MohanPublications Print Books Online store clik Here Devullu.com

అన్నవర వైభవం_Annavara_Vaibhavam

 

అన్నవర వైభవం

సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు. మరెన్నో నామధేయాలు. ప్రతి రూపానికీ ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే శ్రీసత్యనారాయణస్వామి స్వరూపం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై, శివ సహిత అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేతుడై వీర వెంకట సత్యనారాయణస్వామి అన్నవరం దివ్యక్షేత్రాన కొలువై ఉన్నాడు. రాజమండ్రి సమీపంలో రత్నగిరిపై, పంపానది తీరాన స్వయం వ్యక్తంగా సత్యదేవుడు విలసిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తాడు. తెలుగువారి ఇంటింటి దైవమైన సత్యనారాయణుడు వ్రతాధిష్ఠాన దైవం. సత్యదేవుడి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. స్కాంద పురాణం రేవా ఖండంలో ఈ క్షేత్ర వైభవం, సత్యనారాయణుడి లీలా ప్రాభవం, వ్రత వైశిష్ట్యాలు సవివరంగా ఉన్నాయి.

రత్నగిరిపై ఉన్న అంకుడు చెట్టు పొదలో తాను శిలారూపంలో వ్యక్తమైనట్టుగా కర్ణంపూడి సంస్థానాధీశ్వరుడు రాజా ఇనుగంటి వెంకటరామరాయణం స్వప్నంలో స్వామి వెల్లడించినట్టు స్థలపురాణం. శ్రీఖరనామ సంవత్సరం శ్రావణ శుక్ల విదియనాడు మఖా నక్షత్రంలో గురువారం రోజు (1891 సంవత్సరం ఆగస్ట్‌ ఆరున) సత్యదేవుడు ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. వందేళ్ల చరిత్రతోనే వెయ్యేళ్ల ప్రాశస్త్యాన్ని పొందిన ఈ క్షేత్రం అనిన వరాల్ని నెరవేర్చే అన్నవరంగా, ఆపన్నుల దివ్యధామంగా పేర్కొంటారు. ఈ పవిత్ర సన్నిధానం ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో పురాణగాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి.

భద్రుడు, రత్నాకరులనే భక్తులు విష్ణువు కోసం తపస్సు చేయగా శ్రీహరి అనుగ్రహంతో భద్రుడు భద్రాద్రిగా, రత్నాకరుడు రత్నగిరిగా రూపు దాల్చారని చెబుతారు. ఆ రత్నగిరిపైనే సత్యదేవుడు త్రిమూర్తుల సమన్వితంగా విరాజిల్లుతున్నాడు.మరో కథనం ప్రకారం, మేరు పర్వత రాకుమారుడైన రత్నగిరి, మునికన్య పంప పరస్పరం ప్రేమించుకున్నారు. వారిరువురు ప్రణయ భావనలతో వనవిహారం చేస్తుండగా, పంప తండ్రి గమనిస్తాడు. ఆగ్రహంతో ఇద్దరినీ శపిస్తాడు. తమ పవిత్ర ప్రేమను వివరిస్తూ ఇద్దరూ ఆ ముని పాదాలపైపడి శరణు వేడతారు. దాంతో పర్వత రూపంలో రత్నగిరి, ఆ గిరి సమీపంలోనే పావన జలరాశిగా పంప కొలువుతీరతారని ఆ ముని ఆశీర్వదిస్తాడు. శ్రీమన్నారాయణుడు సత్యదేవుడిగా రత్నగిరిపై వేంచేస్తాడనీ, పంప జలరాశులతో ఆ స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని వివరించాడంటారు. నారద మహాముని ఈ రత్నగిరిపై కొంతకాలం తపమాచరించాడనీ, ఈ రత్నగిరి గర్భంలో శ్రీమన్నారాయణ మహామంత్ర ఫలితాన్ని నిక్షిప్తం చేశాడని చెబుతారు.

ఇటీవలే అన్నవరం దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 1893 సంవత్సరంలో బదరీనాథ్‌ క్షేత్రంనుంచి తీసుకొచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని ఆలయం దిగువన ప్రతిష్ఠించారు. ఇది దివ్య యంత్రమనీ, 24 వృత్తాలతో ఉన్న ఈ యంత్రంలో అనేక బీజాక్షరాలు, తొమ్మిది యంత్ర గాయత్రీమంత్రాలున్నాయని వేద పండితులు పేర్కొంటారు. గర్భాలయంలో అభీష్ట వరదాయకుడైన సత్యనారాయణుడికి ఎడమవైపున వాణీరమాంబా స్వరూపిణి అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతిదేవి, కుడివైపున శివుడు కనిపిస్తారు. యంత్రరూపాన బ్రహ్మ ప్రతిష్ఠ జరిగింది.

అన్నవర క్షేత్రంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు స్మార్త ఆగమ విధాన పూర్వకంగా నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని జరుపుతారు. ఏకాదశినాడు స్వామివారి కల్యాణం, రజత గరుడ వాహనంపై వూరేగింపు, ద్వాదశినాడు ప్రథమ హోమం, రావణ వాహనంపై వూరేగింపు, త్రయోదశినాడు కల్యాణ సదస్యం నిర్వహిస్తారు. చతుర్దశినాడు స్వామివారి విహారయాత్ర, పూర్ణిమనాడు చక్రతీర్థం, నాకబలి, బహుళ పాడ్యమినాడు పుష్పయాగం నేత్రపర్వంగా సాగుతుంది. కార్తిక శుద్ధ ద్వాదశినాడు స్వామివారి తెప్పోత్సవం కడు కమనీయంగా శోభిల్లుతుంది. సత్యదేవుడి వ్రతకథల్లో స్వామివారి ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. గోధుమనూక, ఆవునెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారుచేసే అన్నవర ప్రసాదం మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువు తీరిన అరుదైన, అద్వితీయ సన్నిధి... భక్తుల పాలిట దివ్యపెన్నిధి- అన్నవరం క్షేత్రం.

                                                              - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list