MohanPublications Print Books Online store clik Here Devullu.com

అహింసే అసలైన ఆయుధం-The original weapon is Ahimsa


అహింసే అసలైన ఆయుధం
అహింస అంటే పిరికితనం అనుకుంటారు చాలామంది! అహింస వజ్రాయుధం కంటే పదునైనది అని రుజువు చేసిన ధీరులు ఎందరో ఉన్నారు. చావుకు భయపడని ధీరత్వం వారిది. బుద్ధుడు అలాంటి ధీరుల్లో అగ్రగణ్యుడు! అంగుళిమాలుని లాంటి నరహంతకుని దగ్గరికి, అనేక యుద్ధ క్షేత్రాల మధ్యకు ఎలాంటి ఆయుధం, కవచ ఆచ్ఛాదనం లేకుండా వెళ్లేవాడు. బుద్ధునితో పాటు ఎందరో బౌద్ధ భిక్షువుల నిర్భీతిగా జీవించారు.
బుద్ధుడు ప్రబోధించిన సమ్యక్‌ దృక్పథం, యథాభూత దర్శన జ్ఞానమే వారి ధీరత్వానికి ప్రధాన కారణం. అలాంటి వారిలో అధిముక్తుడు ముఖ్యుడు. అధిముక్తుడు చాలా చిన్నతనంలోనే భిక్షువుగా మారాడు. కుర్రతనంలో అతడు ఒక అడవి మార్గంలో పోతున్నప్పుడు ఒక హంతకుల ముఠాకి చిక్కాడు. వారు అడవి బందిపోట్లు. ఒక దేవతారాధకులు. దేవతలకు మనుషులను బలిస్తే తమ దొంగతనాలకు ఆటంకం కలగదని నమ్మి ఎందరినో బలి ఇస్తూ ఉండేవారు. అలా బలివ్వడానికి అధిముక్తుణ్ణి తీసుకుపోయారు వాళ్లు. కాళ్లూ, చేతులూ కట్టేసి బలిపీఠంపై పడుకోబెట్టారు. ఈ తతంగం చూస్తున్న అధిముక్తుని ముఖంలో కించిత్తయినా ఆందోళన కనిపించలేదు. దుఃఖం లేదు. నిర్భీతిగా చిరునవ్వుతోనే ఉన్నాడు. అతని ధైర్యం చూసి దొంగల ముఠా నాయకుడికి ఆశ్చర్యం కలిగింది. ‘‘ఓరీ! బోడిగుండూ! నీకసలు భయం లేదా? తెలియదా? మేము ఎందరినో చంపాం. అందరూ విలవిల్లాడేవారు. ఆర్తనాదాలు చేసేవారు. మనుషులే కాదు, జంతువులు కూడా ఈ బలిపీఠం ఎక్కితే ఏడుస్తాయి. దీనంగా అరుస్తాయి. మరి నీవెందుకు ఇలా నవ్వుతున్నావ్‌?’’ అని ప్రశ్నించాడు కత్తి నూరుతూ!‘‘నాకు ఏ జన్మల మీదా నమ్మకం లేదు. ఈ జన్మలో సమ్యక్‌ జ్ఞానాన్ని పొందాను. దుఃఖాన్ని జయించాను. నాకు ఏ కోరికలూ లేవు. కొత్తవి రావు. ధర్మాన్ని ధరించిన నాకు చావంటే భయం లేదు. అది నా వెన్నంటే ఉంటుంది. ఎదుటి వారిని హింసించి, చంపి, పీడించి బతికే జీవితం కాదు నాది! ఇంద్రియాల్ని జయించిన నాకు మృత్యువు అంటే భయం లేదు. చావు భయాన్ని ఎప్పుడో జయించాను. మీ పని మీరు కానీయండి’’ అన్నాడు చిరునవ్వుతో!
దాంతో దొంగల నాయకుడికి ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. ‘‘స్వామీ! ఇన్ని ఆయుధాలున్న మేమే నిరంతరం భయపడుతూ బతుకుతున్నాం. అలాంటిది ఏ ఆయుధమూ లేని నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఎవరు నేర్పారు? మాకూ ఆ ధైర్యాన్ని నేర్పించగలరా?’’ అని నూరుతున్న కత్తిని పక్కనపెట్టి మోకాళ్ల మీద కూలబడి ప్రార్థించాడు దొంగల ముఠా నాయకుడు. అధిముక్తుడు వాళ్లందరినీ బుద్ధుని దగ్గరికి తీసుకెళ్లాడు. వారు తమ మనసు మార్చుకొని, దారి మార్చుకొని.. మంచి మనుషులుగా జీవనం కొనసాగించారు.
ఇది అప్పటి మాట. నిన్నమొన్న అంబేడ్కర్‌ కూడా తన పోరాటాన్ని అహింసా మార్గంలోనే నడిపించి, నిమ్న జాతుల ఉద్ధరణకు దారులు వేశారు.‘‘సత్యాగ్రహులు పూర్తి అహింస పాటించాలి. బ్రిటిష్‌ సైనికులు లాఠీలతో బాదుతున్నా.. ‘‘అమ్మా.. అయ్యా..’’ అనకూడదు. ‘‘వందేమాతరం’’ అనే అనాలి. దెబ్బల్ని కాచుకోవడానికి చేతులను అడ్డు పెట్టకూడదు. అలా పెట్టడం ప్రతిఘటించడమే అవుతుంది. అలాంటివారే నా వెంట రండి’’ అన్నారు గాంధీజీ.

దండి సత్యాగ్రహంలో అలాంటివారు పాల్గొన్నారు. బ్రిటిష్‌ సైనికులు తలలు పగులగ్గొట్టారు. అయినా సత్యాగ్రహులు ప్రతిఘటన చూపలేదు. ఈ దృశ్యాన్ని చూసిన ఆంగ్లపత్రిక ‘డైలీ హెరాల్డ్‌’ రిపోర్టర్‌ ‘జార్జ్‌’.. ‘‘ఈ దమనకాండ చూశాక.. నేనొక తెల్లవాడినైనందుకు సిగ్గుపడ్డాను. నిరాయుధులపై, ప్రతిఘటించని వారిపై చూపిన ఈ పైశాచికత్వాన్ని చూసి తల్లడిల్లాను. వారి అహింసా తత్వానికీ, ధీరత్వానికీ తలవంచి నమస్కరిస్తున్నాను’’ అని కథనం రాశాడు. ఆ వార్త ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లో పెను సంచలం అయింది. బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ వారు గగ్గోలు పెట్టారు. భారతదేశ సత్యాగ్రహ ఉద్యమం ఆ విధంగా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచదేశాల మద్దతును పొందింది.
గాంధీ, అంబేడ్కర్‌ కూడా అహింసాయుధాన్ని చేపట్టిన ధీరులే! ‘అహింస అంటే పిరికితనం కాదు!’ సడలని ధీరత్వం అని ప్రపంచానికి చాటారు!
బొర్రా గోవర్ధన్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list