MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉషశ్రీ భాగవతం vushasri bhagavatham | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

       
                  
    పలికెడిది భాగవతమట
    పలికించు విభుండు రామభద్రుండట నే
    పలికిన భవహర మగునట
    పలికెద వేరొండు గాథ పలుకగనేలా II

                                                      *    *    *    *    *
    
    జగద్రక్షకుడు, జగన్నాధుడు, జగదారాధ్యుడు, శిష్టరక్షణ దీక్షితుడు, దుష్టశిక్షణ కేళీ పరాయణుడు అయిన శ్రీమన్నారాయణుని  దివ్య చరిత్రలు వినాలనే కుతూహలంతో వున్న శౌనకాది మహామునులను సర్వ పురాణ కథా విషయ కోవిదుడైన సూత మహర్షి చిరునవ్వుతో తిలకిస్తూ - 

    మునీంద్రులారా! ముందుగా నరనారాయణులకు నమస్కరించి, వాగ్దేవతకు అంజలించి,  శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలను ఆపోశనం పట్టిన వ్యాస మునీంద్రులను మనసా ఆరాధించి, ఆయన అనుగ్రహ విశేషంతో అందుకున్న శ్రీమధ్బాగవతం వినిపిస్తున్నాను. సావధాన చిత్తులై ఆకర్ణించండి. 

                      *      *        *         *       *    
    కలియుగ మానవులు ఆహార, విహారాలను యధేచ్చగా సాగించడం వల్ల దుర్బల శరీరులవుతారు.   అది కారణంగా వారికి ఆయుర్దాయమూ, బుద్దిశక్తి, ధైర్యమూ క్షీణిస్తాయి. ఆ దశలో తపోదీక్షకు తగిన దారుఢ్యం వుండదు. యజ్ఞ, యాగాదులు నిర్వహించడానికి వారి మనస్సు సుముఖంగా వుండదు. విలాస జీవితం గడుపుతూ పరమార్దాన్ని సాధించే మార్గం కోసం అన్వేషించే రోజులు కొద్దిగా వుంటాయి. ఆ రోజులలో వారిని తరింపజేయాలంటే  హరి నామస్మరణం, నారాయణ కథా శ్రవణం - రెండే మార్గాలు అని గ్రహించిన పరాశరనందనులు వ్యాస మహర్షి  మహావిష్ణువు లీలలను కథలుగా చెపుతూ భాగవతంగా -  అదే భక్తజన కల్పతరువుగా - శుక యోగీంద్రులవారికి  బోధించారు. 

    శకయోగీంద్రులు వారం రోజులలో దీనిని పరీక్షిత్తుకు వినిపించారు. అందులో నాకు అందిన దానిని, అర్దమైన దానిని భక్తితో వినిపిస్తాను. ఈ గాధను దీక్షగా విని పరీక్షిన్మహారాజు పరమ పవిత్రమైన వైకుంఠంలో నారాయణ సన్నిధానంలో శాశ్వత స్థానం పొందాడు. అదే భాగవత శక్తి. 

    పరీక్షిత్తు

    లలిత స్కంధము, కృష్ణ మూలము శుకాలాపాభిరామంబు మం
    జులతో శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
    జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాల వాలంబునై
    వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్శ్రేయమై. 

    పాండురాజు కుమారుడు అర్జునుడు. వీరి కుమారుడు అభిమన్యుడు. ఈయనకు ఉత్తర యందు ప్రభవించిన పరీక్షిత్తు సింహాసనారూఢుడై ప్రజలను కన్నబిడ్డల వల కాపాడుతూ,  బంధుప్రీతితో ఆశ్రిత పక్షపాతానికి తన రాజ్యంలో అవకాశం రాకుండా  ధర్మదీక్షతో పాలిస్తున్నాడు. 

    ఆ మహారాజు ఒకనాడు వేటకు వెళ్లి సింహాలనూ, పెద్దపులులనూ వేటాడి అలసి, దాహ బాధతో శమీకమునీంద్రుని ఆశ్రమం సమీపించి మంచి నీరు మ అడిగాడు. కనులు మూసి, పరతత్వం మీద మనసు ఏకాగ్రంచేసి వున్న మునికి  ఆ రాజు రాకడగానీ, దాహబాధగానీ కనిపించలేదు, వినిపించలేదు. మాట్లాడకుండా వున్న ముని మీద ఆగ్రహించి పరీక్షిత్తు అక్కడ పడివున్న పాము కళేబరం ఆయన మెడలో వేసి వెళ్లిపోయాడు.  ఎంత ధర్మనిరతుడైనా  దాహబాధ వల్ల కలిగిన కోపం కారణంగా ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు రాజు. కొంతసేపటికి  ఆశ్రమం చేరిన  ముని కుమారుడు  తన తండ్రి మెడలోని పామును చూస్తూనే ఆవేశంతో - 

    "నా తండ్రిని అవమానించిన వాడు తక్షక సర్పం కాటు తిని నేటికి వారం రోజులలో ప్రాణాలు వదులుతాడు." అని శపించాడు. 

    ముని కనులు తెరిచి విషయం గ్రహించి - 

    "నాయనా! ఎంత పొరపాటు చేశావు? వాసుదేవుని అనుగ్రహం వల్ల పునర్జన్మ పొందిన, ధర్మమూర్తియైన రాజును శపించావు.  రాజు లేకపోతే బలహీనులను బలవంతులు హింసించి వారి సంసారాలు  నాశనం చేసి, సంపదలు దోచుకుంటారు. ప్రజలలో విభేదాలు పెరిగి  సంహారకాండ రేగుతుంది. ధర్మమోక్షాల దృష్టి విడిచి అర్దదాసులూ, కామలాలసులూ  అయిపోతారు. వేదం ప్రబోధించిన  సత్యవాక్పాలన  పరాయణులు సన్నగిల్లుతారు. ఇన్ని అనర్దాలు నీ శాపం వల్ల ఏర్పడుతాయి. ఇప్పటికయినా మించిపోలేదు. నా శిష్యుని వెంటబెట్టుకు వెళ్లి మహారాజుకు శాప విషయం చెప్పు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు." అని పంపించాడు. 

    విన్నాడు పరీక్షిత్తు - విషాదరహితుడై రాజ్యాన్నీ సంసారాన్నీ వదలి గంగానదీ తీరం చేరి ప్రయోపవేశ దీక్ష వహించాడు. ఆ వార్త విన్న మునులెందరో అక్కడకు రాగా - 

    "మహాపురుషులారా! వారం రోజుల గడువులో  ఏ సత్కార్యాలు చేస్తే వైకుంఠం చేరగలనో సెలవియ్యండి." అని అర్దించగా. 

    వారు ఆలోచన ప్రారంభించారు. 

    ఆ సమయానికే అక్కడకు వ్యాసనందనుడైన శుకయోగీంద్రులు రాగా, అందరూ లేచి నిలబడి సాదరంగా ఆయనను ఆహ్వానించి, కూర్చోబెట్టారు. 

    పరీక్షిత్తు ఆయన పాదాలకు నమస్కరించి, "యోగీంద్రా! నాకు ముక్తిమార్గం చూపండి" అన్నాడు. 

    శుకయోగీంద్రుడు దరహాసభాసుర వదనంతో - 

    "నరేంద్రా! నిర్భయంగా వుండు, కలియుగ మానవులు తరించడానికి యోగ్యమైన భాగవతగాధను  మా పితృపాదులు నాకు బోధించారు. దానిని నీకు వినిపిస్తాను. అదే నీకు కైవల్యం అనుగ్రహిస్తుంది. 

    పరీక్షిన్నరేంద్రా! ఈ భూమి మీద జీవులన్నిటిలో మానవజన్మ అత్యుత్తమైనది. ఆ జన్మ లభించినందుకు దానిని సార్ధకం చేసుకోవాలంటే హరినామస్మరణం, నారాయణ చరణారవింద సేవ నిరంతరం సాగించాలి. 

     ఈ జీవితంలో  సగభాగం నిద్రలో, నారీజన సంగమంతో వ్యర్దం చేస్తున్నారు. కొంతకాలం బాల్యం మ్రింగుతున్నది. మరికొంతకాలం సంసార పోషణకు ధనార్జనలో పోతున్నది. ఇలా చూస్తే పరమాత్మను ఆరాధించడానికి అవకాశమే వుండడం లేదు. సంసారం, సంతానం, సిరిసంపదలు ఇవన్నీ అశాశ్వతాలు. శాశ్వతమైనది పరమేశ్వరానుగ్రహం. అది సాధించడానికే జీవితాన్ని అంకితం చెయ్యాలి. 

    ఆ సాధనమార్గం బోధిస్తూ మా తండ్రిగారు భాగవతం అనుగ్రహించారు. భాగవత గాధలు వింటూ, మననం చేసుకుంటూ శ్రీహరి యందు మనసు లగ్నం చేస్తే ఈ సంసార బంధాలూ, తాపత్రయాలూ పటాపంచలయిపోతాయి. సూర్యకిరణాలు  చీకట్లను పారద్రోలేటట్లు  భాగవత కథాశ్రవణం సర్వపాపాలనూ హరించి హరి చరణ సన్నిధికి చేరుస్తుంది. 

    హరిభక్తి లేనివాడు గిరగిర తిరిగే బొంగరం వలే పుడుతూ, చస్తూ, సంసార విషవలయంలో  పడి కొట్టుకుంటూ వుంటాడు. నీ పుణ్య విశేషం వల్ల రాజ్యం, సంసారం వదలి ఈ పవిత్రక్షేత్రం చేరావు. మనసు పరాత్పరుని యందు లగ్నం చేశావు. 

    మునికుమారుని  శాపం యింకా ఏడురోజుల వరకూ నిన్ను బాధించదు.  ఈ వారం రోజులలో భాగవతం అంతా వినిపిస్తాను. సావధాన చిత్తుడవై నిర్మల హృదయంతో, బుద్దిని పరమాత్మ యందే నిలిపి విను. 

                                                     *    *    *    *    

    ప్రాచీనకాలంలో ఖట్వాంగుడనే రాజు దేవతలకు సాయపడి రాక్షసులను సంహరించగా దేవతలు సంతోషంతో వరం కోరుకోమన్నారు. 

    నా ఆయుర్దాయం ఎంత వుంది? అని అడిగాడు. 

    రెండు ఘడియలు అన్నారు వారు. 

    ఆ మాట వింటూనే ఆయన సర్వసంపదలూ, ధనధాన్యాలూ ధారపోసి, భార్య పుత్ర వ్యామోహం త్రెంచుకుని శ్రీమన్నారాయణుని  యందు మనసు లగ్నం చేసి వైంకుఠం చేరాడు. 

    బంధనాలు త్రెంచుకుంటే క్షణం చాలు హరిచరణ సేవకు. అదే ముక్తిహేతువు. ధారణతో కొందరు, యోగీంద్రులై మోక్షం పొందుతారు. ధారణ అంటే - సర్వబంధాలూ వదలి, ఇంద్రియాలను జయించి, ఉచ్చ్వాస నిశ్వాసలను నియమబద్దంగా సాగిస్తూ, శ్రీమన్నారాయణుని యందు మనసు నిలిపి, బుద్దిని కేంద్రీకరించడం. 

    శ్రీహరి యందు లగ్నమైన మనసుకు భూత, వర్తమాన, భవిష్యత్కాలాల్లో వుండే విశాలవిశ్వం అంతా గోచరిస్తుంది. 

    ఈ శరీరం వున్నదే, యది - పృధివి, ఆపస్సు, తేజం, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఏడు ఆవరణలతో నిండి వుంటుంది. ఈ శరీరంలో వైరాజ పురుషుడు ప్రకాశించాలంటే ధారణ కావాలి - అంటే విరాట్పురుషుడే ఈ చతుర్దశ భువనరూపి. 

    సర్వవ్యాపకుడైన ఆయనను మనసులో నిలుపుకున్నవాడే ముముక్షువు. 

    హరిమయము విష్వమంతయు
    హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
    హరిమయముగాని ద్రవ్యము
      పరమాణువు లేదు వంశపావన వింటే 

     మనిషి కలలో ఏదో ఆకారాలు చూస్తాడు. తాను ధరిస్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. మెలకువ వస్తుంది. కల అని గ్రహిస్తాడు. అలానే పరమేశ్వరుడు సర్వజీవకోటిలోనూ వున్నా యివేమీ ఆయనను అంటవు. కనుకనే ఆయన అనుగ్రహంతో బ్రహ్మ ఈ బ్రహ్మాండభాండాలు సృష్టిస్తున్నాడు.

    మహారాజా! అజ్ఞానం వల్ల ఏవేవో సుఖాలనీ, భోగాలని, కొట్టుమిట్టాడుతున్నారు. 

    సుఖంగా తినడానికి రెండు చేతులూ కలిపితే దోసిలి అవుతుంది కదా! బంగారు పాత్రలు దేనికి? ఆచ్చాదనకు నారచీరలూ, చర్మాంబరాలూ వుండగా చీనాంబరాలెందుకు? వాస యోగ్యమైన కొండ గుహలుండగా భవనాలూ, సౌధాలూ నిర్మించుకోవాలా?

    విశ్రాంతి తీసుకోవాలంటే  విశాలమైన పృధివి వున్నదే, హంస తూలికాతల్పాలు కావాలా?

    చెట్లు రుచిగల పళ్ళు యిస్తున్నాయి. స్వాదువులయిన జలాలు నదలలో దొరుకుతున్నాయి. అతిధి, అభ్యాగతులకు ఆదరంతో అన్నం పెట్టే పుణ్యసతీమతల్లులున్నారు. ఇన్ని వుండగా అధికార గర్వాంధులైన ధన మదోన్మత్తుల  దగ్గర తలవంచి సేవలు చేయవలసిన దుస్థితి దేనికయ్యా!

    రక్షకులు లేని వారల
    రక్షించెద ననుచు జక్రిరాజై యుండన్
    రక్షింపు మనుచు నొక నరు
    నక్షము బ్రార్దింపనేల యాత్మజ్ఞులకున్

    నారాయణుని శరణు వేడక ప్రాపంచిక తుచ్చ సుఖాల కోసం అన్యాయాలూ,  అక్రమాలూ చేసేవారు నరక ద్వారం దగ్గర వైతరణీ నదీ తీరంలో తీవ్రాగ్ని జ్వాలా శిఖలలో మాడుతూ వుంటారు.

    వెన్నెలల చల్లదనం కురిసే చిరునవ్వుల పురుషోత్తముని తమహృదయంలోనే దర్శించడానికి భక్తులు ధ్యానం చేస్తుంటారు.

    యతీశ్వరులు ఏ క్షణంలో శరీరం విడిచిపెట్టాలనిపిస్తే ఆ క్షణంలో పద్మాసనం  వేసి, ప్రాణవాయువును నిరోధించి, మనస్సును బుద్దితో బంధించి  దాన్ని జీవునితో చేర్చి, ఆత్మతో సంధించి, ఆత్మను బ్రహ్మ పదార్దం తో ఏకీభవింపచేసి తనువు చాలిస్తారు.

    యోగీశ్వరులుంటారు. వీరు పాదాలతో మూలాధార చక్రాన్ని ఛేదించి ప్రాణాయామంతో నాభి దేశానికి తెచ్చి, క్రమంగా హృదయం దాకా నడిపి, కంఠాన్ని దాటించి, బ్రూమధ్యానికి నడిపి, కనులు, చెవులు, ముక్కు బంధించి, అర్ద ముహూర్త కాలంలో బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి బ్రహ్మమందు కలుస్తారు.

