MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

సంతృప్తే పరమావధి_SelfSatisfaction


సంతృప్తే పరమావధి SelfSatisfaction HappySatisfaction Satisfaction DevineHappyness BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu AndhraJyothi

సంతృప్తే పరమావధి


అసంతృప్తికి ప్రధాన కారణం ఎదుటి వారితో పోల్చుకోవడం. వేరే సంస్థలతో పోల్చుకుంటే మన సంస్థ తక్కువగానే కనిపిస్తుంది. వేరే వ్యక్తుల ఆర్థిక స్థితులతో పోల్చుకుంటే మన ఆర్థిక స్థితి తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు పోల్చుకోవడం మానేయాలి. పైగా ఇందులో ఒక విశేషం ఉంది. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలనుకుంటాం. కానీ ఎందుకు ఉండలేకపోతున్నామో చూద్దాం. వ్యాధికి మూలం కనుక్కుంటేనే కదా మందు వేసేది.

ఒక సంసార జీవితంలో ఏది ప్రధానమో ఆలోచించాలి. ఉద్యోగంలో ఏది ప్రధానం? ఒక సినిమా చూశావు. అందులో ఏది ప్రధానం? సంసారంలో ఏది ప్రధానం? భార్యాభర్తల మధ్యన ఉండే అనురాగమే ప్రధానం. దానిపైనే తల్లితండ్రులను చూసే విధానం, కన్న పిల్లలను పెంచే విధానం, బంధుమిత్రులను ఆదుకునే విధానం, లోకంలో బతుకంతా గడిపే విధానం ఆధారపడి ఉంటుంది.

అన్నిటికీ మూలం ఇద్దరి మధ్య అనుబంధమే. మరి ఈ ఇద్దరి మధ్య అనుబంధం దేని మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు అని చాలా మంది అంటారు. కానీ డబ్బు అనేది ప్రాథమిక అవసరాలు తీర్చే వరకు మాత్రమే. తరువాత డబ్బంత జబ్బు ఇంకోటి లేదు. డబ్బుంటే దంపతులు బాగుంటారు అనుకోవడం భ్రమ. పేదరికంలో ఉన్న వారు అనుకుంటుంటారు, డబ్బు లేకపోవడం వల్లే మనకు కష్టాలు వస్తున్నాయి అని. కానీ అది నిజం కాదు. పేదరికాన్ని అవగాహన చేసుకోలేకపోవడం వల్లే బాధలు. అలాగే ఐశ్వర్యం వల్ల ప్రేమ ఉండదు. మనం ఐశ్వర్యాన్ని కూడా అవగాహన చేసుకోలేక పోతున్నాం. నిజానికి దంపతుల మధ్య ఉండాల్సింది ఏమిటంటే ఒకరిని చూస్తే మరొకరికి నా మనిషి! అన్న ఫీలింగ్‌ కలగాలి. బతకడానికి ఏమేం చాలో జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు ఇలా చెబుతున్నారు.

ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు
రొట్టెలొక్కటో రెండో భుజింప డెందమలరింపగ
శ్రీమతి చెంతనుండగ పండుగకాదె జీవితము
భ్రష్ట నికృష్ఠుల కొలువు సేయుటల్‌ దండుగ కాదె
జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదె!

నిజంగా దంపతుల మధ్య ఒకరిపట్ల మరొకరికి శారీరక, మానసిక ఆకర్షణ ఉంటే ఉండటానికి పాక సరిపోదా! ఆ పాకలో ఉండటం వల్లే సర్దుకుని పడుకుంటారు. చలికాలంలో ఆ పాకలోనే సర్దుకుని, ముడుచుకుని పడుకోవడంలోనే చాలా ఆనందాలుంటాయి. అంటే పాకలో ఉండమని కాదు. ఉండటానికి పాక చాలు అనే విషయం అర్థమయితే దానికన్నా వసతి కొంచెం బాగున్నా గొప్పగానే అనిపిస్తుంది. ‘నాకు ఈ ఇంట్లోనే ఉండాలనుంది. నీతోనే ఉండాలనుంది’ అనడం గొప్ప విషయం.

డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవడం తప్పు. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు కాదు, పిల్లాడి చేతికి కత్తి ఇచ్చినట్టు. చాలా ప్రమాదం. వినియోగం తెలియని వాడి దగ్గర డబ్బు ఉండటం కూడా అంతే ప్రమాదం. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటాడు. రొట్టెలొక్కటో రెండో భుజింప! అన్నాడు. ఆ మాట ఎప్పుడో అన్నాడు కానీ ఇప్పుడు రెండు రొట్టెలు తినే వాళ్లే ఉన్నారు. ఇప్పుడు రెండు పూటలా అన్నం తింటున్నాడూ అంటే కూటికి లేని పేదవాడే అయి ఉంటాడు. కోటీశ్వరుడు అన్నం తినడు.

మనం పనిచేసే చోట ఒక అసౌకర్యం కనిపించగానే దాని భూతద్దంలో పెద్దది చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ చూపు మార్చుకోవాలి. భార్యలో గానీ, భర్తలో గానీ, యజమానిలో గానీ, నౌకరులో గానీ ఒక లోపాన్ని చూసినప్పుడు ఆ ఒక లోపాన్ని అట్టే అట్టిపెట్టాలి. దానికి ఇంకొకటి కలపకూడదు. ‘అన్నీ బాగున్నాయి, ఇదొక్కదాన్ని సరిదిద్దుకోలేవా’ అని అనాలి. అంతేకానీ అదొక్కటే మహాపాపం అన్నట్టుగా వ్యవహరించకూడదు. మనకు ఎవరితోనైనా విరోధం వస్తే ఇక లోపాలే వెతుకుతూ ఉంటాం. అన్ని గుణాల్లో ఒక్క లోపాన్ని మన్నించలేరా? ఆలోచించండి. 
డా. గరికిపాటి నరసింహారావు 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

జాతకచక్రం