MohanPublications Print Books Online store clik Here Devullu.com

మీ ఇల్లు బంగారం కానూ!_Your house is gold

మీ ఇల్లు బంగారం కానూ!

దీపావళి బాగా జరుపుకొన్నారా? ధన్‌తేరస్ నాడు బంగారం కొనడం వీలు కాలేదా? అయితే ఇప్పుడు కొనాలనుకుంటున్నారా? మరి ఎక్కడ కొనాలనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. నగలషాపుల వాళ్లేమో రండీ రండీ అంటున్నారు. పైగా ఇంతకాలం మీరు నష్టపోయింది చాలంటున్నారు. బంగారం మీద ప్రేమతో కొని ఉండొచ్చు కానీ ఇంతకాలం నష్టపోయామని తెలియలేదనిపిస్తున్నదా? ఎందుకాలస్యం? మీకు నచ్చిన జ్యువెలరీకే వెళ్లండి. డబ్బులు కూడా ఆదా చేసుకోండి. నచ్చితేనే కొనండి. పనిలో పని ఎస్టిమేట్ స్లిప్ కూడా తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా! మీకెంతో ఇష్టమైన పసిడితో మీ ఇల్లు బంగారం చేసుకోండి. నగల గల గలతో ఇంటికి కొత్త శోభ తెచ్చుకోండి. అయితే ఒక్కమాట. ప్రేమ కొద్దో.. ప్రీతి కొద్దో బంగారం కొంటున్నారు కదా.. అసలు బంగారం ఎక్కడ నుంచి వస్తుంది? షాపుల వాళ్లు ఎలా తక్కువకు అమ్ముతారు? బంగారాన్ని ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చా? ఆభరణాలు ఆనందానికే కాదు.. ఆర్థిక భద్రత కల్పించడానికీ తోడ్పడుతాయా? వంటి విషయాల సమాహారం ఈ వారం ముఖచిత్ర కథనం.

-వాసిరెడ్డి వేణుగోపాల్ ,9000528717

బంగారం ధర బాగా తగ్గింది. ముప్ఫై వేలకు వచ్చింది. ఏదో ఒకటి చేసి ఓ తులం కొనిపెట్టండి
-ఓ ఇల్లాలు

నీ మొహం. ఇంకొన్ని రోజులు ఆగితే పది వేలకు వస్తుంది. అప్పుడు చూద్దాంలే.
- ఓ భర్త

అనేక మధ్యతరగతి ఇళ్లలోనూ ఇలాంటి సంభాషణలు మామూలే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో బంగారం గురించి ముచ్చట్లే ముచ్చట్లు. నిజంగా ఇది హాట్ సీజన్. ఈ సీజన్‌లో బంగారం ధరలాంటి హాట్ న్యూస్ మరొకటి ఉండదు. ఏ ఇంట్లో చూసినా బంగారం కబుర్లే. ఏ వీధిలోకెళ్లినా పసిడి ముచ్చట్లే. బంగారం ఇలా పడిపోతుందని ఎవరైనా కలగన్నారా? అసలు పెరగడమే తప్ప విరగడం ఉండదనుకున్న బంగారం ఎందుకిలా కుంగిపోయింది? ఇంకా తగ్గుతుందా? అసలు ఈ పెరగటం, తగ్గడం వెనక ఉన్న మతలబు ఏంటి? బంగారం కథ ఎక్కడిదాకా పోతుంది?
బంగారం ధర తగ్గినప్పుడల్లా ఇంకా తగ్గుతుందని ఆశగా ఎదురుచూడడం, పెరిగినప్పుడు.. ఇంకెంత పెరుగుతుందో ఏమో అని ఆందోళన చెందడం సహజం.
NewGOLD