    ప్రాణాలు పోతున్నా ఇంద్రియాలను వశం చేసుకోలేనివారు మరణానంతరం   ఆ వాంఛలతో పరమేష్ఠి లోకం చేరుతారు. పాంచభౌతిక వికారాలకు లొంగనివాడు ఆనందమయుడై వాసుదేవునిలో  లయమవుతాడు. ఇది పరమ భాగవతులు అనుసరించే దారి, అని శుకయోగి చెప్పగా విని పరీక్షిత్తు -

    యోగీంద్రాఁ! మీ మధుర వాక్కులతో సర్వ వాంఛలూ వైదొలగి పురుషోత్తముని అవతార  లీలలు  వినాలనే ఉత్కంఠ పెరుగుతున్నది. శ్రీమన్నారాయణుని దివ్యగాథలు వినిపించండి, అనగా యోగి పుంగవుడు -

    పరుడై ఈశ్వరుడై మహా మహిముడై ప్రాదుర్బవస్థాన సం
    హరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై యంతర్గత జ్యోతియై
    పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ భావింప రాకుండు దు
    స్తర మార్గంబున దేజరిల్లు హరికిం దత్త్వార్దినై మ్రొక్కెదన్.

    అని  నారాయణ స్మరణ  చేసి : సృష్టి, స్థితి, లయాలకు కారణం పరాత్పరుడు. బ్రహ్మాండాన్ని ఆయన పదునాలుగు  లోకాలుగా విభజించి  అంతటా వ్యాపించి వున్నాడు.

    ఆయన అవతారాలలో మొదటిది సహస్ర శీర్సాలతో పురుష రూపంగా వుంటుంది. అదే ప్రకృతిని నడుపుతుంది.

    అనంతరం యజ్ఞ వరాహంగా ఆవిర్భవించాడు. నారదావతారంతో వైష్ణవభక్తి బోధించాడు. నరనారాయణ రూపం నాలుగవది.  అయిదవ రూపంలో కపిల నామంతో సాంఖ్యయోగం వుపదేశించాడు.

    అనసూయా, అత్రి దంపతుల గర్బాన కుమారుడైనది ఆరవది - తదుపరి యజ్ఞుడయ్యాడు. ఉరుక్రుమ, వృధు, మీన, కూర్మ, ధన్వంతరి, మోహిని, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణావతారాలు ధరించిన అనంతరం బుద్దుడవుతాడు. కలియుగాంతంలో విష్ణుయశుడనే విప్రునికి కల్కిరూపంలో పుడతాడు.

    లోకంలో  రాక్షసపీడ పెరిగినప్పుడు ప్రభవించి క్రూర దానవులను సంహరించి సాధుజనులను రక్షిస్తాడు.
                                         

   రాజేంద్రా! కురుపాండవ సంగ్రామం తప్పదని తెలిలి, విదురుడు వనాలకు వెళ్లి పుణ్యనదులలో స్నానమాడి, పవిత్రజల పానంతో, దొరికిన ఆకుకూరలతో కాలం గడుపుతూ,  యమునా నది చేరి, అక్కడ ధ్యాన సమాధిలో వున్న కృష్ణ భక్తుడైన ఉద్దవుని చూచి గాఢాలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. ఉద్దవుని సమాధానంలో కృష్ణ నిర్యాణం, పాండవుల స్వర్గారోహణం విని కొంతసేపు చింతించి, నిర్మల చిత్తుడై - 

    ఉద్దవా! పురుషోత్తముడు నీకు బోధించిన ఆధ్యాత్మ రహస్యాలు వినాలని మనస్సు ఉవ్విళ్లూరుతున్నది, అన్నాడు. 

    ఆ రహస్యాలు వివరించగల మైత్రేయుని దగ్గకకు విదురుని పంపి, ఉద్దవుడు బదరికా వనానికి వెళ్లాడు. 

    విదురుడు యమున దాటి గంగ ఒడ్డున - యిసుకతిన్నె మీద పద్మాసనాసీనుడై శ్రీహరిని ధ్యానించే - యోగి పుంగవుడైన మైత్రేయుని దర్శించి, పాదాభివందనం చేసి. 

    మహాత్మా! లోకంలో ఎందరో పుట్టి ఏవో వాంఛలతో పాపకర్మలు చేస్తూ బ్రతుకుతున్నారు. వీరికీ పశువులకూ భేదం లేదు. మాతృ యౌవనం పాలిట గండ్రగొడ్డళ్లు వీరు. ఆ పాపాత్ములను సక్రమ మార్గాన నడపడానికి తమ వంటి వారు లోకంలో అవతరించి పుణ్యాత్ములై జగత్కాల్యాణ కాంక్షతో జీవనయాత్ర సాగిస్తారు. 

    తమ నోట పురుషోత్తముని గాథలు వినాలని కుతూహల పడుతున్నాను. నారాయణ కథామృతం ఆస్వాదించిన వారికి యితర కథలన్నీ విషప్రాయాలే. అనుగ్రహించి ఆ పరమ పురుషతత్వం ఉపదేశించండి. ప్రపంచ మానవులందరూ సుఖబోగాలు కోసం ఏవో కర్మలు చేసి ఆశించిన ఫలితం దొరకక బాధ పడుతున్నారు. ఈ కర్మలన్నీ బంధన హేతువులు. బంధం దుఃఖం కారణం. చేసిన కర్మ ఫలం  అనుభవించడానికి పుడుతూ చస్తూ ఆ వలయంలో చిక్కుకుంటూనే వుంటారు. అందుచేత వాటి నుండి విముక్తికి దారి చూపండి. అన్నాడు.

    మైత్రేయుడు: భక్త శిఖామణీ! ఆ పరమ రహస్యాన్ని వాసుదేవుడు నాకు బోధించాడు. సావధానచిత్తంతో ఆలకించు. 

    సృష్టి ప్రారంభంలో తన అంశతో పురుషుని ప్రభవింపజేసి, అనంతరం మాయామయంగా మహత్తత్త్వం కల్పించాడు. దాని నుండి కార్య, కారణాలు కర్త, పంచభూతాలు పుట్టాయి. అందుండి ఇంద్రియాలు మనస్సు ఏర్పడ్డాయి. 

    సత్వ, రజస్తమోగుణమయమైన అహంకారం పుట్టింది. సాత్వికాహంకారం నుంచి దేవగణాలు వచ్చాయి. వారే ఇంద్రియాధిష్టాన దేవతలు. ముందు శబ్దం పుట్టింది.  అనంతరం జ్ఞానేంద్రియాలు వచ్చాయి. (నేత్ర, నాసిక, జిహ్వ, కర్ణ, చర్మాలు). అనంతరం కర్మేంద్రియాలు - (వాక్, పాణి, పాద, పాయు (మలద్వారం), (ఉపస్థ (జననేంద్రియం)) వచ్చాయి. 

    తామసాహంకారం వల్ల శబ్ద,  స్పర్శ, రూప, రస, గంధాలు; శబ్దం వల్ల ఆకాశం, అది స్పర్శతో కలసి వాయువు, యీ రెండూ కలసి తేజస్సూ, అనంతరం జలం, తరువాయి గంధగుణంతో భూమి ఆవిర్భవించాయి. 

    ఇందులో ఆకాశానికి శబ్దం గుణం, వాయువుకు శబ్ద, స్పర్శలు ; అగ్నికి శబ్ద, స్పర్శ రుపాలు; జలానికి శబ్ద, స్పర్శ, రూప రసగుణాలు వచ్చాయి. పృధివికి శబ్ద, స్పర్శ, రూప, రస, గందాలు అయిదూ వున్నాయి. 

    ఇవి ఒకదానితో ఒకటి కలిస్తే  సృష్టి కొనసాగుతుంది. కనక ఆ సమ్మేళనంతో ప్రాణికోటిని సృష్టించాడు. 

    శ్రీహరి మహిమను చతుర్ముఖ ప్రజాపతి కూడా ఎరగడు. ఇంక తెలుసుకోగల వారెవ్వరూ! అందువల్లనే ఆయన చరణారవింద సేవ అవశ్యం.  అఖిలాండకోటి బ్రహ్మాండాలలో వ్యాపించి వున్న ఆ పురుషోత్తమునికి ప్రాపంచిక కర్మ బంధాలు లేవా! అనిపించవచ్చు. 

    ఆకాశంలో చంద్రబింబం వున్నది. అది చెరువులోని నీటిలో ప్రతిబింబిస్తూ, నీరు కదిలితే అదీ కదులుతున్నది. అంతమాత్రం చేత గగనంలో చందమామ ఊగిసలాడుతున్నాడా! అలానే పురుషోత్తముని లీలలు. 

    అజ్ఞానంలో పడి కొట్టుకునే జీవునికే కర్మబంధాలన్నీ. వీటినుంచి విముక్తి పొందాలంటే హరినామస్మరణం ఒక్కటే మార్గం. 

    వాసుదేవనామంతో విరాజిల్లే పురాణ పురుషుడు భాగవతవేదం చేతబట్టి పాతాళానికి వెళ్లి, ధ్యానంలో ముకుళిత నేత్రుడై వున్నాడు. అక్కడకు సనక సనందనులు రాగా వారిని అనుగ్రహించడానికి కనులు  విప్పి చూశాడు. వారు స్తుతించారు. 

    నాగకన్యలు పవిత్రజల స్నానం చేసి, ఆ పరమ పురుషుని సేవించి ధన్యులయ్యారు. 

    అప్పుడాయన భాగవత గాథను సమత్కుమారునికి వివరించాడు. సనత్కుమారుడు దీనిని  సాంఖ్యాయనునికి విదశం చేయగా, ఆయన పరాశరునికి ఉపదేశించాడు. పరాశరులవారు బృహస్పతికి బోధించారు. బృహస్పతి దానిని నాకు అనుగ్రహించారు, అన్నాడు మైత్రేయుడు. 

     విశ్వం జలమయంగా వున్నప్పుడు, లీలావిలాసంగా పురుషోత్తముడు వేయిపడగల శేషతల్పం మీద శయనించి, మాయాదూరుడై  ఆనందంగా వున్న సమయాన, ప్రపంచాన్ని సృష్టించే కోరికతో, తన నాభి నుండి పద్మాన్ని, దానినుండి వేదమయుడైన చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. 

    ఆయన నాలుగు ముఖాలతో నలుదిక్కులూ చూచి, ఏవీ గోచరించక, తామరపూవు  క్రింది నాళం ద్వారా దాని మూలస్థానం కనుక్కుందామని తిరిగి తిరిగి ఏమీ కనుపించక కమలం మీదికి వచ్చి సుఖాసీనుడై యోగాభ్యాసంతో దర్శించగా, పద్మదళ విశాలనయనుడై శేషతల్పం మీద నారాయణుడు గోచరించాడు. 

    ఆ విరాట్పురుషుని పాదాలకు అభివాదం చేసి, ఆయన అనుజ్ఞ సృష్టికి సంకల్పించి తపస్సమాధిలో సంవత్సరాలు గడిపి, అనంతరం ముల్లోకాలూ సాక్షాత్కరించగా  వాటికి రూపం యిచ్చాడు బ్రహ్మ. 

    పూలతో నిమిత్తంలేని విత్తనాలుగల రావి, మోదుగ, మర్రి మున్ముందు ప్రభవించాయి. 

    అనంతరం పుష్పించి, ఫలించి విత్తనాలయ్యే కాయ ధాన్యాల మొక్కలు వచ్చాయి. తరువాయి పువ్వులు పూసే లతలు, ఉత్తి చర్మమే వుండే వెదురు, అనంతరం మామిడి ఆదిగాగల పళ్లచెట్లు, తరువాయి రెండు గిట్టల జంతువులు ఎద్దులు, దున్నలు, మేకలు పందులు మొదలయిన తొమ్మిది జాతులు, ఒకే డెక్కగల గాడిద, గుర్రం ఆదిగాగల ఆరు జాతులు. అయిదు గోళ్లుండే మార్జాల, సునక, శార్దూల, సింహ, మర్కట గజ, కూర్మాదులు పన్నెండు జాతులు. మొసలి, చేప, ఆదిగాగల జలచరాలు, గ్రద్ద, డేగ, కొంగ, నెమలి, హంస ఆది పక్షులు, అనంతరం మనిషి, యిదీ ఆయన సృష్టి. 

    విబుధులు, పితృదేవతలు, సురలు, ఒకగణం. గంధర్వ అప్సరోజాతులొక గణం, యక్ష, రాక్షసులొక వర్గం. భూత, ప్రేత పిశాచాలొక కూటం. సిద్ద, చారణ, విధ్యాధరలు మరొకవర్గం. కిన్నెర,  కింపురుష దేవగణాలు మరొక కూటంగాఏర్పడ్డాయి. ఇక కాల స్వరూపం విను. ఆకాశంలో వుండే సూర్యకిరణంలో త్రసరేణువు ఆరుభాగాలయితే ఆరోది పరమాణువు. ఆ పరమాణువులో సూర్యుడు నడిచే కాలం సూక్ష్మ కాలం. 

    మేష, వృషభ, మిధునాది ద్వాదశ రాసులలో సూర్యుడు తిరిగే కాలం మహత్కాలం. 

    పరమాణువులు రెండు కలిస్తే అణువు. అణువులు మూడు కలిస్తే త్రసరేణువు. ఇవి మూడు త్రుటి. నూరు త్రుటులు వేధ. మూడు వేధలు లవం. ఇవి మూడు నిమేషం. మూడు నిమేషాలు క్షణం. అయిదు క్షణాలు కాష్ట. పది కాష్టలు లఘువు, యివి పదిహేను నాడి, రెండు నాడులు ముహూర్తం, మూడు ముహూర్తాలు ఝాము, నాలుగు ఝాములు పగలు, నాలుగు ఝాములు రాత్రి, ఇది రోజు. 

    ఏడు రోజులు వారం. రెండు వారాలు పక్షం, రెండు పక్షాలు మాసం. పన్నెండు మాసాలు సంవత్సరం. నూరేళ్లు మానవుని ఆయుర్దాయం. 

    మానవ సంవత్సరం దేవతలకొకరోజు. 

    కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు పాదాలు, ద్వాపరంలో రెండు పాదాలు, కలియుగంలో ఒకేపాదంతో నడుస్తుంది ధర్మం. అందువల్లనే కలియుగంలో ధర్మబుద్ది నశించి, పాప చింతలూ, దుష్ట కర్మలూ పెరుగుతాయి. 

    నాలుగు యుగాలు మహాయుగం. ఇవి వెయ్యి అయితే బ్రహ్మకు పగలు. అప్పుడాయన నిద్రిస్తాడు. చతుర్దశ భువనాలూ పరమాణు రూపుడైన పరమాత్మ యందే లీనమవుతాయి. బ్రహ్మ నిద్రలేచాక సృష్టి ఆరంభమవుతుంది. 

    ఈ సృష్టిలో ఎన్నో విచిత్రాలున్నాయి. ఒకమారు ఆ పరమేష్ఠి దేహాభిమానంతో అహంకారం నిండిన మోహాన్ని; సంగమం,  గంధ మాల్యానులేపనం ఆదిగాగల  పశువాంఛలతో మహామోహాన్నీ, అవి తీరనందున కలిగే క్రోధంలో అంధ తామిస్రాన్ని, యిది నశించగా నేనే నశించాననే భ్రమ కలిగించే తామిస్రంబును, చిత్త విభ్రమాన్ని కలిపి భూత కోటిని సృష్టించి, పశ్చాత్తాపంతో వీరందరినీ తొలగించి, పవిత్ర  హృదయంతో సనక, సనందన,  సమత్కుమార, సనత్సు జాతులను సృష్టించి,  యీ ప్రపంచంలో సదాచార సంపత్తికల ప్రజలను పుట్టించండి, అన్నాడు. 

    వారు నవ్వుతూ, మోక్షధర్మం, నారాయణచరణ సేవ తప్ప మిగిలినవి మాకనవసరం అనగా, భ్రూమధ్యం నుంచి పరమశివుడు పుడుతూనే రోదనం చేశాడు. 

    రోదనం కారణంగా నిన్ను రుద్ర నామంతో పిలుస్తాను. నువ్వు ఆకాశం అంతా వ్యాపించు, చంద్ర, సూర్య, అగ్ని, వాయు, జల, పృథివి ప్రాణాలతో వుంటావు.  హృదయంలో, తపస్సులో నివాసం వుంటుంది అని ఆయనకు సృష్టికార్యం అప్పగించాడు. 

    ఆయన సర్వ విషయాలలో తనవంటి గణాలను సృష్టించాడు. రుద్ర గణాలు విశ్వాన్నే మ్రింగబోగా బ్రహ్మ వారించి  మీరు తపోదీక్ష  వహించండి, అని పంపి, మరో పదిమందిని సృష్టించాడు. 
    వారు దక్ష, నారద, పులహ, పులస్య, భృగు, క్రతు, అంగీరస, వశిష్ట, మరీచి, అత్రి పేర్లతో ప్రఖ్యాతులయ్యారు. 

     ఆ సమయంలో ధర్మదేవత, మృత్యుదేవత, కాముడు (మన్మధుడు) పుట్టారు. అప్పుడు పుట్టిన భారతీదేవిని బ్రహ్మ కామించగా, మహామునులు నిందించారు. బాధతో ఆయన తనువు చాలించగా ప్రపంచం నిండా మంచుకురిసి చీకట్లు క్రమ్మాయి. మరొక దేహం ధరించి  సృష్టిని గూర్చి ఆలోచన చేస్తుండగా ఆయన నాలుగు ముఖాల నుండి ఋగ్య, స్సామ, అధర్వణ వేదాలూ, శాస్త్రాలూ ప్రభవించాయి.  ప్రజా సృష్టికోసం ఆలోచన  చేశాడు. స్వాయంభువ మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. 

    ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి  అనే ఆడ పిల్లలు కలిగారు. ఆకూతి రుచీకుని, దేవహూతి కర్దముని, ప్రసూతి దక్షుని వివాహం చేసుకున్నారు. వీరి వల్ల మానవులు పుట్టారు. స్వాయంభువ మనువు  ప్రజాసృష్టి చేసి వారందరినీ నారాయణ భక్తులుగా రూపొందించి, ఏం చేసినా హరి సమర్పణ బుద్దితో చేయమని ఆదేశించి :

    ప్రజాపతీ! ఇదంతా జలమయంగా వుంది. నా బిడ్డలందరూ సుఖంగా నివసించడానికి యోగ్యమైన స్థలం కావాలి, అనగా ఆయన నారాయణుని ప్రార్దించాడు. అప్పుడు భూమి ఏర్పడింది. 
                                                         హిరణ్యాక్షుడు

    కశ్యప ప్రజాపతి భార్య దితి ఒక సాయంసంధ్యలో భర్తను చేరి : నాధా! నా సవతులందరూ సంతానవతులై సుఖంగా వున్నారు. సంతాన  వాంఛ నన్ను బాధిస్తున్నది. ఈ క్షణంలో సంతానవతినయ్యే అవకాశం అనుగ్రహిచండి, అని ప్రార్దించింది. 

    సంధ్యా సమయాలు అందుకు వుచితం కాదని వారించాడు కశ్యపుడు. వినలేదు దితి. దైవం యేం చెయ్యదలచుకుంటే అదే జరుగుతుందని తృప్తిపరచి పంపాడు. ఆమె గర్బవతి అయింది. దితి! నీకు కలిగే  బిడ్డలు క్రూర స్వభావంతో  రాక్షసులై తిరుగుతూ శ్రీహరి చేతులలో మరణిస్తారు అన్నాడు. 

    ఆవిడ  దీనంగా ప్రార్దించగా:తప్పదు, కాని వారికి కలిగే కుమారుడు మాత్రం ముల్లోకాలలో కీర్తి పొందే సజ్జనుడడవుతాడు; అని ఓదార్చి పంపించాడు. దితికి నెలలు నిండుతున్నాయి. ఆ గర్బంలోని శిశువుల కాంతి సర్వ లోకాలకూ దుస్సహం కాగా,  దేవతలు శ్రీమన్నారాయణుని చేరి, రాబోయే ఉపద్రవం ఏమిటని అడిగారు. 

    దేవతలారా! ఒకనాడు నన్ను దర్శించడానికి వచ్చే సనక, సంనంద నాదులను వైకుంఠ ద్వారపాలకులు నిరోధించగా వారు ఆగ్రహంతో ద్వారపాలకులను శపించారు. వారీ రూపంలో జన్మిస్తున్నారు.  ఎంతవారైనా వేద విదులను అపహసిస్తే ప్రాయశ్చిత్తం తప్పదు. అందువల్ల జయ విజయులిప్పుడు  రాక్షసులుగా పుట్టి నా చక్రధారలతో తనువు చాలించి వైకుంఠం చేరుతారు. అంతవరకూ వారి బాధ మీకు తప్పదు అని పంపించాడు. 

    దితి యిద్దరు బిడ్డలను ప్రసవించింది. వారికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులని పేరు పెట్టాడు  కశ్యపుడు. వారు పరాక్రమంతో సర్వలోకాలూ జయించి, నిఖిల బువనాధీశులయ్యారు. 

          *    *    *    *    *                                                 *    *    *    *  
  హిరణ్యాక్షుడు యుద్దప్రీతితో ఒకనాడు వరుణుని దగ్గరకు పోయి తొడగొట్టగా ఆయన చేతులు జోడించి: దనుజేంద్రా! చాలా కాలంగా యుద్దప్రీతి తగ్గి శాంతగా వుంటున్నాను. నీవంటి వీరునికి తగినవాడు వైకుంఠంలో విష్ణువని వున్నాడు. అక్కడ నీ ప్రతాపం చూపితే ఆయన నీ వ్యవహారం చూసుకుంటాడు. ఎవరెంతటి వారో లోకాలకు తెలుస్తుంది. వైకుంఠనాధుడు దానవ సంహార దీక్షలో వున్నాడని విన్నాడు. అనగా ఆవేశంతో హిరణ్యాక్షుడు బయలుదేరాడు. 

      దారిలో నారదుడు కనుపించగా, తను వెడుతున్న పని చెప్పాడు హిరణ్యాక్షుడు. విని నారదుడు: నాయనా! ప్రస్తుతం నారాయణుడు భూభారాన్ని వహిస్తూ వరాహరూపంలో రసాతలాన  వున్నాడు. అనగా మరింత ఉత్సాహంతో గదాదండం త్రిప్పుతూ రసాతలానికి బయలుదేరి వస్తున్న దానవుని చూస్తూ శ్రీహరి తన కన్నులలో నిప్పులు నిండించి,  చూపులతోనే వాని దేహకాంతిని హరించి, ముట్టెతో క్రిందికి పొడిచి,  కాలితో త్రవ్వి, పైకెగిరి, కోర చివర  భూమిని పెట్టి,  పరుగు ప్రారంభించగా, ఆ దానవుడు వెంట తరుముతుంటే నారాయణుడు భూమిని సాగరం మీద వుంచి యుద్ద సన్నద్దుడయ్యాడు. 

    హిరణ్యాక్షుడు గదాదండం విసరగా శ్రీహరి దాన్ని ముక్కలుగా విరిచాడు. మరొక గద విసిరాడు దానవుడు. దానినే త్రిప్పి విసిరాడు శ్రీహరి. వాడు మూర్చపోయి లేచి మళ్లీ గద విసిరాడు. కొంతసేపు పోరు సాగింది. 

    శ్రీహరి సర్వ రాక్షస సంహార  సామర్ద్యం కల చక్రం ప్రయోగించగా, అది ప్రళయాగ్ని జ్వాలలతో హిరణ్యాక్షుని మాయలు నిరోధించింది. 

    హిరణ్యాక్షుడు మల్ల యుద్దానికి దిగాడు. శ్రీహరి తన అరచేతితో రొమ్ము బ్రద్దలు కొట్టి, వజ్రఘాతం వలె బాహుమూలాల దగ్గర పిడిగ్రుద్దు వేయగా వాడు నేలకూలాడు. 

    దేవతలతో పాటు మునులు, ఋషులు శ్రీహరిని ప్రార్దించారు. 
                                              దేవహూతి

    స్వాయంభువ మనువు తన కుమార్తె దేవహూతి వెంటబెట్టుకుని కర్దముని సమీపించి ;

    ఆర్యా! ఈమె నా బిడ్డ. పురుషోత్తముని  దర్శించిన వారికి తప్ప యీమె గోచరించదు. ఈమెను కామ దృష్టితో చూచిన వారికి ఆ క్షణమే మృత్యువు సంభవిస్తుంది. ఈమె నిన్ను భర్తగా వరిస్తున్నది. అనగా :

    గుణరూపాలలో, నడవడికలో మాకు పోలికలున్నాయి. కనక వరిస్తాను. కాని - దాంపత్య జీవితానికి పరమావధియైన   సంతానం పొందగానే నేను యోగాభాస్యంతో శ్రీహరి ధ్యానంలో వుంటాను, అన్నాడు. 

     స్వాయంభువ మనువు తన భార్య శతరూపతో, కుమార్తె దేవహూతితో యీ విషయం చెప్పి, వారి అంగీకారం పొంది, వివాహం చేశాడు. 

    తిరిగి వెళ్లే వేళ బిడ్డను కౌగిలించుకుని, శిరసు ముద్దాడి, వెన్ను దువ్వుతూ కొంతసేపు కన్నీరు విడిచి వెళ్లాడు. దారిలో బ్రహ్మావర్తదేశంలో విష్ణుపరంగా సత్ర్ర్కతువులు చేసి,  రాజధాని చేరి,హరిచరణారవింద సేవా పరాయణుడై కాలం గడుపుతున్నాడు మనువు. 

    పార్వతీదేవి పరమశివుని ఆరాధించే రీతిలో దేవహూతి భర్తను సేవిస్తూ ఆయన శుశ్రూషయే పరమావధిగా భావిస్తూ, కామక్రోధాలు దరిచేరనీయక సర్వమూ భర్తయే అని త్రికరణశుద్దిగా విశ్వసిస్తూ జీవయాత్ర సాగిస్తున్నది. 
    ముని: 
    ఇల్లాలా! నీ సేవాభావం మా మనస్సుకి ఆహ్లాదం కలిగించింది. నీకు దివ్యదృష్టి యిస్తున్నాను అన్నాడు. 

    స్వామీ! మీ సేవలో సర్వశక్తులూ లభిస్తాయని తెలుసు. కల్యాణ సమయాన మీరు వాగ్దానం చేసిన సంతాన విషయం విస్మరించరని  నమ్ముతాను అంది. 

    కర్దముడు తన శక్తితో మణులు చెక్కిన స్తంభాలతో అలరారే సౌధం, సంసారానికి అవసరమైన శయ్యాగారాలు, భోజనశాలలు, సువర్ణ పాత్రలు, చీని చీనాంబరాలు,చుట్టూ ఉద్యానవనాలు, లతానికుంజాలు, ఫలవృక్షాలు, శుకపిక సంతతులు, సరోవరాలు, క్రీడలు మందిరాలు, ఇన్నింటితో నిండిన దివ్య విమానం సృష్టించాడు. 

    ఈ బిందు సరోవరంలో స్నానం చెయ్యి. అన్ని కోరికలూ నెరవేరుతాయి. అనగా సరోవరంలో దిగి స్నానం చేసింది. 

    చేసేవేళ ఆ నీటిలో వున్న నవ యౌవన శోభనాంగులు వెయ్యిమంది ఆమె చుట్టూ చేరి, చక్కగా అభ్యంగన స్నానం చేయించి, అగరు ధూపంతో తల ఆర్చి, దువ్వలువలు కట్టించి, షడ్రసోపేతంగా భోజనం పెట్టి, కర్పూర హారతులిచ్చి, చక్కని ఆసనం మీద కూర్చుండబెట్టి చేతిలో అద్దం పెట్టారు. 

    దేవహూతి అద్దంలో తన ప్రతిబింబం చూచుకుంటూ, భర్తను స్మరించింది. ఉత్తర క్షణంలో ప్రక్కన నిలిచాడాయన. పెళ్లినాటి వయోరూప సౌందర్య లావణ్య శోభతో వున్న దేవహూతిని దగ్గరగా తీసుకుని కన్యకా సహస్త్రంతో విమానం ఎక్కాడు కర్దముడు. 

    విమానం మీద నిఖిల లోకాలు తిరిగి, నిజ నివాసానికి వచ్చి దేవహూతితో సాంసారిక సుఖభోగాలు అనుభవిస్తూ కొంతకాలం గడిపారు. కర్దముని అనుగ్రహంతో దేవహూతి తొమ్మండుగురు ఆడపిల్లలను ప్రసవించింది. 

     కర్దముడు సన్యాసాశ్రమం స్వీకరించబోగా ఆమె, స్వామీ! ఈ బాలికలకు వివాహం చేసి నాకు తత్వోపదేశం చేయగల కుమారుని దయచేసి మీరు సన్యాసం  తీసుకోండి అని వినయంగా ప్రార్దించింది. 

    అంగీకరించి, దైవ నిర్ణయానుసారం  ఆమెను పుత్రవతిని చేశాడు. శ్రీహరి అంశ ఆమె గర్బాన పుత్ర రూపంలో ప్రవృద్దమై కపిల ముని ప్రభవించాడు. 

    బ్రహ్మాది దేవతలు దేవహూతినీ, కర్దమునీ అభినందించి ఆనందంతో వెళ్లారు. 

    చతుర్ముఖుని ఆజ్ఞానుసారం కర్దముడు తన బిడ్డలు తొమ్మండుగురినీ మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ట, అధర్వుల కిచ్చి వేదోక్తంగా వివాహం చేసాడు. 
                                                కపిలుడు 

    ఒకనాడు కర్దముడు తన యింట కపిల రూపంలో ప్రభవించిన మహావిష్ణువును సమీపించి:

    పురాణ పురుషా! సర్వమానవులూ నీ చరణసేవతో ముక్తిధామం చేరుతారు. అదృష్టవశాన మా పుత్రుడవై జన్మించి మాకు తరణోపాయం చూపించావు. ఇక నేను సంసారం వదలి వనానికి పోయి యోగ మార్గాన ముక్తి సాధించుకుంటాను అన్నాడు. 

    కపిలుడు మందహాసం చేసి : ఈ మానవులందరినీ ఉద్దరించడానికి నేను కపిలమునిగా అవతరించాను. సాంఖ్యయోగ ప్రభోధంతో వీరిని తరింపజేస్తాను. నువ్వు నిశ్చింతగా పరంజ్యోతి ద్యానంతో కైవల్య పదం చేరు; అని పంపాడు. 

    కర్దముడు తపోవనం చేరి యోగ నిష్టతో ఈశ్వర ధ్యానంతో భాగవతోత్తముల స్థానం చేరాడు. 

    బిందుసరం  దగ్గర దేవహూతి కపిలుని చేరి తనకు తత్త్వం ఉపదేశించమని కోరింది. 
    కపిలుడు చిరునవ్వు వెన్నెలల వదనంతో, తల్లీ ఈ జీవిడున్నాడే వీని మనస్సు భవబంధాలను త్రెంచగలదు. కాని సత్త్వ రజ స్తమో గుణాలకు లొంగితే సంసార బంధంలో గిరగిర త్రిప్పుతుంది. నారాయణుని యందు మనస్సు లగ్నమైతే మోక్ష మార్గాన బ్రతుకు సాగుతుంది. 

    మనస్సు, అహంకార మమకారాలకు లొంగి కామ, లోభాది అరిషడ్వర్గాలతో బంధితమై పాపకార్యాలకు పురికొల్పుతుంది. అవి వదిలించుకొన్న నాడు స్వయంజ్యోతి స్వరూపడైన పురుషోత్తముని యందు లగ్నమవుతాడు. జ్ఞాన, వైరాగ్య, భక్తియుక్తమై నారాయణుని యందే వుండే మనస్సు సక్రమ మార్గాన్ని చూపుతుంది, అని భక్తులంటున్నారు. 

    విద్వాంసులేమంటున్నారంటే, యీ యింద్రియాలు ఎప్పుడూ ఏదో ఒక వాంఛతో సతమతమవుతూనే వుంటాయి. అవన్నీ దోషభరితాలు. వాని నుండి  మనస్సునూ ఇంద్రియాలనూ మరలించి అంతఃకరణను  సత్కార్యాల మీద కేంద్రీకరిస్తే మోక్ష మార్గంవైపు నడుస్తుంది, అంటారు. 
    భూతకోటిని తనవలే చూస్తూ, ఓరిమితో శాంత హృదయంతో నిష్కామ కర్మచేస్తూ, నారాయణుని గాధలు పాడుకుంటూ వింటూ వుండేవారు తాపత్రయ దూరువలుతారు, వీరు భగవతోత్తములు. 

    భాగవతోత్తముల సహవాసం వల్ల నిరంతరం హరినామస్మరణ, శ్రవణం లభించి శ్రద్ద, భక్తి సమకూరుతాయి. 

     అమ్మా! ముక్తికంటే భగవత్సేవా భాగ్యం గొప్పది. శరీరంలోని జఠరాగ్ని మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని ఎలా యిస్తుందో, అలానే ఈ సేవ మన శరీరాన్ని నశింపజేస్తుంది. 

    కొందరు సర్వకర్మలూ నారాయణపరంగా చేస్తూ, హరిచరణ సేవనే కోరుకుంటారు. మరి కొందరు విష్ణు కధాగానం మోక్షం కంటే ఉత్కృష్టంగా భావిస్తారు. వీరందరూ మోక్షం పొందుతారు. 

    ఇటువంటి వారి యందు ఆదరంతో వారి బిడ్డగా,  విశ్వాసంతో భార్యగా, హితవుకోరే స్నేహితుడుగా, మంత్రోపదేశం చేసే గురువుగా పూజవతో దైవంగా చూస్తూ ఏ క్లేశం రాకుండా చేస్తాను. ఇదంతా భక్తి యోగుల విషయం. 

    అమ్మా! తత్త్వ విషయం ; ప్రకృతి - పురుషుడు ఈ రెండు ప్రపంచానికి కారణం. ఇందులో ప్రకృతి చతుర్వింశతి తత్త్వాలతో వుంటుంది. 

    పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పది, మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారం అనే అంత కరణ చతుష్టయం - ఇవి ఇరవై నాలుగు ; తత్త్వాలు, ఇదంతా సగుణ బ్రహ్మస్థానం. 

    వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ద, ప్రద్యుమ్న అని నాలుగు వ్యూహాలు స్వచ్చ, శాంత సత్వగుణాలత ఆకలి దప్పికలు, విచార మోహాలు, వార్దక్య మరణాలు అనే ఊర్మిషట్కాన్ని జయించి భక్తజన సేవాసులభమయినది వాసుదేవు వ్యూహం. 

    మహత్తత్త్వం వల్ల అహంకారం పుడుతుంది. ఇది వికార, తేజస, తామస భేదాలతో మూడు విధాలు; మనస్సు, ఇంద్రియాలు, ఆకాశాది భూతాలు - వికారమయాలు. 

    తేజసాహంకారంతో బుద్ది, ప్రాణం వుంటాయి. తామసాహంకారం ఇంద్రియ సమూహంతో నిండి వుంటుంది. ఇవి సంకర్షణ వ్యూహానికి సంబంధించినవి. 

    సంకల్ప - వికల్పాలు, కామం అనిరుద్ద వ్యూహంగా చెపుతున్ిారు. 

    తామసాహంకారం వల్ల పుట్టినవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులైన తన్మాత్రలు. వీటినుండి భూతపంచకం, జ్ఞానేంద్రియాలు. ఇది సృష్టి హేతువు. 
    
      పృధివిమీది ఇన్ని లక్షల జీవజాలంలో మానవజన్మ అత్యుత్తమమైనది. దానిని సార్దకం చేసుకోవాలంటే నారాయణ నామస్మరణం, హరిచరణ సేవ ఆవశ్యం;మరోదారిలేదు. 

    వీటిని విడిచి ఏదో దారులు త్రొక్కి కొన్నిసిద్దులు సంపాదించే వారున్నారు. వారికి మోక్షం దొరకదు.

    సురాపానం చేసిన వాడికి లోకం అంతా శూన్యం. అంతకంటే ఆత్మతత్వం గ్రహించిన వానికి తన దేహమూ; తన భార్యా బిడ్డలు అనే వ్యామోహం వుండదు.

    నిద్రలో కలగంటాం; ఏమేమో చూస్తాం, అనుభవిస్తాం, ఆనందిస్తాం, తెలివి రాగానే ఏమీ కనపడదు. అలానే భూమిమీదపుట్టి సంసార తాపత్రయంలోపడి యిదే సర్వస్వం అనే భ్రమలో  చిక్కుకుంటున్నారు.

    భక్తి భరిత హృదయులు. నిరంతరం భగవదారాధనతో, సేవతో జీవితం సార్దకం చేసుకుని, త్రిగుణాతీతులై తామే పరమేశ్వరులమనే భావంతో వుంటారు.

                                           ఉత్తమ ప్రాణులు 

    చైతన్యంలేని స్థావరాల కంటే చలనమున్న ప్రాణి శ్రేష్టమైనది. స్పర్శ మాత్రమేకల వృక్షాలకంటే రసజ్ఞానం వున్న జీవి ఉత్తమమైనది. అంతకంటే వాసన గ్రహించగలవి, వీటికంటే శబ్ద జ్ఞానం వున్నవి? వీటికన్న రూపజ్ఞానం గల పక్షులు, నాలుగుకాళ్ల జంతువులు, ఇన్నిటినీ మించినది రెండు కాళ్ళ మానవప్రాణి.

    ఈ మనుష్యులలో వేదవేత్తలు, వీరిని మించినవారు శాస్త్రజ్ఞానంతో సంసయాలను ఛేదించగలవారు, వీరిపై శ్రేణి ధర్మపరులు, అందరినీ మించి నిలబడేవారు పరమేశ్వరారాధన పరాయణులు.

    భువన భవనానికి అధిపతియైన వైకుంఠ నారాయణుని కృపా విశేషం వల్ల వాయువు చలిస్తున్నాడు. ఇంద్రుడు వానలు కురిపిస్తున్నాడు. సూర్యచంద్ర తారాగ్రహాల ప్రకాశంతో సముద్రుడు చెలియలికట్ట దాటకుండా వుంటున్నా, నదులు ప్రవహిస్తున్నా, చెట్లు చివురించి పుష్పించి తియ్యని ఫలాలిస్తున్నా ఆయన అనుగ్రహమే.

    ఆ భగవంతుని అతిలోకశక్తి గ్రహించలేక సంసారం, సంపదలు పశువులు, పంటచేలు, యివే శాశ్వతం అనుకుంటూ వాటి రక్షణ కోసం హింసలు సాగించి ధనార్జనతో జీవితం వ్యర్దం చేసుకుంటున్నారు. క్రమంగా యౌవనం మళ్లీ, కౌమారం వదలి, వార్దక్యం నెత్తి మీద పడుతుంది. శక్తి క్షిణించి, ఎముకలగూడు మిగిలిన ఎద్దును విడిచినట్లు జరాభారంతో వున్న వారిని దారాపుత్రులు , -  బంధువులు  వదిలిపెడతారు అంటూ తత్వం బోధిస్తున్నాడు కపిలుడు తల్లికి.
                                              నరకయాతన 

    ఆకలి మందగించి, జీర్ణరసాలు పలచబడి, వాతం ప్రకోపించి, శ్లేష్మం పెరిగి, నాలుకు విడక మరణయాతన ఆరంభమవుతుంది. భయంకర దేహాలతో శూలాలు, పాశాలూ పుచ్చుకుని యమకింకరులు దిగి వచ్చి ఎత్తుకుపోతారు. యాతనాదేహం ప్రాప్తిస్తుంది.

    ఆకలి, దాహం పీడిస్తుంటే మండుటెండలో ఇసుకగుట్టల మీద నడిపిస్తూ కొరడాలతో బాదుతూంటే భరించలేక మూర్చపోతూ మళ్లీ లేస్తూ సాగాలి.

    అలా తొంబది తొమ్మిదివేల యోజనాల దూరం నడిచి యమలోకంలో ప్రవేశిస్తారు. ఇంత యాత్రకూ  రెండు ముహూర్తాల కాలం  పడుతుంది. అక్కడ కణకణ మండుతూన్న గుండంలోంచి లోహ దండాలతో చురకలు వేస్తూ తళ తళ మెరిసే కత్తులే ఆకులుగా వుండే  ఆసిపత్రవనంలో తరుముతుంటే  శరీరం చీరుకుపోతూంటుంది. సల సల మరిగే నీటి మడుగులలో  పడేస్తారు. శూలాలతో; గదాదంజాలతో హింసించి, పేగులు పీకుతారు. వెల్లకిలా పరుండబెట్టి ఏనుగులచేత త్రొక్కిస్తారు. కాలకూట విషం నిండిన కోరల త్రాచులు కరుస్తాయి. పైనించి వేడి వేడి యినుపగుండ్లు పడుతుంటాయి.  ఆ శరీరం ముక్కలుచేసి తినిపిస్తారు.

    తామిస్ర, అంధతామిస్ర, రౌరవాది నరకాలలో పాపఫలం అంతా అనుభవించి మళ్లీ భూమిమీద జన్మించాలి.
                               *    *    *    *
  పురుషుని దేహంలో జీలి శుక్రంలో ప్రవేశించి, అది స్త్రీ గర్బంలో చేరి శోణితంలో కలిసి ముద్దగా తయారవుతుంది. నీటి బుడగగా మారి, పదవనాటికి రేగుపండంత పెరుగుతుంది. క్రమంగా అండరూపం పొంది, తల ఏర్పడి, కాళ్లు, చేతులు, చర్మం, ఎముకలు, గోళ్లు ధాతువులు చేరుతాయి. అయిదవ నెలలో ఆకలి ఆరంభమవుతుంది. ఆరవ నెలలో తల్లి కడుపులో ప్రక్కకు తిరిగి ఆమె తీసుకునే ఆహారం అందుకుని  పెరుగుతూంటాడు.

    అలా మలమూత్ర కోశాలమధ్య పంజరంలో పిట్టలా గిలగిల లాడుతూండగా ఏడవనెలలో జ్ఞానపడి పనిచేసి ఈ జనన క్లేశాన్ని తొలగించమని పరత్పారుని ప్రార్దిస్తాడు.

    పదవనెలలో తల క్రిందికి తిరుగుతుంది. ఊపిరి ఆడదు. జ్ఞానం నశించి భూమి మీద పడతాడు. నెమ్మదిగా తల్లిదండ్రుల చేతులలో శైశవం గడుస్తుంది. బాల్యం ప్రాప్తిస్తుంది. అహంకార మమకారాలతో సంసారంలో పడతాడు. రాగద్వేషాలు, కోరికలు. అవి తీరడానికి పాపకర్మలు.

    దయా, సత్య శౌచాలు వదిలేస్తాడు. మానవాభిమానాలు వుండవు. మనశ్సాంతి పోతుంది. శరీరమే ఆత్మ అనుకుంటాడు. నారీ సంగమమే సుఖం అనుకుంటాడు.

    వీటిని విడిచి ధర్మబుద్దితో ధనార్జచేసి దానిని యోగ్యులకు దానం చేసి దేవ పితృకార్యాలూ, వేదోక్త కర్మలూ చేసేవారు చంద్రలోకం చేరి పుణ్యం ఫలం పూర్తికాగానే మళ్లీ జన్మిస్తారు. కర్మలన్నీ విడిచి నిరంతరం పురుషోత్తముని స్మరించేవారికి పునర్జన్మ భీతి లేదు, అని కపిలుడు తల్లికి భక్తిమార్గం ఉపదేశించాడు.

    కపిలుడు వెళ్ళడంతో దేవహూతి కొంతసేపు చింతించి తిరిగి మనస్సు చిక్కబట్టుకుని పురుషోత్తముని పై మనసు నిలిపి ఆయనలో ఐక్యమైంది, అని శుకయోగి పరీక్షన్మహారాజుకు వినిపించాడు.

        (ప్రధమ, ద్వితీయ, తృతీయ స్కంధాలు సమాప్తం)

                                                చతుర్ద స్కంధం


    స్వాయంభువ మనువు భార్య శతరూపకు ముగ్గురు కుమార్తెలు పెద్దకూతురు ఆకూతి. ఈమెను రుచి ప్రజాపతి కిచ్చి వివాహం చేశారు. ఈమె గర్బాన నారాయణుడు శ్రీయజ్ఞుడు అనే పేరుతో పుట్టాడు. నిమేష కాలం శ్రీహరిని వీడి వుండలేని  శ్రీదేవి ఆకూతికి కుమార్తెగా ప్రభవించి పెరుగుతున్నది. లక్ష్మీనారాయణులు ఆదిదంపతులు కనక వారికి వివాహం జరిగింది.

    మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతి కిచ్చి వివాహం చేశారు. వీరివలన మానవజాతి పెరిగింది.

    అనసూయాదేవిని అత్రి మహాముని వివాహం చేసుకుని ఋష్య పర్వతం దగ్గర నిర్వింధ్యానదీ సమీపంలోని వనంలో తపోదీక్ష వహించాడు.

    అత్రి మహాముని ఒక్క కాలి మీద నిలబడి గాలి ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తున్నాడు. తపోదీక్షాగ్నికి ముల్లోకాలూ మండుతూంటే ఆశ్చర్యంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడకు వచ్చారు.

    త్రిమూర్తులను చూచి ఆనంద తరంగిత హృదయుడై శిరసున చేతులు జోడించి - స్వామీ! నేను సంతాన కాంక్షతో మీలో ఒకరినే ప్రార్దిస్తున్నాను. మీరు ముగ్గురూ వచ్చి నా జన్మ పావనం చేశారు. అనగా వారు  -
  బాహ్యదృష్టికి మేము మూడు రూపాలలో కనిపించినా  వాస్తవానికి ఒక్కరమే. మా ముగ్గురి అంశతో ముగ్గురు కుమారులు కలిగి ముల్లోకాలలో కీర్తి పొందుతారు;  అని అంర్దానమయ్యారు. 

    బ్ర్హహ్మ అంశతో చంద్రుడు, విష్ణువు అంశతో దత్తాత్రేయుడు, శివాంశతో దుర్వాసుడు పుట్టి లోకాలలో పేరు పొందారు. 
    
                                      సతీదేవి కథ 

    దక్ష ప్రజాపతి కూతురు స్వాహాదేవిని అగ్నిహోత్రుడు పరిణయమాడి పావకుడు, పవమానుడు,  శుచి అని ముగ్గురు కొడుకులను కన్నాడు. 

    దక్షుని మరొక కుమార్తె సతీదేవి పరమశివుని వరించింది. అన్యోన్యాను రాగాలతో వారు దాంపత్య జీవితం గడుపుతున్నారు. 

    వేదవేత్తలు నిర్వహించే సత్రయాగానికి దక్షప్రజాపతి రాగా అందరూ లేచి స్వాగత మర్యాదలు నడిపించారు. చతుర్ముఖ ప్రజాపతీ, పరమశివుడూ, కదలకుండా వున్నారు. దక్షుడు చతుర్ముఖుని సమీపించి అభివాదం చేసి యోగ్యమైన ఆసనం మీద కూర్చున్నాడు. 

