దీపావళి
Deepavali
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి,కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తులదీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి,సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.
దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.
ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి,సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.
ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా,విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది.
అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం
నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
దీపావళి
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.
అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.
స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.
అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతి ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565