MohanPublications Print Books Online store clik Here Devullu.com

దోషాలు పోగొట్టే శనీశ్వర క్షేత్రం..._shani


Navagraha shani shanitrayodasi sani bhakti  Bhakthi  Bhakthi_Pustakalu  Bhakti_Pustakalu  BhakthiPustakalu  BhaktiPustakalu MohanPublications Granthanidhi MohanPublicationsBhakti BhakthiMandaram PujaPusthakalu Puranalu Jyothishalu PujaGranthalu Vastulu

దోషాలు పోగొట్టే శనీశ్వర క్షేత్రం...
bhakti  Bhakthi  Bhakthi_Pustakalu  Bhakti_Pustakalu  BhakthiPustakalu  BhaktiPustakalu MohanPublications Granthanidhi MohanPublicationsBhakti BhakthiMandaram PujaPusthakalu Puranalu Jyothishalu PujaGranthalu Vastulu

#దోషాలు_పోగొట్టే_శనీశ్వర_క్షేత్రం...
సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. అయితే శనికి మాత్రమే ప్రత్యేకంగా గుడులుండటం అరుదు. అలాంటి ఓ దేవాలయం హైదరాబాద్‌ మహానగరానికి అతి సమీపంలో నెలకొంది. 22 అడుగుల ఎత్తున ఉండే ఇక్కడి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే సకల శని దోషాలూ పరిహారమవుతాయట.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం... తొమ్మిది గ్రహాలున్నా... శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలచుకోరనిగానీ, ఇంకా చెప్పాలంటే అంతలా భయపడరనిగానీ అంటే అది అతిశయోక్తి కాబోదు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందన్న మాట. శనీశ్వరుడు ఈ జన్మకు సంబంధించే కాదు పూర్వజన్మల పాప కర్మలకూ దండనను విధించే క్రతువును నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నవాడు. జన్మరీత్యా మనిషికి శనిమహర్దశా కాలాలు నడుస్తున్నప్పుడు వాళ్ల వాళ్ల పాపకర్మలను బట్టి వారిని ఆరోగ్యపరంగా, మానసికంగా దండిస్తూ ఉంటాడు. అయితే శనీశ్వరుణ్ణి శరణువేడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందొచ్చన్నది పురాణ వచనం. మనిషి జీవిత చక్రంతో ముడివడిన ఈ శనిదేవుడికి గుళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిలో ఒకటి రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, మదనపల్లి గ్రామ సమీపంలో పచ్చని పంటపొలాల మధ్య వెలిసిన ఘంటల శనీశ్వర ఆలయం. ఇక్కడ స్వామి 22 అడుగుల ఎత్తుతో భక్తజనానికి దర్శనమిస్తాడు.

భక్తులకు వరం...
జాతక చక్రప్రకారం బుధ, గురు, శుక్ర మహర్దశలు ఎలా వస్తాయో అలాగే శనిమహర్దశా వస్తుంది. అయితే ఆ సమయంలో శనీశ్వరుడి వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్లు ఆయన్ను శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు.

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్‌ నమామి శనీశ్వరం
అంటూ ఆయన్ను స్తుతిస్తారు. శనీశ్వర మంత్రాన్ని చదవడం వల్ల ఆయన శాంతిస్తాడట. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడమూ శుభఫలితాన్నిస్తుందట. శనీశ్వరుడికి ఆగమశాస్త్ర బద్ధంగా ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కువ మంది ముందుకు రారు. నిర్మాణంలో ఏవైనా లోపాలు చోటు చేసుకొంటే శనీశ్వరుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్నదే కారణమై ఉండొచ్చు. అందుకే శని ఆలయాలు అతి తక్కువ చోట్ల కనిపిస్తాయి. కోయ దొర స్వామి శంకర్‌రాజుముఖియా హైదరాబాద్‌ సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శనీశ్వర ఆలయంలో దాదాపు 22 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాక్షాత్తు శనీశ్వరుడే భూలోకానికి వచ్చినట్లు తీర్చిదిద్దిన ఈ విగ్రహం కాళ్ల కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది. భారతి నర్సింహస్వామి, స్వరూపానందస్వామి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనగావించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులనూ కొలువుదీర్చారు. విగ్రహం ఎత్తైనది కావడంతో తైలాభిషేకం చేయాలంటే పై అంతస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధులూ, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్టదిక్పాలకులూ ఈ గుళ్లొ కొలువయ్యారు. ఈ ఆలయంలోని స్వామిని స్త్రీలు కూడా ముట్టుకోవచ్చు.వైభవంగా త్రయోదశి
శనివారం నాడు త్రయోదశి తిథి వచ్చినప్పుడు పండగగా జరిపే శని త్రయోదశి శనీశ్వరుడికి ప్రీతిపాత్రం. ఏల్నాటి శని, అర్ధాష్టమశని, అష్టమశని కాలాలు నడుస్తున్నవాళ్లు ఆ రోజు స్వామికి తైలాభిషేకం చేసి అర్చిస్తే దోషాల నుంచి ఉపశమనాన్ని పొందుతారట. అందుకే ఏటా వచ్చే శనిత్రయోదశి రోజుల్లో ఇక్కడికి జనం పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఉంది. రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ సందర్భంగా 45 ఎకరాల ప్రాంగణంలో 216 అడుగుల ఎత్తున్న రామానుజుల లోహవిగ్రహం ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. 108 సుప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాలూ, వైదిక ధర్మాలనూ పరిచయం చేసే ప్రదర్శన శాల కూడా ఇక్కడ ఏర్పాటవుతోంది. రూ. వెయ్యి కోట్లతో శ్రీకారం చుట్టిన ఈ స్ఫూర్తి కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక, శనీశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న చారిత్రక దర్గాను నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

ఇలా వెళ్లాలి...
హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉందీ ఆలయం. హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి 25కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్‌, శంషాబాద్‌ల నుంచి షాద్‌నగర్‌ వెళ్లే బస్సుల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.
- మైలారం వెంకటేష్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌
చిత్రాలు:బషీర్‌

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list