MohanPublications Print Books Online store clik Here Devullu.com

పపుష్కరిణిలో కొలువైన భోలానాథుడు_maheswaram






పుష్కరిణిలో కొలువైన
భోలానాథుడు
సురాసుర పూజితుడైన ఆ పరమశివుడికి జ్యోతి స్వరూపుడు, లయకారకుడు, అర్ధనారీశ్వరుడు... ఇలా వేవేల నామాలున్నాయి. అందుకే భక్తులు ఏ పేరుతో పిలిచినా, నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందిస్తాడు ఈ బోళా శంకరుడు. ఒక్కో ప్రాంతంలో కొలువైన శివయ్యను ఒక్కో నామంతో ఆరాధిస్తాం. కానీ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీరాజరాజ్వేరుడు షోడశరూపాల్లో పూజలందుకుంటున్నాడు.
చుట్టూ పచ్చని చెట్ల మధ్య, చతురస్రాకార సువిశాల పుష్కరిణిలో కొలువుతీరారు ఈ ఆదిదంపతులు. అమ్మవారితోపాటు పూజలందుకుంటున్న రాజరాజేశ్వరుడు శరణంటూ వచ్చిన భక్తుల పాలిట నిజంగా కొంగుబంగారమే. భక్తితో పుష్పం, పత్రం, తోయం... ఇలా ఏది సమర్పించినా కోరిన కోర్కెలు నెరవేరుస్తాడన్నది భక్తుల విశ్వాసం. కోనేరు మధ్యలో వెలుగొందుతున్న శివాలయాల్లో మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. అంతేకాదు ఈ కోనేటి చుట్టూ నెలకొన్న పదహారు శివాలయాల్లో స్వామివారు పదహారు నామాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు.

స్థలపురాణం... 
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీరాజరాజేశ్వరుడి దేవాలయానికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. గోల్కొండ నవాబు తానీషా కాలంలో సేనాధిపతులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు 1673-1680 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే, అంత:పుర కుట్రలో భాగంగా అక్కన్న, మాదన్నలు హత్యకు గురవ్వడంతో ఈ ఆలయం ప్రభ కొంచెం తగ్గింది. 1687లో ఔరంగజేబు దండయాత్ర చేసి, రాతితో నిర్మించిన ఈ ఆలయాలను ధ్వంసం చేశాడు. అప్పటి నుంచీ 1979 వరకూ ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలోనే ఉండిపోయింది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఆలయం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మూడున్నర దశాబ్దాల కిందట మహేశ్వరం ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన టి.శంకర్‌ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలూ, గ్రామస్థుల సహకారంతో 1980లో ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సహకారంకూడా తోడైంది. కాశీ నుంచి తీసుకు వచ్చిన శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు గ్రామస్థులు. అదే నెలలో మహాశివరాత్రి రావడంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచీ భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరగడంతోపాటు ఈ స్వామికి నిత్యపూజా కైంకర్యాలు ప్రారంభమయ్యాయి.

షోడశమూర్తులతో... 
విశాలమైన చతురస్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు, రాజేశ్వరీ దేవితో కలిసి ఉద్భవించినట్లు ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే ఈ పుష్కరిణి మధ్య భాగంలో రెండంతస్తుల్లో వారికి ఆలయాన్ని నిర్మించారు. కింది అంతస్తులో అమ్మవారూ, పైఅంతస్తులో రాజరాజేశ్వరుడూ పూజలందుకుంటున్నారు. పుష్కరిణిలో స్నానమాచరించి నేరుగా రాజరాజేశ్వరుణ్ని దర్శించుకోవడానికి వీలుగా రెండు రాతి వంతెనలు నిర్మించారు. ఈ కోనేటి చుట్టూ షోడశమూర్తులు - అంటే పదహారు రూపాల్లో కొలువైన పదహారు శివాలయాలు ఉన్నాయి. వీటిలో హరిహరేశ్వరుడు, మల్లీశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, ముక్తేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, మణికంఠేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడి రూపాల్లో పరమశివుడు నిత్య పూజలందుకుంటున్నాడు. మహేశ్వరంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి ఫాల్గుణ శుద్ధ విదియ వరకూ అయిదు రోజుల పాటూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి సోమవారం లక్షదీపారాధన, లక్షబిల్వార్చనలు ఘనంగా చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలూ, మరుసటి రోజు స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండగగా నిర్వహిస్తారు. స్వామివారి రధోత్సవం, దోపుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆలయంలోనే కొలువైన రాజరాజేశ్వరీ అమ్మవారి శ్రీచక్రానికి చేసే కుంకుమార్చనలు విశిష్టమైనవి.

చూడదగిన ప్రదేశాలు... 
మహేశ్వరంలోని శివగంగారాజరాజేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోనే అక్కన్న, మాదన్నలు నిర్మించిన కోట ఉంది. ఈ కోట చూట్టూ నిర్మించిన రాతి కట్టడాలూ, కోటలోని నాట్యకళామందిరం, బందిఖానాలు పర్యటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఈ కోటలో చాలా సినిమాలు చిత్రీకరించారు కూడా. మహేశ్వరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘట్టుపల్లి శ్రీవీరాంజనేయస్వామి ఆలయం, హైదరాబాదు నుంచి మహేశ్వరం వచ్చే దారిలో తుక్కుగూడలో అయ్యప్పస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఇలా చేరుకోవచ్చు... 
హైదరాబాదుకి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగారాజరాజేశ్వరస్వామి ఆలయానికి బస్సుమార్గం ద్వారా చేరుకోవచ్చు.హైదరాబాదులోని చార్మినార్‌, కోఠి, సికింద్రాబాద్‌, షాద్‌నగర్‌, ఇబ్రాహీంపట్నం, రాజేంద్రనగర్‌ నుంచి మహేశ్వరానికి ఆర్టీసీ బస్సు సదుపాయాలున్నాయి.
- వనం సుదర్శన్‌, ఈనాడు, హైదరాబాద్‌ 
ఫొటోలు: దోమ యాదగిరిరెడ్డి



పుష్కరిణిలో కొలువైన భోలానాథుడు

#maheswaram





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list