జై అంటే జయాలనిచ్చే..
సారంగాపూరు హనుమాన్!
ఉత్తర దక్షిణాది రాష్ర్టాల మేలు కలయికగా ఉన్న ఇందూర్‌లో ప్రసిద్ధ ఆలయాలకు కొదువలేదు. అలాంటి వాటిలో సారంగాపూరు హనుమాన్ మందిరం ఒకటి. హైందవ రాజ్య సంస్థాపనకు నడుంకట్టిన ఛత్రపతి శివాజీ గురువు సంత్ సమర్ధ్ రామదాసు చేతులమీదుగా ఇక్కడ హనుమాన్ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగినట్లు చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నాయి. నిజామాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న సారంగాపూరు హనుమాన్ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా మారింది. ఇంతటి విశిష్టమైన సారంగాపూర్ హనుమాన్ ఆలయ వైభోగమే ఈ వారం దర్శనం. -అంతడ్పుల రామకృష్ణ ,
ఎక్కడ ఉన్నది?:
నిజామాబాదు జిల్లా సారంగాపూరు గ్రామంలో.
ఎలా వెళ్లాలి?:
హైదరాబాదు నుంచి నిజామాబాదు 175 కిలోమీటర్ల ఉన్నది. బస్సు లో వెళ్లి మండల కేంద్రం నుంచి మరో 6 కిలోమీటర్లు వెళితే ఈ ఆలయం వస్తుంది
విశిష్టత ఏంటి?:
ఎలాంటి సమస్యలు ఉన్నా సారంగాపూర్ హనుమానును దర్శించుకుంటే వెంటనే పరిష్కారమవుతాయి. ఛత్రపతి శివాజీ గురువైన సంత్ సమర్ధ్ రామదాసు ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.
మహారాష్ట్ర సాధువులు:
జిల్లా కేంద్రంలోని రఘునాధ ఆలయం.. పెద్దరామ మందిరంతో పాటు సారంగపూరు ఆలయం ఓకేసారి నిర్మాణం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. చారిత్రకాంశాలతో పాటు సందర్శనకు అనుకూలంగా ఉండటంతో తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్.. మహారాష్ట్ర.. కర్నాటక నుంచి వేలాది భక్తులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. 500 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇందూరులోనే ఉన్నప్పటికీ పూజా కార్యక్రమాలు నిర్వహించేది ఉతర్త భారతీయులైన మహారాష్ర్టులు కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
జయమ్ము నిశ్చయమ్ము:
జైజై హనుమా అంటూ స్వామికి జై కొడితే జయాలు వరిస్తాయని భక్తుల నమ్మకం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సాగరంపూరు మనుమాన్ మందిరానికి వందలాది ఎకరాల భూములు కూడా ఉండేవట. సాంగపూరు హనుమాన్ ఆలయం నుంచి బ్రహ్మపురిలోని పెద్ద రామ మందిరానికి.. ఖిల్లా రామాలయానికి ఇక్కడ్నుంచి సొరంగ మార్గం ఉందట.
చారిత్రక వైభవం:
ఇది జిల్లాలోనే అత్యంత పురాతనమైనది. ఇక్కడి ప్రాచీన గర్భగుడిలో ప్రతిష్టించిన అఖండ ఏకశిలా విగ్రహం చాలా అరుదుగా ఉంటుంది. స్వామివారి నిండైన శిలా విగ్రహం జిల్లాలో మరెక్కడా లేకపోవడం విశేషం. వీటి తాలుకూ చారిత్రక వైభవ ఆనవాళ్లు.. ఆలయ పురాతన నిర్మాణ శైలి ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రధాన ముఖద్వారం మొదలుకుని నిర్మాణం మొత్తం ధృఢమైన రాళ్లతో డంగు సున్నంతో నిర్మించబడింది. ఆలయ ఆవరణలో సాదు సంతులు.. బాటసారులు బస చేసే విధంగా సత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వంటశాలలుగా ఉపయోగిస్తున్నారు.
ఆలయ రక్షణకు సహకరించాలి:
ఉమ్మడి జిల్లాలో సారంగపూరు హనుమాన్ మందిరం.. సలబత్‌పూరు హనుమాన్ మందిరంలో చాలా ప్రసిద్ధి చెందినవి. సతబత్‌పూర్ ఆలయం అభివృద్ధికి కర్నాటక.. మహరాష్ట్ర.. తెలంగాణ భక్తులు సహకరించిన విధంగా ఈ ప్రసిద్ధ ఆలయం రక్షణకు అందరు ముందుకు రావాలి. ఆలయం అభివృద్ధికి ఎంపీ కవిత ప్రత్యేక చొరవ తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి అందదూ ముందుకు రావాలి. చారిత్రక నేపథ్యమున్న ఇలాంటి ఆలయాలను పరిరక్షిస్తే మంచి జరుగుతుంది.
-పెద్ద రామమందిరం పీఠాధిపతి దినకర్ మహరాజ్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565