ఫ్యామిలీ డాక్టర్
పిల్లల్లో పలువరస చక్కగా లేకపోవడం సాధారణంగా కనిపించే సమస్య. నోరు మూసినప్పుడు పై పలువరస, కింది పలువరస కుదురుకుపోయి... చక్కగా, సౌకర్యంగా ఉండాలి. కానీ కొరికినప్పుడు పలువరస కుదురుకుపోకుండా ఉండటం లేదా ఒకచోట పళ్లు గుంపుగా రావడం... అంటే వరసలో కాకుండా ఒకదానిపైన మరొకటి రావడం (క్రౌడింగ్) వల్ల ముఖం వికాసం చక్కగా జరగదు. దానివల్ల ఏదైనా తినే పదార్థం చక్కగా కొరుకుడు పడకపోవడం, పళ్లు తోముకునే సమయంలో, నోరు కడుక్కునే సమయంలో చక్కగా శుభ్రం కాకపోవడం, చిగుళ్ళు మండటం, మాట-పలుకు సరిగా రాకపోవడం వంటివి జరుగుతాయి.
స్కూలుకు వెళ్లే వయసు పిల్లల్లో దాదాపు 90 శాతం మందిలో ఏదో ఒక మేరకు పలువరస చక్కగా లేకపోవడం జరుగుతుంది. కానీ కేవలం 10 - 15 శాతం మంది పిల్లల్లో మాత్రమే ఇది ఒక సమస్యగా మారి, చికిత్స అవసరమవుతుంది. అయితే ఈ పిల్లలు వాస్తవ ఆరోగ్యసమస్య కంటే తమ అందం, ముఖ సౌందర్యం, లుక్స్ కోసమే దీనికి చికిత్స తీసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది.
ఈ లక్షణాలతో గుర్తించండి...
పలువరస చక్కగా లేకపోవచ్చు లేదా నోరు మూసినప్పుడు అది కుదురుగా ఉండకపోవచ్చు ముఖం తీరుగా లేకపోవడం, ఉండాల్సినంత అందంగా ఉండకపోవడం, కొరికినప్పుడు సౌకర్యం కొరవడటం దేనినైనా కొరికినప్పుడు అది చక్కగా కొరుకుడు పడకపోవడం.
నిర్ధారణ: కొన్ని రొటీన్ పరీక్షలు డెంటల్ ఎక్స్-రే కొన్ని ప్రక్రియలతో సమస్యను గుర్తిస్తారు.
చికిత్స: చాలామంది పిల్లల్లో చికిత్స అవసరం లేకపోవచ్చు. అయితే ఒకవేళ మీ చిన్నారుల పలువరస చక్కగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య తీవ్రత ఆధారంగా ఆర్థో డాంటిస్ట్/పీడో డాంటిస్ట్ చికిత్సను సూచించవచ్చు. అప్పుడు వారు సూచించే చికిత్సల్లో కొన్ని ఇవి...
పళ్లకు బ్రేసెస్ వేయడం (తీగ కట్టడం) ద్వారా పలువరసను చక్కదిద్దడంఒకేచోట గుంపుగా వచ్చిన చోట అదనపు పళ్లను తొలగించడం దవడ మీద ఉండాల్సినంత చోటు లేకపోయినా, అదనంగా ఉన్నా దాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేయడం. అంటే రీ-షేప్ చేయడం.దవడ ఎముకను స్థిరంగా ఉంచడానికి వైర్లు కానీ, ప్లేట్లు కానీ అమర్చడంపలువరసను చక్కగా చేయడానికి వైర్లు, ప్లాస్టిక్‌తో చేసిన కొన్ని ఉపకరణాలను వాడతారు. అయితే వీటిలో అవసరం పూర్తయిన తర్వాత తొలగించడానికి వీలైనవి (రిమూవబుల్) కూడా ఉంటాయి. అయితే పై, కింది వరసలకు ఒకసారి వీటిని వాడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఎప్పటికీ అలాగే వదిలేసేవి (ఫిక్స్‌డ్) కూడా ఉంటాయి. వాటి విషయంలో నోటి పరిశుభ్రత సరిగా పాటించడం, పళ్లలో ఏదీ ఇరుక్కోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంత వ్యవధి కావాలి?
పలువరసను చక్కదిద్దడానికి ఉపయోగించి ఉపకరణాలను ఎంత వ్యవధి పాటు నోటిలో ఉంచాలన్నది, సమస్య తీవ్రత ఆధారంగా డెంటిస్ట్ నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో దీన్ని దశల వారీగా చేస్తుంటారు. అది ఆయా పిల్లల వయసు, ఎదుగుదల, వారి పలువరస తీరు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
పలువరస దెబ్బతినకుండా నివారించడం ఎలా?
కొన్ని సందర్భాల్లో పలువరస చక్కగా లేకపోవడం అన్నది జన్యుపరమైతే దాని నివారణ సాధ్యం కాకపోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఈ కింది మార్గాల ద్వారా పలువరస దెబ్బ తినకుండా నివారించవచ్చు. పిల్లలు ఏడవకుండా ఉండటానికి ఉపయోగించే తేనె పీకను అదేపనిగా వాడకూడదు.పిల్లలకు చాలాకాలం పాల పీకతోనే పాలు పట్టకూడదు. ఒక వయసు వచ్చాక మామూలుగానే పాలు తాగించాలి. స్పేస్ మెయింటెనర్స్: శాశ్వత దంతాలు వచ్చే ముందర స్పేస్ మెయింటెనర్స్ అనే గైడింగ్ ఉపకరణాలతో అవి సరైన స్థలంలో వచ్చేలా చేస్తారు. పక్కన ఉండే దంతం దూరంగా రాకుండా అది తగిన స్థలంలో వచ్చేలా చేయడానికి సైతం దోహదపడతాయి. దాంతో ఒకేచోట పళ్లు గుంపుగా రాకుండా ఉండటం సైతం సాధ్యపడుతుంది.
గెడైడ్ ఎరప్షన్: పిల్లలకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే ముందు పళ్లు (అంటే శాశ్వత దంతాలు) ఒక వరసలో చక్కగా వచ్చేందుకు గెడైడ్ ఎరప్షన్ అనే మార్గం ద్వారా మిగతా పలువరస అంతా చక్కగా ఉండేలా చేయవచ్చు.
త్వరగా పీకడం: పన్ను మీద పన్ను వచ్చిన సందర్భాల్లో దాన్ని చాలాకాలం పాటు కొనసాగనివ్వకుండా చాలా త్వరగా పీకేయడం వల్ల శాశ్వత దంతాలను వాటి వాటి స్థలంలో వచ్చేలా చేయవచ్చు.
నోట్లో వేలు పెట్టుకొని చప్పరించే అలవాటును త్వరగా మాన్పించడం అవసరం. ఇది అదేపనిగా కొనసాగితే పై దవడ ముందుకు సాగినట్లుగా, ఎక్కువగా పెరుగుతుంది. దాంతో ఏదైనా కొరకాల్సి వచ్చినప్పుడు అవసరమైన చోటకాకుండా పై దవడ కొరుకుడు చాలా దూరంగా పడవచ్చు.
చికిత్స త్వరగా జరగడం ఎందుకు అవసరమంటే...
ఏదైనా ప్రమాదం జరిగితే ముందు పళ్లకు వెంటనే దెబ్బతినకుండా చూడటానికి నోటి పరిశుభ్రతను చాలాకాలం వరకు కొనసాగేలా చేయడానికి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా కాపాడటానికి స్నేహితులు చులకనగా చూడకుండా చేయడానికి శాశ్వత దంతాలు వాటి వాటి స్థానాల్లోనే వచ్చేలా చేయడానికి... త్వరగా చికిత్స చేయడం అవసరం.
పలువరస చక్కగా లేకపోవడానికి కారణాలు
ఇది చాలా మందిలో వంశపారంపర్యంగా కనిపించే విషయం. దాంతో పాటు చాలా ఇతర అంశాలూ పలువరస సరిగా లేకపోవడానికి కారణమవుతాయి. వాటిలో ప్రధానమైనవి... గ్రహణం మొర్రి, అంగిలి చక్కగా లేకపోవడం పిల్లలు ప్రశాంతంగా ఉండటానికి తేనె పీక పెడుతూ ఉండటం (మూడేళ్ల కంటే తక్కువ వయసు పిల్లల్లో) చాలా కాలం పాటు పాలసీసాతోనే పాలు పట్టడం బొటనవేలు చీకుతుండటం ఏవైనా గాయాల కారణంగా దవడకు దెబ్బ తగలడం / గాయంకావడం నోట్లో పుండ్లు, గడ్డలు ఆయా పళ్లు ఉండాల్సిన రీతిలో పళ్ల ఆకృతి లేకపోవడం నోటి పరిశుభ్రత చక్కగా పాటించకపోవడం అలర్జీ, అడినాయిడ్, టాన్సిల్స్ వంటి సమస్యల కారణంగా నోటి ద్వారా గాలి పీల్చుకోవడం.
డాక్టర్ ఎం. ప్రత్యూష
కన్సల్టెంట్ డెంటల్ అండ్ కాస్మటిక్ సర్జన్
స్పెషలిస్ట్ ఇన్ డెంటల్ లేజర్స్, ఓరల్ క్యాన్సర్స్ అండ్ ట్రామాకేర్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
చెడు అలవాట్లు తగ్గించడానికి కొన్ని ఉపకరణాలు
బ్లూ గ్రాస్ అప్లయన్స్: వేలు చప్పరించే అలవాటును మాన్పించడానికి ఉపకరణం ఇది. పేషెంట్‌కు కూడా అసౌకర్యం కలిగించదు. అయితే తమకు తెలియకుండానే వేలు నోట్లో పెట్టుకోబోతుంటే అలా పెట్టుకోకూడదంటూ గుర్తు చేస్తుంది.
హ్యాబిట్ క్రిబ్: వేలు చప్పరించడంతో పాటు నాలుకతో పలువరసను తట్టే అలవాటును మానేలా చేస్తుంది. బ్లూ గ్రాస్ కేవలం వేలు చప్పరించబోతే గుర్తు చేస్తుంది కానీ ఇది మాత్రం అలా వేలును పెట్టుకోనివ్వకుండా చేస్తుంది.
హైరేక్: నోట్లో వేలు పెట్టుకోగానే మరింత అసౌకర్యం కలిగించడం ద్వారా వేలు చప్పరించే అలవాటును మాన్పిస్తుంది.
లిప్ బంపర్: వేలు చప్పరించే అలవాటుతో పాటు కింది పెదవిని కొరుక్కునే దురలవాటును మాన్పిస్తుంది.
మయో ఫంక్షనల్ బీడ్: నాలుకను ముందుకు తోసే అలవాటును మానేలా చేస్తుంది. అయితే ఇందులోని పూస వంటి భాగాన్ని నాలుకతో రోజులో కనీసం రెండు గంటల పాటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు నాలుక ఉండాల్సిన పోశ్చర్ సరి అవుతుంది.
ఫిక్స్‌డ్ ఎక్స్‌పాండర్ విత్ లూప్స్: దీనితో వేలు చప్పరించడం వంటి అలవాటు మానిపోవడంతో పాటు నాలుకకు తగినంత చోటు దొరికేలా చేస్తుంది. అంతేగాక నాలుక సరిగా పనిచేసేలా చేస్తుంది.
రిమూవబుల్ హ్యాబిట్ అప్లయన్స్: ఇది నోట్లో పెట్టుకోవడంతో పాటు మనకు మనమే బయటకు తీయడానికి (రిమూవబుల్) వీలైన ఉపకరణం. పిల్లలు నిద్రపోయే టైమ్‌లో దీన్ని అమర్చుతారు. దీనివల్ల నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మానిపోవడంతో పాటు నిద్రలో నాలుక కొరుక్కునే అలవాటు తగ్గుతుంది.
ఓరల్ స్క్రీన్స్: పలచటి రబ్బర్‌తో చేసిన పొర ఇది. దీన్ని నోట్లో అమర్చుతారు.
బ్రేసెస్: ఇప్పటి వరకు పేర్కొన్నవే కాక పలువరసను నేరుగా చక్కదిద్దడానికి బ్రేసెస్ అమర్చుతారు. వీటిలో మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్ అనే చాలా రకాలు ఉంటాయి.
ఇక ఇలాంటి బ్రేసెస్ ఉపయోగించడానికి అంత సుముఖంగా లేని వారికి బయటకు కనిపించని ఇన్విసిబుల్ బ్రేసెస్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. క్లియర్ అలైనర్స్, పళ్ల వెనక కనపడకుండా అమర్చే లింగ్యువలల్ బ్రేసెస్ కూడా అందుబాటులో ఉంటాయి.మెటల్ బ్రేసెస్‌లాగే కనిపించే డామన్ బ్రేసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మెటల్ బ్రేసెస్ వంటి వాటి వల్ల చాలాకాలం తర్వాత కనిపించే ఫలితాలు డామన్ బ్రేసెస్ వల్ల త్వరితంగా కనిపిస్తాయి. ఇలా పిల్లల్లో పలువరసను చక్కబరచడానికి అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.
టాగ్లు: పళ్లు, చికిత్స, డెంటల్ ఎక్స్-రే, Teeth, Treatment, Dental X-ray
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565