MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

కనకధారాస్తవము kanakadhara stavam MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALUMohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
కనకధారాస్తవము
రచించినవారు ఆది శంకరాచార్యుడు


ది శ్రీఆదిశంకరులచే విరచితము. ఆయన ఒక పేదరాలి ఇంటికి బిక్షకై వెడలినపుడు ఆమె వద్ద ఆ సమయమున ఏమియు లేకపోవుట వలన జగద్గురువును రిక్త హస్తములతో పంపుటకు మనస్కరించక ఒక ఉసిరికాయను భక్తితో బిక్షాపాత్రలో ఉంచెను. ఆచార్యులు ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి ఆమె పేదరికమును తొలగించుటకు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారాస్తవము పఠించినారు. అంతట లక్ష్మీదేవి సాక్షాత్కరించి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆమె పేదరికమును పోగొట్టినది."తమకు అవసరమైన ధనమింత" అని శ్రీ అమ్మవారితో చెప్పుకొని ఈ స్తోత్రమును ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - అనఁగా దినమునకు మొత్తము మూడు సారులు - అట్లు 40 రోజుల పాటు ఎడతెగక అమ్మవారి ఎదుట కూర్చుండి చదివినచో అవసరమైనంత ధనము తప్పక లభించునని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు. అట్లే దీనిని జీవితాంతము పారాయణ చేయువారి కుటుంబములు కుబేర సమానములై వర్ధిల్లును.పారాయణ పద్ధతి : కుల, మత, వర్గ, వయో, లింగాది విచక్షణ లేకుండా ఎవరైనను దీనిని పారాయణ చేయవచ్చును. కాని నియమములను తప్పనిసరిగా పాటింపవలెను.దేవాలయములో గాని, నివాస గృహమునందున్న పూజామందిరములో గాని పారాయణ చేయవలెను. ఇతర ప్రదేశములు నిషిద్ధము. ప్రాతస్ (ప్రొద్దున) సమయములో నైతే పారాయణ చేయుటకు ముందు ఏమియు తినరాదు. కాని ద్రవ పదార్థములేవి యైనను తీసికొనవచ్చును. శుచిగా స్నానము చేసి, శుభ్రమైన సాంప్రదాయిక వస్త్రములను ధరించి, తిలక ధారణ (బొట్టు పెట్టుకొనుట) చేయవలెను. తరువాత అమ్మవారి వద్ద ఉన్న నిర్మాల్యమును (ముందటి రోజున చేసిన పూజకు సంబంధించిన పూలు మొ॥) తొలగించి రెండు వత్తులతో దీపమును మఱియు రెండు సాంబ్రాణి వత్తులతో ధూపమును పెట్టవలెను. తొలుత ఇలవే్ల్పునకు పూజ, లేదా స్తోత్రము చేసి ఈ స్తోత్రపారాయణ మొదలుపెట్టవలెను.పైన పేర్కొన్నది ఉత్తమ పద్ధతి. తమ గోత్రనామములు చెప్పించి, ఇతరుల చేత తమ సమక్షమునందు చదివించి వినుట మధ్యమము. పురోహితులకు కొంత ధనము చెల్లించి, తమకు బదులుగా వారి చేత పారాయణ చేయించి, ఆ తీర్థము పుచ్చుకొనుట అధమము. ఏ పద్ధతిలో నైనను యజమానులకు ఇచ్చట చెప్పిన నియమములు వర్తించును.ఆత్మస్తుతి, పరనింద, అశ్లీల పరుష భాషణమును మఱియు కామక్రోధాదులను విడిచి పారాయణ చేయవలెను. మనసులో నైనను చదువుకొనవచ్చును. బిగ్గరగా నైనను చదువుకొనవచ్చును. కాని పారాయణ మధ్యలో ఇతరములైన లౌకిక వ్యవహారములను నడుపరాదు. ఈ పారాయణ చేయుచున్న రోజులలో మాంసాహారమును వండుటయు, తినుటయు పనికిరావు. మైల వంటివి వచ్చినప్పుడు పారాయణ మానవలెను. అట్టియెడల అది పారాయణ భంగమని భావింప నక్కఱలేదు. ప్రాణాయామము, కేశవ నామములు, సంస్కృత భాషలో దేశకాలాదుల స్తుతి, సంకల్పము మొదలైనవి ఏవియు ఈ పారాయణకు తప్పనిసరి కావు. బ్రహ్మచర్యాది నియమములు కూడ ఆవశ్యకము కావు. ఆసక్తి యున్నచో తెలుఁగు తాత్పర్యమును తెలిసికొనవచ్చును గాని అది పారాయణ కావశ్యకము కాదు.పారాయణ ముగిసిన తరువాత--

శ్లో॥ లక్ష్మీమ్ క్షీర సముద్రరాజ తనయాం | శ్రీరంగ ధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం | లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ | బ్రహ్మేంద్ర గంగాధరామ్
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం | వందే ముకుంద ప్రియామ్॥


అని చదువుచు హారతివ్వవలెను. ఆ తరువాత బెల్లము లేకుండ పాలను, పంచదారను కలిపి చేసిన క్షీరాన్నమును యథాశక్తి అమ్మవారికి నైవేద్యముగా సమర్పింపవలెను. పానకము, వడపప్పు, చలిమిడి కూడ శ్రేష్ఠమే. నివేదనానంతరము అమ్మవారికి సాష్టాంగ నమస్కారము నొనరింపవలెను. ( స్త్రీలు మాత్రము సాష్టాంగమాచరింపరాదు. మోకాళ్ళపై మోకరిల్లవలెను)'ఆదౌ విఘ్నేశ్వర స్తుతి :'శ్లో॥శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

తాత్పర్యము : తెల్లని వస్త్రములను ధరించినవాఁడును, అంతటను వ్యాపించి యున్నవాఁడును, జాబిల్లి వలె తెల్లనైనవాఁడును, ఎల్లప్పుడును ప్రసన్నమైన ముఖము గలవాఁడును అగు భగవాన్ శ్రీ వినాయకుని, విఘ్నములు తొలఁగిపోవుటకై ముందుగా ధ్యానింపవలెను

శ్లో॥ అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానామ్ ఏకదంత ముపాస్మహే ॥

తాత్పర్యము : శ్రీశ్రీశ్రీ పార్వతీ మహామాత యొక్క ముఖమనెడు పద్మము పుత్రవాత్సల్యముతో వికసించుటకు కారణభూతమై, సూర్యుని వలె తేజోవంతముగా ఉన్న ఏనుఁగు ముఖము గలవాఁడును, తనకొకే ఒక్క దంతమున్నను, భక్తులకు మాత్రము కోరినవెన్నో ప్రసాదించువాడును అగు భగవాన్ శ్రీ వినాయకుని మా విఘ్నములు తొలఁగిపోవుట కొఱకై రాత్రింబవళ్ళును భక్తితో ప్రార్థించెదము.

అథ శ్రీ కనకధారా స్తవ ప్రారంభ: 
హయగ్రీవ స్తుతి :

శ్లో॥ వందే వందారు మందార మిందిరానంద కందళమ్ ।
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ ॥1

తాత్పర్యము : నమస్కరించువారి కోరికలు తీర్చు (మందారమను) దేవతావృక్షము వంటివాఁడును, తన పత్నియైన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు మొలక వంటివాఁడును, పండితులు (జ్ఞానులు) అనుభవించు బ్రహ్మానందమునకు కిరీటము వంటివాఁడును అగు భగవాన్ శ్రీశ్రీశ్రీ హయగ్రీవ దేవునికి సాష్టాంగ నమస్కారము సేయుచున్నాను.శ్రీ కనకధారా స్తోత్రమ్శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2

తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:

ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3


తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్


ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ ।


ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్


భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4


తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజాలినవియు, మానవుఁ డనుభవింపఁగోరు ఎల్ల ఆనందములకును మూలమైనవియు, (దేవత యగుటచే) ఱెప్పపాటు లేనివియు, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపఁగలవియు, అర్ధ నిమీలితము (మాఁగన్ను) గా చూచునవియు నైన శ్రీ మహాలక్ష్మీ మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్


ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।


మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్


భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5


తాత్పర్యము : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క (వెంట్రుకలతో వల్లనై) నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !వివరణము :- భార్యానురాగాతిశయముచే భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆమెను తన వక్ష:స్థలమునందు దాఁచుకొన్నారని పురాణ వచనము.శ్లో॥ బాహ్యాంతరే మురజిత: శ్రితకౌస్తుభే యా


హారావళీవ హరినీలమయీ విభాతి ।


కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా


కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥6


తాత్పర్యము : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !శ్లో॥ ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్


మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన ।


మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్


మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥7


తాత్పర్యము : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !శ్లో॥ నుద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్


అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।


దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం


నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥8


తాత్పర్యము : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !విశేషార్థము : రెండవ పాదమునందలి "అకించన" శబ్దమునకు 'దరిద్రుఁ' డనియు, 'పాపములు లేనివాఁ'డనియు రెండర్థములు.శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి నరా యయా౭౭ర్ద్ర


దృష్టాస్ త్రివిష్టప పదం సులభం భజంతే ।


దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్


పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥9


తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !శ్లో॥ గీర్ దేవతేతి గరుడధ్వజ సుందరీతి


శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।


సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా


తస్యై నమస్ త్రిభువనైక గురోస్ తరుణ్యై ॥10


తాత్పర్యము : విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై


రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।


శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై


పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11


తాత్పర్యము : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలముల నొసంగు వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై


నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।


నమో౭స్తు సోమామృత సోదరాయై


నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12


తాత్పర్యము : పద్మము వంటి ముఖము గలిగిన మంగళదేవతకు నమస్కారము. పాల కడలిని తన జన్మస్థానముగా గల శ్రీ పద్మాలయా దేవికి వందనము. అమృతమునకును, దానితో పాటుగా ఉద్భవించిన చంద్రునికిని తోబుట్టువైన మాదేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమాస్పదురాలైన లోకమాతకు దండములు.శ్లో॥ నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై


నమో౭స్తు భూమండల నాయికాయై ।


నమో౭స్తు దేవాది దయాపరాయై


నమో౭స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13


తాత్పర్యము : బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను ప్రభుత్వము వహించి యున్న శ్రీ భార్గవీమాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చునదైన శ్రీ కమలాదేవికి దండములు.శ్లో॥ నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై


నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై ।


నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై


నమో౭స్తు దామోదర వల్లభాయై ॥14


తాత్పర్యము : బ్రహ్మ యొక్క మానస పుత్త్రులలో ఒక్కడైన భృగువను ఋషి యొక్క వంశమునం దుద్భవించినదియు, లోకోత్తరమైన భర్తృ వాల్లభ్యమును చూఱగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు శ్రీ ముకుందప్రియాదేవికి నమస్కారము.శ్లో॥ నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై


నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్యై ।


నమో౭స్తు దేవాదిభి రర్చితాయై


నమో౭స్తు నందాత్మజ వల్లభాయై ॥15


తాత్పర్యము : కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను గన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపఁబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తె యగు శ్రీదేవికి దండములు.విశేషార్థము : ఇచ్చట "కమలముల వంటి కన్ను" లనఁగా 'కమలముల వలె అందమైన కన్ను' లని లోకానబోధము. పూర్వవ్యాఖ్యాతలందఱును అట్లే వ్యాఖ్యానించి యున్నారు. కాని, దీని నిజమైన అర్థము వేఱు. దేవతల కన్నులు మనుష్యుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎఱ్ఱగా నుండును.శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని


సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి ।


త్వద్ వందనాని దురితాహరణోద్యతాని


మామేవ మాత రనిశం కలయంతు మాన్యే ॥16


తాత్పర్యము : దేవతలందఱిలోను మాన్యురాలవైన ఓ మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను గలిగించునవి. మా యొక్క సమస్త ఇంద్రియములను సుఖపెట్టునవి. అవి రాజాధిరాజత్వమును సైతము ప్రసాదింపఁ జాలినవి. పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనట్టివి. అవి నన్నెల్లప్పుడును (పసిబిడ్డను వలె) పట్టుకొని యుండు గాక !శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:


సేవకస్య సకలార్థ సంపద: ।


సంతనోతి వచనాంగ మానసైస్


త్వామ్ మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17


తాత్పర్యము : హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.శ్లో॥ సరసిజ నయనే సరోజ హస్తే


ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।


భగవతి హరివల్లభే మనోజ్ఞే


త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18


తాత్పర్యము : అందమైనదానా ! కమలములవంటి కన్నులును, చేతులును గలదానా ! మిక్కిలి తెల్లనైన దువ్వలువల తోడను, గంధపు పూత తోడను, పూల దండల తోడను ప్రకాశించుదానా ! విష్ణుమూర్తికి ప్రేయసివైనదానా ! ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా ! హే భగవతీ ! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !శ్లో॥ దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట


స్వర్ వాహినీ విమల చారు జలప్లుతాంగీమ్ ।


ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష


లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ॥19


తాత్పర్యము : అభ్రము, కపిలా, పింగళాదులైన దిగ్గజముల భార్యలు (ఆఁడేనుఁగులు) బంగారు కలశముల యందు పవిత్రమైన ఆకాశగంగ నుండి పట్టి తేరఁగా, ఆ పరిశుద్ధమగు జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననియు, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణుని యిల్లాలును, పాల కడలి యొక్క కూఁతురును అగు శ్రీశ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను.శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం


కరుణా పూర తరంగితై రపాంగైర్ ।


అవలోకయ మా మకించినానామ్


ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయా: ॥


20


తాత్పర్యము : అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు పాత్రుడనైనవాఁడను నేనే. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల) తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే


సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।


అష్టాపదాంభోరుహ పాణిపద్మాం


సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥


21


తాత్పర్యము : మారేడు చెట్ల తోఁట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.


వివరణము :


౧."అష్టాపదమ్" అనఁగా బంగారము.


౨. "సంవిష్ట" అనఁగా 'నిదురించినది' అని అర్థము. కానీ ఆ అర్థమిచ్చట పొసఁగదు. "నివిష్ట" ప్రయోగమును బట్టి 'ఇమిడినది' అని చెప్పికొనవలసి యుండును.శ్లో॥ కమలాసన పాణినా లలాటే


లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।


పరిమార్జయ మాతరంఘ్రిణా తే


ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22


తాత్పర్యము : ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుఁడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా ! తల్లీ ! శ్రీ మహాలక్ష్మీ !విశేషార్థము : శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క ఎడమకాలి తన్నులు కూడా ఎవరికిని అంత సులభముగా లభింపవని భావము.శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:


వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।


కారుణ్యత: కల్పయ పద్మవాసే


లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23


తాత్పర్యము : హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగాఁ జేసికొనుము.విశేషార్థము : ఇచ్చట ఆదిశంకరులు కేవలము "నా యింటికి వచ్చి యుండు"మనుట లేదు. "నా హృదయమునందే నిలుకడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కాని హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మట్టుకు భక్త పరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము.లక్ష్మీదేవిని సంపదల కొఱకు ఉపాసించుటొక్కటే చాలదు, సంపదలు సిద్ధించిన పిమ్మట కూడ ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము.శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం


త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ ।


గుణాధికా గురుతర భాగ్య భాజినో


భవంతి తే బుధ భావితాశయా: ॥24


తాత్పర్యము : ఎవరైతే ఈ స్తుతిపూర్వములైన శ్లోకములతో వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను స్తోత్రము సేయుదురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటె అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.విశేషార్థము : విద్వాంసుల చేత గౌరవింపబడుటయే లౌకిక జీవన పరమార్థము. అది విజ్ఞాన సముపార్జనము వలననే సిద్ధించును. అనఁగా ధనమునకు సహితము విజ్ఞాన సముపార్జనమే ధ్యేయము.ఫలశ్రుతి:శ్లో॥ కనకధారా స్తవం యత్ శంకరాచార్య నిర్మితమ్ ।


త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25


తాత్పర్యము : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కూర్చిన ఈ కనకధారా స్తవమును దినమునకు మూఁడుసారులు - అనఁగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

జాతకచక్రం