MohanPublications Print Books Online store clik Here Devullu.com

అమర్‌నాథ్‌ యాత్రకు ఎలా వెళ్లాలి ?_how to go to amarnath yatra?

అమర్‌నాథ్‌ యాత్రకు ఎలా వెళ్లాలి ? how to go to amarnath yatra? AmarnathYatra AmarnathYatraRegistration Shriamarnathjishrine AmarnathTemple BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu ShriAmarnathYatra

అమర్‌నాథ్‌ యాత్రకు ఎలా వెళ్లాలి ? how to go to amarnath yatra? AmarnathYatra AmarnathYatraRegistration Shriamarnathjishrine AmarnathTemple BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu ShriAmarnathYatra






భం భం బులారే
మంచుకొండ‌ల్లో మ‌హిమ లింగం





అమర్‌నాథ్‌ యాత్ర..

ఇప్పుడెక్కడుంది.. జూన్‌లో కదా!

ఇక్కడెక్కడుంది.. కశ్మీర్‌ దాకా వెళ్లాలి!

అనుమతి ఎలా పొందాలి?

వైద్యపరీక్షలు మాటేమిటి?

మంచుకొండల్లో కొలువుదీరిన

మ‘హిమ లింగాన్ని’ దర్శించడంలో భక్తులకున్న సందేహాలివి!

అమర్‌నాథ్‌ యాత్ర.. పవిత్రమైనది.

ఉద్రిక్తతల మధ్యనే ప్రశాంతత చేకూర్చేది.

వాతావరణం అనుకూలిస్తే.. ఆనందం.

వరణుడు అడ్డగిస్తే.. ఆందోళన.

ఇంకా చెప్పాలంటే.. ‘భయ’భక్తుల మధ్య కొనసాగే యాత్ర ఇది!

ఇన్ని విశేషాలున్న అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ చివరి వారంలో మొదలవుతోంది. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి! యాత్రకు ముందస్తు ప్రణాళిక వివరాలు మీ కోసం..




అమర రహస్యం




అమర్‌నాథ్‌ని ముక్తి క్షేత్రంగా చెబుతారు. ఇక్కడి గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం... మహాప్రళయ కాలంలో వెలిసిన లింగమని అభివర్ణిస్తారు. పరమేశ్వరుడు.. పార్వతికి సృష్టి రహస్యం ఇక్కడే చెప్పాడని క్షేత్ర పురాణం. ఈ రహస్యాన్ని ఎవరూ వినకూడదని నందీశ్వరుడిని పహల్గామ్‌లో, నెలవంకను చందన్‌వాడీలో, వాసుకిని శేష్‌నాగ్‌ దగ్గర, వినాయకుడిని మహాగణేశ పర్వతం వద్ద, పంచభూతాలను పంచతరణి సమీపంలో వదిలిపెట్టాడట. ఒక్క పార్వతిని మాత్రమే అమర్‌నాథ్‌లోని గుహాలయంలోకి తీసుకెళ్లి.. ఆనంద నాట్యం చేసి.. ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని ఆమెకు వివరించాడని భక్తుల విశ్వాసం. ఈ రహస్యాన్ని గుహ సమీపంలో ఉన్న ఒక పావురాల జంట విందట. అమర రహస్యాన్ని విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని చెబుతారు. నేటికీ అమర్‌నాథ్‌ ఆలయంలో పావురాలు కనిపించడం విశేషం.

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఓ అందమైన గుహ. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. అదే అపర కైలాసంగా అభివర్ణించే అమర్‌నాథ్‌ క్షేత్రం. ఈ యాత్రంటే అందరికీ ఆసక్తే! యాత్రకు వెళ్లే వాళ్లూ, వెళ్లని వాళ్లూ.. అందరూ దీని గురించి ఆరాలు తీస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా.. అమరనాథుడి హిమలింగాన్ని దర్శించుకోవాలని పరితపిస్తారు. భోళాశంకరుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా యాత్రికులు తరలివస్తారు. ఈ పవిత్రయాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభం అవుతుందని అమర్‌నాథ్‌ బోర్డు, జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. సందడి మొదలైంది. శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 26)తో యాత్ర ముగుస్తుంది.




ఒక్కోసారి భారీ వర్షాల కారణంగా.. యాత్ర ఒకట్రెండు రోజులు వాయిదా పడుతుంటుంది. అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడం మంచిది.




