MohanPublications Print Books Price List clik Here MohanBookList

పరిణతి_Life Experienceపరిణతి Life Experience OldPeople OldageHome Life OldageLife Middleage BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Antaryami Eenadu Antaryami


పరిణతి


జీవితం అంటే, మార్పు. అనుక్షణమూ అది మారుతుంటుంది. క్షణక్షణమూ వైరుధ్యంగా గోచరిస్తుంది. సుఖదుఃఖాలు లేదా మంచిచెడుల మిశ్రమం అది. అందులో కలయిక ఉంటుంది. ఎడబాటూ సంభవిస్తుంది. మనిషికి ఎన్నో ఆశలుంటాయి. మమతలు, మమకారాలు అతణ్ని శాసిస్తుంటాయి. అవేవీ జీవిత సహజ పరిణామాల్ని మార్చలేవు!

తెలిసిన విషయానికి మానవుడు కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆవేదన చెందాల్సిన పని అంతకన్నా ఉండదు. ఎటువంటి మార్పునైనా అతడు అంగీకరించాలి, స్వాగతించాలి, అందులోనే ఏదైనా ప్రయోజనాన్ని వెతుక్కోవాలి. కలిగిన అవకాశం అతడికి మరో ఉపయుక్తమైన, తృప్తికరమైన బాధ్యతగా పరిణమించవచ్చు. ఎంతో కొంత విశ్రాంతినీ ప్రసాదించవచ్చు. జీవన రంగంలో ప్రతి ఒక్కదాన్నీ మనిషి అన్వేషించాల్సిందే.

ఇటీవలి కాలంలో వృద్ధుల పట్ల పిల్లల నిరాదరణ, నిర్లక్ష్యం పెరుగుతున్నాయి. అవి పెద్దలకు భరించలేనంత నిరాశను, నిర్వేదాన్ని కలిగిస్తున్నాయి. ఆవేదన, ఆందోళన మిగిలిస్తున్నాయి. వృద్ధుల వేదన ఎంత అంటే- ఆత్మహత్యకు పాల్పడేంత లేదా మరణం కోసం ఆత్రంగా ఎదురుచూసేంత! పిల్లలే సర్వస్వంగా జీవించినవారిని క్షోభ ఆవరిస్తోంది. సంతానమే ప్రాణంగా బతికే మనిషికి, ఆ ఊపిరే ఆగిపోతే? నీటిలో తప్ప బతకలేని చేపను బయట ఎక్కడో పడేస్తే? ఇదీ అంతే!

వృద్ధులకు కావాల్సింది పిల్లల ప్రేమాభిమానాలు! అవి తప్ప, వారికి మరేవీ ఆనందాన్ని ఇవ్వవు. పిన్నలకు జీవితాన్ని ఇచ్చినవారు, ఆనందాన్ని పంచినవారు పెద్దలే. వాటిని ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను, ధర్మాన్ని సంతానం విస్మరిస్తోంది. ప్రతి మనిషీ సంఘజీవి, విశ్వజీవి. ఏ విషయంలోనైనా బాధ్యతలు, హక్కులు అతడికి సమాన స్థాయిలో ఉంటాయి. సమాజంతో ముడివడి ఉన్న జీవితాన్ని అతడు దానితోనే పంచుకోవాలి. ఆవేదన, ఆనందం...దేనినైనా కలబోసుకోవాలి. ప్రేమ, ఆత్మీయత వంటివన్నీ సమాజంలోనే, సమాజంతోనే ఉంటాయి.

సమాజ దృక్పథంతో చూసినప్పుడు బంధాలు, బంధుత్వాలు అనేవి ఎంతో అవసరం. అవే ఆదరణీయాలు, అభిలషణీయాలు. మనసున్న మనిషిగా వెలగాలి. అతడి జీవితం కేవలం ఆ కుటుంబానికే పరిమితం కాదు. విశ్వ కుటుంబంలో అతడూ ఒక భాగం. ఏ భావమైనా దానితో పంచుకోవచ్చు- అది ఇవ్వడమైనా, తీసుకోవడమైనా! మానవుడు ఒక అమూల్య సంపద. పండిపోయేకొద్దీ ఆ విలువ మరింత పెరుగుతుంటుంది. ఎంత అంటే, చెప్పలేం. పాత్రతో కొలిచి చూపలేం. మల్లెపూల సౌరభానికి మాటలుండవు. ఆస్వాదించాలి. అంతే!
పెద్దవారు ఇంట్లో ఉండటం కుటుంబానికి అవసరం, శ్రేయస్కరం.

అలాంటి వృద్ధులు దేనికైనా కుంగిపోవాల్సిన పని లేదు. విలువను తగ్గించుకోనక్కర్లేదు. స్వాభిమానం ఉండాలి. ఆత్మగౌరవంతో మెలగాలి. ఎప్పుడూ తీసుకోవడమేనా... ఇవ్వడాన్నీ నేర్చుకోవాలి. మనసుకు ఏవీ అడ్డు రావు. అనర్హతలు అసలే ఉండవు. తీసుకోవటంలోని ఆనందం తెలిసిన వ్యక్తికి, ఇవ్వడంలోని అవసరమూ తెలిసే ఉంటుంది. తాను ఇతరుల నుంచి ఆశిస్తున్నాడు కాబట్టి, ఆ ఇవ్వడం అనేది తానే ఎందుకు చేయకూడదు? ఏమైనా ఇవ్వాలని తాను ఆశించేవారు, తనకు కొందరే ఉంటారు. తానే ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఎందరైనా లభిస్తారు. ఎందరికైనా, అందరికైనా, ఎవ్వరికైనా, ఏమైనా ఇవ్వవచ్చు. ఆ ఇచ్చే స్థానంలోకి పెద్దలే వెళ్లగలిగితే- ఎవరో ఏదో ఇవ్వాలని ఆశించే స్థాయి నుంచి ఎదుగుతారు. మానవుడి నుంచి భగవంతుడు ఆశించే స్థితి లేదా స్థాయి అదే!
- చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం