MohanPublications Print Books Online store clik Here Devullu.com

నమ్మిన దేవతలను గట్టెక్కించిన కూర్మం_Kurmavatar




 
 
 నమ్మిన దేవతలను గట్టెక్కించిన కూర్మం

శ్రీమహావిష్ణువుకు ఖేదం కలిగిన అవతారం కూర్మావతారం. ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. ఈ విషయం శాస్త్రంలో కనిపించదు. ఆయనకు అంత బాధ ఎందుకు కలిగిందీ అంటే, హాలాహలం కారణంగా. పాల సముద్రం లోపల ఆయన ఉండగా, మంధ పర్వతాన్ని వీపున పెట్టి తిప్పుతున్నప్పుడు హాలాహలం పుట్టింది. ఒంటికి దాని వేడి సెగలు కొట్టాయి. కదిలితే మంధ పర్వతం పడిపోతుందని ఆయన కదలలేదు. నన్ను నమ్మి పైన ఉన్న వాళ్లు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. హాలాహలం పైకి తేలి, వాళ్లు పారిపోతే అప్పుడు పైకి లేస్తాను. వాళ్లు కానీ, అలాగే చిలుకుతూ ఉంటే, నా ఒళ్లు దహించుకుపోతున్నా, ఇలాగే ఉంటా అనుకుని ఉండిపోయాడు.

దాంతో ఆయన ఒళ్లు తప్తమై ఎంతో బాధ కలిగింది. హాలాహలం పుట్టినప్పటి వేడి, అమృతోత్పాదనం అయిన తర్వాత, విష్ణువుకి లక్ష్మీదేవితో కల్యాణమైనా తగ్గలేదు. అప్పుడు మళ్లీ పరమశివుని ఆశ్రయించారు. ఆయన, నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా ఉన్నాను. నేను తూర్పు దిక్కుని చూస్తుంటాను. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమ దిక్కు చూస్తూ నీవు నిలబడు అన్నాడు. శివుడికి చంద్ర కంఠేశ్వరుడు అని పేరు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుని ఆలయంలో దర్శనం చేసుకుని, బయటకు వచ్చి నటరాజస్వామి ఆలయానికి వెళ్లేటప్పుడు ఒకపక్క చంద్ర కంఠేశ్వరుడు ఉంటాడు. తిరు మంగై ఆళ్వార్లు అక్కడ శ్రీమహావిష్ణు స్వరూపం మీద స్తోత్రం చేశారు. అక్కడ నిలబడ్డాడు విష్ణువు. పరమేశ్వరుని జటాజూటంలో ఉండే చంద్రవంక చల్లదనం తగిలి శ్రీమహా విష్ణువు శరీరం చల్లబడింది.

ఇంత కష్టపడ్డాడు అనడానికి రెండు సాక్ష్యాలు కాంచీపురంలో ఉన్నాయి. ఒకటి, కచ్చపేశ్వర దేవాలయం. ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంది. రెండోది, చంద్ర కంఠేశ్వర దేవాలయం. కచ్చపేశ్వర దేవాలయంలో ఇప్పటికీ ఆది కూర్మంగానే ఉన్నాడు. తనని నమ్ముకున్న దేవతలు ప్రార్థన చేస్తే వారిని ఒడ్డు ఎక్కించడానికి కూర్మంగా అంత కష్టపడ్డాడు. దానికి కారణం దయ. ఇన్ని కష్టాలు పడిన పరమాత్మ పాదాలు వదిలి, ప్రపంచంలో కనిపించిన ప్రతివారి పాదాలూ పట్టకూడదు. నమ్ముకోవలసిన వాడిని నమ్ముకోకుండా, మిగిలిన వారిని నమ్ముకుంటే దక్కేవి కూడా దక్కవు. వీడిని నమ్ముకుంటే జారిపోయేవి కూడా దక్కుతాయి. ఆది కూర్మమంటే అంత దయ కలిగిన స్వరూపం. అమృతోత్పాదనకు ముందు కూర్మావతారం.

ఆ తర్వాత మోహినీ అవతారం. తనను నమ్మి నిలబడినందుకు దేవతలకు అమృతాన్ని కట్టబెట్టి, పాల సముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి.. అన్నీ పైకి వచ్చేట్లు చేసి, అన్నిటితో కలిసి దేవేంద్రుడు స్వర్గలోకాధిపత్యం పొందేట్లుగా చేసిన పరమ దయాశాలి శ్రీమహావిష్ణువు. ఆయన అవతారమైన ఆది కూర్మావతారాన్ని స్మరించినా, ఒక్కసారి చదువుకున్నా, చెప్పినా, విన్నా, విష్ణువు మాత్రమే కాకుండా 33 కోట్ల మంది దేవతలూ ప్రీతి పొందుతారు. కూర్మావతారాన్ని తలచుకున్నవారు జ్ఞానం పొందుతారు.
- చాగంటి కోటేశ్వరరావు శర్మ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list