పుట్టి పెరిగిన వూరికి తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం... అంటారు ‘శ్రీమంతుడు’ సినిమాలో హీరోహీరోయిన్లు. వూరి సంగతి ఏమో కానీ మన దేహానికి మాత్రం మనం చాలా ఇవ్వాలి. అలంకరణా అందమైన దుస్తులూ పైపై మెరుగులే. మంచి ఆహారమూ చాలినంత వ్యాయామమూ ఇవ్వకపోతే అది మన మాట వినదు, లావైపోతుంది... చెప్పలేనన్ని సమస్యల్నీ తెచ్చిపెడుతుంది.
పండక్కి కొత్త బట్టలు కొనుక్కోవడానికి బజారుకి వెళ్లింది లత. షోకేసులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి చాలా డిజైన్స్. తీరా షాపులోకి వెళ్లి అడిగితే తన సైజులో ఏవీ లేవు. పైగా ‘ప్లస్ సైజ్ కోసం మాకు ప్రత్యేకంగా ఇంకో షాపుంది మేడమ్’ అంటూ ఉచిత సలహాలు. తనమీద తనకే చాలా కోపమొచ్చింది లతకి. ఎలాగైనా సరే ఈసారి బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకుంది. సమస్యేంటంటే కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్లిన ప్రతిసారీ ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఆ తర్వాత మర్చిపోతుంది. పాపం... తను మాత్రం ఏం చేస్తుంది. పొద్దున్నే ఇంటి ముందు క్యాబ్ ఎక్కి ఆఫీసుకు వెళ్తుంది. ఆఫీసులో కంప్యూటరు ముందు ఏడెనిమిది గంటలు కూర్చుంటుంది. అదేంటో గంటకోసారి లేచి నడుద్దామనే అనుకుంటుంది కానీ పనిలో పడ్డాక ఆ విషయం గుర్తొచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. లత లాంటివాళ్లు మనదేశంలో ఎందరో! నగరాల్లో ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేసేవాళ్లకి స్థూలకాయం రావడంలో ఆశ్చర్యమేముంది. పైగా దానికి తోడు డెస్కులో కూర్చుని వారు తినే బర్గర్లూ పిజ్జాలూ సమోసాలూ. వారాంతాలేమో నిద్రకీ ఫ్రెండ్స్‌తో ఓ సినిమాకి వెళ్లడానికీ లేదంటే షాపింగూ ఈటింగ్ అవుట్‌కీ సరిపోతాయి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ రొటీన్‌లో పెద్దగా తేడా ఉండడం లేదు. స్కూలు, కాలేజీ చదువుల వరకూ బాగానే ఉన్న పిల్లలు కూడా డిగ్రీ ఆ తర్వాత ఉద్యోగాల్లోకి వచ్చేసరికి లావైపోతున్నారు. ఇక సంవత్సరాల తరబడి ఒకే రకం ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి చెప్పనక్కర లేదు. ఈ విషయం ఇప్పుడెందుకూ అంటే... మొత్తంగా ఇండియా లావైపోతోంది కనుక. ఎంతగానూ అంటే ప్రపంచంలో స్థూలకాయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనం ఐదో స్థానంలో ఉన్నాం. అక్టోబరు 11న వరల్డ్ ఒబెసిటీ డే నేపథ్యంలో అసలీ స్థూలకాయం అంటే ఏమిటో, దాని వల్ల వచ్చే కష్టనష్టాలేంటో, వదిలించుకోవడానికి ఏం చేయాలో కాస్త చూద్దాం.
నేను లావుగా ఉన్నానా?
