MohanPublications Print Books Online store clik Here Devullu.com

ముగ్గులు, Muggulu, Rangoli, Kolamsముగ్గులు
Muggulu, Rangoli, Kolams

...అందుకే ముగ్గేయమంటోంది సంక్రాంతి!

మన జీవితం ఎంతగా నగరమయమైనా.. సంక్రాంతి మాత్రం తన సంప్రదాయాన్ని ఎంతోకొంత నిలుపుకొంటూనే ఉంది. దాన్నలా నిలుపుతున్న ఘనత మహిళలదే! పరికిణీ ఓణీ రెపరెపలూ, హరివిల్లు వర్ణాల ముగ్గులు లేనిదే సంక్రాంతికి అందమెక్కడిది? దుస్తులపై మక్కువలో ఎప్పుడూ ఎక్కువతక్కువలుంటాయి. మారుతుంటాయి. కానీ ముగ్గులపై మొగ్గు ఎన్ని తరాలైనా చెక్కు చెదరడంలేదు. ఇప్పుడే కాదు అనాదికాలం నుంచి వాటిని తెలుగు స్త్రీలు ఎంతగా కాపాడుకుంటూ వస్తున్నారో, ఒకప్పుడు జీవితంతో వాటిని ఎంత వైవిధ్యంగా మేళవించారో ఓ పెద్ద పరిశోధనే చేశారు రావి ప్రేమలత! మన ముగ్గులపై ఆమె రాసిన ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ పుస్తకం.. తెలుగులో అపూర్వమైందే కాదు అపురూపమైంది కూడా! సంక్రాంతి సందర్భంగా ఆ పరిశోధనా అనుభవాలని వసుంధరతో ప్రత్యేకంగా పంచుకున్నారామె.. 
మాది భువనగిరి దగ్గర ఓ చిన్నపల్లెటూరు. అందరి పిల్లల్లాగే అమ్మ, పిన్నీ, అత్తయ్యలు ముగ్గులు వేయడం చూస్తూ పెరిగినదాన్ని. పెద్దయ్యాక కూడా ఆ ముగ్గులపై అంతగా దృష్టిపోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న రామాచంద్ర కాలేజీలో అధ్యాపకురాలిగా ఉండేదాన్ని. 1990లలో దాదాపు జీవితం నగరానికే పరిమితమయ్యాక.. ఒక్కసారిగా నా దృష్టి ముగ్గులపై పడింది. పరిశోధకురాలిని కాబట్టి వాటి ఆవిర్భావం, విభిన్నతపై దృష్టిపెట్టాను. తెలంగాణా, ఆంధ్రాప్రాంతాల్లో విరివిగా పర్యటించాను. హైదరాబాద్‌లోని ఇతర దక్షిణాదివారూ, మరాఠీలూ, బెంగాలీల ముగ్గులనీ చూసే అవకాశం వచ్చింది. ఆరునెలల నా పరిశీలనలనే పుస్తకంగా రాశాను! 
ఎన్నెన్ని విచిత్రాలో.. 
ఇప్పుడైతే మనకి క్యాలెండర్‌లూ, గడియారాలు వచ్చాయి. అవన్నీ లేని సమయంలో స్త్రీలు వేసే ఈ ముగ్గులే కాలసూచికగా ఉండేవి! మన తెలుగుప్రాంతంలో వారంలో ఏడురోజులకి ఏడురకాల ముగ్గులుండేవి. పూజాగదిలో వాటిని చూసే ఇంట్లోని మగవారు.. వారాలని గుర్తుపెట్టుకునేవారట. అంతేకాదు.. ప్రతిరోజూ సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రాన్ని సూచించేలా కూడా వీటిని వేపేవారు. సూర్యోదయాన్ని సూచిస్తూ ఉదయం వేళ పొడవాటి ముగ్గునే వేసేవారు. దానిపై పడే సూర్యుడి నీడని బట్టి సమయంపై అంచనాకి వచ్చేవారు. సాయంత్రం వేళ సూర్యుడు చిన్నబోతాడు గనుక చిన్నముగ్గు వేసేవారు. నిజానికి.. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్త్రీలు ప్రతిముగ్గులోనూ సూర్యుడికి ఏదోరకంగా ప్రాతినిధ్యం కల్పిస్తూనే ఉన్నారు. మనం వేసే పద్మం, స్వస్తిక్‌ ఆకారాలు ఆయనకి సూచనలే. వాటన్నింటికీ పరాకాష్ట సంక్రాంతికి వేసే రథం ముగ్గు. సూర్యుడి రాక, పోకని సూచించే చిత్రలిపి వైభవం ఇది. ఆ తర్వాత మన స్త్రీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది చంద్రుడికి! చంద్ర కాంత హెచ్చుతగ్గుల్ని సూచించే అన్ని ముగ్గులూ మనకున్నాయి.. ఒక్క అమావాస్యకి తప్ప! తర్వాత శివుడూ.. మన తెలుగమ్మాయిల ముగ్గుల్లో పాము రూపంలో కనిపిస్తుంటాడు. ఇక వృత్తిపరమైన ముగ్గుల్లో ప్రధాన పాత్ర వ్యవసాయానిదే. గుమ్మడిపువ్వు, చెరకుగడల ద్వారా ముగ్గుల్లో వ్యవసాయం ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. 
సుఖప్రసవానికీ.. 
కాలాలకి సంబంధించిన విషయాలకే కాదు.. ఇంట్లోని సుఖదుఃఖాలనీ ముగ్గులతో సూచించారు మనవాళ్లు. ఇంట్లో ఉన్న గర్భవతికి సుఖప్రసవం కావాలని పద్మవ్యూహం ముగ్గు వేస్తారు. అంటే అభిమన్యుడికి సూచనగానన్నమాట! పద్మవ్యూహంలాంటి కాన్పు దశ దాటుకుని.. బిడ్డ అభిమన్యుడిలా కాకుండా బయటకు రావాలనే కోరిక అది. దుష్టశక్తులని పారదోలే బ్రహ్మముడి ముగ్గులూ మనకున్నాయి. మా చిన్నప్పటి దాకా కూడా తేళ్ల ముగ్గులు వేసేవారు. ఎందుకండీ అంటే.. ఇంట్లో కష్టాలు తీరడానికని చెప్పేవారు! చదరంగం ముగ్గులూ, తాడాట ముగ్గులూ మామూలుగా కనిపించేవి. ఇవన్నీ ఒకెత్తయితే యోగశాస్త్ర, వాస్తుశాస్త్ర ముగ్గులు మరొక ఎత్తు. వాటి వెనక ఎంతో గణితం ఉండేది! కానీ అక్షరాలు కూడా నేర్వని ఆడవాళ్లు అలవోకగా దాన్ని వేయడం చూస్తే.. ‘ఔరా’ అనిపిస్తాయి! నిజానికి.. యజ్ఞవాటికల ముందు వేసే మండల గుర్తులే ఇలా ముగ్గులుగా మారి ఉంటాయనీ ఓ వాదన ఉంది. ఇంటి శుభ్రత, సంక్షేమం బాధ్యత స్త్రీలదే కాబట్టి వాళ్లే దాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి! అవే చుక్కల ముగ్గులుగా, ముత్యాల ముగ్గులుగా, గీతలుగా మారాయి.
- జె. రాజు 

ఉన్న ప్రాంతాన్నిబట్టే..

మీరో విషయం గమనించారో లేదో! మహారాష్ట్ర వాళ్ల ముగ్గులు ఎక్కువగా జ్యామెట్రికల్‌గా ఉంటాయి. బెంగాల్‌వాళ్లవి అలల్లా కనిపిస్తాయి. కారణమేంటీ? మహరాష్ట్ర ప్రాంతంలో కొండలెక్కువ కాబట్టి ముగ్గులూ వాటినే ప్రతిరూపాలుగా మార్చుకున్నాయి. బెంగాల్‌లో సుదూరం వరకూ సముద్రం కదా! అందుకే ఆ అలలు. మన దక్షిణాది ప్రాంతంలో ఇవి రెండూ ఉంటాయి.

రోజూ వేయండి..!

మీకో విషయం తెలుసా? పాశ్చాత్యదేశాల్లో స్త్రీలు, పురుషులనే తేడాలేకుండా ముగ్గులు వేస్తున్నారిప్పుడు! కాకపోతే నేలపై కాదు.. పుస్తకాల్లో. ఇలాంటి ముగ్గులు ఏకాగ్రతతో వేయడంవల్ల ఎంతో మానసిక ప్రశాంతి ఉందని వాటిని సిఫారసు చేస్తున్నారు అక్కడి మానసిక శాస్త్రవేత్తలు. మానసిక నిపుణులకి ఆదిగురువుల్లో ఒకరైన సీజీ యుంగ్‌ చేసిన సూచన ఇది! ఎవరీ యుంగ్‌? ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ శిష్యుడు. మన దేశంలోని పతంజలి యోగ సూత్రాలపై దృష్టిసారించినవాడు. అప్పుడే ఆయనకి చైనా, భారతదేశాల్లోని ‘మండలాల’ గురించి తెలిసింది. మన పూజల్లో వాడే యంత్రాలూ, రేఖలు ఇవన్నీ కూడా మండలాలకిందే వస్తాయి. విశ్వ స్వరూపమైన బ్రహ్మని.. ఇలా మండలాలుగా మార్చుకుని భారతీయులు దాన్ని తమ అచేతనలోకి(సబ్‌కాన్షియస్‌) తీసుకెళ్తున్నారని ప్రపంచానికి తొలిసారి చెప్పింది సీజీ యుంగే! ఆయన శిష్యప్రశిష్యులు ఆ మండలాలపై చాలా పరిశోధన చేసి.. ఇప్పుడు మానసిక ప్రశాంతతకి వాటినే గీయాలని సిఫారసు చేస్తున్నారు. ఈ సంక్రాంతి నుంచి రోజూ ఏదోరకం ముగ్గు వేసి చూడండి.. అదే ఓ ధ్యానంలా మారుతుంది!!
radham

muggulu kolam rangoli sankrathi


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం