MohanPublications Print Books Online store clik Here Devullu.com

తిరుప్పావై_విశిష్ట మాసం... ధనుర్మాసం!_Tiruppavai


తిరుప్పావై_Tiruppavai


విశిష్ట మాసం... ధనుర్మాసం!


      తెలుగు లోగిళ్లు పండగవాతావరణాన్ని సంతరించుకునే మాసం, పల్లె పడుచులు హరివిల్లును భువికి తెచ్చే మాసం, ఆండాళ్లమ్మ భక్తికి మెచ్చి రంగనాథుడే దిగివచ్చిన మాసం, తిరుప్పావై సంకీర్తనలూ హరిదాసుల గానాలు ప్రతిధ్వనించే మాసం... ఇలా ఎన్నో మరెన్నో విశిష్టతలను సొంతంచేసుకున్న మాసం ధనుర్మాసం. ‘ధనుః’ అంటే దేనికోసం ప్రార్థిస్తున్నామో అది లభిస్తుందని అర్థం. అందుకే దీన్ని దివ్య ప్రార్థనలకు అనువైన మాసంగా పేర్కొంటారు.

    సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ‘మాసాలలో మార్గశిరం నేను’ అన్న కృష్ణపరమాత్ముడికి అదే నెలలో ప్రారంభమైన ధనుర్మాసమన్నా ఎనలేని ప్రీతి. ప్రతి వైష్ణవాలయంలోనూ ప్రాతఃకాలం నుంచే తిరుప్పావై సంకీర్తనలూ విష్ణునామ పారాయణలూ అర్చనలూ అభిషేకాలూ ప్రారంభమైపోతాయి. ద్రావిడ భాషలో ‘తిరు’ అంటే పవిత్రమైన, ‘పావై’ అంటే వ్రతమని అర్థం. అంటే ధనుర్మాసంలో నిర్వహించే వ్రతం అతి పవిత్రమైందని భావం. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో విష్ణునామ సంకీర్తననే నోముగా భావిస్తారు. గోదాదేవి పాడుకున్న ముప్ఫై పాశురాల్నీ రొజుకొక్కటి చొప్పున గానం చేస్తారు. బ్రాహ్మి ముహూర్తంలో తిరుప్పావై పారాయణచేసిన వారికి ముక్తి కలుగుతుందని గోదాదేవి చరిత్ర స్పష్టంచేస్తోంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో తులసి మొక్కల మధ్య అయోనిజగా గోదాదేవి దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే పరమభక్తుడు ఆమెను పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుని పరమ భక్తురాలు. ఆయనే తన సర్వస్వమని భావించింది. ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించింది. స్వామిని పొందడం కోసమే ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. ముప్ఫైరోజులూ ముప్ఫై పాశురాలతో కీర్తించింది. శ్రీరంగనాథునికి అలంకరించడానికి రంగురంగుపూలతో అందమైన దండల్ని సిద్ధం చేసేది. వాటిని తానే అలంకరించుకునేది. తన అందచందాలను చూసుకుని శ్రీరంగనాథునికి తానే సరిజోడని మురిసిపోయేది. ఓసారి విష్ణుచిత్తుడు పూదండల్లో తలవెంట్రుకని చూశాడు. అది గోదాదేవిదేనని గ్రహించిన ఆయనకి సమస్తం అర్థమైపోయింది. ‘మహాపరాధం జరిగిపోయింది స్వామీ మమ్మల్ని క్షమించ’మంటూ అనేకవిధాలుగా వేడుకున్నాడు. ‘స్వామి నిర్మాల్యాన్ని స్వీకరించడం వరకే మనకు అర్హత. అంతేకానీ, మనం ధరించిన వాటితో రంగనాథుని అర్చించడం మహాపరాధం’ అంటూ కూమార్తెను మందలించాడు. అయినా గోదాదేవి పట్టువీడలేదు. పరమాత్మునికి పట్టపురాణిని అవుతానని ప్రతినబూనింది. విష్ణుచిత్తుడికి ఇదంతా మాయలా తోచింది. ఒకనాటి కలలో ఆ దేవాధిదేవుడే సాక్షాత్కరించి గోదాదేవితో తన కళ్యాణానికి ఆనతినిచ్చేవరకూ ఆ మాయవీడలేదు విష్ణుచిత్తుడికి. ఇంకేముంది, తండ్రి అనుమతితో ఆండాళమ్మ రంగనాథస్వామిలో ఐక్యమైపోయింది.


