MohanPublications Print Books Online store clik Here Devullu.com

పచ్చనివి తిందాం పచ్చగా వుందాం_ Let's eat green and let it be green

























    ప్రకాశవంతమైన పసుపు రంగు కంటికి ఆహ్లాదాన్నే కాదు, మనసుకు ఆనందాన్నీ కలిగిస్తుంది. ఆశావాదాన్ని పెంపొందించే శక్తిమంతమైన రంగుగా దీన్ని కొనియాడుతుంటారు కలర్‌థెరపిస్టులు. అందుకే ఆ రంగు షేడ్స్‌ని ఇంట్లోని ఒక గదిలోనయినా వేయమని ఇంటీరియర్‌ డిజైనర్లు చెబితే, ఆ రంగు దుస్తుల్ని వారంలో కనీసం ఒక్క రోజయినా ధరించమంటారు ఫ్యాషనిస్టులు. అయితే అది కేవలం అందానికీ మానసిక ఆనందానికీ మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యానికీ కొలమానమే అంటూ ఆ పసుపుపచ్చ పండ్లనీ కూరగాయల్నే ప్రిస్కిప్షన్‌గా రాసిస్తున్నారు నేటి పోషక నిపుణులు. పసుపు రంగు వాటిల్లో బయోఫ్లేవనాయిడ్లూ కెరోటినాయిడ్లూ పుష్కలంగా ఉంటాయనీ అవి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయనీ వివరిస్తున్నారు. వీటిల్లో ఖనిజాలూ విటమిన్లూ కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇవన్నీ కలిసి గుండె ఆరోగ్యానికీ కంటిచూపు మెరుగవడానికీ దంతసిరికీ ఎముక బలానికీ పుండ్ల నివారణకీ తోడ్పడతాయి.

అందమైన రంగు! 
అన్నింటికన్నా పసుపురంగు ఆహారం చర్మ సంరక్షణకి ఎంతో మేలు. చలికాలంలోనూ వేసవిలోనూ చర్మం వడలిపోయి, ఎండిపోయినట్లవుతుంది. అందుకేనేమో గుమ్మడి, మొక్కజొన్న, నిమ్మ, అరటి, స్టార్‌ఫ్రూట్‌, పైనాపిల్‌, మామిడి, పనస... వంటి పసుపు రంగు కూరగాయలూ పండ్లన్నీ ఆ రెండు కాలాల్లోనే ఎక్కువగా వస్తాయి. ఇవి మొహంమీద మొటిమలు రాకుండానూ తాజా చర్మ సౌందర్యానికి కూడా దోహదపడతాయి. ముఖ్యంగా పసుపురంగు వాటిల్లో రెటినాల్‌(విటమిన్‌-ఎ1) శాతం చాలా ఎక్కువ. ఇది చర్మం ముడతలు పడకుండానూ దెబ్బతినకుండానూ చేస్తుందట. అందువల్లే వృద్ధాప్యం మీదపడకుండానూ; కాలుష్యం, ఒత్తిడి... వంటి వాటి కారణంగా చర్మం దెబ్బతినకుండానూ ఉండేందుకు రాసుకునే క్రీములూ ప్యాకులకన్నా పసుపు రంగు పండ్లను ఆహారంగా తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు చర్మ వైద్యులు. ఈ కారణంతోనే ఈమధ్య సహజంగా దొరికే పసుపురంగు కూరగాయలూ పండ్లతోబాటు ఏవో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే పండే పసుపురంగు కూరగాయల్నీ పండ్లనీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మరీ పండిస్తున్నారు ఉద్యాన నిపుణులు. అలాంటి వాటిల్లో ప్రధానమైనది గోల్డెన్‌ బీట్‌రూట్‌. కాల్షియం, పొటాషియం, పీచూ ఎక్కువగా ఉండే వీటిల్లో క్యాలరీలు తక్కువ. ఎరుపురంగు దుంపల్లో బెటాలిన్‌ అనే వర్ణద్రవ్యం అధికంగా ఉంటే, పసుపువాటిల్లో బీటా జాంథిన్‌ ఎక్కువ. అందుకే హృద్రోగులకూ మధుమేహులకూ బీపీ రోగులకీ మూత్రపిండ వ్యాధులతో బాధపడేవాళ్లకీ ఈ పసుపు రంగు బీట్‌రూట్‌ జ్యూస్‌ ఎంతో మేలు చేస్తుంది. 

* తెలుపు రంగులో ఉండే బంగాళాదుంపల కన్నా పోషకాలు ఎక్కువగా ఉండే పసుపు రంగు వాటికే ఐరోపా దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. పైగా వాటితో పోలిస్తే వీటిల్లో క్యాలరీలూ తక్కువే. 
* ఎర్రని టొమాటోలతో పోలిస్తే పసుపు రంగు టొమాటోల్లో లైకోపీన్‌ శాతం తక్కువే. కానీ నియాసిన్‌, ఫొలేట్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో గర్భిణులకి ఇవి మంచి ఆహారం. పైగా ఎర్ర వాటిల్లోకన్నా వీటిల్లో ఆమ్ల గుణం తక్కువగా ఉండటంతో మరింత తియ్యగా ఉంటాయి. 
* కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించే కెరొటినాయిడ్లకీ యాంటీ ఆక్సిడెంట్లకీ ఫైటో న్యూట్రియంట్లకీ ఎల్లో క్యాప్సికమ్‌ పెట్టింది పేరు. ఇందులో బీటా కెరోటిన్‌తోబాటు ఫొలేట్‌, కె-విటమిన్‌ల శాతం కూడా ఎక్కువే. అయితే ఈ క్యాప్సికమ్‌ను ఉడికించడంకన్నా పచ్చిగా సలాడ్‌ రూపంలో తీసుకోవడమే మంచిది. 

* క్యాన్సర్‌తో పోరాడే ఐసోఫ్లేవిన్లూ ఫైటోస్టెరాల్సూ పసుపు బీన్స్‌లో పుష్కలం. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్‌ శాతాన్నీ తగ్గిస్తాయి. 

* తెలుపు, నారింజ రంగులే కాదు, పసుపు రంగు చిలగడదుంపలూ ఉన్నాయి. విటమిన్‌-ఎ, విటమిన్‌-బి5, బి6, థైమీన్‌, నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌లతోబాటు కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉండే ఈ చిలగడదుంపలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణశక్తికీ తోడ్పడతాయి. 

* పసుపు రంగు కాలీఫ్లవర్‌లోని పోషకాలు కంటిచూపునీ చర్మ సౌందర్యాన్నీ మెరుగుపరుస్తాయి. అలాగే వంకాయ, క్యాబేజీ, పుట్టగొడుగులు, పచ్చిమిర్చి, ముల్లంగి... ఇలా మరెన్నో కూరగాయలు కూడా పసుపురంగులో లభ్యమవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

పండ్లలోనూ... 
ఎరుపురంగు ఆపిల్స్‌తో పోలిస్తే పసుపురంగు వాటిల్లో సహజమైన చక్కెరలూ పీచూ ఎక్కువ. అందువల్ల దీన్ని మధ్యాహ్నం స్నాక్‌ ఫుడ్‌గా తీసుకుంటే ఉత్తమం. ఎల్లో ఆపిల్‌ శరీరంలోని టాక్సిన్లనీ తొలగిస్తుంది. అలాగే పసుపు రంగు పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. అదే సమయంలో క్యాలరీలు తక్కువ. అందుకే వూబకాయులకి ఇది ఎంతో మేలు. పసుపు రంగు అంజీర్‌లో పొటాషియం ఎక్కువగా ఉండి, బీపీ రోగులకీ మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ శాతాన్నీ తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులున్న వాళ్లకీ ఇది ఎంతో మేలు. సి-విటమిన్‌కీ పీచుకీ అద్భుత నిల్వలైన పసుపురంగు కివీ పండ్లు బీపీ, హృద్రోగాలూ, పక్షవాతమూ... వంటివి రాకుండా అడ్డుకుంటాయి. పసుపు రంగులో ఉండే మెక్సికన్‌ క్రీమ్‌ జామ రకంలో ఎ-విటమిన్‌ శాతం చాలా ఎక్కువ.

ఇవే కాదు, సహజంగానే పసుపు రంగులో దొరికే మామిడి, గుమ్మడి, దోస, అరటి, మొక్కజొన్న... వంటి కూరగాయలూ పండ్లూ ఎన్నో... మరెన్నో. వాటితోపాటు అరుదైన ఈ పసుపురంగు పండ్లనీ కూరగాయల్నీ కూడా మీ హరివిల్లు ఆహారంలోకి చేర్చేయండి. మనమెంతో శుభప్రదంగానూ భావించే ఆ రంగుని ఆస్వాదిస్తూ అందంగా ఆరోగ్యంగా జీవించండి..!


























No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list