MohanPublications Print Books Online store clik Here Devullu.com

అవయవదానం_HumanOrgan

అవయవదానం HumanOrgan HELTHtIPSమళ్లీ బతుకుదాం!


మనం చనిపోయినా మన కళ్లు లోకాన్ని చూస్తాయి. ఒకానొక క్షణంలో ఆగిపోయిన మన గుండె మరణానంతరం స్పందిస్తుంది. మన శరీరం మట్టిలో కలిసిపోయినా.. మన శరీర అవయవాలు మాత్రం ఈ భూమ్మీద ప్రాణంతోనే ఉంటాయి. అన్నదానం ఒక పూట కడుపు నింపుతుంది. విద్యాదానం ఒక జీవితంలో వెలుగు నింపుతుంది. కానీ.. అవయవదానం.. చీకట్లు నిండిన ఇంట్లో వెలుగు నవ్వులు నింపుతుంది. ఆశల దీపాలు వెలిగిస్తుంది. అవయవదానంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.


దేవుడు ఒక్కడే.. కానీ రకరకాల పరిస్థితుల కారణంగా దశావతారాలు ఎత్తవలసి వచ్చిందని చెప్తుంటారు పెద్దలు. మనుషులుగా పుట్టిన మనకు కూడా దేవుడయ్యే అవకాశం అవయవదానం ఇస్తున్నది. బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తి దాదాపు పదిహేను మందికి ప్రాణదానం చేయొచ్చు. అంటే దేవుడి కంటే ఐదు అవతారాలు ఎక్కువే. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి తిరిగి కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అరుదనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని వెంటిలేటర్ మీద ఉంచి ఆ శరీరంలో నుంచి రక్తం, కిడ్నీ, కాలేయంలో నాలుగో వంతు ఇతరులకు దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ వల్ల అచేతనంగా పడి ఉన్న వ్యక్తి కళ్లు ఇద్దరికి, కిడ్నీలు ఇద్దరికి, కాలేయం ముగ్గురికి, క్లోమం (ప్రాంకియాస్) ఒకరికి, కర్ణభేరి ఇద్దరికి, ఊపిరితిత్తులు ఇద్దరికి, పిత్తాశయం ఒక్కరికి, మూత్రాశయం ఒకరికి అమర్చవచ్చు. నరాలు, ఎముకలు కూడా ఇతరులకు అమర్చడానికి అవకాశం ఉంది. దేవుడు ఎలాగైతే అవతారాలు మార్చుకుంటాడో.. అవయవదానం చేసిన వ్యక్తి కూడా మరో అవతారం ఎత్తినట్టే. ఎదుటివారి ప్రాణాలు కాపాడే దేవుడైనట్టే. 1967 డిసెంబర్ 3న తొలిసారి గుండెమార్పిడి చేసి క్రిస్టియానా బార్నార్డ్ అనే వైద్యుడు తొలి అవయవదానానికి ఆజ్యం పోశాడు. ఆ తర్వాత చాలా కాలానికి 1994లో ఢిల్లీ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు.
ఒక కథ..


ఒక ఊరిలో ఓ సంపన్నుండేవాడు. జీవితాంతం తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోనంతగా సంపాదించాడు. ధనంలోనే కాదు.. గుణంలో కూడా సంపన్నుడే. సంపాదనలోంచి కొంతభాగం ఊరి ప్రజల కోసం హాస్పిటల్, స్కూల్, రోడ్డు, మంచినీరు ఇలా రకరకాల అభివృద్ధి పనులు చేయించాడు. ఆ సంపన్నుడి మంచి మనసు అర్థం చేసుకోని ఆ ఊరి ప్రజలు అతడు ఇదంతా పేరు కోసమే చేస్తున్నాడు అని అపార్థం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత ఆ సంపన్నుడు అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే నీ గుండె సత్తువ కోల్పోయింది. గుండెమార్పిడి చేస్తే గానీ నువ్వు బతుకవు అని చెప్పారు. ప్రాణాలు దక్కించుకోవడానికి గుండె మార్పిడి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. మరో రెండుమూడు రోజుల్లో చనిపోతాడన్న ముసలి వ్యక్తి నుంచి, కొన్నిరోజులుగా అచేతనంగా పడి ఉన్న వ్యాధిగ్రస్తులతో సహా అందరినీ సంప్రదించాడు. ఎంత ధనం ఆశ చూపినా ఏ ఒక్కరూ గుండె ఇవ్వడానికి ముందుకు రాలేదు. పైగా చనిపోయిన వారి శరీరాలకు ఘనంగా దహన సంస్కారాలు చేశారు. బాగా ఆలోచించి ఊరంతా నేను ఎలాగూ బతుకను. కాబట్టి మరో 24 గంటల్లో నేను సంపాదించిన నోట్లకట్టల మీద నా శరీరానికి దహనసంస్కారాలు చేసుకోబోతున్నాను అని చాటింపు వేయించాడు. అన్నట్టుగానే నోట్లకట్టలన్నీ చితిలా పేర్చి దాని మీద పడుకున్నాడు. ఆ ఊరి నుంచే కాక పక్క గ్రామాల ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. ఆ సంపన్నుడు చేస్తున్న పనిని విమర్శించారు. నువ్వు చేస్తున్నది పిచ్చి పని. నీ ఆలోచన తప్పు. ఎవరికైనా దానం చెయ్యి అని అరవసాగారు. ఒక్కసారి లేచి కూర్చొని అందరి వైపు చూసి నాకు అమర్చడానికి మరో గుండె లేకపోవడం వల్ల నేను ఈ తనువు చాలిస్తున్నాను. ఇవాళ నాకు పట్టిన గతి రేపు ఇంకొకరికి పట్టొచ్చు. ప్రాణాలు కాపాడలేని ఈ నోట్లకట్టలకు విలువ కట్టి, వీటిని తగులబెడతానంటే ఇంతలా అరుస్తున్నారే. మీ బంధువులు చనిపోయినప్పుడు వారి శరీర అవయవాలు మీరు మట్టిలో కప్పి పెట్టలేదా? కాల్చి బూడిద చేయలేదా? ఈరోజు నా ఆస్తిని దానం చేయమని సలహా ఇస్తున్నారు. మీ బంధువులు చనిపోయినప్పుడు వారి అవయవాలను మీరెందుకు దానం చేయలేదు? ఆ అవయవాల కంటే ఈ నోట్లకట్టలే విలువైనవా? అని ప్రశ్నించాడు. ఆ సంపన్నుడి ప్రశ్నలకు చుట్టూ మూగిన జనం సమాధానం ఇవ్వలేకపోయారు. అది చూసిన ఆ సంపన్నుడు ఇప్పుడే నా ఆస్తిపాస్తులను ప్రభుత్వ అధికారులకు అప్పగిస్తున్నాను. ఇవి ఈ ఊరి అభివృద్ధికి ఉపయోగపడాలి అని చెప్పి కన్నుమూశాడు. అక్కడ ఉన్న అందరి గుండెలు భారంగా మారాయి. అవయవదానం ఎంత గొప్పదో అర్థమైంది. వాళ్లకు తెలియకుండానే కళ్లల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అవయవదానం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో బలంగా నాటుకుంది. మరునాడే ఆ సంపన్నుడి చితి దగ్గర ఆ ఊరి ప్రజలంతా అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. ఇది కథనే కావచ్చు. కానీ కథలా మిగిలిపోకూడదు. కథలో ఊరి ప్రజలలాగే అందరం అవయవదానం చేద్దాం.
ఒక నిజం..


కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల హాష్మి అనే మతబోధకుడు కొన్నిరోజులుగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్నాడు. వైద్యులను సంప్రదిస్తే గుండె మార్చాలి అన్నారు. కానీ పాకిస్థాన్‌లో అప్పటికి గుండెమార్పిడి చేసే వ్యవస్థ అందుబాటులో లేదు. ఇండియాలోని తమిళనాడులోని చెన్నైలో ఆ సౌకర్యం ఉందని తెలిసింది. ఇండియాకు వచ్చాడు. చెన్నైలోని ఫోర్టీస్ మలార్ హాస్పిటల్‌కెళ్లాడు. కార్డియాక్ విభాగంలో పనిచేసే కే.ఆర్.బాలకృష్ణన్ హష్మీ రిపోర్టులు పరిశీలించాడు. అతని గుండె మార్చడానికి చాలా తక్కువ వ్యవధి ఉన్నది. పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పాడు. హష్మీ కుటుంబానికి ఏం చేయాలో అర్థం కాలేదు. గుండె ప్రభావం ఇతర అవయవాల మీద కూడా పడింది. హార్ట్ పంపింగ్ సామర్థ్యం 60 నుంచి 15 శాతానికి పడిపోయింది. ప్రాణాలు నిలవడం కష్టమే అన్న పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఓ యువకుడికి బ్రెయిన్‌డెడ్ అయింది. బతకడం అసాధ్యం. హష్మీ కుటుంబం ఆ యువకుడి కుటుంబం కాళ్లావేళ్ల పడ్డారు. తమ కొడుకు ఎలాగూ బతకడు. ఆ గుండె ఇతడికి అమరిస్తే ఒక కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుందని పెద్ద మనసుతో ఆలోచించారు. వారి కొడుకు గుండెను దానం చేయడానికి ఒప్పుకున్నారు. ఆపరేషన్ జరిగింది. ఆ యువకుడి గుండె హష్మీకి అమర్చారు. హష్మీ ప్రాణాలు నిలబడ్డాయి. ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆగిపోయి మట్టిలో కలవాల్సిన గుండె ఇంకా స్పందిస్తున్నందుకు ఆ యువకుడి తల్లిదండ్రులకు ఏదో తెలియని ఆత్మసంతృప్తి. నా కొడుకు గుండె ఇంకా ఆగిపోలేదన్న మహదానందం. ఇండియా నాకు ప్రాణదానమిచ్చింది అని హష్మీ ఇప్పటికీ గౌరవంగా, ప్రేమగా, ఆప్యాయంగా చెప్తాడు. ఒక్క అవయవదానం ఒక కుటుంబానికి ఆనందాన్నిస్తే.. మరో కుటుంబానికి కొడుకు బతికే ఉన్నాడన్న ఆత్మసంతృప్తిఇచ్చింది.


ఇంకా పెరుగాలి !

అవయవదానం మీద ఉద్యోగులు, చదువుకున్న వాళ్లకు ఒకింత అవగాహన కల్పించాం. కానీ మరిన్ని ప్రాణాలు కాపాడగలగాలంటే ఇది సరిపోదు. ఇంకా ప్రచారం, కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అవయవదాతల సంఖ్య పెరగాలి. అప్పుడే పూర్తిస్థాయి విజయం సాధించినట్టు. మేం సిద్ధం. ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలి? అని కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా jeevandan.gov.in లోకి లాగిన్ అయి దాతగా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. లేదంటే.. నిమ్స్ దవాఖానాలో నమోదు చేసుకోవచ్చు. కొంతమందిని పోగు చేసి అవయవదాతలుగా నమోదు చేయిస్తామంటే మీరున్న ప్రాంతానికే వచ్చి క్యాంపు నిర్వహిస్తాం.

- డా.స్వర్ణలత, జీవన్‌దాన్ ఇంచార్జి
ప్రాణాలు కాపాడినట్టే..


అన్నదానం, విద్యాదానాల కంటే గొప్పది అవయవదానం. మనం చనిపోయిన తర్వాత కూడా బతికుండే గొప్ప అవకాశం ఇస్తుంది ఇది. చనిపోయిన తర్వాత శరీరంలో ఎంతో విలువైన అవయవాలను, మరొకరి ప్రాణం నిలబెట్టగల అవయవాలను మట్టిలో కప్పిపెట్టడం కరెక్టు కాదు. మనిషిగా ఒకరికి ప్రాణం పోయలేం. కానీ.. అవయవదాతగా ఒక ప్రాణం పోకుండా కాపాడగలం. మరణించినా జీవించగలం.

- లలితా రఘురాం, మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్


కేంద్రంగా మారింది..

అవయవ మార్పిడి చికిత్సను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. దాత నుంచి సేకరించిన గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు పదిలక్షల రూపాయల చొప్పున, ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు 13.6 లక్షల రూపాయలు, బోన్‌మ్యారో మార్పిడి చికిత్సకు 8.7 లక్షల రూపాయాలు, లైవ్‌డోనర్ లివర్ మార్పిడి చికిత్సకు 13 లక్షల రూపాయలు చెల్లిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి సైతం హైదరాబాద్‌కు అవయవ మార్పిడి చికిత్సకు తరలి వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వం అవయవదానానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 2013 నుంచి ఇప్పటి వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. అవయవదానంపై అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణ ఇలా అన్ని విభాగాల్లో ఇతర రాష్ర్టాలతో పోటీపడి దూసుకుపోతున్నది. తెలంగాణలో 2012లో మొదలైన జీవన్‌ధాన్ కార్యక్రమం అవయవదానం, ప్రాణదానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నది. వీటి ఫలితంగానే ఇప్పటి వరకూ తెలంగాణలో 50,558 మంది అవయవదానం చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.


ఏవి దానం చేయవచ్చు?

