MohanPublications Print Books Online store clik Here Devullu.com

World Telugu Conference 2017 ప్రపంచ తెలుగు మహాసభలు

World Telugu Conference 2017 ప్రపంచ తెలుగు మహాసభలు

అమ్మబాషకు అంబారీ
14-12-2017 నుంచి తెలుగు సంబరం


భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాఖీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది ఏ జేరంగశక్తుండనే!

- ఉత్తర గోగ్రహణంలోని పద్యపాదాలివి. 2014 సెప్టెంబరు అయిదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తన గురువు మృత్యుంజయశర్మగారిని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గుర్తుచేసుకుంటూ ఈ పద్యాన్ని వల్లెవేశారు.

   మంచి గురువు లభించడం తన అదృష్టమన్నారు ముఖ్యమంత్రి. నాడు తరగతి గదిలో జరిగిన ఘటనను వివరించారు. పద్యాన్ని కంఠస్థం చేసి తరవాతి రోజు అప్పజెబితే వంద పేజీల నోటుపుస్తకం బహుమతి ప్రకటించారట తెలుగు ఉపాధ్యాయులు మృత్యుంజయ శర్మ. అయిదుసార్లు చదివి ఇప్పుడే అప్పజెబుతానన్నారట కేసీఆర్‌.

 ‘చంద్రశేఖరరాయుడా... నిజంగానేనా!’ అంటూ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపడగానే, అయిదుసార్లు చదివి గడగడా పద్యాన్ని అప్పజెప్పడం కేసీఆర్‌ వంతు అయింది. తనకు సాహితీ లోకపు ద్వారాలను తెరచి చూపించింది ఆయనేనని ముఖ్యమంత్రి ఆ వేదికపై గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

   తెలుగు భాష వన్నెలీనడానికి అసలు బీజాలు ఎక్కడ పడాలో వివరిస్తున్న ఘటన ఇది!

భాషాప్రయుక్తంగా ఆవిర్భవించిన మొట్టమొదటి రాష్ట్రంలోని ఓ భాగానికి చెందిన ప్రజల అస్తిత్వ సమస్యల్లో భాష కీలకాంశంగా మారింది. రాజకీయ అంశాలు ఎంత ప్రధానమైనవో, భాష సైతం అంతే ముఖ్యమైనదిగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తొలి సంధ్యలో తిరిగి భాషే ప్రధానంగా చేపట్టిన మరొక పెద్ద కార్యక్రమం- ప్రపంచ తెలుగు మహాసభలు! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్ర స్వరంలో ఉన్నప్పుడు సాహితీవేత్తలే ‘ఏ తెలుగుతల్లి, ఎక్కడి తెలుగు తల్లి, మీ తెలుగు వేరు మా తెలుగు వేరు’ అని గట్టిగా వాదించిన విషయం తెలిసిందే. అదే నేల మీద ఇప్పుడు ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమస్యలను చర్చించుకుందాం రండి భాషను బతికిద్దాం, వికసింపజేద్దాం, తెలుగువారందరూ రండి మాట్లాడుదాం, చర్చిద్దాం’ అనే ఆహ్వానం వినబడుతోంది. ఈ నేపథ్యమే నేటి ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రాధాన్యాన్ని సంతరింపజేసింది. తెలంగాణ సాహిత్యానికి ప్రాచీనకాలం నుంచి ఆధునిక యుగం దాకా తగిన గుర్తింపు, పేరు రాలేదని; సముచిత గౌరవం దక్కలేదని- అటు నిజాం పాలనలోనూ, ఆ తరవాతా ఈసడింపే మిగిలిందని, ఆ భాషా సాహిత్యాల ఆత్మగౌరవం కాపాడి వాటికి పట్టం కట్టేందుకే ప్రస్తుత కార్యక్రమం రూపుదిద్దుకొందని నిర్వాహకులు ఇప్పటికే గట్టిగా తెలియపరచారు. భాష ముఖ్య అస్తిత్వ సమస్యగా పోరాడి రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించ తలపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం.

జాతికి ఆయువుపట్టు

భాషావిధాన రూపకల్పనలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేక పల్టీలు కొడుతూనే ఉన్నాయి. జాతి, జాతీయత అనే అంశాలపై చర్చలు జరుగుతున్నప్పుడు జర్మనీకి చెందిన ఫిషర్‌ అనే భాషావేత్త జర్మనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏ జాతికైనా అంతర్గతంగా నిర్మితమై ఉండే ఒక సహజమైన సరిహద్దు ఉంటుంది. దాన్ని నిర్ణయించేది భాష అన్నాడాయన. అంటే ఒక జాతి ప్రజలు మాట్లాడే భాషే దానికి సరిహద్దులు నిర్ణయిస్తుందని, మాట్లాడే భాష ఆధారంగానే జాతులు ఏర్పడతాయని అప్పటి భావన. కాని, ఈ భావన ఐరోపా దేశాలకు బాగా సరిపోతుంది. భారత జాతి విషయంలో సరిహద్దులు నిర్ణయించేది సంస్కృతి. భిన్న భాషలున్న భారత్‌లో అన్ని భాషా ప్రాంతాల్లో ఆంతరిక ఏకరూప సాంస్కృతిక అంశాలు దేశాన్ని జాతిగా కలిపి ఉంచుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించని అదే ఐరోపా పాలకులు, ఆనాడు రాజగోపాలచారి నాయకత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ మద్రాసు ప్రెసిడెన్సీలో పాఠశాలల్లో తప్పనిసరి హిందీని ప్రవేశపెట్టారు. అప్పటి వలస పాలకులు అవలంబించిన భాషావిధానంపై 1937లోనే తమిళనాడులో తీవ్రమైన హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. పైన చెప్పిన భాషే సహజ సరిహద్దు అనే భావన కారణంగానే 1956లో భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాష విషయంలో మంచి వివేకంతో ప్రవర్తించే తమిళులు, రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే భాషావిధానాన్ని ఏర్పరచుకున్నారు. పరిపాలన అంతా తమిళంలోనే సాగాలని నిర్ణయించుకున్నారు. పరిపాలన పదాలు అన్నీ తమిళంలో ఉండాలని, ఒక సమగ్ర పరిపాలన నిఘంటువు ఉండాలని ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకున్నారు. పది సంవత్సరాల్లోనే సమగ్ర పరిపాలన నిఘంటువు తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ దాన్ని ఉచితంగా అందించారు. భాష విషయంలో నాటి వూపు అలాగే కొనసాగుతూ వచ్చింది. నేటికీ అక్కడ దాదాపు 90 శాతం పరిపాలన తమిళంలో జరుగుతోంది. కింది స్థాయి న్యాయస్థానాల్లోనూ తమిళమే అధికారభాష. ఒక్క హైకోర్టులో, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలవారితో సాగే పాలన, తప్పనిసరి విషయాల్లో మాత్రమే ఆంగ్లాన్ని మరొక అధికార భాషగా వారు వినియోగిస్తున్నారు. 1956లో ఆ ప్రభుత్వం అధికార భాషా సంఘం(అఫిషియల్‌ లాంగ్వేజ్‌ కమిషన్‌)ను కొలువుతీర్చింది. భాషకోసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ అక్కడి ప్రభుత్వంలో నేటికీ కొనసాగుతోంది. భారతదేశంలో ఒక భాషకు మొట్టమొదటగా ప్రపంచ సదస్సు నిర్వహించిందీ తమిళులే! మొదటి సదస్సును మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల ప్రతినిధులు అక్కడ హాజరై. వారి భాషాసమస్యలను చర్చించుకున్నారు. 1968లో రెండో సదస్సును మద్రాసులో అన్నాదురై నాయకత్వంలో నిర్వహించారు.

ఏళ్ల తరబడి ఉదాసీనత

మనకు తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన ఇరవై సంవత్సరాల తరవాత కాని అధికార భాషాసంఘం ఏర్పడలేదు. అదీ ఏ అధికారం లేనిది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయేనాటికి అధికార భాషగా తెలుగు అమలు పరిస్థితి సచివాలయంలో మూడు శాతంగా ఉంది. పాలకుల చొరవ ఉంటే భాష పరిస్థితి ఎలా ఉంటుంది... లేకపోతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మంచి ఉదాహరణలు. తొలి ప్రపంచ తెలుగు మహాసభలను మనం 1975లో నిర్వహించుకున్నాం. పొరుగువారు చేసుకున్న 17 ఏళ్ల తరవాతగాని మనం చేయలేదు. ఆపై 1981, 1990లో, చివరిగా 2012లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తొలి తెలుగు సభల ఫలితంగానే అంతర్జాతీయ తెలుగు సంస్థ ఏర్పడింది. వేర్వేరు దేశాల్లో ఉన్న తెలుగువారి భాషా సమస్యలను తెలుసుకోవడానికి ఈ సభలు ఉపకరించాయి. దరిమిలా ప్రభుత్వాలు ఆ దిశగా కొంత పనిచేశాయి. తెలుగు వాచకాలను ముద్రించడం, వేర్వేరు దేశాలవారికి అందించడం, కొన్ని శిక్షణ తరగతులను నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక బృందాల ప్రయాణాల్లాంటివి చోటుచేసుకున్నాయి. కాని, ఈ మహాసభలు ఏ స్థాయిలోనూ స్ఫూర్తిని రగిలించలేదు. భాషావిషయకంగా తెలుగు ప్రభుత్వాలు పనిచేయవలసిన దానిలో పదోవంతైనా చేయలేదు. అధికారభాష అమలుకు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. మహాసభల తీర్మానాలు నూటికి తొంభై తొమ్మిది బుట్టదాఖలు అయ్యాయి. ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు నేటికీ అమలు కాలేదు.

