Tea టీ
టీ అనేదే లేకపోతే మానవ జీవితంలో వెరైటీ ఉండేది కాదేమో! తేనీటి మహిమ ఎరుగని పాడుకాలంలో పాపం అప్పటి మనుషులంతా ఎలా బతికేవారో ఏమో! భగవంతుడి దయవల్ల మనకు అలాంటి ఇబ్బందేమీ లేదు. ఒకరకంగా మనం అదృష్టవంతులం కూడా! తేయాకు ఉత్పత్తిలో మనది ప్రపంచంలోనే ద్వితీయస్థానం. తేయాకు ఉనికి కనుగొన్న చైనా ఒక్కటే ఈ విషయంలో మనకంటే ముందంజలో ఉంది. మన జనాభాలో అత్యధికులకు అభిమాన పానీయం ఏమి‘టీ’ అంటే నిస్సందేహంగా టీనే అని గణాంకాలే చెబుతున్నాయి. టీని జాతీయ పానీయంగా చేసుకున్న ఘనత మనకే దక్కుతుంది. ప్రపంచంలో నానా రకాల టీలు ఉన్నాయి గానీ, టీకి మసాలా ఘాటును జోడించిన ఘనత కూడా మనకే దక్కుతుంది. ఎంతైనా మనోళ్లు మాస్‘మసాలా’ టైపు కదా! ఇంతకీ ఏమి‘టీ’ సోది అనుకుంటున్నారా? మరేమీ లేదు! ‘టీ’గురించే... కులాసాగా కొన్ని కబుర్లు... కుదిరితే కప్పు టీ!
పురానా జమానాలో... అంటే ఇంచుమించుగా పురాణాలు పుట్టిన జమానాలోనే తేయాకు ఉనికి మనుషులకు తెలిసిందట. చైనాలో ప్రచారంలో ఉన్న పురాగాథల ప్రకారం... అప్పట్లో... అంటే క్రీస్తుపూర్వం 2737 కాలంలో చైనాలో షెనాంగ్ అనే లెజెండ్ ఉండేవాడట. లెజెండ్ అంటే ఏ కథానాయకుడో అనుకుంటే మీరు టీ కెటిల్‌లో కాలేసినట్లే! శ్రీమాన్ షెనాంగ్ ఒక సాదాసీదా రైతు. అయితేనేం? తేయాకు ఉనికిని కనుగొని, దాని మహిమను లోకానికి చాటి చరిత్రను సృష్టించాడు. అంతటి ఘనత సాధించినందుకు ‘లెజెండ్’గా చరిత్రలో నిలిచిపోయాడు. తేయాకు ఘనతను ఆయన ఎలా కనుగొన్నాడంటే... కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం...
ఒకానొక సుదినాన షెనాంగ్ మహాశయుడు ఆరుబయట పొయ్యి మీద నీళ్లు కాచుకుంటూ ఉంటే, అనుకోకుండా అక్కడే ఉన్న ఒక చెట్టు నుంచి కొన్ని ఎండుటాకులు ఆ నీళ్లలో పడ్డాయట. షెనాంగ్ ముఖంలో రంగులు మారాయో లేదో తెలీదు గానీ, నీళ్లు రంగు మారాయి. రంగు మారిన నీళ్లను షెనాయ్ కుతూహలం కొద్దీ రుచి చూశాడట. ఆ రుచికి తన్మయుడై జన్మ ధన్యమైపోయిందనుకున్నాడట. ఆ తర్వాత జరిగిందేమి‘టీ’ అంటారా..? తర్వాత జరిగినదంతా చరిత్రే! చైనా నుంచి తేయాకు నానా దేశాలకు పాకింది. ఏ దేశమేగినా, ఏ నేల మొలిచినా అందరి ఆదరాభిమానాలను పొందగలిగింది. దేశ దేశాలలో తేనీరు ఇంతటి ఆదరాభిమానాలు పొందడం వెనుక మర్మమేమి‘టీ’ అనుకుంటున్నారా..?
రానీయదు చీకాకులు
పోనీయదు ఉత్సాహము, పొగకును తోడౌ
పానీయములెన్ని యున్నను
తేనీటికి సాటిరావు ధరణిని చూడన్!
అని ‘లఘు తుంబురీయం’లోని నూట పద్దెనిమిదో ఆశ్వాసంలో కవివరేణ్యుడు తేనీటి మహిమను కొనియాడాడు కాదేమి‘టీ’! అందుకని తేనీటి అభిమానులారా! ‘టీ’చరులారా! ‘చాయ్’చమత్కారులారా! తేనీటి ఘనసార వైవిధ్యాన్ని, తేయాకు ఘనచరిత్ర వైశిష్ఠ్యాన్ని అవధరించండి.
‘టీ... జీవన కళకు మతం’ అన్నాడు కకుజో ఒకాకురా. తేనీటి మహిమను లోకానికి వెల్లడి చేయడానికి ఈ జపాన్ పెద్దమనిషి ఏకంగా ‘ది బుక్ ఆఫ్ టీ’ అనే ఉద్గ్రంథాన్నే రాసి పారేశాడు. సౌందర్య దృష్టిపైన, కళాసృష్టిపైన తేనీటి ప్రభావాన్ని తన ఉద్గ్రంథంలో వేనోళ్ల ప్రస్తుతించాడు. ఇదివరకటి కాలంలో మన దేశంలోని ఛాందసులు కొందరు టీ తాగే అలవాటును ‘అప్రాచ్యపు అలవాటు’ అని ఈసడించేవారు. టీ మీద వారు మోపిన ‘అప్రాచ్య’ నింద పూర్తిగా నిరాధారమైనది, వాస్తవ దూరమైనది కూడా. తేయాకు పూర్తిగా ప్రాచ్య ప్రపంచపు సొత్తు. పురాగాథలపై నమ్మకం లేని వారు చరిత్రను తరచి చూసినా, తేయాకు ఉనికి తొలిసారిగా కనుగొన్న ఘనత చైనాదే. క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటికే చైనా ప్రజలకు టీ తాగే అలవాటు ఉండేదనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో చైనాను పాలించిన షాంగ్ వంశీయుల హయాంలో తేనీటిని ఔషధ కషాయంలా సేవించేవారు. తేయాకుతో కషాయాన్ని ఏయే పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చునో, ఏయే వ్యాధులకు ఔషధంగా వినియోగించుకోవచ్చునో మూడో శతాబ్ది నాటి చైనా వైద్యుడు హువా తువో తన వైద్యగ్రంథంలో విపులంగా వివరించాడు.
అంతకు ముందు క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో చైనాను పరిపాలించిన హాంగ్ వంశీకుడైన చక్రవర్తి జింగ్, ఆయన పరివారం తేనీరు సేవించేవారనేందుకు ఆధారాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. అప్పటికి తేనీటి మహిమ మిగిలిన ప్రపంచానికి తెలియదు. శతాబ్దాల తరబడి ఈ దివ్యపానీయం చైనాకు మాత్రమే పరిమితమైన దేవరహస్యంగా ఉండేది. అవన్నీ మిగిలిన ప్రపంచానికి చాయ్ ఛాయలైనా సోకని చీకటి శతాబ్దాలు. చరిత్రలో పాశ్చాత్యులు తూర్పు దేశాలను చుట్టి రావాలని ఉబలాటపడి ఉండకపోతే తేనీరు చైనాకే పరిమితమై ఉండిపోయేదేమో! పదహారో శతాబ్దిలో పోర్చుగీసు వర్తకులు నౌకల్లో చైనాకు చేరుకున్నారు. వ్యాపార లావాదేవీల కోసం చైనా కులీన ప్రముఖులను వారు తరచు కలుసుకునేవారు.
తమ వద్దకు వచ్చిన పోర్చుగీసు వర్తకులకు చైనా కులీన ప్రముఖులు తేనీటితో అతిథి మర్యాదలు చేసేవారు. తేయాకును, పోర్చుగీసు వారికి చైనా భాష రాదు. వారు మాట్లాడే భాషలో ఎక్కువగా ‘చ’కార శబ్దాలే వినిపిస్తూ ఉండేవి. అందువల్ల చైనా వారి ద్వారా పరిచయమైన తేనీటికి పోర్చుగీసు వారు ‘చా’ అని పేరు పెట్టుకున్నారు. భారత్‌కు చేరే సరికి అది ‘చాయ్’గా రూపాంతరం చెందింది. చైనాలో కొన్నేళ్లు గడిపిన పోర్చుగీసు వర్తకులు అనతికాలంలోనే ‘చాయ్’దాసులుగా మారారు. డచ్ ఈస్టిండియా కంపెనీ 1607లో తొలిసారిగా తేయాకు బస్తాలను మకావో నుంచి జావాకు ఎగుమతి చేసింది. ఆ రకంగా తేయాకు మొట్టమొదటిసారిగా చైనా భూభాగాన్ని దాటి బాహ్యప్రపంచానికి పరిచయమైంది. డచ్ వారి ద్వారా తేయాకు జర్మనీ, ఫ్రాన్స్ తదితర యూరోపియన్ దేశాలకు, అట్లాంటిక్ మీదుగా అమెరికాకు చేరింది.
ఇంగ్లీషోళ్లూ ఇష్టపడ్డారు
డచ్ వాళ్ల ద్వారా చాయ్ రుచి తెలుసుకున్న వాళ్లలో ఇంగ్లీష్ వర్తకులూ ఉన్నారు. చాయ్ రుచి మీద మోజు పెంచుకున్నారు. తేయాకు వర్తకం ద్వారా లాభాల పంట పండించుకోవచ్చని కలలుగన్నారు. జపాన్‌లోని ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలు చూసుకునే పీటర్ ముండీ మేలిరకం ‘చా’ పంపాలంటూ మకావోని చైనా వర్తకుడు ఒకరికి 1615లో లేఖ రాశాడు. తేయాకు క్రమంగా ఇంగ్లాండ్‌కూ చేరుకుంది. 1660 నాటికి లండన్‌లోని కాఫీ హోటళ్లు తేనీటి విక్రయాలు ప్రారంభించాయి. తేనీటి వాడకంలో తొలి వెరై‘టీ’ సృష్టికర్తలు ఇంగ్లీషోళ్లే! చైనా వాళ్లు, వాళ్ల నుంచి తేనీటి రుచి మరిగిన డచ్ వాళ్లు, డచ్ వాళ్ల నుంచి దీనిని తెలుసుకున్న ఇతరేతర యూరోపియన్లు అప్పటి వరకు తేయాకు కషాయాన్ని నేరుగానే తాగేవారు. ‘ద డికాక్షన్ ఈజ్ టూ బిట్టర్ యూ నో’ అనుకున్నారేమో ఇంగ్లీషోళ్లు. దీని రుచిని మెరుగుపరచడానికి నానా ప్రయత్నాలు, ప్రయోగాలు చేశారు. చివరకు పాలు, పంచదార జోడించి వాడటం మొదలుపెట్టారు. పాలు, పంచదార కలిపి వేడివేడి టీ రుచి చూశాక ‘అద్భుతః’ అనుకున్నారు. కొత్త రుచి జతపడటమే తరువాయిగా టీ ఇంగ్లీషు వాళ్లకు అభిమాన పానీయంగా మారింది. ఇంగ్లిష్ వాళ్ల పుణ్యాన తేయాకు ఆనాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతటికీ విస్తరించింది. పంతొమ్మిదో శతాబ్ది ప్రారంభంలోనే బ్రిటిష్ దొరల ద్వారా తేనీటి రుచి భారతీయులకూ పరిచయమైంది. అందువల్లనే టీ తయారీలో పాలు, పంచదార కలపడం మన దేశంలో అలవాటుగా మారింది.
డచ్ వర్తకులు చైనా నుంచి తేయాకును దేశ దేశాలకు ఎగుమతులు సాగిస్తూ లాభాలు దండుకునే కాలంలో ఇంగ్లీషోళ్లు కొంచెం వెరై‘టీ’గా ఆలోచించారు. తేయాకు వర్తకంలో చైనా గుత్తాధిపత్యానికి తెరదించితే తప్ప లాభం లేదనుకున్నారు. రవి అస్తమించని తమ సువిశాల బ్రిటిష్ సామ్రాజ్యంలో తేయాకు సాగుకు అనువైన ప్రదేశాలను అన్వేషించారు. భారత భూభాగంలోని అస్సాం, డార్జిలింగ్, నీలగిరి వంటి ప్రాంతాలు తేయాకు తోటల పెంపకానికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని గ్రహించారు. అంతకు ముందు చైనా గుత్తాధిపత్యం సాగే కాలంలో తేయాకు స్మగ్లింగ్ సాగేది. స్మగ్లింగ్‌ను అరికట్టడం సాధ్యం కాకపోవడంతో చైనా నుంచి దిగుమతి అవుతున్న తేయాకుపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను ఎత్తేసింది. అక్కడితో స్మగ్లింగ్ బెడద తప్పింది కానీ, తేయాకు వర్తకంలో చైనా గుత్తాధిపత్యం మాత్రం యథాతథంగానే కొనసాగింది.
ఈ పరిస్థితిని అధిగమించాలనే లక్ష్యంతో అర్థర్ కాంప్‌బెల్ అనే బ్రిటిష్ దొర 1840లో చైనా నుంచి తేయాకు విత్తనాలను భారత్‌కు తెప్పించాడు. తొలిసారిగా డార్జిలింగ్‌లో తేయాకు మొక్కల పెంపకం చేపట్టాడు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో 1856లో డార్జిలింగ్‌లో అలుబరి టీ గార్డెన్ ప్రారంభించాడు. ఈలోగా అస్సాం ప్రాంతంలో చైనా తేయాకుకు భిన్నమైన మరోరకం తేయాకు మొక్కలు సహజంగానే పెరుగుతుండటాన్ని బ్రిటిష్ దొరలు గమనించారు. వాటి ఆకులతో కాచిన తేనీరు మరింత రుచిగా ఉండటంతో సంబరపడ్డారు. ఎగుమతుల కోసం తేయాకు సాగుకు సిద్ధపడ్డ యూరోపియన్లకు అస్సాం ప్రాంతంలో ఉదారంగా భూములను ధారాదత్తం చేశారు. అలా అస్సాం టీ ఘుమఘుమలు అంతర్జాతీయ మార్కెట్‌కు వ్యాపించాయి. పంతొమ్మిదో శతాబ్ది వరకు సంపన్నుల పానీయంగా ఉన్న తేనీరు ఇరవయ్యో శతాబ్దం నాటికి మన దేశంలో సామాన్యుల అభిమాన పానీయంగా మారింది.
పురాణాల్లో తేనీటి ప్రస్తావన
తేనీటి ప్రస్తావన మన పురాణాల్లోనూ ఉంది. రామాయణంలో ఉన్న ప్రస్తావన ఆధారంగా భారతదేశంలో తేనీటి వాడుక క్రీస్తుపూర్వం 750-500 సంవత్సరాల మధ్య కాలంలో ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే, ఆ తర్వాత కొన్ని శతాబ్దాలపాటు పురాణాల్లో గానీ, ఇతరేతర సాహిత్యంలో గానీ తేయాకు లేదా తేనీటి ప్రస్తావన అన్నదే కనిపించలేదు. మన దేశంలో బౌద్ధమతం బలం పుంజుకుంటున్న కాలంలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి చెందిన రాతల్లో తేనేటి వాడుకకు సంబంధించిన ఆధారాలు లభించాయి. అప్పట్లో బోధిధర్ముడు వంటి బౌద్ధ సన్యాసులు ఏకాగ్రత కోసం తేనీటిని సేవించేవారట. చైనాలోని బౌద్ధ సన్యాసులు కూడా ఇదే కారణంతో విరివిగా తేనీటి సేవనం చేసేవారట. అస్సాం ప్రాంతంలోని సింగ్ఫో, ఖమ్తీ తెగలకు చెందిన గిరిజనులు క్రీస్తుశకం 12వ శతాబ్దిలోనే తేయాకును, తేనీటిని విరివిగా వాడేవారనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి.
తేనీటి భారతం
బ్రిటిషర్ల పుణ్యమా అని భారతదేశంలో తేయాకు ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాలతో పాటు దక్షిణాదిలో నీలగిరి ప్రాంతంలోనూ తేనీటి తోటలు పెరిగాయి. తేనీటి వినియోగం దేశం నలుమూలలకూ విస్తరించింది. అస్సాంలో తేయాకు తోటలు విస్తరించిన కాలంలోనే బ్రిటిష్ వర్తకుల పుణ్యానే కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో కాఫీ తోటలు విస్తరించాయి. అందువల్ల తొలినాళ్లలో తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో తేనీటి వినియోగం, దక్షిణాది రాష్ట్రాల్లో కాఫీ వినియోగం పెరిగాయి. కాఫీ తోటలు ఉన్న కర్ణాటకకు దగ్గరగానే ఉన్నప్పటికీ దక్కన్ ప్రాంతంలో మాత్రం ముస్లిం పాలకులు ముచ్చటపడిన తేనీటికే అగ్రతాంబూలం దక్కింది. నిజాం పాలనలో కొనసాగిన తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ మన జాతీయ పానీయమే జెండా ఎగరేస్తోంది. కాలం గడిచే కొద్దీ తేనీరు దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించింది. తేనీటి తలసరి వినియోగంలో భారతీయులు 44వ స్థానంలో ఉన్నా, మొత్తం వినియోగంలో మాత్రం తక్కువ తినలేదు. తేయాకు ఉత్పత్తిలో మనది రెండో స్థానం. మన దేశంలో ఏటా ఉత్పత్తవుతున్న తేయాకులో దాదాపు డెబ్భయి శాతం వినియోగం ఇక్కడే జరుగుతోంది. మిగిలిన ముప్ఫయి శాతమే ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. బ్రిటిష్ వాళ్లు టీ డికాక్షన్‌లో కొద్ది పరిమాణంలో మాత్రమే పాలు, పంచదార కలుపుకొనేవారు. మనవాళ్లు పాలు, పంచదార దండిగా కలపడమే కాదు, రుచుల కోసం అల్లం, యాలకలు, మిరియాలు, మసాలా వంటివి జోడించి వాడటం మొదలుపెట్టారు. దాల్చినచెక్క, అనాసపువ్వు, లవంగాలు వంటి సుగంధద్రవ్యాలు వేసి తయారు చేసే మసాలా చాయ్, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన ఇరానీ చాయ్‌ల ప్రసిద్ధి దేశ విదేశాలకు పాకింది.
ఇవీ వెరైటీలు
మన దేశంలో అస్సాం, డార్జిలింగ్, దూరాస్ అండ్ తెరాయ్. కాంగ్రా, నీలగిరి, అన్నామలై, వాయనాడ్, కర్ణాటక, మున్నార్, ట్రావెన్‌కోర్ రకాల తేయాకు ఉత్పత్తవుతోంది. తేయాకు సాగు జరిగే ప్రదేశాల పేరుతోనే ఆయా రకాలు ప్రసిద్ధి పొందాయి. వీటన్నింటిలోనూ నాణ్యతలో తిరుగులేనిది అస్సాం టీయేనని ‘టీ’చరులు చెబుతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అస్సాం టీకి ఉన్న గిరాకీ ‘టీ’చరుల ఉవాచకు ఊతమిచ్చేదిగానే ఉంటోంది. డార్జిలింగ్ టీ, నీలగిరి టీలకు కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అద్భుతమైన గిరాకీ ఉంది. మన దేశంలో 5.63 లక్షల హెక్టార్ల విస్తీర్ణం తేయాకు సాగు జరుగుతోంది.
టాగ్లు: Tea, టీ, చైనా, China, శ్రీమాన్ షెనాంగ్, Shrimaan senang
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565