ఈ ప్రశ్న ఎవరినీ అడగొద్దు. ఎందుకంటే ఎవరూ కచ్చితంగా సరైన సమాధానం చెప్పరు. కొందరేమో లావుగా ఉన్న ఇతరులతో పోల్చి ‘నువ్వు సరిపోయినంతే ఉన్నావు’ అంటారు. వారిది మొహమాటం. ఇక ఇంట్లోవాళ్లైతే ‘కాస్త బొద్దుగా ఉన్నావంతే, దాని వల్ల నష్టం లేదు, కడుపు నిండా తిను...’ అంటారు. వారిది ప్రేమ. ఆఖరికి అద్దం కూడా అబద్ధమే చెపుతుంది. కాస్త దూరంగా పక్కకి తిరిగి నిలబడితే సన్నగా ఉన్నావంటుంది. అందుకే ఎవరి మాటలూ నమ్మొద్దు. ఎవరైనా నిజంగా లావుగా ఉన్నారో బొద్దుగా ఉన్నారో తగినంతే ఉన్నారో... తెలుసుకోవడానికి ఓ లెక్కుంది. దాన్నే బీఎంఐ(బాడీమాస్ ఇండెక్స్) అంటారు. పొడవూ బరువులను బట్టి దీన్ని తెలుసుకోవచ్చు. బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువును ఎత్తు వర్గంతో భాగిస్తే వచ్చేదాన్నే బీఎంఐ అంటారు. ఉదాహరణకు ఓ వ్యక్తి బరువు 70 కిలోలు, ఎత్తు 1.65 మీటర్లు ఉన్నారనుకోండి. 1.65 ఇంటూ 1.65. అంటే 2.72 వస్తుంది. దీంతో 70ని భాగించండి. ఎంత వచ్చిందీ? 25.7. అది ఆ వ్యక్తి బీఎంఐ అన్నమాట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ బీఎంఐ 18.5 కన్నా తక్కువ ఉంటే ఉండాల్సిన బరువుకన్నా తక్కువ ఉన్నట్లు.
18.5- 24.9 మధ్య ఉంటే సాధారణ బరువున్నట్లు లెక్క. భారతీయులకైతే గరిష్ఠం 23 ఉంటే చాలంటున్నారు నిపుణులు.
25.0- 29 మధ్య ఉంటే అధిక బరువు. 30.0- 39.9 మధ్య ఉంటే స్థూలకాయం 40 దాటితే తీవ్రమైన స్థూలకాయం మరో తేలిక పద్ధతి ఏమిటంటే నడుం చుట్టుకొలతను బట్టి తెలుసుకోవడం. పురుషుల నడుం 94-102 సెం.మీ.మధ్య ఉంటే అధిక బరువు ఉన్నట్లే. 102 దాటితే ఇక స్థూలకాయుల జాబితాలో చేరతారు. అదే స్త్రీల నడుము 80-88సెం.మీ. మధ్య ఉంటే అధిక బరువు, 88 దాటితే వూబకాయంగానూ గుర్తించాలి. కాబట్టి నడుం చుట్టుకొలతను పురుషులు 94సెం.మీ., స్త్రీలు 80సెం.మీ. దాటకుండా చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు చెప్పండి... మీరు ఏ కేటగిరీలోకి వస్తారు?
ఈ లెక్కల్ని బట్టి చూస్తే అతి బరువు, స్థూలకాయం కేటగిరీల్లోకి వచ్చేవారు చాలా మందే ఉంటారు. అసలు బరువుకి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు?
నిజమే, చాలామందే ఉంటారు. ఎందుకంటే స్థూలకాయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశమూ ఉంది కాబట్టి. ఇక బరువుకి ఎందుకింత ప్రాధాన్యం అంటే ఆరోగ్యానికి సంబంధించిన సూచికల్లో బరువుదీ కీలక పాత్ర కాబట్టి. మనం ఏ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినా బీపీతో పాటూ బరువూ చూసేది అందుకే. హఠాత్తుగా బరువు పెరగడమూ తరగడమూ అనారోగ్యానికి సూచికే. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య స్థూలకాయమేనంటోంది గత ఏడాది నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక. దీని ప్రకారం ప్రతి ఐదుగురు మహిళల్లోనూ ఒకరు (20.7శాతం)స్థూలకాయులే. 15-49 మధ్య వయసు మహిళల్లో పట్టణాల్లో 30 శాతమూ గ్రామాల్లో 15 శాతమూ స్థూలకాయులే. పురుషుల్లో ఇది కాస్త తక్కువగా ఉన్నా(18.6) గతం కన్నా రెట్టింపు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్‌లు స్థూలకాయులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కాగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలు మధ్య స్థాయిలో ఉన్నాయి.
అసలెందుకొస్తుందీ స్థూలకాయం?
కొన్ని రకాల అనారోగ్యాలను మినహాయిస్తే 95 శాతం బరువు పెరగడానికి మాత్రం జీవనశైలిలో మార్పులే కారణం. శారీరక శ్రమ లోపించడమూ ఆహారంపై నియంత్రణా సరైన ఆహారపుటలవాట్లూ లేకపోవడమూ... ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలవుతున్నాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే తీసుకునే కెలొరీలకూ ఖర్చు పెట్టే కెలొరీలకు మధ్య తీవ్ర అంతరం ఉండడం. ముఖ్యంగా ఆహారం తీసుకునే విధానానిది కీలకపాత్ర. రోజుకు రెండుపూటలు మాత్రమే కడుపు నిండా తినడం అనే అలవాటు నుంచి చాలామంది బయటపడడం లేదు. నిద్రలేమీ జీవనశైలీ కూడా బరువును పెంచుతాయి. నడక అవసరంలేని రవాణా సౌకర్యాలూ గంటల తరబడి కదలకుండా కూర్చోవడమూ వేళాపాళా లేని ఆహారపుటలవాట్లూ శరీరంలో జీవచర్యలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా కొవ్వు పేరుకుపోయి బరువును పెంచుతుంది.
లావుగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది నిజమే కానీ దాని వల్ల అనారోగ్యాలెందుకొస్తాయి?
స్థూలకాయం శారీరకంగానే కాదు మానసికంగానూ ఇబ్బందిపెడుతుంది. కొందరిలో ఆత్మన్యూనతకు కారణమవుతుంది. కుంగుబాటుకు దారితీస్తుంది. పిల్లలైతే తోటివారు హేళన చేస్తారన్న భయంతో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలా వారు స్నేహాలను కోల్పోతారు. ఇక భౌతిక విషయాలకు వస్తే... ఎన్నో రకాల జబ్బులకు ఆహ్వానం పలుకుతుంది మన బరువు. గుండె జబ్బులు, రక్తపోటు, శ్వాస సంబంధ సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులకు తొలి సూచిక బరువే. ఆస్టియో ఆర్థరైటిస్, పిత్తాశయంలో సమస్యలు, సంతానహీనత, ఫ్యాటీ లివర్, మూత్రపిండాల సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లకు(రొమ్ము, గర్భాశయం, అండాశయం, ప్రొస్టేట్, కాలేయం, పెద్దపేగు) కూడా స్థూలకాయం కారణమవుతుంది. స్థూలకాయం ఉన్న యువతీయువకులు స్నేహితులతో కలిసి తిరగడానికి ఇష్టపడకపోవడం, పెళ్లి విషయంలో విముఖత చూపించడం జరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీరిలో శృంగారం పట్ల ఆసక్తి కూడా తక్కువే. పోషకాహార లోపం కన్నా స్థూలకాయం వల్ల వచ్చే అనారోగ్యాలతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. పిల్లల్లో స్థూలకాయం శ్వాస సమస్యలకు కారణమవుతుంది. ఎముకల్లో సామర్థ్యం తగ్గి త్వరగా విరిగిపోతుంటాయి.
మరి ఈ బరువు తగ్గడమెలా? అసలు తగ్గుతుందా?
తగ్గుతుంది. ముందుగా మనం మన శరీరాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. లావుగా ఉందని కోపం తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెడతామో అప్పుడు అది మరింత ఆరోగ్యంగా చురుగ్గా కళకళలాడేలా చర్యలు తీసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది. ఆ తర్వాత బరువు పెరగడానికి కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. అరుదుగా మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు స్థూలకాయానికి దారితీస్తాయి. అందుకని వైద్యులను సంప్రదించి అనారోగ్యం బరువు పెరగడానికి కారణం కాదని నిర్ధారించుకోవాలి. మిగిలిన కారణాలన్నీ జీవనశైలికి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి దినచర్యనూ తీసుకుంటున్న ఆహారాన్నీ చేస్తున్న వ్యాయామాన్నీ ఓసారి నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే స్థూలకాయం తగ్గితే ఆటోమేటిగ్గా దాని వల్ల వచ్చే వ్యాధుల ప్ర¾మాదమూ తగ్గుతుంది. అలాగని దిగులు పడి ఒక్కసారిగా తిండి మానేస్తే లేని సమస్యలు తెచ్చుకున్నట్లే. క్రాష్ డైటింగ్, శక్తికి మించి వ్యాయామం చేసి నెలరోజుల్లోనే కిలోలకొద్దీ బరువు తగ్గాలనుకోవడం సరికాదు. అలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లూ పోషకాలూ అందక కండరాలూ ఎముకలూ బలహీనమైపోతాయి. బరువు పెరగడం ఒక్కసారిగా జరగదు. అలాగే తగ్గడమూ నెమ్మదిగానే తగ్గాలి. మనం వదిలించుకోవాల్సిందల్లా పేరుకున్న కొవ్వును మాత్రమే.
దాన్ని ఎలా తగ్గించుకోవాలి మరి?