అండగా బండారాలు

బేస్‌ క్యాంప్‌లో అద్దెకు విడిది డేరాలు ఉంటాయి. అద్దె రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి ధర పెరుగుతుంది. ఒక్కో డేరాలో నలుగురు నుంచి ఆరుగురు ఉండొచ్చు. డేరాల నిర్వాహకులే యాత్రికుల స్నానాల కోసం వేడినీళ్లు అందిస్తారు. స్థానిక దుకాణాల్లో.. చేతులకు, కాళ్లకు వేసుకునే తొడుగులు, స్వెట్టర్లు, కోట్లు, బూట్లు అందుబాటు ధరలోనే దొరుకుతాయి. యాత్రికులకు ఉచిత భోజనం, ఫలహారం అందించే కేంద్రాలు (బండారాలు) యాత్రికులను సాదరంగా స్వాగతిస్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు.. ఆయా ప్రాంతాల రుచులను యాత్రికులకు అందుబాటులో ఉంచుతారు.

పేర్ల నమోదు

యాత్ర నోటిఫికేషన్‌ ఈ నెలలోనే అమర్‌నాథ్‌ బోర్డు జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ‌www.shriamarnathjishrine.com దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 4 పాస్‌పోర్ట్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు జతపరచాలి. నిర్దేశించిన ఆస్పత్రిలో ఫిబ్రవరి 15 తరువాత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మార్చి 1 నుంచి ప్రకటనలో తెలిపిన బ్యాంకుల్లో (పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్ము-కశ్మీర్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌) ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. రూ.50 రుసుం చెల్లించి.. యాత్రకు వెళ్లదలచుకున్న తేదీలు నమోదు చేయించి.. గుర్తింపు పత్రం తీసుకోవాలి. యాత్రకు వెళ్తున్న వారికి రూ.లక్ష ప్రమాద బీమా కల్పిస్తారు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 31.




పోస్ట్‌‌పెయిడ్‌ తప్పనిసరి




జమ్ము కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ ఫోన్లు పనిచేయవు. పోస్ట్‌పెయిడ్‌ ఫోన్‌ దగ్గరుండాల్సిందే. అక్కడి మొబైల్‌ దుకాణాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోస్ట్‌పెయిడ్‌ సిమ్‌లు అమ్ముతారు. వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం చూపించి సిమ్‌కార్డు కొనుక్కోవచ్చు.




తనిఖీల తర్వాతే

శ్రీనగర్‌ నుంచి రెండు మార్గాల్లో అమర్‌నాథ్‌ యాత్ర సాగుతుంది. మొదటిది బాల్టాల్‌ బేస్‌ క్యాంప్‌ మీదుగా, రెండోది పహల్గామ్‌ మీదుగా. శ్రీనగర్‌ నుంచి బాల్టాల్‌ బేస్‌ క్యాంప్‌కు 95 కిలోమీటర్లు. ఈ దారి వెంబడి ఎత్తయిన పర్వతాలు, మంచుదుప్పటి కప్పుకున్న కొండలు, దట్టమైన అడవుల్లోని దేవదారు వృక్షాలు మనసును దోచుకుంటాయి. శ్రీనగర్‌ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో బేస్‌ క్యాంపులకు వెళ్లొచ్చు. క్యాంప్‌లో భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. యాత్ర పత్రాలు, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు సిబ్బందికి చూపించాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే బేస్‌క్యాంప్‌లోకి ప్రవేశం లభిస్తుంది.

పహల్గామ్‌ నుంచి

శ్రీనగర్‌ నుంచి పహల్గామ్‌ సుమారు 91 కిలోమీటర్లు ఉంటుంది. పహల్గామ్‌ బేస్‌క్యాంప్‌ నుంచి అమర్‌నాథ్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరం. కాలినడకన చేరుకోవాలి. గుర్రాలు, డోలీలు ఉంటాయి.

* పహల్గామ్‌ నుంచి చందన్‌వాడీ మీదుగా ముందుకెళ్లాలి. మూడున్నర అడుగుల దారిలో.. కొండవాలులో.. నడక కష్టంగానే ఉంటుంది. పట్టు కోసం చేతి కర్ర సాయం తీసుకోవాలి.

* చందన్‌వాడీ నుంచి పిస్సూటాప్‌, పంచతరణి మీదుగా 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే శేష్‌నాగ్‌ వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి. ఈ పర్వతాల చెంత ఉన్న నీలిరంగు తటాకం అద్భుతంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి ఆభరణం అయిన వాసుకి ఈ సరస్సులో నిద్రిస్తుందని విశ్వసిస్తారు. శేష్‌నాగ్‌ నుంచి 18 కిలోమీటర్లు వెళ్తే అమర్‌నాథ్‌ గుహకు చేరుకోవచ్చు.

* పహల్గామ్‌, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లే సదుపాయం కూడా ఉంది. ధర రూ.2,000 నుంచి రూ.3,000 వరకూ ఉంటుంది.

యాత్ర తీరు

యాత్రకు అనుమతి వచ్చాక.. ప్రయాణానికి సన్నద్ధం అవ్వాలి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే యాత్రికులు ముందుగా దిల్లీకి చేరుకోవాలి. సమయం కలిసి రావాలంటే విమానంలో వెళ్లొచ్చు. దిల్లీ నుంచి శ్రీనగర్‌, జమ్ముకు విమానంలో చేరుకోవచ్చు. రైలుమార్గంలో అయితే జమ్ముకు వెళ్లాలి. మొదటిసారి యాత్రకు వెళ్లే వాళ్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు ట్యాక్సీలో ప్రయాణిస్తే కశ్మీర సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఎత్తయిన కొండలపై ప్రయాణం, లోయల్లో విహారం, సొరంగ మార్గాల్లో దూసుకుపోవడం.. భలేగా ఉంటుంది.




13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆరు నెలలు నిండిన గర్భవతులను యాత్రకు అనుమతించరు.







వేకువ జామునే

బేస్‌క్యాంపు చేరుకున్న మరుసటి రోజు వేకువజావ నుంచే అమర్‌నాథ్‌ యాత్ర మొదలవుతుంది. బాల్టాల్‌ బేస్‌క్యాంప్‌ నుంచి అమర్‌నాథ్‌కు సుమారు 16 కి.మీ. ఈ యాత్ర కఠినంగా ఉంటుంది. నడవలేనివారికి గుర్రాలు, డోలీలు అద్దెకు దొరుకుతాయి. గుర్రాల మీదుగా వెళ్లే వారు.. గుర్రం యజమాని గుర్తింపు పత్రాన్ని తమ దగ్గర ఉంచుకోవాలి. యాత్ర ప్రారంభంలో భద్రతా సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఆ సమయంలో గుర్రాలు ఒక దారిలో.. యాత్రికులు మరోదారిలో వెళ్తారు. తనిఖీ పూర్తయ్యాక మళ్లీ గుర్రం యజమానిని కనిపెట్టడంలో.. ఈ గుర్తింపు పత్రం సాయపడుతుంది. నడకదారిలో ఉచిత ఫలహారాలు లభిస్తాయి. యువకులు, ఉత్సాహవంతులు మధ్యాహ్నానికల్లా అమర్‌నాథ్‌ ఆలయానికి చేరుకుంటారు. బాల్టాల్‌ క్యాంప్‌ నుంచి హెలికాప్టర్‌లో కూడా అమర్‌నాథ్‌ చేరుకోవచ్చు. ధర రూ.రెండు వేల లోపు ఉంటుంది.

ధవళకాంతులు

అమరనాథుడి గుహాలయానికి కిలోమీటర్‌ ముందుగానే సెల్‌ఫోన్లు, బూట్లు, బ్యాగులు, ఇతర సామగ్రిని అక్కడి గుడారాల్లో, దుకాణాల్లో భద్రపరుచుకోవాలి. మెట్ల మీదుగా కిలోమీటర్‌ వెళ్తే గుహాలయం వస్తుంది. వెండి కొండ వెలుగు రేడు దర్శనంతో భక్తుల అలసటంతా మాయమవుతుంది. ధవళకాంతుల్లో మెరిసిపోయే లింగానికి ప్రణమిల్లి.. రెండు నిమిషాలు అక్కడే గడిపి.. ఆ స్వామిని తలుచుకుంటూ వెనుదిరుగుతారు. సాయంత్రం ఆరుగంటల హారతి తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు. దర్శనం కాగానే.. బేస్‌క్యాంప్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. వాతావరణం అనుకూలించకపోతే.. అక్కడే గుడారాల్లో ఉండి.. మర్నాడు బేస్‌ క్యాంప్‌కు బయల్దేరుతారు. అక్కడి నుంచి ట్యాక్సీలో శ్రీనగర్‌కు తర్వాత జమ్ము మీదుగా దిల్లీ చేరుకుంటే అమర్‌నాథ్‌ యాత్ర పూర్తయియినట్టే!

- నిమ్మల ప్రకాశ్‌రెడ్డి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list