MohanPublications Print Books Online store clik Here Devullu.com

జెండా ఊంచా రహే హమారా-Independence Day-August 15th


ఆ జెండాను చూస్తే రోమాలు నిక్కపొడుస్తాయి.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతుంది.. మువ్వన్నెలతో భరతమాత ముసిముసిగా నవ్వుతున్నట్టు ఉండే ఆ జెండా కనిపిస్తే.. అచేతనంగా పడి ఉన్న చేతులు సైతం సెల్యూట్ చేస్తాయి.. మూగబోయిన గొంతు సైతం మేరా భారత్ మహాన్ అంటూ నినదిస్తుంది.. కులం లేదు, మతం లేదు, జాతి భేదం అసలు లేదు.. జాతి జరుపుకొనే పంద్రాగస్టు పండుగ రోజున అందరి దేవుళ్లూ ఈ జెండాలోనే దర్శనమిస్తారు.. భరతమాత ఒడిలో సగర్వంగా నిల్చుని, జాతిని జాగృతం చేస్తున్న జాతిపతాకపు ముచ్చట్ల సమాహారమిది.
పంద్రాగస్టు. భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన ఈ రోజు దేశ ప్రజలందరికీ పండుగ రోజు. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుల్ని స్మరించుకుంటూ జరుపుకొనే ఈ వేడుకలో అందరికీ ఒకే దైవస్వరూపం దర్శనమిస్తుంది. అదే మూడు రంగుల జాతీయ జెండా. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన వీరుల పౌరుషమంతా.. రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాలోనే దర్శనమిస్తుంది. 

తొలి జెండా

అవి స్వాతంత్య్ర సంగ్రామం మహోధృతంగా సాగుతున్న రోజులు. ఆకాశంలో రకరకాల పక్షులు సైతం స్వేచ్ఛగా ఎగురుతున్నా.. భారత ప్రజాజీవనాన్ని ప్రతిబింబించేలా ఒక స్వేచ్ఛాపతాకం మాత్రం లేకపోయింది. 1904లో వివేకానందుడి శిష్యురాలైన ఐరిష్ వనిత నివేదిత.. భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించారు. పసుపు, ఎరుపు రంగుల సమ్మిళితమైన ఈ పతాకం మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తులను ఉంచారు. భారతమాతకు వందనం అని అర్థం వచ్చేలా బెంగాలీలో లిఖించబడింది. ఎరుపు స్వాతంత్య్రానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛతకు చిహ్నంగా వివరించబడ్డాయి. 
1st-flag
1.మొట్టమొదటి త్రివర్ణ పతాకం

శచీంద్ర ప్రసాద్ బోస్ రూపొందించిన మొట్టమొదటి త్రివర్ణ పతాకం, బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన సందర్భంగా 1906 ఆగస్టు ఏడున ఆవిష్కృతమైంది. పైన నారింజ, కింద ఆకుపచ్చ, మధ్య పసుపుపచ్చ రంగులతో ఈ జెండాను రూపొందించారు. పై పట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామర పూలు, కింద పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో వందేమాతరం అక్షరాలను ఉంచారు. 

2nd-flag
2.ముచ్చటగా మూడో జెండా

1907లో వీరసావర్కర్, భికాజీ కామా, శ్యామ్‌జీ కృష్ణవర్మ కలిసి మరో జెండాను రూపొందించారు. ఈ జెండాలో పై భాగంలోని ఆకుపచ్చ రంగు ముస్లింలకు, మధ్యలోని కాషాయం హిందువులకు, బౌద్ధులకు ప్రతీకగా రూపొందించారు. బ్రిటీష్ భారతంలోని ఎనిమిది ప్రావిన్సులకు గుర్తుగా ఆకుపచ్చ పట్టీపై 8 పద్మాలు ఉంటాయి. కాషాయం పట్టీపై దేవనాగరి లిపిలో వందేమాతరం అని రాసి ఉంటుంది. ఎరుపు రంగు పట్టీపై ఒక చివరన నెలవంక, ఇంకో చివరన సూర్యుడి చిత్రపటం ఉంటుంది. 
1917లో తిలక్, అనిబిసెంట్ కలిసి ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టీలతో కూడిన మరో జెండాను రూపొందించారు. హోమ్‌రూల్ ఉద్యమం సందర్భంగా ఈ జెండానే ఉపయోగించారు. పై భాగంలో యూనియన్ జాక్ గుర్తు, కుడివైపు తార, నెలవంక గుర్తులను, దిగువన హిందువుల చిహ్నంగా సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలను ఉంచారు. అయితే ఈ పతాకాలు అంతగా జనామోదం పొందలేకపోయాయి.

pingali-jenda
3.తుదిరూపం ఇచ్చిన పింగళి వెంకయ్య

మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి తుదిరూపం ఇచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వెంకయ్య.. పైన తెలుపు, కింద ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ రంగు మీద రాట్నాన్ని ముద్రించి కొత్త జెండాను తయారు చేశారు. అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆవిష్కరించారు. అనంతరం ఎన్నో చర్చలు, పరిశీలనలు, కమిటీల నివేదికల అనంతరం 1931లో పైన కాషాయం, కింది భాగాన ఆకుపచ్చ, మధ్యలో తెలుపు రంగు పట్టీపై చరకా గుర్తుతో వెంకయ్య రూపొందించిన జెండాను ఆమోదిస్తూ తుది తీర్మానం చేశారు.

final-jenda
4.స్వేచ్ఛావాయువులు పీలుస్తూ..
మధ్యలో చరకా ముద్రణ కలిగిన మువ్వన్నెల జెండా 1947వరకు జాతీయోధ్యమంలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం అనంతరం దేశానికంతటికీ ఒకే జెండాను నిర్ణయించేందుకు బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ ఒక కమిటీని నియమించింది. మూడు రంగులనూ అలాగే ఉంచి, చరకా స్థానంలో సారనాథ్ స్థూపంలోని అశోక ధర్మచక్రాన్ని చేరుస్తూ.. కొత్త పతాకాన్ని ఆవిష్కరించింది కమిటీ. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత జాతీయ పతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో అది ఆవిష్కృతమైంది. 
అంతకు ముందు జెండాలో-ని రంగులన్నింటికీ మతపరమైన అన్వయాలు ఉండేవి. భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయజెండాకు ఎటువంటి మతపరమైన అన్వయాలూ లేవని స్పష్టం చేశారు. కాషాయం త్యాగానికి గుర్తు, ఇది మన నాయకులు స్వలాభాన్ని వీడి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, జీవరాశులన్నీ వృక్షసంపద మీద ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. అశోకచక్రం ధర్మపాలనకు, చలనానికి, చైతన్యానికి చిహ్నం అని వివరించారు
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం జెండాను ఒంటిపై వేసుకునే వస్ర్తాలపై ఉపయోగించరాదు. 
-2002కు ముందు జెండాను ఇష్టానుసారం ఎగురవేయడానికి అనుమతించేవారు కాదు. జెండా గౌరవానికి భంగం కలుగని విధంగా ఎవరైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా అనుమతిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 
-జాతీయ పతాకాన్ని ఎగుర వేయడమనేది సంపూర్ణ హక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. రాజ్యాంగంలోని 51ఎ ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది. 
-జెండా తయారికి ఖాదీ లేదా చేనేత వస్ర్తాన్నే వాడాలి. ఖాదీలో నూలు, ఉన్ని, పట్టు బట్టలను మాత్రమే వాడాలి. ప్రస్తుతం జాతీయ జెండాను తయారు చేసేందుకు అనుమతి పొందిన ఒకేఒక్క సంస్థ హుబ్లీలో ఉంది. 
-జాతీయ పతాకాల ఉత్పత్తికి అనుమతినిచ్చే అధికారం ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌కు ఉన్నప్పటికీ, దాన్ని రద్దు చేసే అధికారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్‌కు ఉంటుంది. 
-దేశంలోనే భారీ జాతీయ జెండాను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఒడ్డున 2016లో ఆవిష్కరించారు. 
-పాడైపోయిన జెండాలను ఇష్టానుసారం పారేయకూడదు. భూమిలో పాతిపెట్టడం వంటి గౌరవప్రదమైన పద్ధతులనే అవలంబించాలి.
సంతోష్‌కుమార్ ప్యాట






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list