ఆహారంతోనూ వ్యాయామంతోనూ- అంటే రెండు రకాలుగా ప్రయత్నించాలి.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లూ కూరగాయలూ ఎక్కువగా ఉండాలి.
* చిక్కుడు జాతి కూరగాయలూ తృణధాన్యాలూ నట్స్... తప్పనిసరి.
* ఫ్యాట్స్, షుగర్స్‌తో లభించే కెలొరీలను నియంత్రించుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే చక్కెర వల్ల స్థూలకాయం వస్తే దాని వల్ల టైప్ 2 మధుమేహం వస్తుంది.
* సమతులాహారం- అంటే, కెలొరీలను గమనించాలి. రోజుకు ఎన్ని కెలొరీలు తీసుకోవాలన్నది బరువు మీదా మనం చేసే శారీరక వ్యాయామం మీదా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమస్య ఉందీ అనుకుంటే ఒకసారి పోషకాహార నిపుణులను సంప్రదించాలి. ఎత్తూ బరువూ ఆరోగ్య పరిస్థితీ తదితరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తి ఆహారంలో ఎన్ని కెలొరీలు తీసుకోవాలో, అవి ఏయే పదార్థాలనుంచీ లభించేలా చూసుకోవాలో, రోజు మొత్తం మీద ఎలా విభజించుకోవాలో వారు చెబుతారు.
* సమతులాహారం తీసుకుంటూనే రోజూ అరగంట నడిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటోంది జాతీయ పోషకాహార సంస్థ. వేపుళ్లు, తీపి పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు పూర్తిగా తగ్గిస్తే ఇంకా త్వరగా ఫలితం సాధించవచ్చు. పండ్లూ కూరగాయలూ కలిపి రోజుకు 400గ్రా. తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. కావలసిన కెలొరీలూ అందుతాయి. సరైన ఆహారం తీసుకుంటూ చురుకైన జీవనశైలిని అలవరచుకుంటే బరువు తగ్గడమనేది దానంతటదే జరుగుతుందంటారు ‘బరువు తగ్గండి’ అన్న పుస్తకం రాసిన రుజుతా దివేకర్.
* ఒక వ్యక్తి ఆహారంలో ఎన్ని కేలరీలు తీసుకోవాలన్నది ఆ వ్యక్తి వయసూ ఎత్తూ బరువూ చేసే పనీ... వీటన్నిటిని బట్టి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సగటు పురుషుడు 2500 కెలొరీలు, స్త్రీ 2000 కెలొరీలు తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ, వ్యాయామం తగ్గే కొద్దీ కెలొరీలూ తగ్గించాలి. అయితే మన దేశ వాతావరణ పరిస్థితులను బట్టి మన బరువుని 24తో గుణిస్తే వచ్చే మొత్తం కెలొరీలు చాలంటున్నారు నిపుణులు.
* వేళ తప్పి ఆహారం తీసుకోవడమూ చాలినంత నిద్ర లేకపోవడమూ ఉపవాసాల పేరుతో రెండు మూడు రోజులు ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత కడుపు నిండా తినడమూ మంచిది కాదు. ఉపవాసం ఉన్నా ద్రవరూపంలో ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఉపవాసం విడిచాక ఆకలితో ఆబగా తినే పరిస్థితి రాదు. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలని వైద్యులు చెప్పేది అందుకే.
* బరువు తగ్గాలనుకునేవారు తరచుగా వాడే మాటలు... లోఫ్యాట్, షుగర్‌లెస్, కంట్రోల్డ్ డైట్. అవేవీ వద్దు. బ్యాలన్స్‌డ్ డైట్ ఒక్కటే అన్నిటికీ పరిష్కారం.
* మల్టీటాస్కింగ్ మనకిష్టం. తినేటప్పుడు టీవీ చూస్తాం. ఫోన్ మాట్లాడుతాం. కంప్యూటర్ మీద పనిచేస్తాం. ఇలా ఏదో ఒకటి చేస్తూ తినడం వల్ల అసలు తిన్న అనుభూతి మనకు కలగదు. ఏం తిన్నామో మెదడుకీ తెలియదు. దాంతో జీవచర్యల మీద సరైన ప్రభావం చూపదు. అందుకని జ్ఞానేంద్రియాలన్నిటినీ ఉపయోగిస్తూ తినమంటారు నిపుణులు. కళ్లతో ఆహారం రంగుని చూస్తూ ముక్కుతో ఘుమఘుమలనూ నాలుకతో రుచులనూ ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమిలి తినండి. ఆరోగ్య సమస్యలు లేని మంచి జీవితానికి సరైన ఆహారమే కీలకం. కాబట్టి అక్కడ రాజీ పడవద్దు.
* ఈ నాలుగూ మరవద్దు. 1. ఆహారం తాజాగా ఉండాలి. 2. తక్కువ మోతాదులో ఉండాలి. 3. కాలానికి తగినట్లుగా ఉండాలి. 4. కుటుంబ వారసత్వ అలవాట్లకు భిన్నంగా ఉండకూడదు.
* చివరిదీ అన్నిటికన్నా ముఖ్యమైనదీ ఒత్తిడికి దూరంగా ఉండడం. ప్రశాంతంగా ఉన్న మనసు ఆహారాన్ని కొవ్వుగా మారకుండా నివారిస్తుంది.
కాలాన్ని బట్టి సమాజమూ జీవన విధానమూ మారుతుంది. అంతమాత్రాన ఆరోగ్యంలో మార్పులు ఎందుకొస్తున్నాయి?
జీవనశైలి అంటే మన ఆహారపుటలవాట్లూ నిద్ర వేళలూ శారీరక వ్యాయామం లాంటివన్నీ వస్తాయి. సాంకేతికత, పట్టణీకరణ మన అవసరాలనూ జీవనవిధానాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో మనం వాడే ఒక్కో వస్తువునీ గమనించండి. అది లేకముందు మన పని ఎలా ఉండేదీ అది వచ్చాక ఎలా ఉందో... దాన్ని బట్టి జీవన విధానంలో వచ్చిన మార్పులు అర్థమవుతాయి. ఒక చిన్న ఉదాహరణ- గత రెండు వందల ఏళ్లలో మన ఆహారంలో పంచదార వాడకం 30రెట్లు పెరిగిందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆహారపుటలవాట్లలో వచ్చిన మార్పు ఫలితమేగా అది. మన దేశంలో 1995 నుంచి 2014 నాటికి మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మధుమేహం చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. మనం తీసుకునే రకరకాల ఆహారం నుంచి లభించే కెలొరీలు శరీరం మీద రకరకాలుగా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లో ఉండే ఫ్రక్టోజ్ అనే చక్కెర పదార్థం త్వరగా జీర్ణమై హానికారక కొవ్వు పేరుకోవడానికి కారణమవుతుంది. ఇన్సులిన్ స్థాయులను ప్రభావితం చేసి కడుపులో మంటకూ కారణమవుతుంది. ఆహారపుటలవాట్ల ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుందనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి?
ఇక శారీరక శ్రమ విషయానికి వస్తే పల్లెల్లో నివసించేవారి శ్రమతో పోలిస్తే పట్టణాల్లో నివసించేవారి శ్రమ తక్కువే. వాహనాల వాడకం వల్ల నడక తగ్గిపోయింది. రకరకాల విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తున్నందున శ్రమా సమయం రెండూ తగ్గాయి. దాంతో ఖాళీ సమయాన్ని వినోదాలకు కేటాయిస్తున్నారు. గంటల తరబడి టీవీకీ, స్మార్ట్ ఫోన్‌కీ, కంప్యూటర్‌కీ కళ్లప్పగించడం వల్ల శరీరంలో కెలొరీలు కరగడం లేదు. ఒకప్పటితో పోలిస్తే రెడీమేడ్ ఆహారపదార్థాలూ హోటళ్లలో తినడం ఎక్కువైంది. రాత్రిళ్లు పనిచేయడమూ పగలు నిద్రపోవడమూ మామూలైపోయింది. పెరుగుతున్న సంపాదన మనిషిని ఆరోగ్యకరమైన జీవన విధానానికి దూరం చేస్తోంది. వీటినన్నిటినీ కలిపే జీవనశైలిలో మార్పులు అంటున్నారు. పట్టణాలూ నగరాల్లోనే స్థూలకాయుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ మార్పులే.
ఈ మార్పుల్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడం సాధ్యమేనా?
మనం మార్చుకోవాలనుకుంటే సాధ్యమే. ముందుగా, రోజూ ఒకే సమయానికి నిద్ర లేచి ఒకే సమయానికి నిద్ర పోయే అలవాటు చేసుకోవాలి. రోజూ ఓ అరగంట నడకో మరో వ్యాయామమో తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత బయటి తిండి మానేయాలి. తీపి పదార్థాలూ కొవ్వు పదార్థాలూ తక్కువగా, పండ్లూ కూరగాయలూ ఎక్కువగా తీసుకోవాలి. ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అన్నది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఏ పార్టీకో వెళ్ళినాలుగు ముద్దలు ఎక్కువ తింటే ఆరోజు వ్యాయామం కూడా ఓ పావుగంట ఎక్కువ చేయాలి.
ఏట్లో వేసినా ఎంచి వేయమని సామెత. అలాంటప్పుడు మన అస్తిత్వానికి కారణమైన శరీరాన్ని ఏమాత్రం గౌరవించకుండా ఏది పడితే అది పొట్టలో ఎలా వేస్తాం? అందుకే నాలుకకు హితవైనది కాకుండా శరీరానికి హితవైనది తిందాం. ఆరోగ్యంగా ఉందాం.
జేబుకీ బరువే!
గత రెండు దశాబ్దాల్లో మన దేశ ఆరోగ్య రంగం అంటువ్యాధుల నుంచీ ఇతర వ్యాధులకి మళ్లింది. అందులో ప్రధానంగా నాలుగు రకాల వ్యాధులు -గుండె జబ్బులు, శ్వాసకోశవ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు... ప్రజల ఆయుఃప్రమాణాల్నీ ఆర్థిక పరిస్థితుల్నీ హరించివేస్తున్నాయి. ఒకప్పుడు ఆరుపదులు దాటాక వచ్చే ఈ వ్యాధులు ఇప్పుడు నాలుగు పదుల వయసులోనే కన్పిస్తున్నాయి. పైగా ఇవన్నీ జీవనశైలి వల్ల వస్తున్న జబ్బులే. కాస్త జాగ్రత్తపడితే నివారించదగినవే. 1970లలో మొదలైన ఈ మార్పు 90లకు తీవ్రం కాగా ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ‘ఆహారపుటలవాట్లలో, ప్రవర్తనాపరమైన విషయాల్లో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మధుమేహం, గుండెపోటులను 80 శాతం నివారించవచ్చు. 30 నుంచి 40 శాతం క్యాన్సర్లనూ నివారించవచ్చు...’ అంటారు చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ జె.ఎస్.ఠాకూర్. కుటుంబం చేసే ఆహారేతర ఖర్చులో దాదాపు 50 శాతం ఇప్పుడు అనారోగ్యాలకే ఖర్చవుతోంది. మధ్య తరగతి కుటుంబంలో ఒకరికి గుండెజబ్బు వచ్చిందంటే ఆ కుటుంబం దాచుకున్న డబ్బంతా అయిపోతుంది. అదే క్యాన్సర్ వస్తే కుటుంబం అప్పులపాలవుతోంది.
బొద్దు ముద్దే కానీ...
తాజా అధ్యయనాల ప్రకారం దక్షిణభారతదేశంలోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలూ 18.5 శాతం అమ్మాయిలూ స్థూలకాయులే. ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధన ప్రకారం మరో ఏడేళ్లలో అంటే 2025కల్లా మనదేశంలో కోటీ డెబ్భై లక్షల మంది బాలబాలికలు(5-17 సంవత్సరాల మధ్య వయసువారు) స్థూలకాయులుగా ఉంటారు. అంటే 184 దేశాల్లో మన దేశం రెండోస్థానంలో ఉండబోతోంది. పసిపిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు. కానీ పెరిగే క్రమంలో పొడుగైన కొద్దీ లావు తగ్గి మామూలు బరువుకి వచ్చేస్తారు. అలా కాకుండా బొద్దుగానే కొనసాగితే వారు పెద్దయ్యాక కూడా స్థూలకాయులుగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. పిల్లల్లో స్థూలకాయానికి హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఆహార పదార్థాలు - అంటే ఫుడ్ హై ఇన్ ఫ్యాట్, సాల్ట్ అండ్ షుగర్ కారణమని పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడంతో కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్ల క్యాంటీన్లలో ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మహారాష్ట్ర ఈ దిశగా చర్యలు తీసుకుని క్యాంటీన్లలో ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలను నిషేధించింది. పిల్లలకు శారీరక వ్యాయామం లేకపోవడమూ స్థూలకాయానికి మరో కారణం. స్కూళ్లలో ఆట స్థలాలు ఉండవు. ఇళ్లలో టీవీ ఆకర్షిస్తుంది. దాంతో పిల్లల జీవనశైలిలో చురుకుదనం మాయమయింది. పిల్లలకు రోజూ కనీసం ఒక గంట శారీరక వ్యాయామం ఉండేలా తల్లిదండ్రులే చూడాలంటోంది జాతీయ పోషకాహార సంస్థ.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565