MohanPublications Print Books Online store clik Here Devullu.com

బ్రహ్మకు గుడి లేదు,పూజా లేదు!_Brahma does not have a temple, No Pooja!


guru.gods,brahma

బ్రహ్మకు గుడి లేదు,పూజా లేదు!
Brahma does not have a temple, No Pooja

    గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏమీ లేదు కనుక. అంటే... మనం చేసిన కర్మఫలితానికి ఈ శరీరాన్ని ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే ఈ శరీరం పడిపోవాలి. ఈ శరీరంతో ఉండగా ఇక బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది.. అందుకని ఆయనకు గుడిలేదు, పూజలేదు. స్థితికారుడైన విష్ణువు, జ్ఞానదాత అయిన మహేశ్వరుడు మాత్రం అనుగ్రహిస్తారు.


బ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టికంతటికీ పెద్దవాడు. అందువల్ల ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తుంటాడు. మనుష్యుడు పొందిన ఈ శరీరాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ’జంతూనాం నరజన్మ దుర్లభం’అంటారు శంకరభగవత్పాదులు. అంటే అందరూ పశువులే. పశువుకానివాడు ఉండడు. పశువు అంటే పాశం చేత కట్టబడినది. జన్మ అది ఒక రాట(పశువులను కట్టే గుంజ).

కర్మపాశాలు పలుపుతాళ్ళు. అవి మెడకు తగిలి ఉండడంవల్ల ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మనుష్యుడు ఒక శరీరంలోకి వస్తాడు. ఆ కర్మపాశాలను తెగకోయకలిగినవాడు–పశుపతి. ’ఈశ్వరా! నేను పశువుని. మీరు పశుపతి. నన్ను ఉద్ధరించడానికి మనిద్దరి మధ్య ఈ సంబంధం చాలదా’ అన్నారు శంకరులు.

కాబట్టి బ్రహ్మగారిచ్చిన ఈ శరీరం ఒక అద్భుతం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, మిగిలిన తిర్యక్కులు (భూమికి వెన్నుపాము అడ్డంగా కలిగిన ప్రాణులు).. అలా అన్నిటిలోకి మనుష్యుల శరీరమే గొప్పది. మనుష్యుడు ఎక్కడుంటాడు... మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకమంటే.. మృత్యువుచేత గ్రసింపబడేది. అంటే ఈ లోకంలోకి ఏ ప్రాణివచ్చినా అది వెళ్లిపోతుంది ఒకనాడు.‘జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. వచ్చిన ప్రతి శరీరం వెళ్ళిపోవలసిందే. అయినా మనుష్య శరీరం చాలా గొప్పది. కారణం ?

దేవతలు మనకన్నా గొప్పవాళ్ళంటారేమో! కానీ వారి శరీరాలకు కర్మాధికారం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వాళ్లకా అధికారం లేదు. వాళ్ళ పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లోఉండి తరువాత మర్త్య లోకంలో పడిపోయి మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడు అలా కాదు. ఇక్కడుండి పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు. లేదా చిత్తశుద్ధి కలిగి, దాని వలన జ్ఞానం కలిగి, మోక్షం కావాలని కోరుకుని తద్వారా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు.

మనుష్యశరీరంతో వచ్చినా, దానివిలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలం తాను బతికితే చాలని, ఇతరులగురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చేయకుండా, గురువుగారి పాదాలు పట్టుకోకుండా స్వార్థంతో బతికి చివరకు మళ్ళీ కొన్ని కోట్లజన్మల వెనక్కి తిర్యక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా, తిర్యక్కుగా వెళ్ళిపోవాలన్నా... మనుష్య శరీరానికే. అంటే పైకెక్కాలన్నా, కిందకుపోవాలన్నా ఇక్కడికి రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మచేయగల అధికారం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే.

ఈ శరీరాన్ని బ్రహ్మగారిచ్చారు. ఇస్తే... ఏమిటి దానివల్ల ఉపయోగం? సనాతనధర్మంలో ఆశ్రమ వ్యవస్థ వచ్చింది ఎందుకు... మెలమెల్లగా వ్యామోహాన్ని తీసేసి భగవంతునివైపు నడిపించడానికి. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఆ మార్పుచేత కట్టు మీద కట్టు వేసినా, ఆ కట్టువేయవలసినవాడు ఎవడు... అంటే... గురువొక్కడే. గురువుకు తప్ప ఆ కట్టువేసే అధికారం మరెవ్వరికీ లేదు.








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list