మనిషి చనిపోయిన తర్వాత శరీరంలోంచి దాదాపు 200 అవయవాలను దానం చేయవచ్చు. కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దపేగు, చిన్నపేగు, కాలేయం, ఎముకలు, ఎముకల్లో ఉండే మూలుగ వంటివి దానం చేయవచ్చు.


ఎప్పుడు ఎలా సేకరిస్తారు?

చనిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే అవయవాలను సేకరిస్తారు. అవి అమర్చడం కూడా కొన్ని గంటల్లోనే పూర్తి చేయాలి. ఎవరైనా గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి కొన్ని అవయవాలను ఆరు నుంచి 24 గంటల్లోపు సేకరిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో, బ్రెయిన్‌డెడ్ అయి చనిపోయిన వారి అవయవాలను వెంటిలేటర్ మీద నుంచి తొలగించేలోపు సేకరిస్తారు. ఒకవేళ వెంటిలేటర్ నుంచి తొలగించిన తర్వాత 4-5 గంటలలోపు గుండె, 10-12 గంటలలోపు కాలేయం, 24 గంటలలోపు మూత్రపిండాలు సేకరించడానికి అవకాశం ఉంది.


ఎప్పుడు చేయాలి?

చనిపోయిన తర్వాతనే అవయవ దానం చేయాలని రూలేం లేదు. బతికుండగా కూడా అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. అమ్మ, నాన్న, తోడబుట్టిన వారు, కొడుకు, కూతురు, భార్య ఇలా మీ రక్తం పంచుకుని పుట్టిన వారందరికీ బతికుండగా కూడా అవయవాలు దానం చేసి వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇందుకోసం ఎవరి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బంధుమిత్రులకు అవయవదానం చేయాల్సిన సందర్భంలో మాత్రం తప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారి శరీరం నుంచి అరోగ్యంగా ఉన్న అవయవాలు దానం చేయడానికి అర్హమవుతాయి. చనిపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న శరీర భాగాలు అవసరం ఉన్నవారికి అమర్చేలా అంగీకారం కూడా

తెలుపవచ్చు.
ముగింపు.. కాదు.. మరో జన్మకు ఆరంభం..


మనిషి చనిపోయిన తర్వాత శరీరంలోని ఏ భాగాన్నీ తొలగించకుండా అలాగే దహన సంస్కారాలు చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందనే మూఢ నమ్మకం చాలామందికి ఉంది. కానీ అది నిజం కాదు. మరణించిన వ్యక్తికి ఆ అవయవాలు ఏ మాత్రం పనికి రావు. ఇతరులకు దానం చేయడానికి అవకాశం ఉన్న అవయవాలను దానం చేసి మిగిలిన పార్థివ దేహానికి దహన సంస్కారాలు చేయాలి. ఆ దానం చేసిన అవయవాల రూపంలో ఆ మనిషి మరింత కాలం బతికే ఉంటాడు. ఒకరి ప్రాణాలు నిలబెట్టి ఆ ఇంటి వెలుగును కాపాడే అవకాశాన్ని వదిలేసి, విలువైన అవయవాలను మట్టిలో కలిపేయడం కరెక్టు కాదు. ప్రభుత్వాల కృషి, ఆరోగ్యశాఖ ప్రయత్నం, స్వచ్ఛంద సంస్థల సేవల వల్ల ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెరుగుతున్నది. మూఢనమ్మకాలు తగ్గిపోతున్నాయి. వచ్చిన కొద్దిపాటి మార్పుకే అవయవదానంలో దేశంలోనే మన తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. అందరూ మనసు పెట్టి ఆలోచిస్తే.. ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఎన్నో ఇంటిదీపాలు ఆరిపోకుండా వెలుగుతాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికి అవయవాలు కావాలన్నా భారతదేశం వైపు, తెలంగాణ వైపు చూడాలి. అక్కడికి వెళ్తే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశ కలుగాలి. అంతటి మహత్తరమైన రోజు రావాలని అందరం కోరుకుందాం. ఆ దిశగా అడుగులేద్దాం.

List1


ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి మీరూ జీవనదాతలు కావొచ్చు :


040-23489494 మొబైల్స్ 8885060092 ,8885060093Yes i am a Organ Donor

-అవయవదానం కంటే విలువైంది ఏదీ లేదు. మనం చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషిని బతికించేదే అవయవదానం. అందుకే నేను నా మరణానంతరం నా అవయవాలు దానం చేయడానికి ఒప్పుకున్నాను

- ఆమిర్‌ఖాన్, బాలీవుడ్ నటుడు


No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list