బతికినన్నాళ్లే కాదు, చచ్చిపోయే చివరి క్షణాల్లోనూ ఒంటిమీద బంగారం ఉండాలని కోరుకుంటారు భారతీయ మహిళలు. ఒంటిమీద బంగారంతో పుణ్యస్త్రీగా కన్నుమూయాలన్నది భారతీయ వివాహితకు ఉండే బలమైన సెంటిమెంట్. ఈ ఆడోళ్లున్నారు చూశారూ.. బంగారం పేరెత్తితే చాలు, పడి చస్తారు.. ఒళ్లు మరిచిపోతారు. వాళ్లకదో వేలంవెర్రి.. ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి మగాళ్లనుంచి. మహిళలు ఎగబడితేనే, మహిళలు పడిచస్తేనే బంగారం ధర ఇంత దాకా వచ్చిందా? వేరే కారణాలు ఉన్నాయా? 
భారతదేశంలో బంగారం అంటే చాలా క్రేజ్ ఉన్న మాట నిజం. ప్రపంచంలో పసిడి కొనుగోళ్లలో అందరికంటే ఇండియన్లే ముందున్నారన్నది వాస్తవం. ప్రతి సంవత్సరం భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారం దాదాపు 1000 టన్నులు. అయితే బంగారం ధర హెచ్చుతగ్గులకు ఇదొక్కటే కారణం కాదు. అనేక అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం బంగారం ధరపై ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

అసలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది?
భారతీయుల దగ్గరే బంగారం ఎక్కువ ఉందని ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. అయితే అధికారికంగా భారతదేశం దగ్గర ఉన్న బంగారం నిల్వలు చాలా తక్కువే. ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువ బంగారం ఉన్నది అగ్రరాజ్యం అమెరికా దగ్గరే. అమెరికా దగ్గర 8,133 టన్నుల గోల్డ్ ఉంటే, ఇండియా దగ్గర ఉన్నది 557 టన్నులే. మనతో పోలిస్తే చైనా దగ్గర రెట్టింపు బంగారం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా.. పసిడిని ఎగబడి కొనుగోలు చేస్తున్నది. చిన్న దేశాల దగ్గర కూడా మనకంటే ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయి. బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాలే సంపన్న దేశాలుగా ప్రపంచ చిత్రపటంలో వెలుగొందడం కూడా గమనించాల్సిన అంశం. బంగారం నిల్వలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయనడానికి ఇది నిదర్శనం.

ప్రపంచ చరిత్రలో బంగారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. బంగారం కోసం స్పెయిన్ చేసిన యుద్ధాలు లోకవిదితం. అంతెందుకు.. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ సేనలు అనేక ఐరోపా దేశాలపైకి దండెత్తినప్పుడు.. మొదటగా స్వాధీనం చేసుకున్నది బంగారాన్నే. కొల్లగొట్టిన బంగారంతో హిట్లర్ తన సేనలను మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాడు.
గత చరిత్రనే కాదు.. వర్తమాన మానవ చరిత్రనూ, దేశాల చరిత్రనూ బంగారం ప్రభావితం చేస్తూనే ఉంది బంగారం. పదేళ్ల క్రితం అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, డాలరుకు విలువ తగ్గిపోయాక బంగారం విలువ మరింత పెరిగింది. అప్పటిదాకా డాలరు నిల్వలలో పోటీపడిన ప్రపంచ దేశాలు గోల్డ్ నిల్వలను పెంచుకోవడానికి పరుగులు తీశాయి. కాబట్టే పదిహేను సంవత్సరాల క్రితం 288 డాలర్లు ఉన్న ఔన్సు బంగారం ధర ఒక దశలో 2000 డాలర్లదాకా దూసుకెళ్లి.. ప్రస్తుతం 1200 డాలర్ల దగ్గర స్థిరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలపై ప్రజలకు నమ్మకం నానాటికీ సన్నగిల్లుతున్నది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కరెన్సీ అయిన డాలరుపై విశ్వాసం సడలిపోతున్నది. డాలర్ ప్రామాణిక ఆర్థిక వ్యవస్థలో లుకలుకలు బయటపడుతున్నా కొద్దీ.. సురక్షిత ఆర్థిక సాధనంగా గోల్డ్ నిలుస్తున్నది. 
NewGOLD1

ప్రపంచ దేశాల మధ్య లావాదేవీలు గతంలో గోల్డ్ రూపంలో జరిగేవి. ఆ మేరకు ఒప్పందాలున్నాయి. కానీ డెభ్బయ్యో దశకంలో అమెరికా ప్రెసిడెండ్ నిక్సన్ తూచ్ అన్నాడు. గోల్డ్ కాదు.. డాలర్లే ఇస్తానన్నాడు. ప్రపంచ దేశాలకు వాటిని ఆమోదించక తప్పలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నంతకాలం అమెరికా మాట చెల్లిపోయింది. ఎప్పుడైతే అమెరికా బలహీనపడిందో, డాలరుపై నమ్మకం చెదిరింది. డాలరుకు ప్రత్యామ్నాయాలు వెదకడం మొదలైంది.

ధర ఎందుకు తగ్గినట్టు?
డాలరు బలహీనపడడం వల్లనే బంగారం ధర పెరిగినట్టయితే.. ఇప్పుడు ఎందుకు తగ్గినట్టు? నిజానికి ఈ తగ్గుదల గత సంవత్సరం ఏప్రిల్‌లోనే ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ఒకసారి, జూన్‌లో మరొకసారి బంగారం ధర బాగా తగ్గింది. అప్పటినుంచి క్రమంగా తగ్గుతూనే వస్తున్నది. కానీ భారతదేశంలో మాత్రం గత ఏడాది ఏప్రిల్‌లో ఎంత ధర పలికిందో, ఇప్పుడూ అదే ధర పలుకుతున్నది. దిగుమతి సుంకాలు అమాంతం పెంచడం దీనికి కారణం.

గత ఏడాది ఏప్రిల్‌లో సైప్రస్ దేశం సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంక్షోభం నుంచి బయటపడడంకోసం సైప్రస్ తన దగ్గరున్న బంగారం నిల్వలను విక్రయించింది. మార్కెట్‌లో సరఫరా పెరగడంతో ధర ఒక్కసారిగా తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సైప్రస్ దేశాన్ని ఆపదలో ఆదుకున్నది బంగారమే. తొంభయ్యో దశకంలో సంక్షోభంలో చిక్కుకున్న భారతదేశాన్ని ఆదుకున్నది కూడా గోల్డ్ నిల్వలే.

పైకి కనిపించకపోయినప్పటికీ ప్రపంచంలో ప్రతిదీ బంగారంతో ముడిపడే ఉంటుంది. ప్రపంచంలో ఏ రాజకీయ అలజడి తలెత్తినా.. అందరూ మళ్లీ బంగారంవైపే చూస్తారు. దీనికి ఉదాహరణ సిరియా సంక్షోభం. సిరియా చిన్న దేశమే. కానీ పెద్ద సవాలుగా నిలిచింది. అక్కడ ఆందోళన చేస్తున్న ప్రజలపై విషవాయు ప్రయోగం జరగడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. బంగారంవైపు పరుగులు తీసింది. అలా ఉంటుంది.. రాజకీయ పరిణామాల ప్రభావం బంగారం ధరపై.అలాగే కొన్ని ఆర్థిక నిర్ణయాల ప్రభావం కూడా బంగారంపై ఉంటుంది. ఉదాహరణకు ఇరాన్ చమురు కొనుగోలు ఒప్పందం. ఇరాన్ అణు కార్యక్రమాలకు ఆగ్రహించిన అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్ పై ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ తన ముడిచమురును డాలర్లకు విక్రయించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇరాన్ ఊరుకోలేదు. తన చమురుకు బదులుగా సర్వీసులను, సరుకులను.. చివరికి బంగారాన్ని తీసుకోవడం మొదలుపెట్టింది. దాంతో అమెరికా దిగివచ్చింది. అగ్రరాజ్యాలతో కుదిరిన ఒప్పందంవల్ల ఇరాన్ ఇప్పుడు తన చమురును డాలర్లకు అమ్ముకోగలుగుతున్నది. బంగారంతో, లోకల్ కరెన్సీలతో క్రూడాయిల్‌ను మారకం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఇరాన్‌కు లేదు. పైగా ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంచనా.

సాధారణంగా ఉద్రిక్త పరిస్థితులు బంగారానికి డిమాండ్ పెంచుతాయి. టెన్షన్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. గోల్డ్ రేటు దిగిరావడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే ముడిచమురు ధర తగ్గిన ప్రభావం కూడా గోల్డ్ రేటుపై ఉంది. బంగారం ఉత్పత్తి వ్యయంలో చమురు పాత్ర గణనీయంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసం అమెరికా ఉద్దీపన పథకాలు ప్రకటించి వందల బిలియన్ డాలర్లను వెదజల్లుతూ వచ్చింది. అయితే త్వరలోనే ఈ ఉద్దీపన పథకాలను నిలుపుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. గోల్డ్ నుంచి మదుపరుల దృష్టి ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లడం కూడా బంగారం ధర మందగించడానికి కారణమైంది. అయితే ఇక అంతా ప్రశాంతంగానే ఉంటుందని, బంగారానికి డిమాండ్ ఇంకా ఇంకా పడిపోతుందని అంచనా వేయడానికి లేదు. అన్ని దేశాలు కూడా ముందు జాగ్రత్తల్లో ఉన్నాయి. జర్మనీ, జపాన్‌లు అమెరికా దగ్గర దాచుకున్న తమ బంగారాన్ని వెనక్కు తెచ్చుకుంటున్నాయి. టర్కీ తనకు కావాల్సిన ముడి చమురును బంగారం ఇచ్చి తెచ్చుకుంటున్నది. నిక్సన్ హయాంలో గోల్డ్ స్టాండర్డ్ తొలగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ గోల్ స్టాండర్డ్ వైపు ప్రపంచం అడుగులు వేస్తున్నది. ఇరాక్ తాను విక్రయించే ఆయిల్ కు డాలర్లకు బదులు యూరోలు తీసుకుంటోంది. లిబియా, రష్యా, చైనాలు డాలర్‌ను బైపాస్ చేశాయి. డాలర్ నిల్వలు అనేది గతించిన చరిత్ర అని చైనా అధ్యక్షుడు అన్నారు. చైనా, జపాన్ డైరెక్ట్‌గా తమ కరెన్సీలతో ట్రేడ్ చేసుకుంటున్నాయి. ఇండియా, జపాన్ మధ్య కూడా డాలర్ రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. వెనెజులా డాలర్ వదిలేసి గోల్డ్‌కి పెద్దపీట వేసింది. ఇరాన్, రష్యాలు తమ మధ్య డాలర్ లేకుండా డైరెక్ట్ ఐపోయాయి. అలాగే చైనా, బ్రెజిల్. ఇండియాకి ఇరాన్ డాలర్ లేకుండానే ముడిచమురు ఇస్తున్నది. మొత్తానికి డాలర్‌కి కష్టకాలం పోయిందని చెప్పడానికి లేదు. దీని అర్ధం.. బంగారానికి వన్నె తగ్గబోదని.

అన్నింటికంటే ముఖ్యం.. బంగారం ఉత్పత్తి ఏడాదికేడాది తగ్గిపోతున్నది. కొత్త గనుల అన్వేషణ దాదాపుగా లేదు. గుర్తించిన గనులను తవ్వడం లాభసాటిగా కనిపించడం లేదు. ప్రపంచ పరిణామాలతో సంబంధం లేకుండా చైనా గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ కొనుగోలు చేస్తున్నది. మరోవైపు అనేక రంగాలలో బంగారం వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అంతరిక్ష ప్రయోగాలు చేయాలన్నా, స్మార్ట్ మొబైల్ ఫోన్లు తయారు చేయాలన్నా, కంప్యూటర్ మదర్ బోర్డులు తయారుచేయాలన్నా బంగారం తప్పనిసరి. అవును. జగమంతా ఇప్పుడు పసిడిమయం. ఎలక్ట్రానిక్ వస్తువు లేకుండా మనిషి జీవితం ఒక్క అడుగు కూడా ముందుకుపడని పరిస్థితి. అవి కంప్యూటర్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, టీవీలు కావొచ్చు, మరొకటి కావచ్చు. అన్నింట్లో బంగారం వాడాల్సిందే. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్‌లు, చిప్‌లు.. ఇలా అన్నింట్లో గోల్డ్ వాడకం తప్పనిసరి అయిపోయింది. ఎల్లో మెటల్‌కి ఉన్న విశిష్ట లక్షణాలు దానిని ఆ స్థానంలో నిలబెడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో ప్రతి సంవత్సరం ఉపయోగిస్తున్న బంగారం ఎంతో తెలుసా? మూడొందల టన్నులు. ఈ వినియోగం రానురాను మరింత పెరుగుతుంది. మొబైల్ ఫోన్ హ్యాండ్ సెట్స్‌లో గోల్డ్ వాడకం కంప్యూటర్లలో కంటే ఎక్కువే.ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు కూడా గోల్డ్‌తో కుస్తీ పడుతున్నారు. బంగారం సూక్ష్మకణాలతో ఎన్నో ఉపయోగాలున్నట్టు నిర్ధారణ కావడం దీనికి కారణం. నానో టెక్నాలజీలో బంగారం సూక్ష్మకణాలను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు సైంటిస్టులు. బంగారం ఇప్పటిదాకా ఆభరణాల విలువను, ఇన్వెస్ట్‌మెంట్ విలువను మాత్రమే కలిగివుంది. ఇప్పుడు మానవాళి అభ్యున్నతికి దోహదపడుతున్నది. ఆఫ్రికా దేశాలలో మలేరియా వ్యాధిని మట్టుబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో గోల్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగారానికి ఉన్న విశిష్ట లక్షణాలు మెడికల్ పరీక్షల్లో, వ్యాధి నిర్ధారణలో బాగా పనికొస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా బంగారం ధరను ప్రభావితం చేసేవే. బంగారానికి బంగారు భవిష్యత్తు వుందని నిర్ధారించేవే.

బంగారం దిగుమతులపై గతంలో అనేక ఆంక్షలుండేవి. దిగుమతి సుంకాలు కూడా అధికంగా ఉండేవి. తొంభయ్యో దశకం వరకూ ఇది కొనసాగింది. ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా స్మగ్లింగ్ పెరిగింది. అసలు బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ఆధారంగానే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేరసామ్రాజ్యం విస్తరిల్లింది. తొంభయ్యో దశకంలో చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించారు. అప్పటినుంచి బంగారం స్మగ్లింగ్ కూడా తగ్గింది. స్మగ్లింగ్ ద్వారా బంగారం తెచ్చుకోవాల్సిన అవసరం వ్యాపారులకు తప్పిపోయింది. ఇరవై ఏళ్లుగా బంగారం స్మగ్లింగ్ అనేది లేదు. కానీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. అయినప్పటికీ బంగారం అమ్మకాలు తగ్గలేదు. ప్రజలకు ఎల్లో మెటల్‌పై మోజు తగ్గలేదు. ఫలితంగా మళ్లీ స్మగ్లింగ్ పెరిగింది.

రామాయణం ఆసాంతం పసిడికావ్యం. అది అయోధ్యకాండ కానివ్వండి, అరణ్యకాండ కానివ్వండి, సుందరకాండ కానివ్వండి.. రామాయణం ప్రతి పేజీలోనూ కనిపించేది, వినిపించేది.. బంగారమే. శ్రీరామచంద్రుడు సీతాదేవిని మనువాడినప్పుడు అలంకరించుకున్న ఆభరణాలు, అయోధ్యను ఏలినప్పుడు ధరించిన కిరీటాలు, వజ్రాభరణాలు అనేకం. వాటి సంగతి పక్కనపెడదాం. రామాయణం ప్రతి కీలకఘట్టంలో బంగారం ప్రమేయం కనిపిస్తుంది. సీతారాముల వనవాసం సీనులో ముఖ్యమైన మలుపులన్నీ బంగారానివే. పసిడి లేడిని చూసి సీతమ్మవారు ముచ్చట పడకపోతే, ఆ బంగారు జింకను తేవడానికి రాముడు వెళ్లకపోతే, అన్నను వెతుక్కుంటూ లక్ష్మణుడు బయలుదేరకపోతే.. రామాయణం మరో రకంగా ఉండేదేమో. రామాయణంలో విలన్ రావణుడు. లంకలో రావణుడు నివసించే విశాల భవంతి బంగారంతో చేసినదే. నిజానికి దానిని శివపార్వతులకోసం విశ్వకర్మ నిర్మించాడు. కానీ, శివుడి నుంచి రావణుడు తెలివిగా లాగేసుకున్నాడట. ఆ కథ ఏమైనప్పటికీ.. సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లిన మార్గం ఆనవాళ్లను తెలిపేది బంగారం నగలే. ఆకాశమార్గాన రావణుడు తనను ఎత్తుకెళ్తుంటే.. పైనుంచి సీతాదేవి విసిరిన నగలు లంకకు వెళ్లే దారిని చూపించాయి. అక్కడ లంకలో అశోకవనంలో శోకసంద్రంలో ఉన్న సీతని హనుమంతుడు గుర్తించి, రాముడి దూతనని రుజువు చేసుకోవడానికి చూపించేది బంగారం ఆభరణాన్నే. సీతాదేవి కూడా తన ఆచూకీకి గుర్తుగా రాముడికి పంపిస్తుంది బంగారం ఆభరణాన్ని.

పెట్టుబడికి బంగారమే:
బంగారం కొనడం మనకు సంప్రదాయంగా వస్తున్నది. బంగారం లేని ఇల్లు అంటూ ఉండదు మన దగ్గర. పండగలప్పుడు.. వేడుకలప్పుడు బంగారం తళుక్కుమనకపోతే ఆ పండుగ పండగే కాదు.. ఆ వేడుక వేడుకే కాదు. బంగారు నగలపై మనకున్న మోజును పక్కనపెడితే చాలామంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా కూడా కొంటుంటారు. ఎందుకు బంగారానికి ఇంత ప్రాధాన్యత ఇస్తారంటే.. ప్రస్తుత రోజుల్లో బంగారంతో పోటీపడి పెట్టుబడి చేసేది వేరేదేదీ లేదు. మిగతా ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా సంక్షోభంలో ఉన్నాయి. ఆఖరికి రియల్ ఎస్టేట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చాలామంది బంగారాన్ని పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. డాలర్‌తో సమానంగా గోల్డ్‌ను చూడటమే ఈ పరిస్థితికి కారణం. నమ్మిన వాళ్లకు ఇది నిజంగానే బంగారు పెట్టుబడిగా మారుతున్నది. 
-పాపారావు, మార్కెట్ విశ్లేషకుడు

బంగారం ఇప్పుడొక పెట్టుబడి
బంగారం ఇప్పుడొక పెట్టుబడి సాధనంగా మారింది. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి అధికంగా ఉంటుందని గత పదేళ్లలో రుజువైంది. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇకముందు కూడా లాభాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే బంగారంలో పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం కొనాలనుకుంటే ఈటీఎఫ్‌లు ఉన్నాయి. కమాడిటీ మార్కెట్‌లోనూ బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లు మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. మ్యూచువల్ ఫండ్స్‌కి వర్తించే పన్ను రాయితీలు గోల్డ్ ఈటీఎఫ్ లకూ వర్తిస్తాయి. ఇది కేవలం పేపర్ ట్రేడింగ్ కాదు. ఈటీఎఫ్‌లు నిర్వహించే సంస్థలు అందుకు తగినట్టుగా బంగారాన్ని కూడా నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇక ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్ లాంటి కమోడిటీ మార్కెట్లలో అయితే అతి తక్కువ మార్జిన్ తో బంగారం కొనేసుకోవచ్చు. 
NewGOLD2

మానవ దేహం అనేక ఖనిజాలు, లోహాలు, ధాతువులకు కేంద్రం. ఇనుము, ఫాస్పరస్, గంధకం, నీరు, ఉప్పు.. ఇలా అనేకం ఉంటాయి మానవ దేహంలో. ఈ భూమ్మీద ఏమేం దొరుకుతాయో అవన్నీ ఉంటాయి మానవ శరీరంలో. మరి బంగారం మాత్రం ఉండదా? ఎందుకుండదూ? బంగారం కూడా ఉంటుంది. ప్రతి మనిషి శరీరంలో అంతో ఇంతో గోల్డ్ ఉంటుంది. అది రక్తంలో కలిసి ప్రవహిస్తుంటుంది. ఒక్కో మనిషి శరీరంలో పాయింట్ రెండు మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. మీరెప్పుడైనా రక్తదానం చేశారంటే.. బంగారాన్ని దానం చేసినట్టే. మానవ దేహంలో ఉన్న బంగారం చాలా తక్కువ పరిణామమే కావచ్చు. కానీ బంగారం అంటే ఏమాత్రం గిట్టనివారి శరీరంలో సైతం బంగారం ఉంటుందనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ బంగారాన్ని బయటికి తీయడం కష్టం. ఒకవేళ తీసినా దానితో ఏ నగోనట్రో చేయించుకోవడం ఇంకా కష్టం. ఎనిమిది గ్రాముల బరువుండే ఓ బంగారు కాసును తయారు చేయించుకోవాలంటే.. ఎంత మంది శరీరాల్లోని బంగారం తీయాలో తెలుసా? నలభై వేల మందినుంచి. సో.. ప్రతి మనిషి శరీరంలో గోల్డ్ ఉందని చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ, బయటికి తీయడానికి కాదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list