MohanPublications Print Books Online store clik Here Devullu.com

మందులు సరిగా వేసుకుంటున్నారా? | Are you swallowing Tablets properly?




మందులు సరిగా వేసుకుంటున్నారా?


అప్పటిదాకా..

ఒళ్లంతా జ్వరంతో భగభగా మండిపోతుంటుంది.సమ్మెటతో బాధుతున్నట్టుగా తలంతా ఒకటే నొప్పి, పోట్లు.పేగులన్నీ మెలితిరిగిపోతున్నట్టు కడుపులో ఏదో బాధ, విరేచనాలు.అడుగు తీసి అడుగు వేయలేనంతగా విలవిలలాడించే కాలి నొప్పి.చల్లగాలిలో కొద్దిగా తిరిగినా ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం.

అదేంటో..

ఒక మాత్రో, మందో వేయగానే అంత నొప్పీ.. అంత బాధా.. అంత ఇబ్బందీ.. అంత ఆయాసమూ.. ఉన్నట్టుండి ఉఫ్‌ మని ఎగిరిపోతుంది.అవును.. ఇదంతా మందుల మాయే! ఎన్నో పరిశోధనలు, ఎన్నెన్నో ప్రయోగాల అనంతరం వైద్యరంగం మనకు అందించిన మంత్రదండాల మహిమే! ఇన్‌ఫెక్షన్‌ జబ్బులను తగ్గించటం దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల నియంత్రణ, వాటి దుష్ప్రభావాల నుంచి కాపాడటం వరకూ మన ఆరోగ్యం విషయంలో మందుల పాత్ర ఎనలేనిది. జాగ్రత్తగా, సరైన పద్ధతిలో వాడితే ఇవి బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. లేకపోతే భస్మాసుర హస్తంలా మొదటికే మోసం తెస్తాయి. నిజానికి వీటిపై శ్రద్ధ ఆసుపత్రికి వెళ్లే ముందే మొదలవ్వాలి. డాక్టర్‌ను ఏం అడగాలి? ఏయే సందేహాలు నివృత్తి చేసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. అందుకే మందుల వాడకంపై సమగ్ర కథనం మీ కోసం.

ఉపవాసం చేస్తుంటే.. ఉపవాసం చేస్తున్నా కూడా బీపీ, ఫిట్స్‌, గుండెజబ్బుల వంటి దీర్ఘకాల సమస్యలకు వాడే మందులను మానకూడదు. మధుమేహులు ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఒకవేళ చేస్తే రక్తంలో గ్లూకోజు స్థాయులను బట్టి మందు మోతాదులను తగ్గించి వాడుకోవాలి.

ప్రతిదానికీ ఒక పద్ధతుంటుంది. ఇది మందులకూ వర్తిస్తుంది. డాక్టర్‌ చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం తీసుకుంటే పూర్తి ఫలితాలు కనబడతాయి. కానీ మందుల విషయంలో మనం చేసే తప్పులు, పొరపాట్లకు లెక్కేలేదు. కొందరు మందులు వేసుకోవటం తరచుగా మరచిపోతుంటారు. మధ్యలో గుర్తుకొచ్చినా ‘ఏం ఫర్వాలేదులే’ అనే అనుకుంటుంటారు. ఇంకొందరు సూచించిన మోతాదులో వేసుకోరు. బాధ, ఇబ్బంది కాస్త తగ్గగానే పూర్తిగా మానేసేవారు మరికొందరు. దీంతో



సమస్య మళ్లీ మొదటికొస్తుంది. పైగా ఈసారి ఇంకా తీవ్రంగా వేధిస్తుంది కూడా. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు కాబట్టి కొంతకాలం వాడాక అంతా బాగుందిలే అనుకుని మందులు మానేసేవారూ ఉన్నారు. కొందరికి జబ్బుల కన్నా మందులు వేసుకోవటమంటేనే ఇబ్బందిగా తోస్తుంటుంది. ఎప్పుడెప్పుడు మందులు మానేద్దామా అనే చూస్తుంటారు. మాత్ర వేసుకునేప్పుడు నీళ్లు తాగకపోవటం, భోజనం చేశాక వేసుకోవాల్సినవి ఖాళీ కడుపుతో వేసుకోవటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేసే తప్పులు ఎన్నెన్నో. వీటికి తోడు అపోహలూనూ. పెద్ద మోతాదులో మందులు వేసుకుంటే అనర్థమని, ఒకసారి మందులు వేసుకోవటం మొదలుపెడితే వాటికి అలవాటు పడిపోతామని ఎంతోమంది అనుకుంటుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. డాక్టర్‌ చెప్పినట్టుగా మందులు తీసుకోవటం, అదీ పూర్తికాలం వాడుకోవటం, ఏదైనా అనుమానం వస్తే డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవటం ఎంతో అవసరం. కాబట్టి మందుల విషయంలో ఎలాంటి అపోహలకు, పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవటం మనకే కాదు, సమాజానికీ ఎంతో మేలు చేస్తుంది.

నిద్ర మాత్రలు వేసుకునేవారు తమకు తాము మోతాదు పెంచుకోకూడదు. మాత్ర వేసుకున్నా మునుపటిలా నిద్ర పట్టటం లేదని అనిపిస్తే డాక్టర్‌ దృష్టికి తీసుకురావాలి. అలాగే నిద్రమాత్రలను వేసుకునేవారు వాహనాలు నడపటం, ప్రమాదకర పనుల వంటివి చేయకూడదు.


నీరు తప్పకుండా తాగాలి





మనం నోటి ద్వారా తీసుకునే మందులన్నీ జీర్ణాశయంలోకి, అక్కడ్నుంచి పేగుల్లోకి.. ఆ తర్వాత రక్తంలో కలిసి, దాని ద్వారా కాలేయంలోకి చేరతాయి. కొన్నిమందులు జీర్ణాశయం, పేగుల్లో మాత్రమే పనిచేస్తాయి.ఏదేమైనా అక్కడి వరకూ మందులు చేరాలంటే తగినంత నీరు తాగటం తప్పనిసరి. నీళ్లు తాగకపోతే కొన్నిసార్లు మాత్రలు అన్నవాహిక గోడకు అతుక్కొని పుండు (పిల్‌ అల్సర్‌) పడొచ్చు. అలాగే థైరాయిడ్‌ హార్మోన్‌ వంటి మాత్రలు వేసుకున్నాక కొద్దిసేపటివరకూ వేడి నీళ్లు, ఛాయ్‌, కాఫీ వంటివి తాగకపోవటమే మంచిది. వేడి తగిలితే హార్మోన్లు పనిచేయవు.

* మందులను నిటారుగా కూచొనో, నిలబడో వేసుకోవటం మంచిది. వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కూచొని ఉండటం మేలు. మాత్రలు గొంతులో అంటుకున్నట్టు, అడ్డుపడినట్టు అనిపిస్తే మెత్తటి అరటిపండు లేదా మెత్తటి బ్రెడ్‌ ముక్క వంటివి తినటం.. మరింత ఎక్కువ నీరు తాగటం మంచిది.


క్రమం తప్పరాదు

ఎట్టి పరిస్థితుల్లోనూ మందులను మధ్యలో మానెయ్యకూడదు. ఇక బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యల విషయంలో నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఇలాంటి సమస్యలకు డాక్టర్లు మందులు రాసిచ్చి, నెల తర్వాత రావాలని చెబితే.. నూటికి తొంబై మంది నెల పాటు మందులు వాడి మానేస్తుంటారు. పోనీ అప్పుడైనా క్లినిక్‌కు వస్తారా అంటే అదీ లేదు. దీంతో జబ్బు మరింత తీవ్రమై ఇతరత్రా సమస్యలకూ దారితీయొచ్చు. ఉదాహరణకు బీపీ మందులను మానేస్తే రక్తపోటు బాగా పెరిగిపోయి మెదడులో రక్తనాళాలు చిట్లి పక్షవాతం రావొచ్చు. ఒకోసారి కిడ్నీలు, గుండె కూడా దెబ్బతినొచ్చు.

* మరికొందరు డాక్టర్‌ దగ్గరకు వచ్చే రోజు, పరీక్షలు చేయించుకునే రోజున మందులు వేసుకోవటం మానేస్తుంటారు. దీంతో మందులతో జబ్బు నియంత్రణలో ఉందో లేదో కచ్చితంగా తెలియదు. కాబట్టి డాక్టర్‌ను కలవటానికి వచ్చేటప్పుడు, పరీక్షలు చేయించుకునే రోజున కూడా విధిగా మందులు వేసుకోవాలి. లేకపోతే మందులు సరిగా పనిచేయటం లేదని పొరపడి డాక్టర్లు మందు మోతాదు పెంచే అవకాశముంది. ఇది దుష్ప్రభావాలకు దారితీయొచ్చు.


సొంత ప్రయోగాలు కూడదు

మనదేశంలో సొంతంగా మందులు కొనుక్కొని వాడేవారు చాలా ఎక్కువ. ఇది ఏమాత్రం తగదు. ముఖ్యంగా డాక్టర్‌ సిఫారసు లేకుండా నొప్పి నివారణ మందులు అసలే వేసుకోకూడదు. మనదేశంలో కిడ్నీ జబ్బులు పెరగటానికి విచ్చలవిడిగా నొప్పి నివారణ మందులను వాడుకోవటమూ ఒక కారణమే. మనదేశంలో వైరల్‌ జ్వరాలు ఎక్కువ. వీటికి పారాసిటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవచ్చు గానీ నొప్పి నివారణ మందులు వేసుకోకూడదు. ఏ జ్వరంలోనైనా ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య తగ్గుతుంది. నొప్పి మందులు వేసుకుంటే వీటి సామర్థ్యమూ తగ్గుతుంది. పొట్టలో అల్సర్లు కూడా ఏర్పడొచ్చు, రక్తస్రావానికీ దారితీయొచ్చు.


భోజనం ముందా? తర్వాతా?



గుండెల్లో మంటకు వాడే ఒమిప్రొజోల్‌ వంటి మందులు, కొన్ని మధుమేహం మందులు, ఎముకక్షీణతను తగ్గించే బిస్‌ఫాస్ఫోనేట్‌ వంటివి భోజనానికి ముందే వేసుకోవాలి. క్షయ చికిత్సలో ఇచ్చే రిఫామ్సిన్‌ అయితే పరగడుపుననే తీసుకోవాలి. కొన్నింటిని.. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులను (పెయిన్‌ కిల్లర్స్‌) భోజనం తర్వాతే వాడుకోవాలి. వీటిని పరగడుపున వేసుకుంటే జీర్ణాశయంలో పుండ్లు పడొచ్చు. విటమిన్‌ మాత్రలు, స్టిరాయిడ్స్‌ వంటివి భోజనం తర్వాతే వాడుకోవాలి.




సిరప్‌ల విషయంలో మోతాదు సరిగా ఉండేలా చూసుకోవాలి. వైద్యులు చెప్పే స్పూన్లు, వంటింట్లో వాడే చెంచాలు ఒకటి కావు. కాబట్టి మందుల సీసాలతో వచ్చే కొలత పాత్రలతోనే తీసుకోవాలి.



రిపోర్టులు, చీటీలు వెంట తీసుకెళ్లాలి



కొందరు పరీక్ష రిపోర్టులను తీసుకురారు. ‘అన్నీ నార్మల్‌గానే ఉన్నాయండీ’ అని చెబుతుంటారు. ‘పోయినసారి వచ్చినపుడే చూశారండీ. అందుకని తేలేదు’ అంటుంటారు. గతంలో చూసినా కూడా అన్ని విషయాలు డాక్టర్‌కు గుర్తుండాలని లేదు. అందువల్ల డాక్టర్‌ దగ్గరికి వచ్చేటప్పుడు కొత్త, పాత రిపోర్టులతో పాటు మందుల చీటీలన్నీ తీసుకురావాలి. వీటన్నింటినీ ఒకేచోట ఫైలు చేసి, క్రమ పద్ధతిలో భద్రపరచుకోవాలి. పాత రిపోర్టులు కింద, కొత్తవి పైన పెట్టుకోవాలి. వేరే డాక్టర్‌ రాసిన మందుల చీటీలైనా సరే. మొహమాట పడకుండా చూపించాలి. చీటీలు లేకపోతే మందుల పేర్లనైనా కాగితం మీద రాసుకోవాలి, మందులనైనా వెంట తీసుకెళ్లాలి. అలాగే అప్పటికే ఏవైనా మందులు వేసుకుంటుంటే ఆ విషయాన్ని కూడా ముందుగానే చెప్పాలి. సొంతంగా కొనుక్కుని వేసుకునే బిళ్లలు, విటమిన్‌ మాత్రల వంటివే కాదు. చెట్ల మందులు, పసర్లు, ఆయుర్వేదం, హోమియోపతీ.. ఇలా ఎలాంటి మందులు వాడుతున్నా తప్పకుండా చెప్పాలి. పడని మందులు గురించీ చెప్పాలి.


