MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

దివ్య స్మరణ_DivyaSmarana


దివ్య స్మరణ DivyaSmarana AllisWell Antaryami Eenadu Eenadu Paper BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


దివ్య స్మరణ
‘అందరూ బాగుండాలి’ అనేది కేవలం ఓ వాక్యం కాదు. అది ఒక దివ్యమంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే, అదే గొప్పగా పనిచేస్తుంది. ప్రయోగించి చూసినవారికి దాని ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి.

‘అందరూ బాగుండాలని అనుకోవాల్సిన అగత్యం ఏమిటి’ అంటూ ఎదురుప్రశ్న వేసేవారున్నారు. ‘ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది’ అన్నది వారు వేసే రెండో ప్రశ్న.

అందరూ బాగుండాలని అనుకోవడం వెనక రహస్యం ఉంది. ‘సర్వేజనా స్సుఖినో భవంతు’ అని పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునే మనిషి, తానూ బాగుంటాడు.

ప్రతి రోజూ- తనకు సంబంధం లేని మనిషి క్షేమం కోరి హృదయపూర్వక ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం! వాటి కోసం అతడు ఎక్కడికీ వెళ్లనక్కరలేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే, శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకంపనలు ఏర్పడి, ధ్యానంగా మారి, రోగాల్ని దూరం చేస్తాయి. ఇది యోగుల బోధ.

లోక క్షేమం కోరుకునేవారి బాగును భగవంతుడే చూస్తాడంటారు. ఓ నలుగురు ఇళ్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టుకింద ఎవరు ఉండనిస్తారు? నిజాయతీగా, నిస్వార్థంగా ఉండేవారు; నలుగురి క్షేమమూ కోరేవారే లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి. దాన్ని ఏ దేవుడి పేరుతోనైనా పిలుచుకోవచ్చు.

అందరికీ నీడనిచ్చే చెట్టుగా మారాలి మనిషి. పచ్చదనాన్ని కాపాడాలి. అందరికీ వెలుగునిచ్చే సూర్యుడి ముందు అతడు మోకరిల్లాలి. గాలిని కలుషితం చేయకూడదు. గుక్కెడు నీటి కోసం విలవిలలాడేవారికి చెలమగా మారాలి. పర్యావరణాన్ని కాపాడాలి. భూమిని నివాసయోగ్యం చేయాలి. ప్రేమపూర్వకమైన మాటలకు వందనం చేయాలి.

యుద్ధం చేయనంటూ వెనుతిరిగిన అర్జునుణ్ని కృష్ణుడి మాటలే మార్చాయి. విశ్వరూపాన్ని చూసి, విశ్వంలో తానూ భాగమేనని గ్రహించి, అంతిమ సత్యం తెలుసుకున్న ప్రతి నరుడూ అర్జునుడే!

వివేకానందుడి పలుకులు విశ్వమంతటా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటాయి. అందరి కోసం గాంధీజీ చెప్పిన మాటలు, చేసిన పనులు ఎంతో గొప్పవి.

లోకహితం కోరే మానవుడు సహజంగానే దివ్యత్వాన్ని సాధిస్తాడు. అతడికి ఆ అర్హత, యోగ్యత కలిగించి నారాయణుడు లక్ష్యం నెరవేర్చుకుంటాడు. సకల జనహితమే ఈశ్వరుడికి ఇష్టమైన మంత్రం. ‘ఓం నమశ్శివాయ’ అంటే ఆయన ప్రీతి చెందుతాడో లేదో తెలియదుగాని, ఇతరుల హితం కోరే చిన్నప్రాణినైనా ఆయన ప్రేమించక మానడు.

సర్వుల హితం కోరడంలో ప్రేమ ఇమిడి ఉంటుంది. ఎవరి కోసం వారే ఉంటే, ఆ జీవితం నిష్ఫలం. దానికి ప్రాముఖ్యం, అర్థం ఉండవు. మనిషి జీవితం ఏ క్షణం నుంచి ఇంకొకరి కోసం సాగుతుందో, ఆ క్షణం నుంచే సేవాభావం వెలుగొందుతుంది. సేవ కేవలం హృదయానికి సంబంధించినదై ఉండాలి. దాన్ని ఆలోచనలు, మాటలు అనుసరించాలి. ఆలోచనను హృదయం ఎప్పుడూ మంచి దారిలోనే నడిపిస్తుంది. హృదయం ఒక దిక్సూచి. ప్రేమకు అది కేంద్రస్థానం. సేవ, ప్రేమల్ని మనిషి కళలుగా నేర్చుకోవాలి. అదే సమగ్ర జీవిత కళ. అహంకారాన్ని విడనాడాలి. ఉపనిషత్తులకు ప్రాధాన్యాల పట్టిక ఉంది. అందులో అన్నింటికన్నా ముందు ఉండేది మానవత్వమే.

సకల జీవరాశులూ చల్లగా ఉండాలన్న భావన పెరిగేకొద్దీ, మనిషి అసలైన ఆనందానికి అర్థం తెలుసుకుంటాడు. అటువంటి నామస్మరణ ఉన్న చోట, మంచి వెల్లివిరుస్తుంది. అప్పుడే రుషులు సంతోషిస్తారని, దేవతలు దీవిస్తారని ఉపనిషత్‌ వాక్యం!
- ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం