టీ... ఎన్ని రుచులో
Tea ... how many tastes
ఇరానీ చాయ్
కావలసినవి
చిక్కని పాలు(హోల్‌మిల్క్): 4 కప్పులు, కోవా: 4 టేబుల్‌స్పూన్లు, పంచదార: 2 టీస్పూన్లు, టీపొడి: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు:3 కప్పులు
తయారుచేసే విధానం
గిన్నెలో టీ పొడి వేసి నీళ్లు పోసి మూతపెట్టి సుమారు అరగంటసేపు మరిగించాలి. అది వడబోస్తే సుమారు అరకప్పు అవుతుంది. మరో గిన్నెలో పాలు పోసి సుమారు ఒకటిన్నర కప్పులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత కోవా, పంచదార వేసి కరిగేవరకూ వేగంగా కలపాలి. ఇప్పుడు ఇందులో వడబోసిన డికాక్షన్ వేసి కలిపితే హైదరాబాదీ ఇరానీ చాయ్ రెడీ.
స్పైసీ చాయ్
కావలసినవి
చిక్కని పాలు: 2 కప్పులు, మంచినీళ్లు: 2 కప్పులు, సోంపు: పావుటీస్పూను, మిరియాలు: నాలుగు, యాలకులపొడి: అరటీస్పూను, అల్లంతురుము: అరటీస్పూను, పంచదార: మూడున్నర టీస్పూన్లు, దాల్చినచెక్క: ఒకటిన్నర అంగుళంముక్క, బ్లాక్ టీ: 5 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* దాల్చినచెక్క, యాలకులపొడి, మిరియాలు, సోంపు అన్నీ కలిపి బాగా దంచాలి.
* గిన్నెలో పాలు పోసి మూడింట రెండొంతులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత పంచదార, మసాలాపొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి సిమ్‌లో మూడు నిమిషాలు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి సగమయ్యేవరకూ మరిగించాక టీ ఆకు వేసి మరో నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్‌చేసి మూతపెట్టి ఉంచాలి. సుమారు ఐదు నిమిషాల తరవాత డికాక్షన్‌ను వడబోసి మరిగే పాలల్లో పోసి సిమ్‌లో నిమిషం మరిగించి అందించాలి.
దమ్ కీ చాయ్
కావలసినవి
మంచినీళ్లు: 3 కప్పులు, పాలు: 4 కప్పులు, టీపొడి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, పంచదార: 3 టేబుల్‌స్పూన్లు, కోవా: 3 టేబుల్‌స్పూన్లు, యాలకులు: మూడు, అల్లంతురుము: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* టీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాక దంచిన యాలకులు, అల్లంతురుము వేసి ఆ నీళ్లు సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత టీపొడి, పంచదార వేసి మూతపెట్టి సిమ్‌లో మరిగించాలి. సుమారు పది నిమిషాలకు ఆ నీళ్లు సగమవుతాయి. అదేసమయంలో మరో పాత్రలో పాలు పోసి కాచాలి. అవి మరగడం మొదలవగానే సిమ్‌లో పెట్టి మూడింట రెండొంతులు అయ్యేవరకూ కాచాలి. ఇప్పుడు పాలల్లో కోవా కూడా వేసి పూర్తిగా కలిసేవరకూ కలిపి ఓ నిమిషం మరిగించి దించాలి.
* ఇప్పుడు కప్పులో ఒక వంతు టీ డికాక్షన్ పోసి నాలుగు వంతుల పాల మిశ్రమం వేసి స్పూనుతో తిప్పి అందించాలి.
కశ్మీరీ చాయ్
కావలసినవి
మంచినీళ్లు: 12 కప్పులు, గ్రీన్ టీ ఆకులు: 2 టేబుల్‌స్పూన్లు, యాలకులు: నాలుగు, అనాసపువ్వు: ఒకటి, లవంగాలు: మూడు, పాలు: 3 కప్పులు, పంచదార: రుచికి సరిపడా, బేకింగ్‌సోడా: చిటికెడు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క
తయారుచేసే విధానం
* మందపాటి గిన్నెలో ఆరు కప్పుల మంచినీళ్లు పోసి సిమ్‌లో మరిగించాలి. అందులో గ్రీన్ టీ ఆకు వేసి, మరో పది నిమిషాలు సిమ్‌లోనే మరిగించాలి. తరవాత సోడా వేయాలి. ఇప్పుడు టీ రంగు గులాబీరంగులోకి మారిపోతుంది. వెంటనే మిగిలిన ఆరు కప్పుల చల్లని నీళ్లు పోసి వడబోయాలి.
* ఇప్పుడు వడబోసిన టీ కషాయంలో యాలకులపొడి, దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వు వేసి మూత పెట్టి సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత నెమ్మదిగా పాలు పోసి బాగా కలపాలి. చివరగా చిటికెడు ఉప్పు, పంచదార వేస్తే నోరూరించే కశ్మీరీ చాయ్ రెడీ. దీన్ని బాదం, పిస్తాలతో కలిపి అందించాలి.
మసాలా చాయ్
కావలసినవి
మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, పాలు: కప్పు, బ్లాక్ టీ: ఒకటిన్నర టీస్పూన్లు, అల్లం: టీస్పూను, తులసి ఆకులు: ఆరు, టీపొడి: టీస్పూను(బ్లాక్ టీ ఆకు నుంచి వచ్చే రంగు సరిపోదు అనుకుంటేనే)
తయారుచేసే విధానం
* టీ గిన్నెలో పాలు, నీళ్లు పోసి మరిగించాలి. తరవాత అల్లం తురుము వేసి మరో పొంగు రానివ్వాలి. ఇప్పుడు టీఆకులు, పొడి కూడా వేసి సిమ్‌లో రెండు నిమిషాలు మరిగించాలి. తరవాత తులసి ఆకులు వేసి సిమ్‌లో రంగు మారేవరకూ మరిగించి దించి వడబోయాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565