MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు


సాధనలో అనేక వైక్లబ్యాలుంటాయి. ‘నేను మంచి మార్గంలో వెడుతున్నా’ అనుకుంటూ శిష్యుడు దారితప్పి ధర్మానుష్ఠానంలో వైక్లబ్యాన్ని పొందుతాడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతుంటాడు. ధర్మం అత్యంత ప్రధానం.  పరమ సున్నితమైన విషయమది. అంత సున్నితమైన ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువు దిద్దుతుంటాడు శిష్యుణ్ణి.గురువుగారితో బాగా అంటకాగి తిరగడం అలవాటయింది. గురుబోధలు వింటూ తన సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గురువుగారికి అనుమానమొచ్చింది. పిలిచి – ’ఏమిరా, నేను గృహస్థాశ్రమంలో లేనా! నా భార్యాబిడ్డల్ని చూడ్డం లేదా ! ధర్మం ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వారి బాగోగులను చూడడం.’’ అని హెచ్చరించి దిద్దుతాడు.
’కర్తవ్యం’ అని ఒక మాట ఉంది. గురువు గొప్పదనమంతా కర్తవ్యనిష్ఠలో ఉంది. గురువు ఒకసారి చెప్తాడు.. వినలేదు, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాడు.. వినలేదు. తను బతికున్నంత వరకు చెపుతుంటాడు తప్ప ‘నీ ఖర్మ’ అనడు. అది కర్తవ్యం. అంటే చేయవలసిన పని తాను చేయడం. ఫలితం–ఈశ్వరానుగ్రహం. కొడుకును కన్న తరువాత వాడికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాడికి సరైన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా తాను జీవించడం గృహస్థు ధర్మం. కొడుకు అలాగే ఉంటే సంతోషం. అలా ఉండకపోతే? బెంగపెట్టేసుకుని గృహస్థు అనుష్ఠానం మానేయకూడదు. తన అనుష్ఠానం తాను చేసి వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం.
ఈశ్వరునిపట్ల నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమ ధర్మంగానే పట్టుకోవాలి, నీవు పండేవరకు. నీ కర్తవ్యం పూర్తయ్యేవరకు నీవలాగే పట్టుకోవాలి.
శిష్యుని పొరబాట్లను గురువు దిద్దుతాడు. ఉత్థానపతనాలలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు. గురువు ఒక్కొక్కసారి తీవ్రస్వరంతో మాట్లాడతాడు. కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కబెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది ఎలా మాట్లాడినా లక్ష్యం ఒక్కటే. శిష్యుణ్ణి కాపాడుకోవాలి. ధర్మంనుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. అలా గురువు బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా తన కర్తవ్యాన్ని పాలిస్తాడు. వెరసి గురువు పరబ్రహ్మ.
Tags: 
guru
student

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list