MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనదాకా వస్తేనే!_Civics Sense



మనదాకా వస్తేనే! Civics Sense Common Sense Giving to sense in public civic sense in public places Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU, BHAKTHIPUSTHAKALU



మనదాకా వస్తేనే!

సినిమా టికెట్ల కోసమైనా.. బస్సు, రైలు టికెట్ల కోసమైనా.. వరుసలో నిలబడటం మాకు నచ్చదు.
అంబులెన్స్‌లో రోగి ప్రాణాపాయంలో ఉన్నా దారి ఇచ్చే ప్రసక్తే లేదు.
ట్రాఫిక్‌ జామ్‌ అయితే అప్పటికే ఉన్న వరుసలో వాహనాన్ని నిలపం. పక్క లేన్‌లోంచి దూసుకెళ్లి సమాంతరంగా కొత్త వరుస సృష్టిస్తాం.

ఇంకో లేన్‌లో వెళ్లే అవకాశం లేకపోతే ఫుట్‌పాత్‌ మీద నుంచి అయినా సరే బండిని పోనిస్తాం తప్ప తగ్గే ప్రసక్తే లేదు.

రోడ్డు మధ్యలో డివైడర్‌ పక్కనే పెద్ద వాహనాలు తప్ప చిన్న వాహనాలు వెళ్లకూడదని తెలిసినా.. మా బండి మీద నెమ్మదిగా వెళ్తాం.

వెనక నుంచి హెల్మెట్‌ లేకుండా రయ్య్‌...న బండి మీద పోతూనో, బస్సుల్లోంచో రోడ్డు మీద తుఫుక్కున ఉమ్మేస్తాం. ఆ ఉమ్మి తుంపరలు వెనక వచ్చేవాడి ముఖం మీద పడ్డా డోంట్‌కేర్‌! అధవా వాడొచ్చి అడిగినా రివర్స్‌గేర్‌లో వాణ్నే బెదిరిస్తాం తప్ప బెణకం తొణకం!
రద్దీగా ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర.. ఎడమపక్క మళ్లాల్సిన వారి కోసం ఉండే ఫ్రీలె్‌ఫ్టను కూడా వదలం.

బిజీ రోడ్డు మీద రివర్స్‌ తీసుకుంటాం. పొరపాటున మన బండికి వేరే బండి తాకితే మాట్లాడే పనే లేదు.. మీదపడి కొట్టేస్తాం. తప్పు మనదైనా సరే.. రివర్స్‌గేర్‌లో దబాయిస్తాం తప్ప తప్పు ఒప్పుకోం!! చిన్నపాటి యాక్సిడెంట్‌ అయితే నడిరోడ్డుపైనే గొడవ పడతాం తప్ప.. కారునో, బండినో కాస్త పక్కకు తీసి మాట్లాడుకోం!! చిన్న చిన్న సర్వీసు రోడ్లలో సైతం కారును ఆపేసి మా పని మేం చూసుకుంటాం. డివైడర్ల మీద నుంచి బండి ఎక్కించేస్తాం. డివైడర్ల మధ్య సందుల్లోంచి కూడా బండ్లు పోనించేస్తాం. నిబంధనలు అధిగమించి భారీ హారన్లు బండికి పెడతాం.

ట్రాఫిక్‌ జామ్‌ అయిన విషయం కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. అయినా చెవులు చిల్లులు పడేలా హారన్‌ కొడతాం.
వయోధికులు, చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్నా ఒక్క క్షణం ఆగం. బర్రున దూసుకెళ్లి భయపెడతాం. ఫూటుగా మందుతాగి బండ్లు నడుపుతాం. రెడ్‌లైట్‌ అంటే మాకు లెక్క లేదు. రాంగ్‌రూట్‌లో అడ్డగోలుగా దూసుకెళ్తాం. సీటుబెల్టా అంటే ఏంటి?
ఇన్ని మాటలెందుకుర భయ్‌.. ట్రాఫిక్‌ రూల్స్‌ గీల్స్‌ జాన్తానై! మేం భారతీయులం!!
చాక్లెట్‌ రేపర్లు, సిగరెట్టు పీకలు.. అన్నీ రోడ్డుమీదే పారేస్తాం! బర్రుబర్రు మంటూ చీదేస్తాం!! అటూఇటూ చూసి మూత్రవిసర్జనా అక్కడే చేసేస్తాం!

శుభ్రత అంటే మాకు ప్రాణం. అందుకే ఇంట్లో చెత్తంతా పోగుచేసి రోడ్డు మీద పోసేస్తాం. మున్సిపాల్టీ వాళ్లు ఉన్నదెందుకు?

ప్లాస్టిక్‌ కప్పులు, కవర్లు, తాగేసిన కొబ్బరి బోండాలు.. చెత్తాచెదారం.. ఏవైనా డ్రైనేజీ కాలువలో పారేస్తాం! అది బ్లాకయితే మాకేంటి?

ప్రభుత్వం మొత్తుకున్నా తడిపొడి చెత్త వేర్వేరుగా వెయ్యం. అన్నీ కలిపే వేస్తాం.
బారాత్‌ పేరుతో రాత్రి పదయినా.. పన్నెండయినా.. మైకుల్లో పాటలు, డాన్సులతో హోరెత్తిస్తాం!! పార్టీలని, పూజలని భారీ సౌండుతో డీజే పెడతాం. జనాలకు ఇబ్బందా? సోవాట్‌?

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. కానీ, బస్సులో స్త్రీల సీట్లో కూర్చుని, ఎక్కడ లేవమంటారోనని నిద్ర నటిస్తాం!

నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను.. అంటే ప్రజల ఆస్తులను నాశనం చేస్తాం. చారిత్రక కట్టడాల మీద కిళ్లీ మరకలు.. బ్లేడుతో పేర్లు చెక్కడాలు.. మా సరదా. మేం భారతీయులం!!
నిత్యం మేం చేసే తప్పులివి. కానీ.. అవే తప్పులు ఎదుటివాళ్లు చేస్తే మాకు బీపీ వచ్చేస్తుంది. ‘ఒక్కడికి కూడా సివిక్‌ సెన్స్‌.. సంస్కారం లేదు. ట్రాఫిక్‌ రూల్స్‌ తెలియవు. రాంగ్‌ రూట్‌లో వచ్చి నన్నే బుకాయిస్తున్నాడు చూడు’ అంటూ గుండెలు బాదుకుంటాం. మాటలు విసర్జిస్తాం. బూతులు అలవోకగా దొర్లిస్తాం. అమెరికా, సింగపూర్‌లలో రోడ్డు మీద చెత్త కాగితం వేసినా, రోడ్‌ రూల్స్‌ పాటించకపోయినా భారీ జరిమానా వేస్తారని ఆ దేశం గురించి గొప్పలు చెబుతాం. కానీ మేం మాత్రం చాన్స్‌ దొరికితే చాలు నియమాలు ఉల్లంఘిస్తాం. ‘భారతీయులకు సివిక్‌ సెన్స్‌ తక్కువ’ అని పాశ్చాత్య దేశాలు అవహేళన చేసినా మాకు చీమ కుట్టినట్టయినా ఉండదు. ‘రూల్స్‌ ఉన్నది బ్రేక్‌ చేయడానికేగా భాయ్‌’ అని జోక్స్‌ పేల్చుతాం! ‘నేనొక్కడినే రూల్స్‌ పాటించకపోతే కొంపలేం మునిగిపోవులే’ అనుకుంటాం. మేం భారతీయులం.

సంస్కారానికి సంకేతమా.. అయితే?
‘‘సమాజం సరైన దిశలో పురోగమించేందుకు, మనతో పాటు మన చుట్టుపక్కల వారు కూడా సౌకర్యంగా జీవించేందుకు ఏర్పాటు చేసుకున్నవే సామాజిక నియమాలు లేదా పౌర కర్తవ్యాలు. ఇతరుల హక్కుల్ని గౌరవించడం, సమాజం, కుటుంబం, పర్యావరణం పట్ల బాధ్యతతో మెలగడమే సివిక్‌ సెన్స్‌. మనం ఏ మేరకు సామాజిక నియమాలు పాటిస్తున్నామనేదే మన సంస్కారానికి, నాగరికతకు సంకేతం’’ అంటారా?.. ఇదంతా మాకు తెలిసిన సోదే. అయితే మాత్రం.. మేం పాటించాలా? ఎవడూ పాటించనప్పుడు నేను మాత్రం ఎందుకు పాటించాలి? ‘‘పౌర నియమాలు పాటించడం అంటే రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ ఆస్తుల్ని శుభ్రంగా ఉంచడం మాత్రమే కాదు.. చట్టాన్ని, ఎదుటి వారిని, వారి అభిప్రాయాలను గౌరవించడం కూడా సివిక్‌సెన్సే. విశృంఖలత, వివక్ష, విధ్వంసకర ధోరణి, అసహనం ఇవన్నీ కూడా పౌర స్పృహ లేదనేందుకు నిదర్శనాలు’’.. లాంటి మెట్ట వేదాంతం మాకు చెప్పొద్దు. మేం భారతీయులం!!
ఉపసంహారం: అమెరికాకో సింగపూర్‌కో వెళ్లినప్పుడు మాత్రం.. చాక్లెట్‌ రేపర్‌ తీసి రోడ్డు మీద పారేయం. జేబులో జాగ్రత్తగా పెట్టుకుని డస్ట్‌బిన్‌ కనిపించినప్పుడు అందులో వేస్తాం. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తాం. ఎందుకంటే.. అక్కడ మేం ఉత్తి భారతీయులం కాదు.. ఎన్నారైలం! నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష పడుతుందని మాకు తెలుసు!! అక్కడ కూడా రోడ్డు మీద వాహనంలో వెళ్లేటప్పుడు సిగ్నల్‌ ఇవ్వకుండా లేన్‌ మారడం లాంటి శిక్ష పడని నేరాలు చేస్తాం. విదేశీయులు తిట్టుకుంటే మాకేంటి?.. మేం భారతీయులం!!

సివిక్‌సెన్స్‌ ... నాన్సెన్స్‌!
సివిక్‌సెన్స్‌ అంటే మా దృష్టిలో నాన్సెన్స్‌. చట్టం వుంది నా కోసం కాదు. మిగతా అందరి కోసం. వ్యక్తిగత లక్ష్యాలను అందుకోవడానికి.. సామాజిక నియమాలను తుంగలో తొక్కితే తప్పేంటి? ఈ నియమాలన్నీ నిరర్థకం. నేను హ్యాపీగా వుండటమే జీవితానికి పరమార్థం. బహిరంగ ధూమపానం, మద్యపానాల్ని ప్రభుత్వం నిషేధించింది. ఆ పని ఒకరో ఇద్దరో చేస్తే పోలీసులు ఏమైనా చెయ్యగలరు. వీధివీధినా పేట పేటలో ఉంటాం మేం. మమ్మల్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆస్పత్రిలోనో.. సినిమా థియేటర్లోనో.. సెల్‌ఫోన్‌లో పెద్దగా మాట్లాడటం మేనర్స్‌ కాదని తెలుసు. అయినా మేం మాట్లాడతాం. సమయం సందర్భం గమనించకుండా సెల్ఫీలు తీసుకుంటాం. కష్టాల్లో ఏడ్చే బాధితులను జర్నలిస్టులమై గుచ్చిగుచ్చి ఇంటర్వ్యూలు చేస్తాం. నీకు నచ్చకపోతే పక్కకుపో, మేం భారతీయులం. ఇవన్నీ చిన్నచిన్న విషయాలే. చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే కనీసం వచ్చే తరం అయినా పౌర స్పృహతో వ్యవహరిస్తుందని.. ఈ చిన్నచిన్న మార్పులే దేశపురోగతిని వేగవంతం చేస్తాయని కూడా మాకు తెలుసు. మేమే పాటించనప్పుడు పిల్లలకు ఎలా చెప్తాం? కాబట్టి చెప్పం. మేం భారతీయులం.


ఇవి వదిలేస్తేనే...స్వచ్ఛ భారతం

బహిరంగ ప్రదేశాల్లో సెల్‌ఫోన్‌లో పెద్దగా మాట్లాడటం
రోడ్ల మీద ఉమ్మి వేయడం, చెత్త కుమ్మరించడం
బహిరంగ మూత్ర విసర్జన, ఆరుబయట మలవిసర్జన
చెవులు చిల్లులు పడేలా హారన్‌ కొట్టడం
రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా దూసుకుపోవడం
వాహనంలో వెళుతూ రోడ్ల మీద చెత్త పడేయడం
రోడ్‌ రూల్స్‌ పాటించకపోవడం
నిర్దేశించిన వరుసలో కాకుండా వేరే లైన్స్‌లో వాహనం నడపడం
రోడ్ల మీద వాహనాలు పార్క్‌ చేయడం
తప్పుడు దిశలో వాహనాలు నడపడం
ఎడమ వైపు నుంచి వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయడం
అంబులెన్స్‌కు దారి ఇవ్వక పోవడం
పెద్దలను, మహిళలను గౌరవించకపోవడం
క్యూ పాటించకపోవడం
ప్రభుత్వ ఆస్తుల్ని పాడు చేయడం

ట్రాఫిక్‌ నియమాలు పాటించడం, క్యూలో నిలబడటం ఇవన్నీ మన జీవితంలో కూడా క్రమశిక్షణను పెంచుతాయి. స్కూలు దశ నుంచే సివిక్‌ సెన్స్‌ను విధిగా పాఠ్యాంశంలో చేర్చాలి. ప్రజలు సామాజిక నియమాల్ని, చట్టాల్ని గౌరవించకపోతే మనం సాధించే ప్రగతి అంతా వృథా.
- డాక్టర్‌ పట్టాభిరామ్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు


అవగాహనా రాహిత్యం
అర్థరాత్రి పెద్ద శబ్దాలు చేయడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోడం, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం ఇవన్నీ అవగాహనా రాహిత్యం. ఇప్పుడిప్పుడే మన దగ్గర సివిక్స్‌ సెన్స్‌ విషయంలో అవగాహన పెరుగుతోంది. సమాజంలో సివిక్స్‌ సెన్స్‌ పెరగాలంటే, చిన్నప్పటి నుంచి ఆ అంశాలపై పాఠశాలలు,ఇంట్లోనూ బోధించాలి.
- సి. నరసింహారావు, మానసిక విశ్లేషకులు


చిన్నపనులే..
ఓ వ్యక్తి సౌశీల్యాన్ని అంచనావేయాలంటే, ముందుగా తాను నిర్వర్తించే చిన్న పనులను పరీక్షించమని స్వామి వివేకానంద చెబుతారు. మనం ఓ పబ్లిక్‌ టాయిలెట్‌కి వెళ్లినప్పుడు సరిగ్గా ఫ్లష్‌ చేయ్యం. అదే ఇంట్లో చాలా శుభ్రంగా ఉపయోగిస్తాం. సివిక్స్‌ సెన్స్‌ అనేది వ్యక్తిగత నిబద్ధత, స్వీయశిక్షణకి సంబంధించిన అంశం.
- స్వామి రఘునాయకానంద, రామకృష్ణమఠం

చిన్నప్పటి నుంచే నేర్పించాలి
క్రమశిక్షణ, సివిక్‌సెన్స్‌ అనేవి సమాజం నేర్పుతుందా. పెంపకం ద్వారా అలవడుతుందా! పాఠశాల నేర్పుతుందా అనే విషయం పక్కనబెడితే, ప్రతి వ్యక్తికీ నియమావళి చాలా అవసరం. అది సమాజ అభ్యున్నతికి చాలా కీలకం కూడా. ముఖ్యంగా పిల్లలకు పెంపకంలో విలువల్ని చెప్పడం మాత్రమే కాకుండా, ఆచరించి చూపడం వల్ల ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలి. పరిసరాల్లో ఎలా మెలగాలి వంటి విషయాలన్నీ అవగతమయ్యే అవకాశం ఉంది. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న నియమనిబంధనలను మనం పాటించకపోతే ఆ సమాజం మనల్ని ఆమోదించదు. కనుక, వాటిని కచ్చితంగా పాటించాలనుకుంటాం. అలానే మన దేశానికి వచ్చిన తర్వాత ఏముందిలే! ఎవరు పట్టించుకుంటారు అనే సందర్భంలోకి వెళతాం. వాస్తవానికి ఆ ప్రవర్తన అనేది ఇంగితానికి, స్వీయ క్రమశిక్షణకి సంబంధించిన విషయం. మనం ఎలా ఉంటే, మన సమాజం అలా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించాలి.
- డా.పద్మజ, మనస్తత్వ నిపుణురాలు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list