    సుఖాసీనుడై శివుని వైపు చూస్తూ కన్నుల చింతనిప్పులు రాలుతూండగా: ఓ మునీశ్వరులారా! మీరందరూ ఎరుగుదురు, సావిత్రి వంటి నా బిడ్డ సతీదేవిని పెండ్లాడిన ఈ శివుడు నేను వచ్చినప్పుడు లేచి స్వాగతం యివ్వకపోగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సజ్జనుడెవడూ యిలా చరించడు. అభిమానమూ మర్యాదా ఎరగనివాడు భూత ప్రేతగణాలు సేవిస్తుంటే దిగంబరుడై  ప్రమధగణనాధుడై శరీరమంతా బూడిద పూసుకుని ఎముకల దండలతో శ్మశాన వాసంతో జుట్టు  విరియబోసుకుని తిరిగే వీనిని శివుడని ఎలా పిలుస్తున్నారు?
    దక్షునికి భయపడి యజ్ఞమంటపంలో ఒక్కరూ ఆమెను పలకరించలేదు. కన్నతల్లి, చెల్లెళ్లూ ఆదరించినా కన్నతండ్రి ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. 

    ఈశ్వర తిరస్కార, రుద్రరహిత యాగం చూసే సరికి ఆమెకు రోషం వచ్చింది. వెంట వచ్చిన రుద్రగణాలు తమ అధిపతిని అవమానించిన వానిని సంహరిస్తామని ముందుకు  నడవగా వారిని వారించి - 

    ఈ లోకంలో పుట్టే అందరినీ ప్రేమతో చూచే  పరమశివునికి పక్షపాత భావం లేదని తెలియక గర్వంతో దక్షప్రజాపతి ఆయనను అవమానించాడు. ఇటువంటి వారికి ఎదుటివారి సుగుణాలు కూడా దుర్గుణాలుగా కనిపిస్తాయి. ఎదుటివారిలో దుర్గుణాలన్నీ సుగుణాలుగా  భావించి  మన్నిస్తారు ఉత్తములు. 

    నేను నా బిడ్డను ఎందుకిచ్చానని అడగవచ్చు. అది విధివశాన జరిగిందనుకోవాలి. 

    ఈ అమర్యాదకర ప్రవర్తన కారణంగా వీనికి యజ్ఞాలలో హవిర్బగ్యం యివ్వడానికి వీలులేదు, అని శాసించి మరుక్షణంలో యాగశాల విడిచి వెళ్లాడు.

    ఆవేశంలో పరమశివుని నిందించిన దక్షుని అక్కడి మునులందరూ గర్హించారు. పరమశివుని అనుచరులలో ప్రధానుడైన నందీశ్వరుడు మా అధిపతిని నిందించిన దక్షప్రజాపతీ, వీరి వంశీయులూ తత్త్వజ్ఞానశూన్యులై పశువాంఛతో పడి దేహమే శాశ్వతమని నమ్మే మూఢులవుతారు. పరమ శివుని ద్వేషించే  వారందరూ ధనదాసులూ ఇంద్రియలోలులూ అయి  భిక్షాటనంతో బ్రతుకుతారు, అని శపించాడు. 

    భృగు మహర్షికి ఆగ్రహం వచ్చి: వేదప్రతిపాదితమైన కర్మాచరణం చేసే  విప్రజనాన్ని నిందించిన ధూర్జటి వ్రతపరాయణులు పాషందులై జీవిస్తారు. వారందరూ జటాజూటాలతో ఎముకల మాలలతో బూడిద పూసుకుని తిరుగుతూ మూఢులై పరిశుభ్రత లేకుండా నశిస్తారు అని శపించాడు. 
దక్షయజ్ఞం

    రుద్రుడు లేని యాగం చెయ్యాలని దక్షుడు నిశ్చయించి, 'బృహస్పతి యజ్ఞం' సాగించి వచ్చిన  నిఖిల దేవగణాలనూ ముని బృందాలనూ ఆహ్వానించాడు. 

    వారందరూ విమానాల మీద వెడుతూ దక్షయజ్ఞాన్ని గురించి ఘనంగా చెప్పుకుంటుంటే విన్న సతీదేవి తన తండ్రి చేసే యాగం చూడాలని వుందనీ అన్నదమ్మ్ములూ, అక్కచెల్లెళ్లు అందరూ వస్తారు కనుక వారిని చూచి వస్తానని భర్తను వేడుకుంది. 

    పుట్టింట  జరిగే ఉత్సవానికి  పిలుపురాలేదు కనుక వెళ్లడం  మంచిది కాదంటే ; పుట్టింటికీ, గురుగృహానికీ, స్నేహితుల యింటికీ పిలవకుండా వెళ్ళవచ్చుగదా అని పరిపరి విధాల బ్రతిమాలింది. 

  పరమశివుడు చిరునవ్వు నవ్వి ప్రాణేశ్వరీ! నువ్వు చెప్పినట్లు పుట్టింటికీ గురగృహానికీ స్నేహితుల నివాసాలకూ పిలుపు లేకుండా వెళ్లడం దోషం కాదు. కాని మంచి చెడ్డల వివేకం లేకుండా అహంకారంతో చరించే వారింటికి పిలవకుండా వెడితే అవమానిస్తారు. శత్రువుల ఆయుధప్రహారాలలో దైవం రక్తసిక్తమైనా భరించవచ్చు. ఆప్తులు నోటి కొచ్చినట్లు మాట్లాడితే సహించలేము. ఇప్పుడు నా మీద ద్వేషంతో  వున్న వారింటికి వెడితే నీకు అవమానమే సిద్దిస్తుంది. ఇంత చెప్పినా నీకు వెళ్ళాలని వుంటే వెళ్ళు అన్నాడు. 

    పుట్టింటి మీద ఆశ వీడని సతీదేవి ప్రయాణమైంది. పరమశివుని అనుచరులు యక్షులు ఆవిడ సేవకు అవసరమయిన లాంఛన సామాగ్రిని తీసుకుని ఆమెను వృషభ వాహనం ఎక్కించి శంఖ దుందుభి ద్వానాలతో యజ్ఞశాల చేరారు.
    ఒక్కమారు 'శివశివా' అంటే చాలు సర్వపాపాలూ హరిస్తాయి. అటువంటి పరమశివుని అవమానించిన యీ ప్రజాపతిని ఏమనాలి శివనింద చేసిన వాని నాలుకు కోసివెయ్యాలి. అలా చెయ్యలేకపోతే శివనింద వినడం కంటె ప్రాణాలు వదలడం మంచిది. అందుకు ధైర్యం చాలకపోతే రెండు చెవులూ మూసుకుని ఆ ప్రదేశం విడిచిపోవాలి. 

    పరమశివుని నిందించింది చాలక రుద్రునికి ఆహ్వానం లేకుండా యజ్ఞం సాగించడం సతీదేవికి అవమానంతో పాటు ఆగ్రహం కడా పెరిగింది. ఆమె వెంట వచ్చిన రుద్రగణాలు యజ్ఞాశాలలోని సభ్యులందరినీ సంహరించే సంకల్పంతో సాగుతుంటే వారిని ఆపి 

     సతీదేవి : ప్రపంచంలో ప్రతి ప్రాణినీ ప్రేమతో ఆధరించే నా భర్తను అవమానించిన దక్షప్రజాపతి ఎంత అవివేకి! ఎదుటివారిలో సుగుణాలను సైతం దుర్గుణాలుగా చిత్రించుకునే అజ్ఞానులు వీరు. 

    నేను దక్షుని కుమార్తెననిపించుకోవడం కంటే దౌర్భాగ్యం లేదు. ఇక్కడే ప్రామ త్యాగం చేస్తాను, అని ఉత్తరముఖంగా పద్మాసనం వేసి కూర్చుని, ప్రాణాపానాలను ఏకోన్ముఖం చేసి, నాభి వద్ద బంధించి ఉదానాన్ని  కలిపి, హృదయం మీదుగా కంఠం దాటించి భ్రూమధ్యంలో కేంద్రీకరించి, పరమశివునిపై మనసు నిలిపి యోగాగ్నిలో దేహాన్ని భస్మం చేసింది. 
    యజ్ఞ విధ్వంసం

    ఆ దృశ్యాన్ని చూచిన సదస్యులందరూ హాహారావాలు చేశారు. రుద్రగణాలు విజృంభించపోతుంటే భృగు మహర్షి అభిచార హోమంతో ఋభుగణాలను  సృష్టించి వారి కెదురుగా పంపాడు. 

    రుద్రగణాలు కైలాసం చేరి జరిగిన విషయాలు వివరింపగా, శివుడు ఆగ్రహోదగ్రుడై జటాజూటం  పెరికి నేలకు కొట్టాడు. 

    ప్రళయాగ్ని జ్వాలలు క్రక్కే అరుణ నేత్రాలతో, ఏనుగు తొండాల వంటి బాహువులతో రంపాల వంటి దంతాలతో, విశాల దేహంతో వీరభద్రుడు ఆవిర్బవించి శివుని పాదాలకు నమస్కరించి;

    ఏమి ఆజ్ఞ? అని నిలబడ్డాడు. 

     వీరభద్రా! ఈ రుద్రగణాలకు అధిపతివై దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిరా, అని ఆజ్ఞాపించాడు. 

    శూలాయుధంతో వీరభద్రుడు హుంకరించి అడుగువేశాడు. ప్రమధ గణాలు "హర హర మహాదేవ" నినాదాలతో వీరభద్రుని వెంట నడుస్తుంటే భూమ్యాకాశాలు దద్దరిల్లాయి. 

    దండధరుని వలే వస్తున్న వీరభద్రుని చూడగానే  యజ్ఞశాలలోని సదస్సుల  గుండెలలో భీతి పుట్టి, శరీరాలు గజగజ లాడాయి. సతీదేవి వంటి సాధ్విని అవమానించిన పాపఫలం అనుభవించక తప్పదు అనుకున్నారు. 

    యాగమంటపం నేలమట్టం అయింది. అప్పటికే సదస్యులు పారిపోతున్నారు. వీరభద్రుడు అడుగువేశాడు. సూర్యుని పళ్లు ఊడపీకాడు. భృగు మహర్షి గడ్డం, మీసం తీసేశాడు. మరొకరి కన్నులు, చేతులు, కాళ్లు, కీల్లు ఊడగొట్టాడు. చివరకు  దక్షుని శరీరంనిండా కత్తులు నడిపినా చర్మం చెక్కు చెదరక పోవడంతో కంఠం నరికేశాడు. 

    భయపడి ముందే పారిపోయినవారు కొందరు వైకుంఠం చేరి నారాయణునికీ, కొందరు సత్యలోకంలో చతుర్ముఖునికి యాగశాలలోని హింసాకాండ వివరించారు. 

     ఈ ప్రమాదం తప్పదని తేలినందువల్లనే వీరుభయులూ యాగానికి వెళ్లలేదు. వారి దీనాలాపాలు విని ప్రజాప్రతి బ్రహ్మ - 

    భయపడకండి, మనమందరం వెళ్ళి పరమశివుని ప్రార్దించి ప్రసన్నుని చేసుకుని యాగం పూర్తి అయ్యేదారి చూద్దాం అన్నాడు. 

    అందరూ కైలాసం చేశారు. అక్కడ నారద మునీంద్రునితో గోష్టిలో వున్న ఫాలలోచనునికి అభివాదం చేసి, తలలు వంచి, చేతులు జోడించి నిలబడ్డారు. 

    శివుడు బ్రహ్మదేవునికి నమస్కిరంచాడు. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వరులు చతుర్ముఖునికి పాదాభివాదం చేసి ప్రక్కగా నిలబడ్డారు.

    శివుడు చూపిన ఆసనం మీద బ్రహ్మ ఆసీనుడై - కైలాసపతీ! సృష్టి, స్థితి, లయ కారకుడవు, కారణుడవు నీవే. ధర్మార్ద కామమోక్షాలను మానవులు క్రమబద్దంగా సాగించడానికి వేదాలను అనుగ్రహించిన వాడవు.

    వేదం ప్రతిపాదించిన కర్మలను నిర్వహించడానికి ప్రజాపతులను సృష్టించి, వారిచేత యజ్ఞయాగాదులు చేయించేవాడివి. యాగఫలాన్ని ఇచ్చే వాడివి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ దీక్ష కలవాడివి.  ఈ భూతకోటి అంతనూ వాత్సల్యంతో చూచే నిన్ను గ్రహించలేక కొందరు అహంకారంతో అన్యాయాలకు దిగితే వారిని శిక్షించేవాడివీ నీవే.

    అయితే నేను నీ శిక్ష కారణంగా దక్ష ప్రజాపతి ఆరంభించిన యజ్ఞం ఆగిపోయింది. అది పూర్తి కావాలంటే దక్షుడు మళ్లీ జన్మించాలి. అవయవాలు  కోల్పోయిన వారందరూ తిరిగి వాటిని పొంది ఆరోగ్యవంతులు కావాలి,  అన్నాడు.

     శివుడు: ప్రజాపతీ! నీ సూచనానుసారం అన్నీ జరుగుతాయి.  కాని దక్షునికి మేక తల తప్పదు. సూర్యునికి దంతాలు రావు. మెత్తని పదార్దాలే ఆహారం అవుతుంది.

                                                            *    *    *    *
    శివుని అనుగ్రహంతో అజాముఖుడై పునర్జన్మ పొందిన దక్షుడు యజ్ఞం పూర్తి చేసి త్రిమూర్తులు  అనుగ్రహం పొందాడు.

    యాగశాలలో శరీరం విడిచిన సతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమెనే పార్వతీదేవి అని పిలుస్తున్నారు.

                                                                    ధ్రువుడు 

    స్వాయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానుపాదునికి సునీతి, సురుచి యిద్దరు భార్యలు. గుణవతి, వినయశీల అయిన సునీతికి ధ్రువుడు. సురుచికి  ఉత్తముడు కుమారులు.

    ఉత్తానపాదునికి సురుచి  యందు అనురాగం అధికం. అందువల్ల  ఎప్పుడూ ఆమె దగ్గరే వుండేవాడు. అది కారణంగా ఉత్తమునికి రాజు దగ్గర ఎక్కువ చనువుండేది.

    ఒకనాడు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చొని ఆడుకుంటుండగా ధ్రువుడు వచ్చాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనే కాంక్షతో దగ్గరగా రాగా చూచిన సురుచి -

    వెర్రి నాయనా! ఆ అదృష్టం నీకు లేదు. నా కడుపున  పుట్టి వుంటే ఆ భాగ్యం నీకూ లభించేది. ఇప్పుడైనా నువ్వు తపస్సు చేసి లక్ష్మీవల్లభుని అనుగ్రహంతో నా బిడ్డగా పుట్టే వరం సంపాదించు.  అప్పుడు నిన్ను కూడా రాజుగారి తొడ  మీద కూర్చోబెట్టి ఆడిస్తాను అంది.
    ధ్రువుని మనస్సు ఆవేదనతో కన్నుల నీరు నిండింది. ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లి కథ అంతా చెప్పాడు.
    శింశుమార ప్రజాపతి కుమార్తె భ్రమిని వివాహం చేసుకుని ధర్మబద్దంగా దాంపత్య జీవితం గడుపుతూ, కల్ప, వత్సర, అనే కుమారులను కన్నాడు.  వాయుదేవుని కుమార్తె ఇలను పెండ్లాడి కుమారునీ కుమార్తెను పొందాడు ధృవుడు.

    ఆ రోజులలో ఉత్తముడు వేటకుపోయి మరణించిన వార్త విని సురుచి శోకం పట్టలేక ఘోరారణ్యంలో దావాగ్నిలో ప్రాణాలు విడిచింది.

    ఈ సంఘటనలు  హృదయాన్ని శోకసాగరంలో ముంచగా ధృవుడు  హిమాలయ పర్వత ప్రాంతపు లోయలో తపస్సుకు వెళ్ళి, అక్కడ యక్షులు విఘ్నం కలిగించగా వారితో యుద్దం ఆరంభించాడు.

    యక్షులు మాయా యుద్దం ఆరంభించగా, మరింత ఆగ్రహంతో వారి మాయాజాలాన్ని ఛిన్నాభిన్నం చేసే దారి తోచక ఆలోచిస్తున్న సమయంలో మునులు ప్రత్యక్షమై - నాయనా! నిఖిల మాయలనూ సంహరించే శక్తి శ్రీహరి స్మరణతో కలుగుతుంది, అని అదృశ్యమయ్యారు.

    ధృవుడు శ్రీహరిని స్మరించి నారాయణాస్త్రం ప్రయోగించాడు. అంతలో యక్షుల శక్తులు సన్నగిల్లాయి. ఆ అస్త్ర ప్రభావం వల్ల బయలుదేరిన వాడి బాణాలతో కొందరు కాళ్లు విరిగి, తొడలు విరిగి, చెవులు రాలి, చేతులు రాలి, పొట్టలు చీలి నానాయాతనలూ పడుతూంటే స్వాయంభువ మనువు ప్రత్యక్షమై -

    నాయనా!  ఏమిటీ కిరాతక కృత్యం? దేహాభిమానం కల పశుప్రాయులు చేసే పని యిది. సర్వప్రాణికోటికీ అధీశ్వరుడైన నారాయణుని సేవించి పరమపదం పొందిన నువ్వు ఈ పాపకర్మ చేయరాదు. సహనం, భూత, దయ, కరుణ, స్నేహభావం వున్నవారినే శ్రీహరి కరుణిస్తాడు. వీరు నీ సోదరుని చంపారని నువ్వు వీరిని  సంహరించావు. అందువల్ల కుబేరునికి అపచారం జరిగింది. ఆయన పరమశివుని యిష్ట సఖుడు. ఈ అపరాధాన్ని మన్నించమని కుబేరుని వేడుకో, అని శాంతింపజేసి వెళ్లాడుచ. 

                                                *    *    *    *    *

  ధృవుడు ప్రసన్నుడుగా వున్న వార్త విని కుబేరుడు అనుచరులతో వచ్చాడు. కుబేరుని చూస్తూనే ధృవుడు చేతులు జోడించాడు.

    రాకుమారా! మీ తాతగారి మాటలు విని శాంతించావు, సంతోషం ఇక నువ్వు నిర్మల హృదయంతో విష్ణు నామస్మరణమే జీవిత ధ్యేయం చేసుకో, అని పంపించాడు కుబేరుడు.

    ధృవుడు రాజ్యానికి వచ్చి భూరి దానాలతో యజ్ఞాలుచేసి పురుషోత్తముని యందు మనసు నిలిపి, సర్వం హరిమయంగా కొంతకాలం రాజ్యం చేసి పద్మాసనాసీనుడై నారాయణ నామస్మరణం ఆరంభించాడు.

     నంద సునందలనే నారాయణ సేవకులు దివ్య విమానం తెచ్చి  దృవుని ఎక్కించి, వైంకుఠం వైపు బయలుదేరగా - ఓ నారాయణ సేవకులారా! నా కన్న తల్లిని విడిచి రాలేను, అనగా వారు తమ ముందున్న విమానం మీద వాని తల్లిని చూపించారు. ఆనందంతో దృవుడు నారాయణ పదం చేరాడు.

                              వేనరాజు 

    ఈ వంశంలో అంగుడనే రాజు చిరకాలం సంతానం లేక పుత్ర కామేష్టి  చేసి కుమారుని కన్నాడు. వాని పేరు వేనుడు. వీడు చిన్ననాటి నుంచీ క్రూర కృత్యాలు చేస్తూ అందరినీ హింసించేవాడు. ఇటువంటి  దుష్టుడు కొడుకుగా పుట్టడం కంటే సంతానం లేకపోయినా బావుండును అని బాధపడి, దండించాడు, శాసించాడు వాని నడవడి  మారలేదు.

    అది సహించలేక రాజు ఎవరికీ చెప్పకుండా అడవికి వెళ్లాడు మంత్రి పురోహితులు తమ రాజు కోసం వెదికి కనిపించక వేనుని సింహాసనం ఎక్కించారు.  సింహాసనం ఎక్కింది మొదలు వాడు మరీ దుష్టుడై సజ్జన హింస ఆరంభించాడు.

    యజ్ఞ యాగాలు నిషేధించాడు.
    దానధర్మాలు కట్టిపెట్టించాడు.
    అగ్నిహోత్రాలు పనికి రావన్నాడు.

    ఈ వార్త తెలిసి విద్వాంసులు వానిని సమీపించి, స్వస్తి వాక్యాలు పలికి :  మహారాజా! మనోవాక్కాయలతో జరిపే ధర్మకార్యాల వల్ల లోకాలు క్షేమంగా వుంటాయి. ప్రజలకు కళ్యాణ ప్రదాలు - రాజు ధర్మమార్గం విడిస్తే ప్రజలు బహిష్కరిస్తారు.

    చోర భీతి లేకుండా చేసి ,బంధువులూ, సేవకులూ వంచించకుండా ప్రజలను రక్షించాలి.

    రాజ్యంలో శ్రీహరి ప్రీతికి యజ్ఞయాగాలు సాగుతూ వుండాలి. నారాయణుడు తృప్తి పొందితే యిహపర సుఖభోగాలిస్తాడు. కనక సర్వ దేవతా ప్రీతకర  కార్యాలు నడిపించాలి, అన్నారు.
    వేనుడు నవ్వుతూ : ఏమిటీ మాటలు? ఎవడా యజ్ఞప్రియుడు? జూరునితో తిరిగే యిల్లాలికి భర్తకంటె వాడే ప్రియుడయినట్లు మీరు ప్రభువైన నన్ను కాదని ఎవరినో ఆరాధించమనడం నచ్చలేదు. సర్వదేవతలూ రాజులో వున్నారు. మీరంతా నన్ను పూజించి సేవించండి, అని అహంకారంతో మాట్లాడుతూండగా.

    ఈ నీచ కర్ముని వల్ల లోకానికి హాని కలుగుతుంది. ఏ పురుషోత్తముని అనుగ్రహ విశేషం వల్ల వీడు రాజ భోగాలనుభవిస్తున్నాడో, ఆ నారాయణుని  నిందించే వీనిని అంతమొందించాలి, అని నిశ్చయించి క్రోధాగ్నిని పూరించి హూంకారం చేశారు. వేనుడు మరణించాడు. రాజు లేకపోతే  దేశంలో చోరులూ, క్రూరులూ, పెచ్చుపెరిగి, రెచ్చి సాధు హింస చేస్తారని వేనుని ఊరువు మధించగా రాక్షసుడు పుట్టాడు. వానిని అరణ్యాలకు  సాగనంపారు.

    వేనుని బాహువులు మధించగా నారాయణాంశతో పృధువు, లక్ష్మీదేవి అంశతో అర్చి జన్మించారు.

      పృధువును రాజ్యాధిపతిని చేశారు. సర్వలక్షణలక్షితుడై అర్చితో దాంపత్యం సాగిస్తూ నిఖిల ప్రజారంజకంగా పరిపాలన ఆరంభించాడు.

    దేశంలో క్షామం ఏర్పడి ప్రజలు అన్నోదకాలు లేక అలమటిస్తుంటే వారి బాధలు, చూడలేక, ఇంతకూ కారణం భూమి నిస్సారం కావడం అని గ్రహించి, ధనస్సు సంధించాడు. భూదేవి భయపడి గోరూపధారియై పరుగు పెడుతూంటే తరుముతూ  వెడుతున్నాడు.

    కొంత దూరం సాగాక భూదేవి నిలబడి, మహారాజా! రక్షించు. నిఖిల ప్రాణికోటికీ ఆధారమయిన ఓషధులు నాలో వున్నాయి. గోరూపంతో వున్న నాలో క్షీరంగా వాటిని పిండుకోవాలి.  అందుకు ముందు లేగదూడ కావాలి, అనగా మనువును ఆవుదూడగా వుంచి మహారాజు ఓషధులన్నీ పిదికి ప్రజలకు శాంతి, సౌఖ్యం ప్రసాదించాడు.

                             *    *    *    *   

   పృధు చక్రవర్తి అశ్వమేధం ఆరంభించాడు.

    యాగశాలలో నిర్విరామంగా షడ్రసోపేతంగా భోజన పానీయాలు సమకూరుస్తున్నారు. వేదోక్తంగా యజ్ఞం సాగుతున్నది. అది చూచి దేవేంద్రుడు సహించలేక యజ్ఞశాలలోని అశ్వాన్ని హరించాడు. పృధువు ధనుర్బాణధరుడై దేవేంద్రునిపై బాణవర్షం కురిపించగా, ఇంద్రుడు అశ్వాన్ని  వదలి వెళ్లిపోయాడు. పృధువు అశ్వాన్ని తీసుకువచ్చి యజ్ఞం పరిసమాప్తి చేస్తుండగా, ఇంద్రుడు మళ్లీ అపహరించాడు. పృధువు ఇంద్ర సంహారానికి సన్నద్దుడు కాగా వేతవేత్తలు వారించి: మహారాజా! వేద మంత్రాలతో దేవేంద్రుని  ఆహ్వానిస్తాం. రాగానే వానిని అగ్నికి  ఆహుతి చేయవచ్చు. అన్నారు.

    ఆయన అంగీకరించాడు. ఋత్విక్కులు దీక్ష వహించారు. చతుర్ముఖుడు వచ్చి వారిని శాంతింపజేసి, పృధువుకు యాగఫలం అనుగ్రహించాడు. విష్ణువు ఇంద్ర సమేతంగా వచ్చి పృధువుకు క్షమార్పణలు చెప్పించి -

    రాజా! నరపాలునికి ప్రజారక్షణ ప్రధాన కర్తవ్యం. అందువల్ల ప్రజలు చేసే పుణ్యకర్మఫలంలో ఆరవవంతు లభిస్తుంది. ప్రజల కష్టసుఖాలతో సంబంధం లేని రాజు ప్రజలు చేసే పాపఫలాన్నీ అనుభవించక తప్పదు, అని బోధించాడు. తన పాదాల మీద వ్రాలిన ఇంద్రుని లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు పృధువు. అనంతరం మహా విష్ణువును ప్రార్దించి, సెలవు తీసుకుని రాజధాని చేరి, పురుషోత్తమ ధ్యానం చేస్తూ, కన్నబిడ్డలక వలే ప్రజలను పాలిస్తూ, పురుషోత్తమ పదం చేరాడు, అని శుకయోగీంద్రుడు ఆ గాధను ముగించి పురంజనుని కథ మొదలు పెడుతున్నాడు.    
   
                                                పురంజనోపాఖ్యానం

    పరీక్షిన్మహారాజా! చాలాకాలం క్రితం పురంజనుడనే రాజుండేవాడు. ఆయన తనకు యోగ్యమైన  నగరం కోసం అన్వేషించి, అన్వేషించి చివరకు తన మనస్సుకు నచ్చిన నగరం చూచాడు. నగరం వెలుపల చక్కని ఉద్యానవనంలో ఆగాడు.

    అక్కడికొక లావణ్యలహరి వచ్చింది. ఆ సుందరీమణిని చూడగానే ఆయన మనసు ఆమె మీద లగ్నం అయింది. దగ్గరగా వెళ్లి -

    బాలామణీ! ఏ వంశంలో ప్రభవించావు? ఏ గాత్రం నీ జన్మతో పావనమైంది, అని అడిగాడు. ఆమె నవ్వి: మహారాజా! ఎవరి దాననో, పేరేమిటో, అన్నీ మరిచిపోయాను. నీ సౌందర్యం, సాహస పరాక్రమ సంపత్తి చూచాక నా మనస్సు స్వాదీనంలో వుండడం లేదు. నవ ద్వారాలతో, నవనవలాడే లావణ్యంతో  అలరారే ఈ శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను, అనగానే పురంజనుడు సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకొని భవనాంతర్బాగంలోని అంతఃపురంలో సకల భోగాలూ ఆమెకు అందించి అనుభవిస్తున్నాడు. నిర్విరామ శృంగార యాత్రలో బిడ్డలను కని వారికి వివాహాలు జరిపించాడు.

    క్రమంగా వార్దక్యం ప్రవేశించి, శరీరంలో అవయవాల సత్తువ సడలింది. అయినా వాంఛ చావలేదు. కాలపాశ బంధితుడవుతూ  కూడా నేను లేకపోతే ఈ లావణ్యలహరి ఏమైపోతుందా, అనుకుంటూ ఆమె మీదే మనసు నిలిపి ప్రాణాలు వదిలాడు.

    అది కారణంగా విదర్బరాజుకు కూతురుగా పుట్టాడు పాండ్యదేశాధిపతి మలయధ్వజుడు ఆమెను వివాహమాడి రాజ్యపాలన సాగిస్తూ, సాంసారిక జీవితం ధర్మబద్దంగా నడిపి వయసు మల్ళగా రాజభోగాలు విడిచి వానప్రస్థ దీక్షతో అడవికి  వెళ్లి శ్రీమన్నారాయణ చరచ కమలాల మీద మనసు నిలిపి పరమ పదం చేరాడు. వియోబాధ భరించలేక చితిలో ప్రాణాలు విడవడానికి సంకల్పించే వేళ బ్రాహ్మణుడొకడు అడ్డుపడి -

    ఏమిటి  చేస్తున్నావు, నేనేవరినో మరచినట్లున్నావు. మానస సరోవరంలో విహరించే హంస దంతులం మనం. విధివశాన నీకు మానవజన్మ మీద కోరిక కలిగి, భూలోకంలో రాజుగా పుట్టావు. అక్కడ ఒక కామినీమణి కల్పించిన పంచారామ మధ్యంలో నవద్వారయుత నగరంలో ప్రవేశించావు. పంచారామాలంటే  ఇంద్రియ  పంకచం, నవద్వారాలే శరీరానికున్న నవరంధ్రాలు. అప్పుడు నీ పేరు పురంజనుడు.

    నాడు ఈ మగదేహం, నేను  ఈ స్త్రీ రూపం. ఇదంతా నీ భ్రమ వాస్తవానికి మనం హంసలం, అనగానే ఆమె హంసగా మారి మానససరోవరానికి వెళ్లింది. కామం ఎంత వంచిస్తుందో చూచావా మహారాజా! అని శుకుడు సాగుతున్నాడు.

                                                    (చతుర్దస్కంధం సమాప్తం) 



 పంచమ స్కంధం

    స్వాయంభువుడు  ప్రియవ్రతునికి సింహాసనం అప్పగించి, వానప్రస్థం సాగించడానికి వెళ్లాడు. ప్రియవ్రతుడు ప్రజలను కంటికి రెప్పవలె కాపాడుతూ, మనస్సును నారాయణుని యందు లగ్నం చేశాడు.

    ఆయనకు విశ్వకర్మ కుమార్తె బర్హిష్మతి ధర్మపత్ని. వీరి దాంపత్య జీవితంలో పది మంది కొడుకులు, ఒక కుమార్తె కలిగారు. సూర్యుడు అస్తమించడం వల్ల లోకం చీకటిలో పడుతున్నదని గ్రహించి, తపశ్సక్తితో తానే సూర్యుని వలె వెలుగుతూ లోకాల చీకట్లు తొలగించిన శక్తిశాలి. ఆయన రథం సాగిన ప్రాంతంలో సముద్రాలు ఏర్పడి, మధ్యలో ద్వీపాలు నిలిచాయి. అవే సప్త ద్వీపాలు.

    కుమార్తె ఊర్జస్వతిని భార్గవునికిచ్చి  వివాహం చేసి, కుమారులను రాజ్యపాలకులను చేసి, వనానికి వెళ్లి, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసి వైకుంఠం చేరాడు.

    ఆయన కుమారుడు  అగ్నీధ్రుడు. జంబూ ద్వీపానికి  అదిపతి, సంతాన కాంక్షతో మందరగిరి  మీద ఏకాగ్రచిత్తంతో బ్రహ్మను ఉపాసించగా, ఆయన పూర్వచిత్తి అనే అప్సరసను పంపాడు.

    ఆమెను వెంట బెట్టుకుని రాజధానికి వచ్చి, సంసారం సాగించి తొమ్మండుగురు బిడ్డల తండ్రి అయ్యాడు. ఆయనకు బిడ్డలకు అప్పగించి అప్సరస దేవలోకం  చేరింది. వార్దక్యం మీద పడకుండా ఆయన తన కుమారుడు నాభిని సింహాసనం ఎక్కించి తపోదీక్ష వహించాడు. నాభి భార్య పేరు మేరుదేవి. వీరుభయులూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ క్రతువు సాగించారు.

      స్వామి ప్రసన్నుడు కాగా సాక్షాత్తూ నారాయణాంశతో కుమారుడు కావాలని కోరుకున్నారు. మహావిష్ణువు మేరుగర్బాన ఋషభనామంతో ప్రభవించాడు.

    ఋషభుడు గురువుల వద్ద వేదశాస్త్రాలూ, రాజనీతి, ధనుర్వేదము అభ్యసించి,  శతమన్యుని  కూతురు జయంతిని వివాహమాడి నూరుగురు బిడ్డల తండ్రి అయ్యాడు.

    నాభి భార్యతో బదరికా వనంలో తపోదీక్ష సాగించి నారాయణునిలో ఐక్యమయ్యాడు. ఋషభుని పాలనలో ప్రజలు ధర్మనిరతులై పాంచభౌతిక సుఖాపేక్ష లేకుండా పరమేశ్వరారాధన పరమ లక్ష్యంగా సత్కర్మలు నిర్వర్తిస్తూ, త్యాగధనులుగా ప్రఖ్యాతులయ్యారు.

    ఋషభుడు కుమారులకు రాజ్యం అప్పగిస్తూ: నాయునలారా! మానవుని వంచించేది కోరిక. అది కలిగిందో వాడు కుక్క కంటే అధముడు. అందుచేతనే తృష్ణ విడిచి పరమార్ద దృష్టితో బ్రతకండి సంపదల కంటె వంచించేది కామం.  కమనీయ కామిని కంట పడితే మనస్సు చెలించి  దాని వెంట త్రిప్పుతుంది. అందుచేత కామమోహితులు కాకుండా వుండండి. నిరంతరం సజ్జన సాంగత్యంతో, విద్వాంసులు సన్నిధానంలో సత్కాలక్షేపాలు సాగిస్తూ, రాగద్వేషాలను దరిజేరనీయకుండా హరి నామస్మరణ సాగించండి.

    ఇంద్రియ వాంఛలు చాలా బలమైనవి, అవి మహామహులను కూడా లొంగదీసి పాతాళానికి లాగుతాయి. సంసారకూపంలో కొట్టుకుంటూ 'నా భార్య, నా బిడ్డలు, నా యిల్లు, నా సంపద' అనుకుంటూ యిల్లు కట్టి, భూములు కొని,  బంగారం కూడబెట్టే లోభం పెరగనివ్వకండి లోభాన్ని మించిన శత్రువు లేదు. దానిని దరిజేరనివ్వరాదు.

    వేదమే పరబ్రహ్మం. ఆ వేదవేత్తల  పదసన్నిధిలో ధర్మం తెలుసుకు పరమపదం పొందండి, అని అవధూతాశ్రమం స్వీకరించి తిరుగుతున్నాడు.

    ఆయన నారాయణుడు  కనక యోగులు సైతం దేహాభిమానంతో ఎలా చరిస్తారో చూపి, వారికి ముక్తిమార్గం అందించి కర్నాటక ప్రాంతంలోని వనంలో దావాగ్నిలో శరీరాన్ని విడిచి వైకుంఠం చేరాడు.  

  జడభరతుడు

    అనంతరం ఋషభుని పెద్దకొడుకు భరతుడు రాజ్యం పాలిస్తూ  పంచజని అనే తరుణీమణిని  పెండ్లియాడి, అయిదుగురు కుమారులను కని , వారికి వయసు రాగానే రాజ్యం అప్పగించి, వనాలకు వెళ్లాడు. 

    ఆశ్రమవాస సమయంలో గండీ నదిలో స్నానం చేస్తుండగా, కడుపుతో  వున్నలేడి నీరు త్రాగడానికి వచ్చింది. అదే సమయంలో ఆ వనంలో సింహం గర్జించింది. లేడి బెదిరిపోయింది. కడుపులోని లేడి కూడా జారింది. లేడి ప్రామం వదిలింది. 

    హృదయం ద్రవించి భరతుడు లేడికూనను రెండు చేతులలో గుండెకు హత్తుకుని ఆశ్రమానికి తెచ్చి పెంచుకున్నాడు. జపం, తపం, స్నానం, సంధ్య సర్వమూ లేడిపిల్లయే అయిందాయనకు. 

    క్రమంగా అది గంతులు వేయడం ఆరంభించింది. దానితో ఆడుతూ, గెంతుతూ జీవితం గడుపుతున్నాడు. ఒకనాడది దూరంగా వెళ్ళింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. పరిసరాలన్నీ వెదికి, దిగులుగా ఆశ్రమ ద్వారంలో కూర్చుని పరిపరివిధాల విచారించాడు. క్షణం కూడా నన్ను విడిచేది కాదు. తల్లిలేని బిడ్డ, ఎక్కడకు పోయిందో, ఏ పులి నోట పడిందో, అనుకుంటూ శోకించాడు. రాజ్యం వదిలాడు. సంసారం విడిచాడు. హరినామస్మరణతో జీవితం సార్దకం చేసుకుంటున్న తరుణంలో ఈ లంపటం.... అలా శోకించే వేళకు చెంగు చెంగున దూకుతూ లేడి వచ్చి ఒడిలో తల వుంచింది. దాన్ని రెండు చేతులతో కౌగలించుకుని కన్నీరు విడుస్తూ ముద్దులాడి పచ్చిక తినిపించి, తన దర్బాసనం మీద ప్రక్కలో పడుకోబెట్టుకున్నాడు. 

    రోజులు గడుస్తున్నాయి. వయసు మళ్లీ, కాలం ఎదురు చూస్తున్నది. వాని దృష్టి లేడి మీదనే నిలబడింది. మనస్సు లేడి భవిష్యత్తును గురించి చింతిస్తున్నది. అలా ప్రామాలు వదిలాడు. అవసాన వేళ మనసు లేడి మీద వుండడం వల్ల లేడిజన్మ ప్రాప్తించింది. 

    పూర్వజన్మ వాసనా కారణంగా జంతుజన్మలో అయినా హరినామస్మరణం సాగించి, మహాపురుషుల ఆశ్రమాలలో జీవితం గడిపి మరుజన్మలో వేదవిదుల యింట పుట్టాడు. 

    తెలివి వచ్చింది మొదలు హరినామ స్మరణతో జీవితం గడుపుతున్నాడు. ఏ విద్య నేర్పాలన్నా వానికి రావడంలేదు. తల్లిదండ్రులు పరలోకం చేరారు. ఇంట్లో వున్న బంధువులు ఎన్ని విధాల  హింసించినా చలించకుండా నారాయణుని మీదనే మనసు లగ్నం చేసుకున్నాడు.

    వీడు మూఢుడు, జడుడు, బధిరుడు, పిచ్చివాడు - అని ఎవరెన్ని  తిట్టినా  నవ్వుతుండేవాడు. పంటచేను  దగ్గర కాపలాపెడితే, అక్కడ ప్రశాంతంగా కూర్చుని విష్ణునామం  జపించేవాడు. 

                          *    *    *    *    *    

    ఆ దేశాన్ని పాలించే రాజు సంతానం లేక బాధపడుతుంటే , ఒక శాక్తేయు డెదురుపడి - నరబలి  యిస్తే సంతానం కలుగుతుంది అన్నాడు. 

    రాజభటులు తిరిగి తిరిగి చేనిగట్టున వున్న ఈ యువకుని తీసుకువెళ్లి, చక్కగా తలంటి పోసి కొత్త బట్టలు కట్టి మంచిగంధం పూసి పూలమాలలు వేసి పంచ భక్ష్యాలతో కడుపునిండా భోజనం తినిపించి, సాంబ్రాణి ధూపం వేసి హారతి యిచ్చి కాళికాదేవి ముందు నిలబెట్టారు. 

    పదునైన కరవాలం చేతబట్టి మహారాజు మందహాసంతో వానిని చంపడానికి సిద్దపడుతూంటే కాళికాదేవి ఆ రాజునూ వాని అనుచరులనూ బతి తీసుకుంది. 

    బలిపశువుగా వున్నప్పుడు ఎంత సంతోషంగా నిలబడ్డాడో కాళికాదేవి నిప్పులు క్రక్కే కన్నులతో వారిని సంహరిస్తున్నప్పుడు కూడా అంత నిర్వికారంగా నిలబడి శ్రీహరిని ధ్యానిస్తున్నాడు. 

    నెమ్మదిగా తమ చేను చేరి అక్కడ గట్టుమీద కాపలా కాస్తున్నాడు. కొంతసేపటికి ఆ దారినే సింధు దేశపురాజు పల్లకీ మీద వెడుతున్నాడు. 

    పల్లకి మోసే బోయీలు గట్టుమీద వాని వాలకం చూసి కొంతసేపు వీని చేత పల్లకీ మోయిస్తే విశ్ర్రాంతిగా ఒకడు నడవవచ్చని వానిని పిలిచి భుజం మీద పల్లకీ  వుంచారు. 

    అలవాటులేక  తడబడుతూంటే రాజుగారు మండిపడగా నవ్వుతూ - మహారాజా! దూషణ భూషణలు, రాగద్వేషాలు, ఆకలిదప్పులు అన్నీ యీ దేహానికే. 

    మీరు నన్ను జీవన్మృతుడా! అన్నారు. నేనొక్కడనే  జీవన్మృతుడనా? మనమందరం  మృత్యువును వెంటబెట్టుకుని జీవిస్తున్నవారమే, అది ఎప్పుడు కబళిస్తుందో అని ఎదురు చూస్తున్నవారమే. 

    మీరు ప్రభువులనీ, మేమంతా సేవకులమనీ, అనుకుంటున్నారు. ఈ సంబంధం దేహం వున్నంత వరకే. అది లేదో ఈ భావం లేదు. నేను మూఢుడననీ జడుడనీ చెవిటి వాడిననీ ఏమేమో  అన్నారు. అదంతా నిజమే అంటుండగా పల్లకీ దిగి మహారాజు వాని పాదల మీద వ్రాలి - 

    మహానుభావా! తమరెవరు? కపిల మహామునురలారా! నా అజ్ఞానాన్ని మన్నించి అనుగ్రహించండి. యముని చేతిలోని కాలదండం, ఇంద్రుని వజ్రాయుధం, ఫాలాక్షుని త్రిశూలం ఇవేవీ నన్ను భయపెట్టవు; జ్ఞాన నిధులైన విప్రులకే నేను భయంతో చేతులు జోడిస్తాను -  అన్నాడు.  

 మహారాజా! నేనెవరినో నాకే తెలియదు. ఈ శరీరం శాశ్వతం కాదు. ఇది వున్నంతసేపే  దీనికొక రూపం, దానికొక నామం, దానితో బంధుత్వం. మండుతున్న పొయ్యి మీద కుండపెట్టి నీరుపోసి మరుగుతుంటే బియ్యం పోస్తాం.  అది అన్నం  అవుతుంది.  అలానే ఈ దేహం,  ఇంద్రియాలు ఇవి జీవుని వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. సంసారంలో దేహఘటం  వుంటుంది.   దీని రక్షణ  శిక్షణ చేసే జీవుడనే రాజు, దుష్కర్మలకు దూరుడై పురుషోత్తముని ఆరాధనతో నడిస్తే ఈ జన్మఘటం ముక్కలు ముక్కలవుతుంది. 

    మహారాజా! కంటికి  కనిపించేదంతా నశించేదే అని జ్ఞానులు బోధిస్తున్నా ఆ తత్వం వంట బట్టక జీవకోటి నానా యాతనలు పడుతున్నది. కర్మకాండ, వేదాంతం ఇవేవీ తత్వాన్ని అందించలేవు. ఈ జీవితమే ఒక కల. జ్ఞాన నేత్రం వికసిస్తే కల కరిగిపోయి సత్యం సాక్షాత్కరిస్తుంది. 

     మానవుని మనస్సు వాంఛల వలయంలో కొట్టుమిట్టాడుతున్నంత సేపూ జనన మరణ చక్రభ్రమణం తప్పదు. దీనిని విడిచి బైట పడాలంటే మనస్సును  శ్రీహరి పదకమలాల మీద కేంద్రీకరించాలి. 

    స్థావర జంగమ జీవకోటి కంతకూ భూమి  ఆధారం. అణుమరమాణు సంయోగం వల్ల భూమి ఏర్పడుతున్నది. ఈ అణువే కాలమనీ, మహత్తనీ భావించే వాడు అజ్ఞాని. నిత్యమూ, శాశ్వతమూ అయినది భాగవతశబ్దం. దీనినే బ్రహ్మమంటారు. హరినామ సంకీర్తనం, భాగవత చరణసేవ బ్రహ్మసాక్షాత్కార సాధనాలు. 

    ఈ పరమ రహస్యం  తెలియక,  తెలిసినా, ఆచరించలేక పాషండుల బోధలు విని లోకయాత్రతో భౌతిక సుఖాల కోసం తాపత్రయ పడుతూ దుఃఖసాగరంలో మునిగే వారు లక్షల సంఖ్యలో వుంటారు. 

    నేనురాజను, వీరంతా సేవకులు అనే అహంకారం పోగొట్టి, అజ్ఞానాంధకార కూపం నుండి బైటపడు, అని బోధించాడు. 
    మహారాజు వాని ప్రబోధంతో విరాగియై  శ్రీహరిని ఉపాసించి దివ్యధామం చేరాడు. 

                                     భూగోళ వివరాలు

    పరీక్షిన్నరేంద్రా! ఈ భూమి తామర మొగ్గలా వుంటుంది. దీని బొడ్డు జంబూద్వీపం.  దీని పొడుగు లక్షయోజనాలు, వెడల్పూ అంతే. గోళాకృతిలో వుండే ఈ ధరణి మీద ఎనిమిది  కుల పర్వతాలు, తొమ్మిది వర్షాలు, వీటిలో మధ్య వుండేది ఇలావృత వర్షం. ఈ ప్రాంతమంతా బంగారం వుంటుంది.

    ఈ ధరణీ పద్మానికి పైకి లేచిన నాభి మేరుగిరి, దీని యెత్తు లక్ష యోజనాలు. రెండువేల యోజనాల పొడవుతో తూర్పు  పడమరలకు వ్యాపించి శ్వేత, నీల, శృంగగిరులున్నాయి. వీటి మధ్య హిరణ్య, కురువర్షాలు ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధ, హేమకూట, హిమాలయాలు. ఈ గిరుల మధ్య కింపురుష, భారతవర్షాలున్నాయి. 

    ఇలావృత్తానికి పశ్చిమంలో మాల్యవత్పర్వతం, తూర్పున గంధ మాదనం, దీనికి తూర్పున భద్రాశ్వవర్షం మేరునగరానికి ప్రాగ్దిశలో మందరగిరి, మేరువుకు నలువంకలా క్షీర, ఇక్షు, మధురసాలతో నిండిన  సరోవరాలు; ఈ జలస్నానం ఆరోగ్య సౌభాగ్యదాయకం. 

     మేరుగిరి మీద చైత్రరథం, విభ్రాజకం, సర్వతోభద్రం అనే ఉద్యానవనాలలో దేవగణాలు విలాస యాత్రకు వచ్చి నృత్యాలతో గానాలతో ఆనందిస్తారు. 

    మందరగిరి మీద మర్రి చెట్లవలె పెరిగే మామిడి చెట్లు నిరంతరం మధుర ఫలాలు వర్షిస్తాయి.  ఆ రసం మీది నుండి సుగంధం వస్తుంది. ఈ రెండు పర్వతాల మీద పెరిగే నేరేడుచెట్లు పళ్లరసాలతో జాంబూనదం ఏర్పడింది. ఈ నదిలో మన్ను బంగారు సుపార్శ్వ పర్వతం మీద పెరిగే వృక్షాల ఫలాల నుండి జాలువారే తేనె త్రాగినవారు విడిచే నిశ్వాసం సుగంధభరితంగా వుంటుంది. 

    కుముద పర్వతం మీది వటవృక్షం ఎవరేం కోరితే అవి యిస్తుంది. దీని మ్రాను నుండి పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం కలిపిన అన్నం పుడుతుంది; దీని నాశ్రయించిన వారికి జరామరణాలూ, శీత వాతాతపాలూ వుండవు. వీరి శరీరం సుగంధ భరితం. దేవదానవ గంధర్వ మునిగణ విహార భూమి యిది. 

    మేరుగిరికి తూర్పున జఠర దేవకూటాలు, పశ్చిమాన, పవన పాలియాత్ర గిరులు, దక్షిణాన కైలాసం; కరవీరం; ఉత్తరంగా త్రిశృంగ, మకర పర్వత పంక్తులు. 

    మేరు శిఖరంమీద యోజనాల కైవారంతో సువర్మమయమైన బ్రహ్మపురం. దీని చుట్టూ దిక్పాలకులు ఎనమండుగురూ వుంటారు. నారాయణుడు వామనావతార వేళ త్రివిక్రమ రూపంతో పెరుగుతున్నప్పుడు ఆ కాలి గోరుసోకి బ్రహ్మాండం బ్రద్దలైంది. అప్పుడు లేచిన జలధార భగవత్పాది పేరుతో పాప ప్రక్షాళనం చేసింది. 

    ఈ పవిత్ర వాహినిలో ధృవుడు తన శిరసు ముంచాడు. ధృవ నక్షత్రానికి క్రిందనున్న సప్తర్షి మండలం విష్ణుపాదోదకంతో పరిప్లావితం అవుతూంటుంది. అది దేవ పధాన చంద్రమండలం మీద నుంచి మేరు శిఖరం చేరి నాలుగు దిక్కులకూ ప్రవహించింది. 

    ఆ నదులనే సీత, చక్షువు, భద్ర, అలకనంద అని పిలుస్తారు. అలకనంద భారతవర్షంలో ప్రవహిస్తూ దక్షిణంగా సాగి సాగరంలో సంగమించింది. 

    ఈభూగోళం మీది జంబూద్వీపంలోని భారతవర్షం మాత్రమే కర్మభూమి. మిగిలిన దేశాలలో ప్రజలు ఈ బూమి మీద పుట్టి కర్మఫలం అనుభవించి పోతారు. వీరు నిరంతరం కామభోగాలలో మునిగి తేలుతుంటారు.

 ఇలావృత్తానికి అధిపతి పరమశివుడు. ఇక్కడి వనాలలో పార్వతీ పరమేశ్వరులు లీలా వినోదాలలో వుంటారు. కనక అక్కడికి  మరెవరూ రాకూడదు. 

    హయగ్రీవుని అనుచరుడైన భద్రశ్రవుడు భద్రాశ్వవర్షానికి అధిపతి. హరి వర్షాధిపతి.  దైత్య, దానవులందరూ ప్రహ్లాదుని అనుచరులై శ్రీహరిని సేవిస్తారు. 

    కేతుమాల వర్షాధిపతి లక్ష్మీనారాయణుడు. రమ్యకానికి మనువు, హిరణ్య వర్షానికి కూర్మ రూపుడైన హరి, ఉత్తర కురువర్షానికి వరాహ స్వామి, కింపురుష  వర్షానికి  శ్రీరాముడు, భారత వర్షానికి బదరికాశ్రమ వాసి నారాయణుడు అధిపతులు. 

    భారత వర్షంలో మలయ, మహేంద్ర, మంగళ, మైనాక, వింధ్య, శ్రీశైల, ఇంద్రకీల, చిత్రకూట, రామగిరి ఆదిగాగల పర్వతాలూ, గంగ, యమున, సరస్వతి కృష్ణవేణి, గోదావరి, తుంగభద్ర, సరయు, భీమరధి, కావేరి ఆదిగాగల  నదులూ వున్నాయి. 

    ఈ వర్షంలో ప్రజలు సత్వ రజస్తమో గుణాలతో కర్మలు చేసి,  దేవ,మనుష్య, తిర్యగ్జన్మలు పొందుతారు. రాగద్వేషాలు విడిచి నారాయణుని యందే మనసు నిలిపే భాగవతోత్తములు కూడా వుంటారు. మిగిలిన దేశాలలో ఎన్నిమారులు జన్మించినా లభించని  వైకుంఠం ఈ దేశంలో పుట్టి నారాయణస్మరణ  చేసేవారికి ప్రాప్తిస్తుంది. 

    వైకుంఠనాదుని కథాగానం, నామస్మరణం లేని స్థలం అమరావతి అయినా సరే విడిచి భారత వర్షంలో జన్మించి జన్మరాహిత్యమ సాధించుకోవాలి. 

    ప్రాణికోటిలో సర్వోత్తమమైన  మానవజన్మ లభించినందుకు దీనిని ఆయన సేవకే అంకితం చెయ్యాలి. 

                                                  సప్త సముద్రాలు

    జంబూద్వీపం చుట్టూ వేల యోజనాల కైవారంలో ఉప్పు సముద్రం, రెండు లక్షల యోజనాల వైశాల్యంతో ప్లక్షద్వీపం.  ఇక్కడివారు  అగ్నిని పూజిస్తారు. దీని కావల ఇక్షు సముద్రంలో శాల్మనీ ద్వీపం. వీరు చంద్రుని ఆరాధిస్తారు. దీని తరువాయి సురా సముద్రంలో కుశద్వీపం, ఆవల ఘృత సముద్రంలో క్రౌంచద్వీపం, ఆ వెనుక పదహారు లక్షల యోజనాల క్షీర సాగరంలో శాకద్వీపం.  అది దాటితే  దధి సముద్రం. పదివేల దళాల బంగారు పద్మం మీద చతుర్ముఖ ప్రజాపతి సుఖాసీనుడై వుంటాడు. ఇక్కడే మానసోత్తరగిరి. 

    ఈ పర్వతం చివర బయలుదేరి సూర్యుని రథం మేరువుకు  ప్రదక్షిణం చేసేటప్పుడు  రాత్రిం బగళ్లు ఏర్పడతాయి. పుష్కర ద్వీపంలో  ప్రాణుల మధ్య విబేదాలు లేవు. సర్వ మానవత్వం. ఈ ద్వీపం చుట్టూ స్వాదుజల సాగరం. ఈ సాగరాన్ని దాటితే లోకా లోకపర్వతం. ఇక్కడ రెండు కోట్ల యోజనాల విశాల ప్రదేశంలో దేవగణాలు విహరిస్తాయి. 
    భూగోళంలో నాలుగో భాగాన్ని లోకాలోక పర్వతం ఆక్రమించింది. దీనిమీద పుష్కర, చూడ, వామన, ఋషభ, అపరాజిత నామాలు గల దిగ్గజాలు సుఖంగా తిరుగుతాయి. విష్వక్సేనాది అనుచరులు, దేవర్షులు, మునులు పరివేష్టించి వుండగా నారాయణుడిక్కడే వుంటాడు. భువన భవన మధ్యంలో సూర్యుడు, సూర్యునికిరు వంకలా ఇరువై అయిదు కోట్ల యోజనాల వైశాల్యంలో బ్ర్హహ్మాండ భాండ వున్నది. ఈ ప్రాణికోటి కంతకూ ఆత్మ సూర్యుడే. బ్రహ్మాండ మధ్యంలో వుండే సూర్యుడు ఉత్తర దక్షిణ దిశలలో తిరిగేటప్పడు మంద, తీవ్ర గతులుంటాయి. 

    మేషాది మీనం వరకూ చరించే సమయంలో మేష - తులా రాసులలో వున్నప్పుడు రాత్రింబవళ్లు సమంగా వుంటాయి. వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యారాసులలో చరించే కాలంలో రాత్రి ఒక్కొక్క ఘడియ తగ్గుతుంది. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాసులలో పగటి పూట ఘడియ సన్నగిల్లుతుంది. 

    ముహూర్త కాలంలో సూర్యగమనం ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు. సూర్యుని రధాశ్వాలు గాయత్రీ ఆదిగా గల ఏడు ఛందస్సులు, సారధి అరుణుడు. అంగుష్ట మాత్ర దేహులైన అరవై వేల మంది వాలఖిల్యమునులు సూర్యుని, ముందు సాగుతూ సౌరసూక్తాలు పటిస్తుంటారు. 

    కుజ, గురు, శని, చంద్ర, బుధ, శుక్రగ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి. వీటికి బహు దూరంలో సప్తర్షి మండలం. దానిపైన శింశుమార చక్రం. అక్కడ ఇంద్ర, యమ, వరుణ, కశ్యప, ధృవులు  శాశ్వతంగా స్థిరంగా వుంటారు. దృవ మండలం చుట్టూ నిఖిల గ్రహతారాగోళాలూ తిరుగుతుంటాయి.

 నారాయణుని దివ్య శరీరం ధృవమండలం. సాయంవేళ  ధృవతారను దర్శించి, శింశుమార చక్రానికి నమస్కరించే వారికి క్లేశాలు దూరంగా వుంటాయి. అయితే నిర్మలము, ప్రశాంతమూయైన మనస్సు ప్రధానం.

    అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలూ భూమికి క్రిందనున్న లోకాలు. ఈ లోకాలలో దైత్యదానవ నాగజాతులు స్వర్గాన్ని మించిన భోగాలు అనుభవిస్తారు.

    పాతాళంలో రమణీయ భవనాలెన్నో మహాశిల్పి మయుడు నిర్మించి అంతటా వసంత శోభలీనే ఉద్యానవనాలు కల్పించాడు. రంగు రంగుల పక్షుల కల స్వనాలతో, కమలాలతో, కలువలతో అలరారే సరోవరాల నుండి సుగంధ సౌరభం వస్తూంటుంది. ఇక్కడి నాగుల పడగల మీది మణులు నిరంతరం కాంతులు జల్లుతుంటాయి. ఈ లోకవాసులకు ఆకలి దప్పులూ జరా రోగాలూ వుండవు.

    నారాయణుని సుదర్శనాయుదానికే వీరు భయపడతారు. అతలానికి అధిపతి మయుని కుమారుడు బలాసురుడు. వీనికి ఇంద్రజాల, మహేంద్ర జాలాది విద్యలన్నీ కరతలాలు. ఈ విద్యలు కొందరు భూలోక వాసులు ప్రదర్సించి ధనం సంపాదిస్తున్నారు.

    బలాసురుడు ఆవులించగా కామిని, స్వైరిణీ, పుంశ్చల అనే నారీ బృందాలు పుట్టి, పాతాళం చేరి అక్కడి మగవారికి చక్కని రసాలు అందించి వారితో నిర్విరామంగా కామ సుఖాలు అనుభవిస్తున్నారు.

    సుతలంలో బలి వుంటాడు. ఈ రాక్షసేశ్వరుని సింహద్వారంలో శంఖ, చక్రగదాదారియై నారాయణు డుంటాడు. తలాతలానికి  రాజు యముడు. ఈ లోకానికి దిగువ మహాతలంలో నాగమాత సంతానం వున్నది. అయిదు పడగలు, ఆరుపడగలతో వాటిమీద మణికాంతులతో యిక్కడ విహరిస్తుంటారు. అనంతరం రసాతలం. వీనిలో నివాత, కవచ,  కాలకేయాదులుంటారు. ఆ తరువాయి పాతాళం; ఆ లోకంలో వాసుకి ఆదిగా  గల నాగులుంటారు. వీరి ఫణులమీది మణికాంతులు చీకటిని చేరనివ్వకుండా యీ లోకాన్ని నిరంతరం కాంతిమంతంగా వుంచుతాయి.  ఈ క్రింద లోకానికి ఆదిశేషుడు చుట్ట చుట్టుకుని పడుకుంటాడు. శేషుని పడగమీద భూగోళం ఆవగింజలా నిలబడి వుంటుంది.

                                      నరక లోకాలు

    జనపాలాగ్రణీ! ప్రపంచంలో అందరూ సాధువర్తనలూ, సదాచార పరాయణులూ  వుండరు. ఎన్నో అత్యాచారాలు, అకార్యాలు, అన్యాయాలు చేసేవారు లక్షలాదిగా వుంటారు. ఆ పాపాల ఫలం  అనుభవించడానికి నరకాలున్నాయి.  ఇవన్నీ దక్షిణ దిశలోని యముని ఆధిపత్యంలో వుంటాయి.

    తామిస్ర, అంధతామిస్ర, అశిపత్ర, అంధకూప, రౌరవ, మహారౌరవ కాలసూత్ర, కుంభీపాక, సూకరముఖ, క్రిమిభోజన, వజ్రకంటక, శాల్మలి, వైతరణి, విశాసన, లాలాభక్షణ, రేతఃపాన,  ప్రాణరోధ యిలా ఎన్నో నరకాలు.

    ఇరుగు పొరుగు పిల్లలను ఇల్లాండ్రను అవమానించి, అసహనం చేసేవారిని తామిస్ర నరకంలో పారేసి తిండి పెట్టకుండా కొండల మీద నుంచి ఉక్కు పాదాలతో తన్నుతూ దొర్లిస్తారు.

    పరస్త్రీని బలాత్కరించి అనుభవించేవారిని అంధ తామిస్రంలో అనేక హింసలపాలు చేస్తారు. వంచనతో ధనం ఆర్జించేవారు  రౌరవ నరకంలోనూ, పశు పక్షి సంతతులను బాధించి, సంహరించేవారు మహా రౌరవంలో, కన్నాలు కప్పెట్టి ఊపిరాడకుండా చేసి ఎలుకలను చంపేవారు కుంభీపాక నరకంలో మరుగుతున్న నూనెలో వేయిస్తారు.

    కన్నతల్లినీ, తండ్రినీ, వేదవేత్తలను బాధించే పాపాత్ములు కాలసూత్ర నరకంలో కణకణలాడే  మంటలలో మాడుతుంటారు. బక్కచిక్కిన పశువులచేత బళ్లులాగించి నాగిలి దున్నించే క్రూరులు  కూడా ఈ శిక్ష అనుభవిస్తారు.  ఆపదలో వున్న బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతో తులతూగుతూ  తన కడుపు నింపుకునే స్వార్దపరులు  క్రిమి కీటకాలు తింటూక్రిమి భోజన నరకంలో వుంటారు. సోమరులై దొంగతనం చేసి బ్రతికేవారు తప్తోర్మి నరకంలో మండుతూన్న ఇనుప  గుండు దెబ్బలు తింటుంటారు.






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list