కాలంతో కలిసి వేయాలి
అడుగులు!
‘మగడు వేల్పను పాత మాటది/ ప్రాణ మిత్రుడ నీకు’ అని మహాకవి గురజాడ అత్యున్నత కుటుంబ విలువకు దారి చూపించారు. భర్త పాదసేవ తప్ప భార్యకు పరమధర్మం లేదనే రోజులకు కాలం చెల్లిపోయింది. ఒకప్పుడు భర్త బయటికెళ్లి సంపాయించాలనీ, భార్య ఇల్లు చక్కదిద్దుకోవాలని భావించేవారు. ప్రస్తుతం ఆలూమగల బాధ్యతలు, పనుల మధ్య గీత చెరిగిపోయింది. ‘ఇది ఆడవారి పని.. ఇది మగవారి పని’ అనే భేదం కనుమరుగవుతోంది. ‘అన్ని పనులు ఇద్దరివీ’ అనే భావన బలపడుతోంది. దాంతో ఇంటి పనుల ఒత్తిడి భార్యపైన తగ్గుతోంది. అలాగే భార్య కూడా గడపదాటి ఉద్యోగం చేస్తూ కుటుంబ ఆర్థిక భారాన్ని మోస్తున్నది. ఇలా దంపతుల మధ్య అంతరాలు తగ్గుతూ పరస్పరం తోడు నీడగా నిలుస్తున్నారు. అంతటితో సరిపోదు.. కుటుంబ సభ్యులందరినీ ఆవైపు నడిపించాల్సిన బాధ్యత కూడా వారిద్దరిపైనే ఉంది.
నెలకొల్పాల్సిన విలువలు ఇవీ..
* నేటి ఆధునిక యుగంలో ఎవరికీ తీరికలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా కాసేపు కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి లేదు. సెల్‌ఫోన్లు, టీవీ, కంప్యూటర్‌లతో ఎవరికివారే గడిపేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా పిన్నాపెద్దా మనసు విప్పి మాట్లాడుకోవడంలేదు. కనీసం రాత్రిభోజనాలప్పుడైనా అందరూ కలిసి తింటూ కుటుంబ విషయాలు చర్చించుకోవాలి.
* సగటు మధ్యతరగతి కుటుంబాల్లో భర్తే ఇంటిపెద్ద. ఎవరికీ ఏమీ చెప్పకుండా అన్ని నిర్ణయాలను తనే తీసుకుంటుంటారు. ఫలితం భార్యాపిల్లలు దేనిగురించీ ఆలోచించక, అన్నీ ఇంటిపెద్ద చూసుకుంటారనే భరోసాతో కాలం గడిపేస్తుంటారు. ఇది కుటుంబానికి హానికరం! కుటుంబ సమస్యలన్నింటినీ కలిసి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ముందుకెళ్లాలి.
* భార్యాభర్తలు ఒకర్నొకరు పిల్లల ఎదుట చులకన చేసుకోకూడదు. పర్యవసానం ఇద్దరిపైనా పిల్లలకు గౌరవ భావం ఏర్పడదు. ఎల్లప్పుడూ భాగస్వామిని పిల్లల ఎదుట ఉన్నతంగా నిలబెడుతుండాలి.
* భార్యాభర్తలు ప్రేమపూర్వకంగా మెలుగుతుండాలి. తప్పులను బేషరతుగా అంగీకరించి ‘సారీ’ చెప్పాలి. సుగుణాలను మెచ్చుకోవాలి. పరస్పరం సాయపడుతుండాలి. వీటిని పిల్లలు చూస్తుండటం వల్ల వారిలో కూడా విలువలు అభివృద్ధి చెందుతాయి. మన పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాలి అన్న తపన మనల్ని ఉన్నత సంస్కారంవైపు మళ్లిస్తుంది. అది కుటుంబం మొత్తానికీ రక్షణ కవచంగా ఏర్పడుతుంది.
* ఒంటెత్తుపోకడల్ని విడనాడటం, భిన్నాభిప్రాయాల్ని గౌరవించడం, స్త్రీపురుషులను సమానంగా చూడటం, గెలుపోటముల్ని హుందాగా స్వీకరించడం తదితర ప్రజాస్వామిక విలువలు ముందుగా కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులే పిల్లలకు వాటిని నేర్పాల్సివుంటుంది. తద్వారా ఆ పిల్లలు తమ భావి జీవితంలో కష్టనష్టాల్ని ధైర్యంతో ఎదుర్కోగల్గుతారు. పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు.
* తమ బలహీనతలు, తప్పులు, లోటుపాట్లను పిల్లలు తమంతట తామే పెద్దలతో చెప్పుకునే వాతావరణం కుటుంబంలో నెలకొల్పాలి. వారు తమ తప్పుల గురించి చెబుతున్నప్పుడు వెంటనే వాటిని పరుషంగా తీవ్ర పదజాలంతో ఖండించరాదు. అలా చేస్తే ఇక మున్ముందు వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పడానికే వారు జంకుతారు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో జరుగుతున్నదిదే!
* పెద్దలు పిల్లలతో గడుపుతూ వారి ఆలోచనా తీరుతెన్నుల్ని గమనిస్తుండాలి. లేకపోతే పిల్లలు దారితప్పుతున్న సంగతిని తల్లిదండ్రులు ఎప్పటికీ తెలుసుకోలేరు. వారికి ఆ సంగతి తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తమ ఇబ్బందులు, భావోద్వేగాల గురించి తల్లిదండ్రులకు తెలియచెబితే తమను మనస్ఫూర్తిగా క్షమించి, ఆ బిలోంచి బయటపడేస్తారనే నమ్మకాన్ని పిల్లల్లో పాదుగొల్పాల్సివుంటుంది.
పిల్లలు నిస్సంకోచంగా తమ యిష్టాయిష్టాలను, ప్రేమవ్యవహారాలను సైతం ధైర్యంగా ఇంట్లో చెప్పే వాతావరణాన్ని తల్లిదండ్రులే సృష్టించాలి. అమ్మానాన్నలకు చెబితే తమకు తప్పక సరైన సాయం, మార్గదర్శకత్వం అందుతుందనే భరోసా కల్పించాలి.
- కె. రఘు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565