MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం!_ Spirituality .. an art form!

ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం

తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు.
ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం!_ Spirituality .. an art form!
ఆధ్యాత్మికత అనగానే దేవుడిని నమ్మటం అనుకుంటారు. నాస్తికులమని అనేవారు దేవుడు లేడని వాదిస్తూ ఆధ్యాత్మికత వ్యర్థం అంటుంటారు. అసలు ఆధ్యాత్మికతకి దేవుడున్నాడా లేడా అనే వాదానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికత అనేది ఈ విషయాలకు చాలా అతీతమైంది. ఆధ్యాత్మికత ఒక కళ వంటిది. కళ ఒక శారీరక మానసిక కౌశలం. కళ మనలోపలి అంశం. సాధన ద్వారా కళ మెరుగుపడి ఔన్నత్యాన్ని పొందుతుంది. కళ ద్వారా భావనాత్మక ఆనందం పుడుతుంది. కళ ఒక ఆనందపు గని. ఆనందించడానికి ఉపయోగపడే పరికరం లాంటిది. కళ పరమావధి ఆనందం. తనలోపల ఉన్న ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని శాస్త్రబద్ధంగా అభ్యసించి, నిరంతరం సాధన చేసి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఔన్నత్యాన్ని అందుకొని మనిషి కళాకారుడుగా పరిణతి చెందుతాడు. కళాకారుడు గొప్ప వాడు కావలంటే తాను సాధన చేస్తున్న కళను లోతుగా తాను ఆనందిస్తూ, అదే కళ ద్వారా ఇతరులకు ఆనందాన్ని పంచాలి. ఒక సంగీతకారుడు తాను పాడుతూ ఏవో దివ్యలోకాల్లో విహరిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఆ పాట వినేవాళ్లు కూడా తప్పకుండా ఆనందిస్తారు. కాస్తోకూస్తో ప్రవేశం ఉన్నవారైతే అతని తాదాత్మ్యతలోని గాఢతను కూడా అర్థం చేసుకోగలుగుతారు కూడా. ఆధ్యాత్మికత కూడా అలాంటిదే. కళను సాధన చేసినట్టుగానే ఆధ్యాత్మికతను కూడా సాధన చెయ్యాలి. మన అందరిలోనూ ఆధ్యాత్మికత ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. అది పూర్తిస్థాయిలో వికసించి మన ఆనందానికి కారణం కావాలంటే నిరంతర సాధన చెయ్యడం అవసరం. ఆప్పుడే అందులోని పూర్తి ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. 


భక్తి - ఆధ్యాత్మికత

భక్తి అనేది ఒక భావోద్వేగం. అపారమైన గౌరవం. అనిర్వచనీయమైన ప్రేమ, త్యాగ శీలతవంటి రకరకాల భావోద్వేగాల మేళవింపును భక్తిగా చెప్పుకోవచ్చు. డబ్బు, సమయం లెక్కచేయని ఒక సమ్మోహన స్థితి. ఇలాంటి భావోద్వేగాన్ని ఎవరి మీద చూపగలం?! అలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మనకు ఏదో ఒక సాధనం కావాలి. ఎవరినైనా పూజించాలి. సేవించాలి. తరించాలి. మన చుట్టూ ఉన్న మనుషుల పైన అలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలను చూపలేం. ఎందుకంటే వారిలో లోపాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే పురాణ పురుషులను, అరూప్య భావనలను ఆదర్శ మూర్తులుగా చిత్రీకరించుకొని, భావించుకొని వాళ్ల విగ్రహాలు, పటాలను పూజిస్తూ భక్తిని ప్రదర్శిస్తాము. భక్తిలో సంతోషం ఉంది. భక్తి అనే భావోద్వేగం కలిగినపుడు దాన్ని బయటకు ప్రదర్శించినప్పుడు మాత్రమే దానివల్ల సంతోషం కలుగుతుంది. అయితే నిరంతరం భక్తిలో ఉండడం సాధ్యమైతే సంతోషం బానే ఉంటుంది. కానీ అది సాధ్యపడదు. దైనందిన జీవితాన్ని గడపడంలో మనం మరో భావోద్వేగంలోకి వెళ్లిపోతాం, అందువల్ల ఇక ఆ అనుభూతి దూరమై మరో రకమైన భావనలో పడిపోతాం. 

ఆధ్యాత్మికతకి సింహద్వారమే భక్తి. ఇది ఆధ్యాత్మికతలోకి మనతో ప్రయాణం చేయిస్తుంది. చాలా మంది భక్తిలో ఉంటుంటారు. కానీ తర్వాత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించరు. అసలు తర్వాత స్థాయి ఉందన్న అవగాహన కూడా ఉండదు. భక్తి ద్వారా దొరుకుతున్న సంతోషమే చివరిదని భావిస్తారు. కొంత మందికి తర్వాత స్థాయి గురించి ఎరుక ఉన్నప్పటికీ ఇంతకంటే ముందుకు వెళ్తే ఏమౌతుందో, భార్యాపిల్లలకు దూరమైపోతామేమో అనే భయం ఒక మూలన ఉంటూ ఉంటుంది. తమ భక్తి ద్వారా చేసే పూజలు, వ్రతాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నామని చెప్తుంటారు చాలామంది. కాని ఈ పయనం ఇక్కడితోనే ఆగకూడదు. తర్వాత స్థాయి ఏమిటి అనేది తెలుసుకోగలగాలి. ఆ స్థాయికి చేరగలగాలి. ఇంకొందరు ఆచారాన్నే భక్తిగా భావిస్తుంటారు. మడి, తడి, అంటూ పాటించడమే భక్తి అనే భ్రమలో ఉంటారు. కానీ అవి కేవలం బాహ్యపరమైన విషయాలే. ఒక నాట్యకళారూప ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆహార్యం, అలంకరణల వంటివి ఈ అంశాలు. కాగా నాట్యం భక్తి. అలంకరణలు గొప్పగా ఉండి, నాట్యం పేలవంగా ఉంటే ఉపయోగం ఉండదు. ఆచార సంప్రదాయలు కూడా అలాంటివే. ఆచార సంప్రదాయాలకంటే కూడా మనసులో ఉండే భక్తి భావన ముఖ్యం. దీనికి పనికి చవ్చే సాధానాల వంటివి మాత్రమే ఆచారసంప్రదాయాలు. 


బ్రహ్మానందానికి మార్గం...

ఇక ఆధ్యాత్మిక కళా సాధనకు వస్తే ప్రాణాయామం, ధ్యానం వంటి అనేక రకాల సాధానాలను ఉపయోగించి వ్యక్తి తనలోకి తాను చూసుకునే ప్రయత్నం చేస్తాడు. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటాడు. తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు. సృష్టిలోని రహస్యాలను ఎరుకలోకి తెచ్చుకుంటాడు. చివరికి తనే సృష్టిగా.... సృష్టికర్తననే భావనని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. మనసులో ఉత్పన్నమైన అనుమానాలకు సమాధానం వెతుక్కుని తృప్తి చెందే స్థితి... ఆ తర్వాత ఆలోచనలే రాని స్థితికి వెళతాడు. అంతా అర్థమైతే ఇక మిగిలేది ఆనందమే. 

ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే లేదా మనసు సమాధాన పడితే తృప్తి కలుగుతుంది. అలా మన ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికాక ప్రశ్నలే లేని స్థితిలో మిగిలేది తృప్తి మాత్రమే. ఆ తృప్తే బ్రహ్మానందం. తియ్యగా ఉంటుంది అన్నంత మాత్రాన తీపి రుచి అర్థం కాదు. తీపి తిని చూడాలి. అలాగే సాధన చేసి బ్రహ్మానందాన్ని అనుభవించాలి. సాధన చేసి అటువంటి అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఉంటున్నప్పటికీ వాటికి అతీతంగా నిరంతరం ఆనందంలో ఉండడం సాధ్యపడుతుంది. ప్రపంచానికి సంబంధించిన దిగులు పెద్దగా బాధించదు. ప్రశాంత వదనుడై సృష్టి ఆటని గమనిస్తుంటాడు తరగని చిరునవ్వుతో!
- చక్రధర్‌రావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list