ప్రైవేటీకరణే శాపం

ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేసే కేంద్రపథకం కారణంగా 1970 దశకంలో తెలుగు అకాడమీ వచ్చిన కొత్తలో డిగ్రీ దాకా తెలుగు మాధ్యమాన్ని అమలు చేశారు. స్నాతకోత్తర స్థాయిలోనూ పాఠ్యగ్రంథాలు తయారు చేసింది తెలుగు అకాడమీ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇతరచోట్లా స్నాతకోత్తర (పీజీ) పరీక్షలను తెలుగులో రాయడానికి అనుమతించారు. క్రమంగా విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వేళ్లూనుకుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన వూపందుకుంది. ఇంగ్లిషు మీడియమే ఉద్యోగాలు తెచ్చిపెడుతుందన్న ప్రచారం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు మొగ్గుచూపారు. క్రమంగా ప్రైవేటు విద్యాలయాలు, కళాశాలలు పెరిగి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో వచ్చేవారు లేక మూతపడే స్థాయికో లేక రెండు మూడింటిని కలిపి ఒకటిచేసే స్థాయికో వచ్చేదాకా ప్రభుత్వాలు నిద్రపోయాయి. లేదా ప్రైవేటును ప్రోత్సహిస్తూ నిద్ర నటించాయి. చివరికి తెలుగు మాధ్యమంగా లేక, పాలనలో ఉపయోగంలో లేక అమ్మభాష అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. దాంతో భాషోద్యమం విజృంభించిన తరుణంలో రెండు కొత్త తెలుగు రాష్ట్రాలు తమ భాషావిధానాలను ప్రకటించాయి. తెలుగు చదువుకుంటే ఉద్యోగం రాదని ప్రజలు అనుకునే దశలో తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం, అదీ ప్రపంచ తెలుగు మహాసభల తరుణాన నిర్ణయాన్ని వెలువరించడం భాషాప్రేమికులందరికీ సంతోషం కలిగించింది.

భారతదేశంలో ఆయా భాషలవారు ప్రపంచ మహాసభలను నిర్వహిస్తూనే ఉన్నారు. తమిళం, కన్నడం, హిందీ, గుజరాతీయులూ ప్రపంచ మహాసభలను నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టారు. కాని సభల్లో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలోకాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారివారి భాషలకు ప్రోత్సాహం అందించడంలోకాని ఇతర భాషలవారు చాలా ముందున్నారు. అందరికన్నా వెనకబడి ఉన్నది తెలుగువారే అని చెప్పాలి. తమిళులు వేర్వేరు దేశాల్లో భాషాభివృద్ధి, సంస్థలకు (ఛైర్‌)లను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా పరిశోధనలను ప్రోత్సహించడానికి పథకాలు చేపట్టారు. పరిశోధకులకు ఫెలోషిప్పులు అందించారు. వారి భాషకు ‘క్లాసికల్‌’ స్థాయి తెచ్చుకోవడానికి పోరాటం చేశారు. ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్లాసికల్‌ తమిళ్‌’ అన్నది ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో తమిళం చదువుకునే విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. అక్కడున్న తమిళ విభాగాలకు పోస్టులను ‘ఎండోమెంట్‌’ రూపంలో మంజూరు చేస్తున్నారు. ఇంటర్‌నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ తమిళ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ ఏర్పడింది. 2010లో కోయంబత్తూరులో వరల్డ్‌ క్లాసికల్‌ తమిళ్‌ కాన్ఫరెన్సును డీఎంకే పార్టీ నిర్వహించింది. అసలు అక్కడి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో భాష విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తాయి. ప్రపంచంలో మొదటిసారిగా ఒక భాషకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పడింది తమిళ భాషకే. దీని ఏర్పాటుకు దోహదపడిందీ ప్రపంచ తమిళ మహాసభలే. 1981లో మదురైలో ఎంజీఆర్‌ నేతృత్వంలో ఈ మహాసభలు జరిగాయి. తమిళ విశ్వవిద్యాలయాన్ని ఎంజీఆర్‌ ఏర్పాటు చేశారు. అందులో అంతర్జాతీయ తమిళ అధ్యయన విభాగం ఏర్పాటైంది. అక్కడివారు ఏర్పరచుకున్న ప్రపంచ తమిళ మహాసభలు చాలామంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రపంచస్థాయిలో తమిళ అధ్యయనం జరగడానికి ఇవి బాగా తోడ్పడ్డాయి. క్లాసికల్‌ తమిళ సంస్థ కేంద్ర నిధులతో ఎన్నో భాషావికాస కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగే తమిళ భాష సాహిత్య కార్యక్రమాలకు ఇది ప్రోత్సాహాన్ని అందిస్తోంది. భాష విషయంలో తమిళుల వీరావేశం ఏ మాత్రం తగ్గలేదు. తమిళ మాధ్యమంలో విద్యాబోధన కూడా గట్టిగానే ఉంది. హైకోర్టులోనూ తమిళ భాషను అమలు చేయడానికి వారు తీవ్ర కృషి చేస్తున్నారు. మద్రాసులో 1968లో ప్రపంచ తమిళ మహాసభలు జరిగిన 20 ఏళ్ల తరవాత తిరిగి మద్రాసులోనే 2018లో ప్రపంచ తమిళ మహాసభలు జరపడానికి తమిళులు సిద్ధపడుతున్నారు.


నూతనోత్తేజం...

పొరుగున కర్ణాటకలోనూ ‘విశ్వ కన్నడ సమ్మేళన’ పేరిట ప్రపంచ మహాసభలను నిర్వహించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగానే ఏర్పడిన కర్ణాటక, భాష సాహిత్యవికాసాల్లో మనకన్నా ఎంతో ముందుంది. అన్ని స్థాయుల్లో కన్నడను అధికార భాషగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా భాష విషయంలో కన్నడిగుల నిబద్ధత మారడంలేదు. కన్నడిగులు 1915 నుంచే ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. 2017లో 83వ సమ్మేళనం జరిగింది. విశ్వ కన్నడ సమ్మేళనాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడిగులు పాల్గొంటారు. మొదటి విశ్వ కన్నడ సమ్మేళనం మైసూరులో, తరవాత 2011లో బెల్గామ్‌లో జరిగింది. వీటిలో తీసుకునే నిర్ణయాల ఫలితంగానే, కర్ణాటక ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడిగుల భాషావికాసానికి చర్యలు చేపడుతోంది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గల కన్నడ శాఖలకు పోస్టులను మంజూరు చేస్తున్నారు. అక్కడి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. ఏడాది క్రితమే దిల్లీలోని జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో కన్నడ ఛైర్‌ను ఏర్పాటు చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయంలోని కన్నడ విభాగమూ ఇదే రీతిలో ఉంది. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్య సైతం కన్నడ మాధ్యమంలో సాగుతోంది. అక్కడి విద్యార్థులకు వేరే శాఖలో ఇంగ్లిషులో బోధన సాగినా, కన్నడంలో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారు. కన్నడ భాషా సంఘం రాజకీయంగానూ చాలా గట్టిగా ఉంది. ప్రపంచ కన్నడ మహాసభలు అన్ని స్థాయుల్లో సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేరళ సైతం భాష విషయంలో మంచి నిర్ణయాలే తీసుకుంది. 1995లో ప్రపంచ మలయాళీ మండలి(వరల్డ్‌ మలయాళీ కౌన్సిల్‌) ఏర్పడింది. మలయాళీల విశ్వసౌభ్రాతృత్వం కోసం ఇది పనిచేస్తోంది. మొదటి మహాసభ న్యూజెర్సీలో జరిగింది. మలయాళీ డయస్పోరాలో పటిష్ఠమైన సంబంధాన్ని ఏర్పాటు చేయడం, మలయాళీ సమాజాన్ని శక్తిమంతం చేయడం, భాషాభివృద్ధి దీని లక్ష్యాలు. ప్రభుత్వపరంగా మలయాళాన్ని అన్ని విద్యాసంస్థల్లో తప్పనిసరి చేసింది. అటు గుజరాతీ, హిందీ భాషలకూ ప్రపంచస్థాయి సదస్సులు జరుగుతున్నాయి. వారి వారి రాష్ట్రాల్లో భాషకు ప్రోత్సాహం ఇవ్వడం, ఇతర దేశాల్లో ఉన్నవారి భాషా సమాజాలకు ప్రోత్సాహం అందజేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో మన తెలుగు సమాజమే చాలా వెనకబడి ఉందని చెప్పాలి.


సంధ్యవేళ చల చల్లని గాలి
వయ్యారాల పైరగాలితో కలిసి మెలిసి
అల్లన చల్లన మెల్లన వీచీ వీచింది
అది మేనుకు హాయిని గొలిపింది
అదేనోయీ! తేట తెలుగు హాయి
              - డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా
              - కాళొజీ నారాయణరావు

ఎవరు కాకతి ఎవరు రుద్రమ
ఎవరు రాయలు ఎవరు సింగన
అంతా నేనే అన్నీ నేనే
అలుగు నేనే పులుగు నేనే
వెలుగు నేనే తెలుగు నేనే
              - దాశరథి కృష్ణమాచార్య

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం