MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆరుట్ల బుగ్గ జాతర!_ArutlaBugga

telangana, arutlabugga jatara
తెలంగాణలోమరో కాశీ క్షేత్రం 
ఆరుట్ల బుగ్గ జాతర!
అడుగులన్నీ ఆరుట్లవైపే.. భక్తులంతా బుగ్గ జాతరవైపే. బుగ్గ జాతర ఓ మహా ఉత్సవం. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు.. భక్తుల కొంగు బంగారం. నిరంతరం పారే సెలయేటి చెంతన లింగేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. కొండ కోనలు.. ఆకట్టుకునే అటవీ అందాల మధ్యన కొలువైన బుగ్గక్షేత్రంలో శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి పదిహేను రోజులు జాతర జరుగుతుంది. పక్కనే రాచకొండ.. అటు పక్కన చరిత్రాత్మక చుక్కపురీ పట్నం ఉండి ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా.. మరోవైపు పిక్‌నిక్ వేదికగా ప్రజలను ఆకర్షిస్తూ రారమ్మని పిలుస్తుంది వందల ఏండ్ల చరిత్ర ఉన్న బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం. పవిత్రమైన ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నవంబర్ 4 నుంచి ప్రారంభమైన సందర్భంగా ఈ వారం దర్శనం.
-దాయి శ్రీశైలం,
ఎక్కడ ఉన్నది? :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో.
ఎలా వెళ్లాలి? :
హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్లు ఎంజీబీఎస్, సాగర్ రింగ్‌రోడ్డు నుంచి 277 నంబర్ బస్సు ద్వారా ఇబ్రహీంపట్నం.. అక్కడి నుంచి బుగ్గ జాతరకు స్పెషల్ బస్సుల్లో చేరుకోవచ్చు. నల్గొండ జిల్లా నారాయణపూర్, మునుగోడు, చౌటుప్పల్ నుంచి వచ్చేవారు నారాయణపూర్ శివన్నగూడ నుంచి ఆరుట్లకు చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ నుంచి వచ్చేవారు ఇబ్రహీంపట్నం నుంచి రావచ్చు. పదిహేను రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి.. ఈ చారిత్రక ప్రాంతాన్ని సందర్శించి గుండంలో స్నానమాచరించి.. కార్తీక దీపాల్ని వెలిగిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుందని భక్తులు అంటున్నారు.
ప్రత్యేకత ఏంటి? :
ప్రతియేటా కార్తీక పౌర్ణమికి ప్రారంభమై అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరిగే ఈ ఆలయం భక్తుల పాలిట మరో కాశీ. లింగ పూజలు.. స్నానాలు.. వ్రతాలు.. వనభోజనాలు. కుటుంబం.. బంధుమిత్రుల కలయికతో ఆ ప్రాంతం చూడచక్కగా కనిపిస్తుంది. కొండలు.. కోనలు.. ప్రకృతి సెలయేరులు.. పచ్చనిపైర్లు.. ఇంతకన్నా ప్రశాంత వాతావరణం ఎక్కడా అనిపిస్తుంది ఆ దృశ్యాల్ని చూస్తుంటే!
స్థల విశిష్టత:
ఇక్కడో మహిమ కనిపిస్తుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. తూర్పు దిక్కు నుంచి పడమర వైపు నీళ్లు ప్రవహించి.. తిరిగి తూర్పు వైపు మరలుతున్నాయి. ఇది చాలా అరుదైన సన్నివేశం. భూగర్భ జలాలు అడుగంటి.. గతంలో కరువు ఏర్పడినప్పటికీ బుగ్గలో నీటి బుడగలు దుంకడం ఆగలేదు. భక్తుల నోములు.. వ్రతాలకు అసౌకర్యం కలగలేదు. ఇది నిజంగా మహిమే మరి! స్కూళ్లు.. కాలేజీల నుంచి వేలాది విద్యార్థులు బుగ్గకు క్యూ కడుతారు. పున్నమి రోజున ప్రారంభమైన ఈ ఆలయం దీపకాంతులతో వెలుగులు జిమ్ముతున్నది. వందల సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతున్నది. ఇక్కడ శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా పూజలు నిర్వహించాడట. అందుకే ఇది బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంగా విరాజిల్లుతున్నదని చెబుతారు స్థానికులు.
linga-pooja
కాశీకి వెళ్లలేనివారికి:
రాష్ట్రం నలు మూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలాచరిస్తారు. కాశీకి వెళ్లి దర్శించుకోలేని వారు బుగ్గ రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో కొందరు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ఈ పదిహేను రోజులు వ్రతాలతో ప్రాంగణమంతా రద్దీగా ఉంటుంది. ఆలయానికి ఎడమవైపున కబీర్దాస్ మందిరం ఉంది. స్నానాల తర్వాత కబీర్ మందిరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. కబీర్ మందిరానికి కుడివైపు నాగన్నపుట్ట ఉంటుంది. కార్తీకమాసంలో ఈ పుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నాగేంద్రుడి దర్శనం:
భక్తులకు పుట్టలో నుంచి నాగేంద్రుడు దర్శనమిస్తాడట. నాగన్న పుట్టకు ఎదురుగా శివ పార్వతుల ఆలయం.. వెనకాల కబీర్దాస్ ధ్యానమందిరం ఉన్నాయి. కాశీలో దైవోపదేశం పొందిన సాధువు నర్సింహా బాబా 1975లో ఈ ప్రాంతంలో కబీర్దాస్ మందిరాన్ని నిర్మించాడట. మందిరంలోనే ధ్యానం చేసిన నర్సింహా బాబా ఇక్కడే సజీవ సమాధి అయ్యాడని అక్కడి పూజారులు చెపారు. జాతర కోసం స్పెషల్ బస్సులు.. వ్రైవేట్ వాహనాలతో నిజంగానే కాశీయాత్రకు వెళ్లినట్లు అనిపిస్తుంది. కాశీకి పోయాము రామాహరీ.. గంగ తీర్థమ్ము తెచ్చాము రామాహరీ.. తీర్థమ్ము తెచ్చాము రామాహరీ ఊరి కాల్వలో నీళ్లండి రామా హరీ.. ఉట్టి కాల్వ కాదండి రామా హరీ.. బుగ్గజాతరలో బుడగలండీ రామా హరీ అని భక్తులు స్మరిస్తుంటారు.
పర్యాటక ప్రాంతం:
రామలింగేశ్వర స్వామికి ఎంతో పవిత్రత ఉంది. ప్రతీయేటా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. పద్మనాయకుల పాలనా కేంద్రమైన రాచకొండ ఇక్కడికి చాలా దగ్గర. ఖగోళ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాస్త్రసాంకేతిక పాఠాలు నేర్పిన నిజామియా అబ్జర్వేటరీ బుగ్గ జాతర పక్కనే కావడం మరో విశేషం. జాతరకు వచ్చేవాళ్లు వీటిని కూడా సందర్శించి.. వనభోజనాలు చేసి ఆనందిస్తుంటారు. దీంతో మా ఊరు పర్యాటక ప్రాంతంగా కూడా పేరు సంపాదించింది. బుగ్గ ఆలయం మా ఊర్లో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం.
లాలగారి జంగయ్య

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list