MohanPublications Print Books Online store clik Here Devullu.com

జటాధారీ జోగులాంబా_Jogulamba_Alampur


జటాధారీ జోగుళాంబా...
Jogulamba_Alampur...
#జటధారీ
       #జోగుళాంబా...

 ‘తుంగభద్ర నదితీరంలోనూ కృష్ణాతుంగభద్ర సంగమ సమీపంలోనూ ఉన్న ఆలంపూర్‌ చారిత్రకంగానే కాదు, ప్రముఖ యాత్రాస్థలంగానూ ప్రాచుర్యం పొందింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబా ఆలయంతోబాటు నవబ్రహ్మేశ్వర, సంగమేశ్వర... వంటి దేవాలయాలకీ ఆలవాలమైన ఆ మహిమాన్విత క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా చూసి రావాల్సిందే’ అంటూ ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కె.వాసవదత్త రమణి.
నవలింగ దివ్యధామంగా పేరొందిన ఆలంపూర్‌ క్షేత్రానికి వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అందుకే ఒకరోజు ఉదయాన్నే కారులో బయలుదేరాం. హైదరాబాద్‌కి 218 కిలోమీటర్లు, మహబూబ్‌నగర్‌కి 126 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రదేశం. పరశురాముడు, తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించిన ప్రదేశం ఇదేనట. అందుకే ఇది పరశురామ క్షేత్రంగానూ పేరొందింది. ఒకప్పుడు దీన్ని హమతాపూర్‌, అమలాపూర్‌ అని పిలిచేవారట. అదే క్రమంగా
ఆలంపూర్‌గా మారింది.
పురాణగాథల ప్రకారం- తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఆహ్వానించకపోయినా వెళ్లి, అవమానాలపాలై ప్రాణత్యాగం చేస్తుంది సతీదేవి. భార్యావియోగంలో పరమశివుడు కోపోద్రిక్తుడై చేస్తోన్న శివతాండవానికి ముల్లోకాలూ కంపించిపోగా, విష్ణుమూర్తి శివుణ్ణి శాంతపరుస్తూ తన విష్ణుచక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అప్పుడామె దేహ శకలాలు పద్ధెనిమిది ప్రదేశాల్లో పడి, అష్టాదశ శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. అందులో ఒకటైన అమ్మవారి వూర్ధ్వదంతం(పైదవడ) పడినచోటే ఆలంపూర్‌ జోగుళాంబా. కింద దవడకన్నా పై దవడ కాస్త వేడిగా ఉంటుంది. అందుకే ఇక్కడి తల్లి రౌద్రరూపంలో వెలసింది అంటారు. ఇతర క్షేత్రాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడి అమ్మవారికి తలవెంట్రుకలు పైకి ఉంటాయి. దీన్నే జట అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఉండే ఈ జట, అమ్మవారికి ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ జటలో తేలు, కపాలం, గుడ్లగూబ, బల్లి ఉంటాయి. ఇక్కడి అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ప్రాచీన ఆలయం ధ్వంసం కావడంతో ప్రస్తుత ఆలయాన్ని పుష్కరకాలం క్రితమే పునర్నిర్మించారు. సంతానలేమితోనూ అనారోగ్యంతోనూ బాధపడేవాళ్లు జోగుళాంబా దర్శనంతో అవి తొలగిపోతాయని నమ్ముతారు.
 గోష్పాదం!
ప్రధాన ఆలయంలో అమ్మవారిని చూశాక, ఆలయం చుట్టూ ఉన్న నవ బ్రహ్మేశ్వర ఆలయాల దగ్గరకు వెళ్లాం. ముందు అమ్మవారి ఆలయానికి చెంతనే ఉన్న బాలబ్రహ్మస్వామిని దర్శించుకున్నాం. అందులో విగ్రహం గోష్పాదం(లింగం పాదముద్ర రూపంలోనూ తలభాగం దోసిలి ఆకారంలోనూ ఉండేదే గోష్పాదం)ఆకారంలో ఉంది. లింగం తలభాగంలో గుంతలు పడి ఉంది. అవి సిద్ధులు రసం తోడిన గుర్తులుగా చెబుతుంటారు. అందుకే ఔషధ, మంత్ర తంత్ర సంస్కారాలు పొందిన ఈ లింగం, ఎంతో పవిత్రమైనదనీ దీన్ని చూసినంతనే ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడనీ భక్తుల విశ్వాసం.
ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు శక్తిహీనుడై, పరమశివుడికోసం కఠినమైన తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి పాపాన్ని కడిగి, తిరిగి బ్రహ్మత్వాన్ని ప్రసాదించాడట. బ్రహ్మ పిలుపుమేరకు ప్రత్యక్షం కావడంతో ఇక్కడి లింగానికి బ్రహ్మేశ్వరుడనీ, విగ్రహం చిన్నదిగా ఉండటంతో బాలబ్రహ్మేశ్వరుడనీ పేరు. ఆ తరవాత కొంతకాలానికి ఈ విగ్రహం నుంచి కొన్ని రసాలు వెలువడుతున్న విషయాన్ని గమనించిన రససిద్ధులు అనే మహాముని, పరుసవేది విద్యతో ఆ రసాల్ని మిళితం చేస్తూ ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారంలోనే ఎనిమిది ఆలయాలను నిర్మించాడట. అవే కుమార, గరుడ, వీర, విశ్వ, అర్క, తారక, స్వర్గ, పద్మ ఆలయాలు. అందుకే వీటిల్లోని శివలింగాలు స్తూపాకారంలో ఔషధమూలికలతో సంతరించుకున్న వివిధ రంగుల్లో దర్శనమిస్తాయి. ఈ మొత్తం సముదాయమే నవబ్రహ్మ ఆలయం.
 నవ బ్రహ్మేశ్వరులు
బాలబ్రహ్మస్వామి విగ్రహం ఆరోశతాబ్దం నాటిదనీ, ఆలయ నిర్మాణం ఏడో శతాబ్దంలో జరిగిందనీ శాసనాల ద్వారా తెలుస్తోంది. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు... ఇలా అనేక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. అయితే శాతవాహనులు, చాళుక్యుల కాలంలోనే జోగుళాంబా క్షేత్ర నిర్మాణాలు ఎక్కువగా కొనసాగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎర్రని ఇసుకరాయితో నిర్మించిన ఇక్కడి నవబ్రహ్మేశ్వర ఆలయ వాస్తు శిల్పం దేశంలోనే ప్రాథమికమైనదిగా చెబుతారు. గోడలమీద ఉన్న రామాయణం, మహాభారతం, పంచతంత్ర కావ్య శిల్పాలు సైతం సందర్శకుల్ని కట్టిపడేస్తాయి. అందుకే ఈ క్షేత్రంలో లభించిన శిలాశాసనాలూ, శిల్పాలూ, రాతి స్తంభాలూ అన్నింటినీ పురావస్తు శిల్ప సంపదగా గుర్తించి, ఓ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ క్షేత్రంలో లభ్యమైన సూర్యభగవానుడి విగ్రహం, నాగబంధం, నటరాజ విగ్రహాలు ప్రపంచస్థాయి పురావస్తు ప్రదర్శనల్లో మూడుసార్లు మొదటిస్థానంలో నిలిచి మన శిల్పకళావైభవాన్ని చాటాయి.
తుంగభద్రా నది దగ్గర కాసేపు గడిపి, సంగమేశ్వర ఆలయానికి బయలుదేరాం. ఐదో శతాబ్దంలో పులకేశి చక్రవర్తి అత్యద్భుతమైన శిల్పకళతో కాచవెల్లి గ్రామంలో నిర్మించిన ఆలయమిది. మొదట్లో ఇది కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశానికి సమీపంలో ఉండేది. అందుకే
సంగమేశ్వరాలయంగా పేరొందింది. శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురవుతుందన్న కారణంతో పురాతత్వ శాఖ, విగ్రహంతోబాటు దేవాలయ రాళ్లను కూడా దూరంగా తరలించి, యథాతథంగా పునర్నిర్మించింది. అది చూసి తిరుగుదారిలో బాచుపల్లి ఆంజనేయుణ్ణి దర్శించుకుని, ఇంటికి చేరుకున్నాం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list