కార్తికంలో
ఉసిరి విశిష్టత!
కార్తిక మాసంలో ఉసిరిచెట్టుకు పూజ చేయటం, ఉసిరికాయ పచ్చడి తినటం ప్రధానమైన నియమంగా చెబుతారు. ఈ విషయాన్ని స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించారు. వాస్తవానికి మన సంప్రదాయంలో ఉసిరికి చాలా విశిష్టత ఉంది. ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ తినటం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలను మన పూర్వీకులు అనేక సందర్భాలలో ప్రస్తావించారు. ఇక శాస్త్రపరంగా చూస్తే- చైత్రమాసంలో వేపచెట్టు మీద.. కార్తిక మాసంలో ఉసిరి చెట్ల మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరికాయపై వత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తిక పౌర్ణమినాడు ఉసిరికొమ్మను తీసుకువచ్చి తులసిచెట్టు పక్కనే పాతి.. రెండింటికీ కలిపి పూజ చేసి దీపం పెడతారు. దీని వెనక ఒక పరమార్థం ఉంది. తులసి విష్ణుసంబంధమైనది. ఉసిరి లక్ష్మీ సంబంధమైనది.
ఈ రెండింటికీ పూజచేస్తే- విష్ణువుకు, అమ్మవారికి పూజ చేసిన పుణ్యం లభిస్తుందని మన పూర్వీకుల నమ్మకం. ఇదే విధంగా కార్తికమాసంలో తప్పనిసరిగా చేయాల్సిన ది వన భోజనం. అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్లి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. దీని వెనక ఒక పరమార్థం ఉంది. ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది. అదే విధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది. మనకు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కలగజేస్తూ.. ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక సారైనా ప్రకృతిని కోరుకోవాలి. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది? అందుకే కార్తికమాసంలో వనభోజనాలు పెడతారు. దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు. వనం అంటే పరబ్రహ్మం.
అన్నం కూడా పరబ్రహ్మమే. ఈ రెండింటినీ ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఒక అలౌకికానుభూతిని పొందటానికి చేసే ప్రయోగమే వన భోజనాలు. దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే- అరణ్యంలో ఎవరికీ సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి.. భగవంతుడి నామస్మరణ చేస్తూ గడపడమని లెక్క. ఆశ్రమం మారటం అంటే- ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు. ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చారనుకుందాం. అంటే బ్రహ్మచర్యం జారిపోయిందని లెక్క. వానప్రస్థానికి వెళ్లటం అంటే గృహప్రస్థం జారిపోయిందని లెక్క. వీటన్నింటికీ సాధన కావాలి. ఈ సాధనలో ఒక క్రమమే ఈ వనభోజనం. ఈ మొత్తం తత్వాన్నంతా భాగవతంలో మనం చూడవచ్చు. శ్రీకృష్ణుడు వనభోజనాల సమయంలో చేసిన లీలలు అసామాన్యం.
- శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565