ఓపిక అవసరం

ఏదైనా సమస్యతో ఆసుపత్రికి వచ్చినపుడు పేషెంటుకు, వెంట వచ్చినవారికి ఓపిక చాలా అవసరం. ‘వచ్చి చాలా సేపయ్యింది. ఇంకా ఎందుకు పిలవటం లేదు’ అని కొందరు డాక్టర్‌ గది బయట గొడవ చేస్తుంటారు. దీంతో డాక్టర్లపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. డాక్టర్‌ కూడా మానవమాత్రుడే కదా. రోగిని క్షుణ్నంగా పరీక్షించాలి, రిపోర్టులను పరిశీలించాలి, అంతకుముందు ఇచ్చిన మందుల పనితీరును విశ్లేషించుకోవాలి. ఎలాంటి మందులు ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ఇందుకు డాక్టర్‌ ప్రశాంతంగా ఆలోచించటం, ఏకాగ్రతతో పరీక్షించటం ఎంతో అవసరం. దీన్ని రోగులు, వెంట వచ్చినవారు దెబ్బతీయకూడదు. కాబట్టి ఓపికగా నిరీక్షించటం అవసరమనే విషయాన్ని గుర్తించాలి.


మద్యానికి దూరం



మద్యం మన కేంద్ర నాడీవ్యవస్థను నిద్రాణంగా ఉంచుతుంది. అందువల్ల మద్యం ప్రభావం మూలంగా మందులు పనితీరు మరింత ఉద్ధృతం కావొచ్చు. లేదూ సరిగా పనిచేయకపోవచ్చు. గ్లూకోజు నియంత్రణకు వాడే మెట్‌ఫార్మిన్‌ వేసుకునేవారు మద్యం తాగితే ఒళ్లంతా మంటలు, చికాకు వంటివి తలెత్తొచ్చు. ఫిట్స్‌, నిద్ర మాత్రలు, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లకు వాడే మందుల వంటివి మత్తును కలిగిస్తాయి. వీటిని వాడేవారు మద్యం తాగితే మత్తు మరింత అధికమై గాఢ నిద్రలోకి వెళ్లిపోవచ్చు. అందువల్ల మాత్రలు వేసుకునేప్పుడు మద్యానికి దూరంగా ఉండటమే మంచిది.


ఒకరి మందులు మరొకరికి వద్దు

సమస్య ఒకటే అయినా అందరిలోనూ ఒకేలా ఉండదు. అందువల్ల డాక్టర్లు ఒకరికి రాసిచ్చిన మందులను అవే లక్షణాలు కనబడుతున్నాయి కదా అని మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆడ, మగ, వయసు, బరువు వంటి వాటిని బట్టి డాక్టర్లు మందులను, వాటి మోతాదులను నిర్ణయిస్తారు. అవి వారికే ప్రత్యేకం. ఉదాహరణకు ఒకరి మధుమేహం మందులను మరొకరు వాడితే మందు మోతాదు ఎక్కువై రక్తంలో గ్లూకోజు స్థాయులు పడిపోయి కోమాలోకీ వెళ్లిపోవచ్చు.

కొన్నిరకాల జ్వరాల్లో బీపీ తగ్గిపోవచ్చు. కాబట్టి బీపీ మాత్రలు వేసుకునేవారికి జ్వరం వస్తే తప్పకుండా డాక్టర్‌ సలహా తీసుకోవాలి.


అబ్బా.. ఇంత పవరువా?

యాంటీబయోటిక్స్‌ విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. డాక్టర్‌ ఎక్కువ ‘పవర్‌’ మందులు రాశాడని భావించి 500 మిల్లీగ్రాములకు బదులు 250 మిల్లీగ్రాములు వేసుకుంటుంటారు. మూడు సార్లు వేసుకోవాల్సినవి రెండు సార్లు.. వారం రోజులు వేసుకోవాల్సినవి నాలుగు రోజులే తీసుకుంటుంటారు. దీంతో బ్యాక్టీరియా బలపడి యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. మొండిగా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపిస్తే యాంటిబయోటిక్స్‌ ఇచ్చినా ఫలితం ఉండదు. బీపీ మాత్రల వంటివి సరిగా వాడకపోతే ఆ వ్యక్తికే నష్టం గానీ యాంటిబయోటిక్స్‌ను సరిగా వాడకపోతే సమాజానికీ నష్టం కలుగుతుంది.

* కొందరు జలుబు చెయ్యగానే యాంటీబయోటిక్స్‌ కొనుక్కొని వేసుకుంటుంటారు. జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్‌ పనిచేయవు. వీటికి యాంటీబయోటిక్స్‌ వాడితే ఒంట్లో మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, దాని మూలంగా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరంగా, విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వేసుకోవద్దు.


మాత్రలను విరిచి వేసుకోవచ్చా?



మధ్యలో గీత ఉన్న మాత్రలను విరిచి వాడుకోవచ్చు. అయితే వైద్యులు చెప్పకుండా మాత్రలను పొడి గొట్టటం, ముక్కలు చేయటం, నీళ్లలో కలపటం, గొట్టాలను విడదీయటం వంటివి చేయొద్దు. కొన్ని మాత్రలను కడుపులోకి వెళ్లాక మందు నెమ్మదిగా విడుదలయ్యేలా (ఎస్‌ఆర్‌ రకం) చేస్తారు. వీటిని విడదీస్తే మందంతా ఒకేసారి విడుదలై జీర్ణం కావొచ్చు. ఇది దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. నిజానికి విరచాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు దాదాపు అన్ని మందులూ తక్కువ మోతాదుల్లోనూ దొరుకుతున్నాయి కూడా.


మందులు మరచిపోతే?



ఏ మందైనా రోజూ సమయానికి వేసుకోవటం మంచి పద్ధతి. ఒకవేళ బీపీ మాత్రల వంటివి మరచిపోతే గుర్తుకొచ్చినపుడు వీలైనంత త్వరగా వేసుకోవాలి. కానీ రెండు మోతాదులు ఒకేసారి వేసుకోవద్దు. ఉదాహరణకు- పొద్దున మాత్ర వేసుకోవటం మరచిపోతే మధ్యాహ్నం ఎప్పుడైనా గుర్తుకొచ్చినపుడు తీసుకోవచ్చు. అయితే నిన్న వేసుకోలేదు కదా అని మర్నాడు ఒకేసారి రెండు మాత్రలు వేసుకోవటం తప్పు. యాంటీబయోటిక్స్‌ వేసుకోవటం మరచిపోతే అరగంట, గంటలోపు గుర్తుకొస్తే వేసుకోవచ్చు. మరీ సమయం మించితే వేసుకోవద్దు. తర్వాత వేసుకోవాల్సిన సమయం వరకూ ఆగాలి. అయితే ఉదయం వేసుకోలేదు కదా అని రెండు మాత్రలను ఒకేసారి వేసుకోవటం తగదు.


రెండు, మూడు మందులు ఒకేసారి వేసుకోవచ్చా?

కొన్నిసార్లు రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. నిజానికి చాలారకాల మందులను కలిపి వేసుకున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ కొన్ని మందులను మాత్రం కలపకూడదు. ఇది ఆయా మందులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అలర్జీలకు వాడే యాంటీహిస్టమిన్స్‌, నిద్రమాత్రలు కలిపి వేసుకుంటే మత్తు మరింత ఎక్కువ కావొచ్చు. అందువల్ల రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వచ్చినపుడు కలిపి వేసుకోవచ్చా అని డాక్టర్‌ను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి.


మందుల గడువు తీరిపోతే?

ప్రతి మందుకూ కొంత నిర్దిష్టమైన గడువుంటుంది (ఎక్స్‌పైరీ డేట్‌). వాటిని ఆ తేదీ లోపే వాడుకోవాలి. అయితే కొన్నిసార్లు పొరపాటున గడువు తీరిన మందులనూ వేసుకుంటుంటారు. దీనికి పెద్దగా గాబరా పడాల్సిన పనేమీ లేదు. గడువు తీరిన మందులు అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు గానీ ఇతరత్రా నష్టమేమీ ఉండదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list