MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

వసుధైక కుటుంబం_VasudikaKutumbam


వసుధైక కుటుంబం VasudikaKutumbam Univers Galaxy World Earth BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Antaryami Eenadu Eenadupaperవసుధైక కుటుంబం


విశ్వంలో ఏదీ- దేనికీ దూరంగా లేదు. దూరాభారం అసలే కాదు. సమస్త విశ్వంలోనూ స్థాణురూప దైవం నిండి ఉన్నట్లు చెబుతారు. అప్పుడు అంతటా ఏకరూపత ఉంటుంది కాబట్టి, దూరానికి తావే లేదని విశ్వసించాలి. కాకపోతే, మాయ అలా భ్రమ కలిగిస్తోంది. కమలం చిన్నది. దాని ఉనికి, పరిమాణం ఎంత? అత్యంత దూరాన అంతరిక్షంలో ఉండే సూర్యుడికి, దానికి సంబంధమేమిటి? అనుబంధం, హృదయానుబంధనం, అపురూప అనుసంధానం- దాన్ని ఏమని పిలవాలన్నదీ మరో ప్రశ్న.

వెన్నెల కిరణాలకే వికసించే కలువ- తన కలువరేకులంత కళ్లతో, నయనాల దిన్నెల్లో వెన్నెలను ఆస్వాదిస్తోందని అనుకోవాలి. చంద్రుడే వెన్నెల ప్రవాహాలను పంపి, సుదీర్ఘ స్పర్శలతో కలువ రేకులను విప్పుతున్నట్లు భావించాలి. నేలమీద మడుగులో కలువ. అందనంత దూరాన అంతరిక్షంలో చంద్రుడు. ఈ ప్రేమానుబంధానికి అర్థం, అంతరార్థం గ్రహించాలి. అడవిలో ఉసిరి. సముద్రంలో ఉప్పు- ఇది సురుచిర సమ్మేళనం. ఇది ఆకు, వక్క, సున్నం కలగలిసిన పక్వ పరిమళ తాంబూల చర్వణం.

అంతులేనంత ఉన్నతోన్నత పర్వతాలు. ఆ పక్కనే లోతు అంతుపట్టని లోయలు. నిర్గమ జలరాశి వద్దనే సముద్రాల లోపలి బడబాగ్నులు. స్వభావాలు, బలాబలాల్లో సమఉజ్జీలన్నంత సామరస్యం కనిపిస్తుంది. అంతా సమతుల్య జీవనం. ఒకదాని అవసరం మరోదానికి ఉంది. భగవంతుడికి తప్ప- ఈ లోకంలో ఏదీ మరోదాని సహకారం లేకుండా మనలేదు. మహాపర్వతమైనా ‘భూమిపీఠం’ ఉండాలి. బడబాగ్నికైనా ‘వాయుఊతం’ కావాలి. ఈ బంధాలకు అంతుబట్టని దూరాలు అతకవు. అవి లేవు కూడా!

ఇది ఏకసూత్ర విస్తరిత విశ్వం. బీజరూప విస్ఫోటక లోకం. ఏది ఎక్కడ ఊపిరి పోసుకున్నా, విస్తరించినా ఒక సూక్ష్మజీవి అవసరానికి కిందికి దిగి రావాల్సిందే. పైకి పాకిపోవాల్సిందే. భూమి అవసరానికి ఆకాశం అమృత జలాల్ని వర్షిస్తుంది. వాటి కోసం సముద్ర జలాలు ఆవిరులై మేఘాలుగా పైకి పయనిస్తాయి. వృక్షాలు వింజామరలు వీచి, వాటి ఉష్ణాన్ని శీతలీకరిస్తాయి. సానుకూలతల జీవన సరళి ఇది. పరస్పర సహకార ప్రవర్తనా శైలి ఇదే!

శ్వాసను సైతం లోకం కోసం పీల్చే వృక్షాలున్నాయి. కోయిల పాపల కోసం గూళ్ల పొత్తిళ్లుపరిచే కాకులున్నాయి. ఒంటరి జీవనం, ఏకాకితనం ఎక్కడా లేవు.

ఈ విశ్వం తనకు తానే ఎంతో దగ్గర. అంతకు మించి, పొదుపరి. ఒక గూడులా, పొదలా లక్షలాది జీవరాశుల్ని, అగణిత స్థావర జంగమాదుల్ని అది పరిష్వంగంలో పొదువుకుంటుంది. ప్రకృతి నడుమ సేదదీర్చే విశ్వజననిలా అలరారుతుంది.

విశ్వం అంటే విష్ణువు. విష్ణువు అంటే విశ్వం. అంతా విశ్వసర్వం. ఆ విరాటరూపుడితో స్వేచ్ఛగా నడయాడే సంతానం. అందరూ రక్త సంబంధీకులు, ఆత్మ బంధువులు. అన్నీ కలిసిన ఈ సువిశాల విశ్వగర్భంలో- ఎవరికీ ఎవరితోనూ పేచీ లేదు. పోటీ లేదు. ఈ సూత్రాన్ని అన్వయించుకుంటే, అలవాటు చేసుకుంటే- విశ్వమే వసుధైక కుటుంబం అవుతుంది. విశ్వాభిరామంగా మారుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

జాతకచక్రం