు. అలాంటప్పుడు మెహందీ పెడుతున్నప్పుడే మధ్యలో ఈ గ్లిటరింగ్స్ చల్లుతారు. పెళ్లికూతుళ్లకు ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మెరుపుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఎక్కువ కాలం నిలిచేవి, తక్కువ కాలం నిలిచేవి. మీరు ఎంతకాలం ఉండాలో దాన్ని బట్టి మీ మెహందీలో దీన్ని యాడ్ చేసుకోవచ్చు.
పువ్వుల మెహందీ :
మెహందీ డిజైన్లలో ఎక్కువగా కనిపించే డిజైన్ ఇది. చిన్న పువ్వుల నుంచి పెద్ద పువ్వుల దాకా మన చేతిలోనే విరబూస్తాయి. దీంట్లో కూడా రకాలు ఉంటాయి. మామూలు మెహందీ డిజైన్లు, షేడెడ్ డిజైన్లు ఉంటాయి. పండుగల్లో, పెళ్లిళ్లల్లో ప్రత్యేకంగా సంప్రదాయత కనిపించాలంటే ఈ మెహందీ డిజైన్లను ఎంచుకోవచ్చు.
తెల్లని మెహందీ :
మీకు ప్రయోగాలు చేయడమంటే సరదానా?! అయితే తెల్లని మెహందీని ట్రై చేయండి. నేచురల్ హెన్నాతో మెహందీ పెట్టుకుంటే కొన్ని రోజుల వరకూ నిలిచి ఉంటుంది. కానీ తెల్లని మెహందీని త్వరగానే తీసేయొచ్చు. తెల్లని హెన్నాతో ఇంకా కొందరు మెరుపులు కూడా కలిపితే ఈ మెహందీ చూడడానికి మరింత అందంగా కనిపిస్తుంది.
స్టిక్కర్ మెహందీ :
గంటలు గంటలు మెహందీ పెట్టించుకోవడం బోర్ అనుకుంటున్నారా? మార్కెట్‌లో రెడీమేడీగా ఈ డిజైన్‌లు స్టిక్కర్ల రూపంలో అందుబాటులోకి వచ్చాయి. మీ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేట్లు ఈ స్టిక్కర్‌ని చేతి మీద అంటించుకుంటే సరిపోతుంది. డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్స్‌లో లభ్యమయ్యే ఈ స్టిక్టర్‌లను కావాలనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. ప్రత్యేకమైన అకేషన్‌లలో ఇవి చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా పండుగలప్పుడు మనకు సమయం ఎక్కువగా దొరుకదు, కాబట్టి వీటిని ఎంచక్కా చేతికి అతికించుకోవచ్చు.
పూల తీగ:
చేతులు మొత్తం పూలతో నింపేయడం బాగానే ఉంటుంది. కానీ అందరికీ అది నప్పదు. సింపుల్‌గా, త్వరగా మెహందీ వేయించుకోవాలంటే ఈ డిజైన్‌ని ఎంచుకోండి. దీన్ని ఎక్కువగా చేతి వెనుక భాగంలో వేయించుకుంటారు. కింద ఎక్కడో ఒక పూల తీగ మొదలై చూపుడు వేలు చివరి వరకూ పాకుతుంది. పెద్ద పెద్ద పూలు, ఆకులతో ఈ డిజైన్ చూడచక్కగా ఉంటుంది
.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565