రంగురంగుల ముంగిళ్లు... 
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుంచీ భోగి పండగ వరకూ ఉన్న కాలాన్ని తెలుగువారు నెలగంటగా అభివర్ణిస్తారు. ఈ నెలరోజులూ పడుచులు తమ ముంగిలిలో ఆవుపేడను కళ్లాపి చల్లి, అందమైన ముగ్గులు వేస్తారు. వాటి మధ్యలో పేడతో గొబ్బెమ్మలను తయారుచేసి, పసుపూకుంకుమలతో రంగురంగుల పూలతో అలంకరించి, పూజించడం పూర్వం నుంచీ వస్తున్న సంప్రదాయం. అంతేకాదు, పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఈ ధనుర్మాసమంతా లోగిళ్లను ముగ్గులతో నింపడం వల్ల కోరిన వరుడు వస్తాడంటారు.

కాత్యాయనీ వ్రతం 
ధనుర్మాస ప్రశస్తిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే నారదమహర్షికి తెలియజేశాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లోనూ నారాయణ, భాగవత సంహితల్లోనూ కనిపిస్తాయి. రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లే, గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కీర్తించి ఆయననే పెండ్లాడుతుంది. ఇంతటి మహిమ ఉన్న వ్రతాన్ని పెళ్లికాని యువతులు నేటికీ ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని చెయ్యాలనుకునేవారు తెల్లవారుజామునే నిద్రలేచి, తలారా స్నానంచేసి స్వామిని భక్తితో అర్చించాలి. ఆ జగన్నాటక సూత్రధారిని ధనుర్మాసంలో మధుసూదనుడిగా పేరుతో కొలిచి, తొలి పదిహేను రోజులూ చక్కెరపొంగలిని సమర్పించాలి. తర్వాతి పదిహేను రోజులూ దద్ధ్యోదనాన్ని నివేదించాలి. విష్ణుపురాణాన్ని పఠించడం, వైష్ణవాలయాలను సందర్శించడం ద్వారా విశేష ఫలితం లభిస్తుందంటారు.

ఆలయాల్లో... 
ధనుర్మాసంలో వైష్ణవాలయాలు ఆధ్యాత్మికశోభతో వెలిగిపోతూ ఉంటాయి. నలుదిక్కులా విష్ణుసహస్రనామ పారాయణాలూ, తిరుప్పావై సంకీర్తనలూ, గీతా ప్రవచనాలూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం నెలరోజులూ ‘కౌసల్యా సుప్రజారామ...’ అనే మేలుకొలుపు స్థానంలో గోదాదేవి విరచిత తిరుప్పావై వీనులకు విందుచేస్తుంది... ధనుర్మాస ప్రాశస్త్యమంతా భక్త విజయమేనని తెలపడానికి గుర్తుగా!

#దివ్యవ్రతం 

    భగవంతుడితో సాహచర్యం ఓ మధురానుభూతి. సఖ్యమే ఆత్మ నివేదనమని భాగవతం చెబుతుంది. దేవదేవుడితో భక్తహృదయాల చెలిమి దివ్యమైన వూహలకు హేతువుగా మారుతుంది. ఆ అనుభవాల్ని రామాయణంలో హనుమంతుడు, లక్ష్మణుడు; భారత భాగవతాల్లో అర్జునుడు, సుదాముడు సొంతం చేసుకున్నారు. గోప గోపికలు కృష్ణభగవానుడి సాన్నిహిత్యంలో ఓలలాడారు. అలాంటి శుద్ధ భక్తికి ఆద్యులైనవారి జాబితాలో ఆళ్వార్లు ఉన్నారు.

    ఆళ్వార్లలోని భక్తి, స్మరణ, సృజన ఎంతో అపురూపమైనవి. కీర్తనలతో నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, త్యాగయ్య వంటివారు చరితార్థులయ్యారు. పన్నెండుమంది ఆళ్వార్లలోనూ భక్తి అత్యంత ఉన్నతస్థాయిలో ఉండేది. వారిలో కృష్ణానురక్తి అధికం. పాశురాలతో స్వామిని ఆరాధించి, భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. కుల వ్యవస్థను తోసిపుచ్చడం ఆ జీవితాల్లోని ముఖ్యమైన అంశం.

ఆళ్వార్లు జ్ఞాన నిధులు. వారిని కృష్ణదేవరాయలు ఎంతగానో ప్రస్తుతించేవారు. పన్నెండుమంది ఆళ్వార్లలోనూ ఏకైక మహిళామణి ఆండాళ్‌. ఆమెను ‘గోదాదేవి’ అని పిలిచేవారు. జీవులకు మోక్షమార్గం ఉపదేశించడానికి అవతరించాలని దేవేరుల్ని విష్ణువు కోరతాడు. ఫలితంగా భూదేవి గోదాదేవిగా రూపు ధరించిందంటారు.

విష్ణుచిత్తుడికి పూలతోటలో లభించిన తనయ గోదాదేవి. అల్లారుముద్దుగా పెరిగింది. తమిళనాట గల శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్ర శాయి కోవెలలో అర్చకుడాయన. అంతకుమించి, అపార భక్తితత్పరుడు. అవే శ్రద్ధాసక్తులు గోదాదేవిలోనూ ప్రస్ఫుటమయ్యేవి. కాలక్రమంలో విష్ణుభక్తి అధికమైంది. మిగతా పదకొండు మంది ఆళ్వార్లు విష్ణువును, ఆయన అంశను తండ్రిగా భావించుకొని తరించారు.

గోదాదేవిలోని స్త్రీ సహజమైన ప్రేమతత్వం దైవాన్నే ప్రాణనాథుడిగా భావించింది. ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేసి కృష్ణప్రేమ పొందారని తెలుసుకొంది. తానూ అదే రీతిలో మాధవుణ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. ఆమె సౌందర్యం వర్ణనాతీతం.

నాథముని విరచిత దివ్య ప్రబంధం గోదాదేవి గురించి వర్ణించింది. ఆమె పూలదండలతో పాటు తులసిమాలల్ని అల్లి, శ్రీవిల్లిపుత్తూరులోని స్వామికి సమర్పించేది. ఆ దైవాన్నే తన భర్తగా భావించేది. దండల్ని ఆయనకు సమర్పించే ముందు తానే ధరించేది. ఆ తరవాత వాటిని దైవానికి కైంకర్యం చేసేది. తాను గోపకన్య అనుకొనేది. వటపత్రశాయిని కృష్ణుడిగా తలచి వలపు మాలలు అల్లుకొనేది.


ధనుర్మాసం (ధనుస్సంక్రమణం) ప్రారంభం కాగానే, గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రారంభించింది. రోజూ వేకువజామున మార్గశీర్ష స్నానం చేయడం ఆ వ్రతంలోని ముఖ్య ఘట్టం. కీర్తనల్ని గానం చేస్తూ చెలుల్ని నిద్రలేపేది. వాటిని ‘పాశురాలు’ అంటారు. ఉపనిషత్తుల సారంగానూ భావిస్తారు.


గోదాదేవి రోజుకొక్క పాశురాన్ని గానం చేసేది. దైవాన్ని వర్ణించేది.‘అవ్యక్తోపనిషత్తు’లోని దేవ రహస్యాలన్నీ ఆ పాశురాల్లో వ్యక్తమయ్యేవి. పదకొండు నుంచి ఇరవై ఆరో పాశురం వరకు ఆమె గానం చేసిన ప్రబంధ సారమంతా ఈశావాస్యోపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తుల భావమేనని ప్రతీతి. ముప్ఫయ్యో పాశురం ఫలశ్రుతి. ఆ పాశురాలన్నీ భగవంతుణ్ని చేరడానికి అనువైన మార్గాలని భక్తులు భావిస్తారు. ధనుర్మాసంలోని పలు ఆలయాల్లో గోదాదేవి విరచిత పాశురాలే వీనులకు విందు చేస్తూ వినపడుతుంటాయి. అవన్నీ భక్తులందరూ ఆస్వాదించి తీరాల్సిన మకరంద మధురిమలు! - అప్పరుసు రమాకాంతరావు
తిరుప్పావై_Tiruppavaiతిరుప్పావై_Tiruppavai

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం