MohanPublications Print Books Online store clik Here Devullu.com

సీతమ్మకు చేయిస్తి...!_Sriramanavami


సీతమ్మకు చేయిస్తి...! Sriramanavami Badrachalam Khammam Badradri Sitarama Kalyanam Lord Sitarama Ramadasu Lord Rama Eenadu Sunday Magazine Eenadu Sunday Book Eenadu Cover Story Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


సీతమ్మకు చేయిస్తి...!

      జగదానందకారకుడైన రాముడికీ జగన్మాత జానకికీ జరిపించే కళ్యాణం కడుకమనీయం. అసలు కళ్యాణం అంటే అది సీతారాములదే. కళ్యాణంలోని ప్రతి ఘట్టం కనులకు పండగే. ఇందులో అమితమైన భక్తితో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం. శతాబ్దాల కి¨ందటే స్వామికీ సీతమ్మకీ ఏయే నగలు అలంకరించాలో వాటన్నింటినీ అమర్చిన గొప్ప భక్తాగ్రజుడు శ్రీరామదాసు. తానీషాల కాలంనాటి ఆభరణాలకు రాములోరి దర్బారులో ఇప్పటికీ విశిష్ట స్థానమే.

ప్రపంచంలోని ఏ దేవుడి నగలైనా భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కదలి వచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. తానీషా ప్రభువుల ఖజానాలోని నగదుతోనే కంచర్ల గోపన్న రాములవారికీ, సీతమ్మకూ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకూ నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. అంతట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి ఆరు లక్షల రామమాడలను రాశిగా పోసి తానీషాకు ఇస్తాడు. అలా రాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటి నుంచీ రాములవారి కళ్యాణానికి పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ సమర్పించడం ప్రారంభించాడు. నేటికీ భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్ర శుద్ధ నవమి రోజు (ఈ ఏడాది మార్చి 26)న జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండటం విశేషం. 
రామదాసు ప్రత్యేక కృషి 
భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అనేదానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెబుతారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు, కిరీటాలు, శఠారి, ఛత్ర, చామరాలు, వస్త్రాలు మొదలైనవాటిని తయారు చేయించాడన్నది పండితుల విశ్లేషణ. రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవోపేతమైంది చింతాకు పతకం. చింత చిగుర్లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన 
ఈ నగ తయారీకి ఆ కాలంలోనే పదివేల వరహాలు వెచ్చించాడట రామదాసు. జానకీనాథుడి అలంకరణకు కలికితురాయినీ చేయించాడు. ఇక లక్ష్మణ స్వామికి ముత్యాల పతకాన్ని, భరత శత్రుఘ్నులకు పచ్చల పతకం, రవ్వల మొలతాడు చేయించాడు. 

మూడు సూత్రాలు! 
చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలో స్వామివారు కట్టే తాళిబొట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో రాములవారు సీతమ్మ మెడలో మూడు సూత్రాలను కడతాడు. పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి మొత్తం మూడు సూత్రాలను కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపజేయడం భద్రాచల క్షేత్ర ఆచారం. ఇలా మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటిచెబుతుంది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు ఈ సూత్రాలు సంకేతాలు.వైరముడి... 
రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి. ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన వ్యక్తే చేయించడం విశేషం. 1880 ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దారుగా వచ్చినప్పుడు దీన్ని చేయించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 
స్వర్ణ పుష్పార్చన 
భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఈ అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది స్వర్ణ పుష్పాలను చినజీయర్‌ స్వామి బహూకరించారు. అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసీ దళాలతో మూలవిరాట్టును పూజిస్తారు. శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు అయిదు కిలోల బంగారంతో వీటిని చేయించారు. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు మూడున్నర కోట్ల రూపాయల విలువైన పదికిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు. వీటిని ప్రతి శుక్రవారం మూలవిరాట్టుకు అలంకరిస్తారు. 
ఒడిలో సీతమ్మతో, చేతిలో శంఖచక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్మంగళ దాయకం. అందుకే నవమినాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అర్చకస్వాములు ఆనందంగా చూపిస్తుంటే, ఎంత దూరాన్నుంచైనా రెండు చేతులతో కళ్లకద్దుకుని తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఈ సందడి ఒక్క భద్రాచలంలోనే కాదు ప్రతి తెలుగు పల్లెలోనూ కనిపిస్తుంది. ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవశిస్తుంది.
- మామిడి నాగేశ్వరరావు, న్యూస్‌టుడే, భద్రాచలం

శ్రీరామ నవమి

హిందువులకు ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామచంద్రుడు విళంబి నామ సంవత్సరంలో, చైత్రశుద్ధ నవమినాడు, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీరామనవమిగా భావిస్తారు. దేవుడు అవతరించిన రోజే కళ్యాణాన్ని ఆచరించాలన్నది పాంచరాత్రాగమ సంప్రదాయం. ఆ ప్రకారం శ్రీరామనవమినాడే సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. ఈ వేడుక కూడా అభిజిత్‌లగ్నంలోనే జరగడం విశేషం.

శ్రీరాముడిలాగే రామనామం కూడా చాలా విశిష్టమైంది. రామనామాన్ని జపంగానే కాదు బిడ్డకు పేరు పెట్టి పిలిచినా, ఏమరపాటుగానైనా స్మరించినా పుణ్యమేనంటాడు పోతన. ‘రామా’ అని పలకగానే మనలోని పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నది ఆర్యోక్తి. అంతటి మహిమాన్విత నామాన్ని కలిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణం లోకానికీ పండగే. అలాగే పూజ పూర్తయిన తర్వాత మిరియాలూ బెల్లంతో చేసిన పానకాన్నీ, వడపప్పునూ నైవేద్యంగా పెడతారు. పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని వెనుక ఆరోగ్యపరమైన పరమార్థం కూడా ఉంది. పానకంలో వాడే మిరియాలూ, యాలకులూ వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే వడపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవచేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది కూడా.

సీతమ్మకు చేయిస్తి...! Sriramanavami Badrachalam Khammam Badradri Sitarama Kalyanam Lord Sitarama Ramadasu Lord Rama Eenadu Sunday Magazine Eenadu Sunday Book Eenadu Cover Story Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu




పరిపూర్ణ మానవుడు శ్రీరామచంద్రుడు

‘శ్రీరామనవమి’ వచ్చిందంటే చాలు దేశమంతటా ఆకాశమంత పందిళ్లు వేసి భూదేవంత పీట వేసి ఊరూ వాడా ఏకమై ఆనందోత్సాహాలతో సీతారాముల కల్యాణం జరుపుకుంటారు ప్రజలు. శ్రీరాముడు లోకారాధ్యుడు ఎందుకైనాడు? భగవంతుడనా? పురుషోత్తముడనా? ఎవరి విశ్వాసాలు వారివి. రెండూ సత్యాలే కావచ్చు. నమ్మినవారికి నమ్మినంత. నాణెమునకు బొమ్మా బొరుసు ఉన్నట్లే శ్రీరాముడిలో నారాయణతత్త్వముంది, నరతత్త్వము వుంది.
శ్రీరాముడు మాత్రం తను ఒక సాధారణ మానవుడిగానే గడిపాడనడంలో సందేహమేమాత్రమూ లేదు. రామో విగ్రహవాన్ ధర్మః- ‘రాముడు ధర్మము మూర్త్భీవించినవాడ’ని ఎలా చెప్తామో అతడొక ‘మూర్త్భీవించిన ఆదర్శము’ అని కూడ చెప్పాలి. రాముడు మానవమాత్రుడిగానే తన జీవితకాలంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఃఖానుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని కొనసాగించాడు. జాతికి, మానవాళికి అదే ప్రేరణ. స్ఫూర్తి కూడా. అందుకే ఆయనొక ‘జాతీయ మహానాయకుడు’. డా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడ రాజ్యాంగ మూలప్రతిలో రామపట్ట్భాషేకము, రామసేతు వంటి చిత్రాలకు స్థానం కల్పించారు.
శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. దైవంగా భావించే ధార్మికులు, ఆధ్యాత్మికులు కూడ దీన్ని అంగీకరిస్తారు. ఏది ధర్మమో దానిని దైవంగా భావించడం హిందూ జీవన పద్ధతి. శ్రీరాముడు మానవుడే అనే విషయాన్ని నారద వాల్మీకులే స్పష్టం చేశారు. తన ఆశ్రమానికి నారదుడు వచ్చినపుడు వాల్మీకి ఆయనతో- ‘మీరు లోక సంచారం చేస్తుంటారు కదా! ఈ లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థవంతుడు, సదా ప్రియదర్శనుడు, సర్వ ప్రాణికోటికి హితుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, ధైర్యవంతుడు, దేవతలు కూడ భయపడే పరాక్రమవంతుడైన మానవుడెవడైనా ఉన్నాడా? ఉంటే తెలియజేయండి’ అని అడిగినపుడు-

బహవో దుర్లభాశ్ఛైవ యే త్వయా కీర్తితా గుణాః
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతాః అని..
ఇట్టి సద్గుణ సంపన్నుడైన మానవుడు లభించడం దుర్లభమే. కాని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు మాత్రం దీనికి మినహాయింపుగా- శ్రీరాముడనే రాకుమారుడు ఉన్నట్టుగా చెప్పాడు. దీనిని బట్టి రాముడు వేసిన ప్రతి అడుగులో ఒక మానవోత్తముడు గోచరిస్తాడు. అతనిని ఆశ్రయించిన సద్గుణ సంపద కారణంగా దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.

ప్రజాపతిః సమః శ్రీమాన్ ధాతారిపు నిషూదనః
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా
వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః
-అని కూడ నారదుడు చె ప్పాడు. శ్రీరాముడు ప్రజాపతులతో, బ్రహ్మతో సమానుడే కాని ప్రజాపతి కాడు, బ్రహ్మకాడు అన్నాడు. శత్రువులను, దుర్మార్గులను చీల్చి చెండాడి జీవకోటిని, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, తన ధర్మాన్ని ఆచరిస్తాడు. స్వజనులను రక్షిస్తాడు. వేదవేదాంగాల తత్వాన్నాకళింపు చేసుకొన్నాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు అని శ్రీరాముని గురించి చెప్పాడు. సమస్త సద్గుణములు రాముడి నాశ్రయించి యున్నాయని అర్థం. అందుకే ఆయన పురుషోత్తముడు, మానవోత్తముడు, నరోత్తముడు. రాముని మానవ జీవన విధానాన్ని, కార్యసాధకతను, ఆదర్శాన్ని అడుగడుగునా మనం గమనించవచ్చు.

శ్రీరాముడు దైవీశక్తి సంపన్నుడని రామాయణాది గ్రంథాలు వర్ణించినా రాముడెక్కడా తన జీవితంలో దైవీశక్తిని ఉపయోగించుకోలేదు. ఒక మానవుని వలె తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తన భుజబలాన్ని, తన మేధస్సును, తన విద్యలను తాను నమ్ముకున్నాడు. 14 ఏళ్ల పాటు వనవాసమంతా కాలి నడకనే సాగింది. సీతానే్వషణ సుగ్రీవుని సహాయము, హనుమంతుని శక్తి సామర్థ్యములతోనే జరిగింది. సముద్రమును దాటవలసి వచ్చినపుడు కూడా వానరుల సహాయంతో సేతువును నిర్మించి దానిమీదుగా లంకకు వెళ్లాడు తప్ప ఎక్కడా మహిమలను, మాయలను ఉపయోగించలేదు. యుద్ధ శిబిరాలలో ఉన్నపుడు మైరావణుడు మోసంతో రామలక్ష్మణులనపహరించి పాతాళంలో బంధించి దుర్గాదేవికి బలియిచ్చే సమయంలో గూడ రాముని ప్రవర్తన అలాగే ఉన్నది.

రావణ వధానంతరం అయోధ్యకు బయలుదేరి గంధమాదన పర్వతం దగ్గర దిగి ఋషిమునుల ఆశీస్సులు పొందిన శ్రీరాముడు వేదవేదాంగ విద్యా సంపన్నుడు. పరమ శివభక్తుడైన రావణుని చంపినందువల్ల కలిగే పాపమునకు ప్రాయశ్చిత్తంగా రామేశ్వరంలో సైకత శివలింగ ప్రతిష్ఠ చేశాడు. యుద్ధంలో శత్రువును చంపితే పాపం కలుగదు. కాని రావణుడు పరమశివ భక్తుడనే భావనతో లోక కళ్యాణార్థం రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయో శ్రీరాముడి మనస్సులో గూడ అలాగే పరిభ్రమించడంతో అలా వ్యవహరించాడు. అవసరాన్ని బట్టి శక్తిని, యుక్తిని, మేధస్సును ఉపయోగించాడు. సీతాపహరణం తరువాత సీతావియోగ బాధను, సీతా పరిత్యాగం తరువాత వియోగ బాధను ఆయన అనుభవించిన తీరుతెన్నులు ఊహకందనివి. రాముని దుఃఖాన్ని చూసి అక్కడి ప్రకృతి కూడ శోకించిందనడంలో అతిశయోక్తి లేదు.

కృతజ్ఞతామూర్తి..
సీతానే్వషణకై బయలుదేరిన రామలక్ష్మణులకు కొన ఊపిరితోనున్న జటాయువు తారసపడి సీత జాడ తెలిపి ప్రాణాలను వదిలాడు. తన భార్యను రక్షించడానికి పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు అంతిమ దహన సంస్కారం చేసి తన కృతజ్ఞతాభావాన్ని రాముడు ప్రదర్శించాడు. జటాయువు పక్షిజాతి, తాను మానవజాతి అనే భేదభావాన్ని రాముడు కనపరచలేదు. సమస్త జీవకోటి పట్ల సమాన భావన కలిగి ఉన్న విశాల హృదయుడుగా శ్రీరాముడు కనిపిస్తాడు.

హనుమంతుడు వానర జాతీయుడు. రామభక్తుడు. రామసేవకుడు. రాముని వెన్నంటి ఉన్నవాడు. సుగ్రీవునితో మైత్రి కలిగించాడు. సీతారాముల పరస్పర యోగక్షేమాలను తెలియజేశాడు. సాటియైన ప్రత్యుపకారము చేయలేక ఆత్మీయాలింగన సౌఖ్యాన్ని కలిగించి తన కృతజ్ఞతను వ్యక్తపరచుకున్నాడు శ్రీరాముడు.
భారతదేశ సంస్కృతిలో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అంతర్భాగం. దీనిని రక్షించుకోవడం మానవ ధర్మం. విశ్వామిత్రుడు చేస్తున్న యాగానికి రాక్షస శక్తి అడ్డుపడుతుంది. ఆటంకాలు కలిగిస్తుంది. విశ్వామిత్రుడు పాలకుల

సహాయం అర్థించాడు. రామలక్ష్మణులు యాగ సంరక్షణార్థం వెళ్లారు. కాలినడకన వెడుతూ రామలక్ష్మణులకు విద్యాబుద్ధులను నేర్పుతూ, సామాజిక అవగాహనను విశ్వామిత్రుడు కలిగించాడు. ధైర్య సాహసాలను, విజిగీషు ప్రవృత్తిని పెంపొందించాడు. కర్తవ్యాన్ని ప్రబోధించాడు. రాముణ్ణి ఉత్తముడిగా, కర్తవ్య పరాయణునిగా తీర్చిదిద్దాడు. యాగ సంరక్షణకు కటిబద్ధుడైనాడు రాముడు. కంటికి రెప్పలా కాపాడినాడు. దుష్టశక్తుల్ని తరిమిగొట్టాడు. యజ్ఞయాగ సంరక్షణకు కటిబద్ధుడైనాడు రాముడు. కంటికి రెప్పలా కాపాడినాడు. దుష్టశక్తుల్ని తరిమిగొట్టాడు. యజ్ఞ యాగ నిర్వహణలో కలుగుతున్న ఆటంకాలను ప్రతిఘటించడం నాటి నుండి నేటివరకూ సాగుతూనే వుంది. ఒక జాతి జీవన సాంస్కృతిక మూలాలను పరిరక్షించడం ప్రతి పౌరుని కర్తవ్యం కావాలి. రాముడా పని చేశాడు. ఇది యజ్ఞ్భూమి. యజ్ఞ యాగాదులే ముక్కారు పంటలు పండిస్తున్నాయనడంలో సందేహం లేదు. సమాజ శ్రేయస్సును, సమాజ కళ్యాణాన్ని ఆకాంక్షించేవి యజ్ఞాలు.

చిత్త సైర్థ్యము కలిగిన మహాయోగి
తమ కర్తవ్యాన్ని నిష్ఠతో ఆచరించిన వారిని లోకంలో ఉత్తములుగా పరిగణిస్తారు. శ్రీరాముడు ఆ కోవకు చెందినవాడే. లోకంలో కర్తవ్యాన్ని నిర్వహించేవారు కొందరే ఉంటారు. ఆ బాధ్యత స్వీకరించాడు శ్రీరాముడు. పుత్ర ధర్మం నిర్వహించాలనుకున్నాడు. లోభ ప్రలోభాలకు లోబడని దృఢచిత్తాన్ని అలవరచుకున్నాడు. చిత్తస్థైర్యం అంటే అదే.
దశరథుని దుస్థితికి కారణములను శ్రీరాముడికి కైక తెలియజెప్పింది. అంతే- శ్రీరామునిలో ఒక్కసారిగా పితృభక్తి చైతన్యవంతమైంది. ‘కరిష్యే ప్రతి జానామి రామోద్విర్నాభిభాషితే’. రాముడు మరోమాట మాటాడలేదు. తండ్రిని అసత్యదోషం నుండి కాపాడటానికి ఇంతకుమించిన పుత్రధర్మం మరొకటి లేదని భావించాడు. కష్టనష్టాలను బేరీజు వేసుకోలేదు. కుటుంబంలో కలహాలు రాకూడదు. కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. అశాంతి, అవ్యవస్థ చోటుచేసుకోకూడదని భావించాడు. త్యాగభావన పెల్లుబికింది. తాను త్యాగశీలిగా నిలబడ్డాడు.
నాహమర్థ పరోదేవి లోకమావస్తుముత్యహే
విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం!
- అన్నట్లుగా రాగద్వేషాలకతీతులైన ఋషులవలె ధర్మాన్నాశ్రయించి వనవాసం చేస్తానన్నాడు. అలాగే చేశాడు. ఇది మానవ అసాధ్య కార్యమేమీ కాదు. సిద్ధించినా, సిద్ధించకపోయినా వికల్పం చెందని మనస్సు కలిగిన ఉదాత్త గుణ సంపన్నుడుగా శ్రీరాముడు వ్యవహరించాడు. అందుకే అతడు ‘వ్యక్తమేష మహాయోగి’ అయ్యాడు.


గొప్ప స్నేహశీలి
లోకంలో శాశ్వతమైన వాటిలో చెప్పుకోదగిన అంశాలలో స్నేహం ఒకటి. స్నేహం శిలాక్షరము వంటిది. శ్రీరామ సుగ్రీవుల మైత్రి అటువంటిదే. తల్లిదండ్రుల తరువాత మనిషి మేలుకోరేవాడు, సహజంగా ప్రేమించేవాడు- మిత్రుడు మాత్రమేననేది లోక విదితం. శ్రీరామ సుగ్రీవుల మిత్రత్వానికి ప్రధాన కారణం వారిరువురు ఒకే విధమైన అవస్థలో ఉండటం. సుగ్రీవుడు భార్యావియోగ దుఃఖంలో ఉన్నాడు. శ్రీరాముడు కూడ భార్యా వియోగాన్నననుభవిస్తున్నాడు. వారిద్దరి మధ్య హృదయ సంవాదమేర్పడింది. రాముడు స్నేహం చేయడానికిదొక్కటే కారణం కాదు. సుగ్రీవుని ద్వారా వృత్తాంతమంతా విన్న తరువాత ధర్మం సుగ్రీవుని పక్షాన ఉందని రాముడు గ్రహించాడు. వాలి ఎంతో బలవంతుడైనప్పటికీ తన అవసరాలను సులభంగా తీర్చగలవాడైనప్పటికీ ధర్మం సుగ్రీవుని పక్షాన ఉన్న కారణంగా వాలిని కాదని ధర్మం వైపు మొగ్గు చూపి సుగ్రీవునితో చేయి కలిపాడు. ధర్మపక్షపాతి అయ్యాడు.
‘త్వం వయస్యోసి హృద్యో మే హ్యేకం దుఃఖం, సుఖంచ నౌ’-
అన్నట్లు పరస్పరము సుఖదుఃఖాలు పంచుకున్నారు. ‘ఉపకార ఫలం మిత్రం’. మైత్రికి ఉపకారమే ఫలమన్నట్లుగా పరస్పర సహకారమందించుకున్నారు. సుగ్రీవుడు చేసిన సహకారాన్ని రాముడు స్మరించుకుంటూ సుగ్రీవుని వంటి మిత్రుడు ఇతరత్రా లభించడని అంటాడు.

మైత్రీబంధం పరస్పర కష్టాలను తొలగించేదిగా, ధర్మరక్షణకు దోహదపడేదిగా ఉండాలి. అదీ ‘సజ్జన మైత్రి’ అంటే. రామ సుగ్రీవులది సజ్జన మైత్రి.

దేశభక్తి పరాయణుడు
రాముడు అయోధ్యలో పుట్టాడు. ఈ మట్టిని, ఈ భూమిని ప్రేమించాడు. ఈ గాలితో, నీటితో మమేకం చెందాడు. వీటిని సంరక్షించే విషయంలో దృఢంగా నిలబడ్డాడు. రావణ వధ తరువాత అయోధ్యకు బయలుదేరే సమయంలో లక్ష్మణుడు రామునితో ఈసువర్ణ లంకలోనే ఉండిపోవచ్చు గదా.. అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు శ్రీరాముడు-

అపిస్వర్ణమరుూలంకా నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
అని అంటాడు. అంటే- లక్ష్మణా..! లంకా నగరము స్వర్ణమయమైన భవనాలతో ప్రకాశిస్తున్నప్పటికీ జనని, జన్మభూమి కూడ స్వర్గము కంటే గొప్పనైనవి అంటూ మాతృభూమి విశిష్టతను తెలియజెప్పాడు. ఏమైనా లంక లంకే, అయోధ్య అయోధ్యయే. అయితే నీవు జన్మించిన దేశాన్ని నీవుంటున్న దేశాన్ని సంపన్న దేశంగా నిర్మాణం చేసుకోవాలి. సమృద్ధ, సశక్తదేశంగా మలచుకోవాలి. అందుకోసం కష్టపడాలి. కృషిచేయాలి. తన దేశాన్ని ప్రేమించిన ఒక పౌరుడిగా రాముడు ఈ జాతికిచ్చిన సందేశమిది.

సోదర ప్రేమ
దశరథుని సంతానంలో శ్రీరాముడు పెద్దవాడు. సహజంగానే పెద్దన్న పాత్రను పోషించాడు. అంటే తమ్ముల పట్ల అనురాగం చూపాడు. వారి శ్రేయస్సును కాంక్షించాడు. తండ్రిలేని ఆ పిల్లల బాగోగులన్నీ చూసుకున్నాడు. ఆ అన్నదమ్ముల అనుబంధమే విశిష్టమైనది. శ్రీరాముడు వనవాసానికి వెడితే రామునకు చెందవలసిన రాజ్యము తనకక్కరలేదని రాజ్యాభిషేకాన్ని తృణప్రాయంగా భావించి శ్రీరాముని వద్దకు వెళ్లి రాజ్యాధికారారమును స్వీకరించమని విన్నవించుకున్నాడు భరతుడు. బ్రతిమిలాడాడు. అయినా మాటకు ప్రాణము సత్యమన్నట్లుగా రాముడు ససేమిరా అన్నాడు. ఎట్టకేలకు భరతుని అభ్యర్థన మేరకు తన పాదుకలనిచ్చాడు. రాముడికి ప్రతిగా పాదుకలను ఉంచి, అతని ప్రతినిధిగా పరిపాలన చేసిన ఘనత భరతునిది. రామునిపై భరతునకు పిచ్చిప్రేమ. రాముడు చెప్పింది తు.చ. తప్పకుండా చేసేవాడు లక్ష్మణుడైతే, శ్రీరామునకు యశస్సును కల్గించే విషయాన్ని నచ్చచెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవాడు భరతుడు.

అందుకే-
దేశేదేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః
తంతు దేశం న పశ్చామి యత్రభ్రాతా సహోదరః
- అంటూ భరతుని వంటి సోదరుడు లభించడం ఈ భూమిమీద దుర్లభమైన విషయమని భరతుణ్ణి మెచ్చుకుంటాడు. లక్ష్మణుడు యుద్ధ్భూమిలో మూర్ఛపోయిన తరువాత కూడ సోదర ప్రేమను ఇలాగే వ్యక్తపరచాడు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన అన్నదమ్ముల అనుబంధాన్ని ఆచరణలో చూపించిన ఆదర్శభ్రాత శ్రీరాముడు.
సౌశీల్య సంపన్నుడు
శీలము లేని జీవితం- దీపం లేని ఇల్లు, తెగిన గాలిపటం వంటిది. శీలమే మనిషికి నిజమైన భూషణము అనేది భారతీయ ధర్మం. వ్యక్తిగత, జాతీయ శీలములు రామునికాభరణాలు. ఏకపత్నీవ్రతమే రాముని వ్రతము. ఆ ఆదర్శాన్ని సమాజం ముందుంచాడు. శ్రీరాముడు దండకారణ్యంలో నివశిస్తున్న సమయంలో విద్వజ్జిహ్వుని భార్యయైన శూర్పణఖ భర్త మరణించిన తరువాత స్వేచ్ఛా సంచారం చేస్తూ రాముని సౌందర్యాన్ని చూసి మోహించి అనుచితమైన కోరికను కోరింది. రాముని వ్యక్తిత్వమేమిటో ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. ఎదుట నిలబడిన శూర్పణఖ మహా సుందరాంగి. ధన కనక కాంతల మోహంలో పడిపోతుంటారు కొందరు. ఉత్తములు మాత్రమే వీటికి అతీతంగా ఉండగలుగుతారు. రాముడు జితేంద్రియుడు. పైగా నియమశీలుడు. నైతిక వర్తనుడు. కాబట్టి శూర్పణఖను సున్నితంగా తిరస్కరించి తన దగ్గరనుండి పంపించివేశాడు. అది జాతికాదర్శం. పరస్ర్తి వ్యామోహం, పరపురుషుని మోహం నేడెన్ని అనర్థాలను కలిగిస్తోందో మనం నిత్యం చూస్తున్న విషయమే. కాబట్టి భారతీయ జీవన పద్ధతులను, కుటుంబ పద్ధతులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా శ్రీరాముని జీవితం మనకు తెలియజేస్తోంది.

సాధారణ మానవులు ధనమోహంలో పడ్డట్టే రాముడు కూడ బలహీనతకు గురయ్యాడు. దండకారణ్యంలో పర్ణశాల ముందు సంచరిస్తున్న బంగారు లేడిని చూసిన సీత ఆ లేడి కావాలని అడిగినప్పుడు, రాముడు భార్య అడిగిన వస్తువును తెచ్చి ఇవ్వాలని భావించాడే కాని బంగారు లేడి సృష్టికి, ప్రకృతికి విరుద్ధమని ఒక్క క్షణం పాటు ఆలోచించలేకపోయాడు. దాని వెంటబడ్డాడు. ప్రమాదో ధీమతామపి అని గదా! దాని దుష్ఫలితమే సీతాపహరణం, సీతావియోగం. మనిషి బలహీనతలకు లోనయితే దుష్పరిణామాలు సంభవిస్తాయన్నది సత్యదూరం కాదు.

సమరసతా మూర్తి..
శ్రీరాముడు అయోధ్యను వదిలి వెళ్ళే సమయంలో శృంగిబేరపురానికి చేరుకుని ఇంకుదీ వృక్షచ్ఛాయలో విశ్రమించాడు. ఇది తెలిసి అక్కడి బోయజాతి నాయకుడు గుహుడు సపరివార సమేతంగా రాముని వద్దకు వచ్చాడు. ‘ఈ దేశమంతా నీది. మేమంతా నీ అనుయాయులం. నువ్వు మాకు రాజువి..’ అనే గుహుని మాటలు విని ఒక్కసారిగా ఆత్మీయతా పూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు రాముడు. ఆ ప్రేమకు, ఆ స్నేహానికి గుహుడు పులకరించిపోయాడు. శ్రీరాముడు తన జీవితంలో స్నేహధర్మంతో ఆలింగన సౌఖ్యం కలిగించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు గుహుడు, రెండవవాడు హనుమంతుడు. ఇతడొక బోయవాడని, ఆటవికుడని- అతడొక వానరుడనే భేదభావం కాని రాముని మనసులో ఏకోశాన చోటుచేసుకోలేదు. ఉన్నత, నిమ్న అనే భేదభావాలేమాత్రము చూపలేదు. గుహునితో మర్రిపాలు తెప్పించుకొని జటాధారణ చేసి గుహుని నావ ఎక్కి గంగానదిని దాటిన వ్యక్తి.
గిరిజన భక్తురాలుగా పేరుగాంచిన శబరి ఆశ్రమానికి వెళ్లి, ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ధన్యురాలినని శబరి భావిస్తే ఆమె వాత్సల్యంతో తాను ధన్యుడనైనానని భావించిన సౌజన్యమూర్తి శ్రీరాముడు.

నరులు, వానరులు, పక్షులు, జంతువులు అనే తేడా లేకుండా సమస్త ప్రాణికోటినీ సమాన భావనతో చూసిన సమరసతా మూర్తి. సేతువు నిర్మాణంలో ఉడుత చేస్తున్న ప్రయత్నాన్ని చూసి ప్రేమతో ఒడిలోకి తీసుకున్న అనురాగమూర్తి.

శ్రీరాముని జీవితం సమాజానికాదర్శం కావాలి. ‘చదివిన సదసద్వివేక చతురత కలుగన్’ అంటూ మనం చదువుకుంటున్నాం. కాని అది ఆచరణలో కనిపించడం లేదు. కులభేదాలతో, కుల వైషమ్యాలతో, కులాల కువిమర్శలతో, కుల కలహాలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వైషమ్యాలను పెంచుకుంటున్నాం. నాగరికత పెరుగుతోందని చెప్పుకుంటూనే అమానుషంగా ప్రవర్తిస్తున్నాం.

సంఘటనా కుశలుడు
శ్రీరాముడు సత్యప్రతిష్ఠాపన కోసం వనవాసానికి సిద్ధమైనాడు. సీతనపహరించిన అధర్మ శక్తిపై ధర్మ పోరాటానికి పిలుపునిచ్చాడు. ధర్మపోరాటం ఒక్కరు చేసేది కాదు. ధర్మం సమాజానాశ్రయించి ఉంటుంది. కాబట్టి ధర్మరక్షణ కోసం సమాజం లేచి నిలబడాలి. రాముడు సమాజాన్ని తట్టి లేపాడు. సమాజం రాముని వెంట నడిచింది.
యాంతి న్యాయ ప్రవృత్తస్య! తిర్యంచోపి సహాయతాం!
అపంథానం తు గచ్ఛంతం! సోదరోపి విముంచతి!
న్యాయమార్గంలో నడిచిన వారికి పశుపక్ష్యాదులు కూడ సహకరిస్తాయి. అధర్మమార్గంలో వెళ్ళే వారిని తోడబుట్టినవారు కూడ విడిచిపెడతారు. రామ, రావణుల విషయంలో అదే జరిగింది.
విభీషణుడు రావణాసురుడిని కాదని నలుగురు అనుచరులతో రాముని వద్దకు వచ్చి శరణు కోరాడు. శ్రీరాముడు సుగ్రీవాదులతో చర్చించి, తర్కించిన పిదప శత్రుపక్షానికి చెందినవాడైనా సరే నమ్మదగినవాడనే అభిప్రాయం కలిగిన తరువాత ధర్మకార్యంలో విభీషణుడిని జోడించాడు. వాలిని వధించిన తరువాత వాలి పుత్రుడైన అంగదుడిని వ రాజ్యానికి పట్ట్భాషిక్తుని చేసి రాజనీతిని పాటించి అంతశ్శత్రవులు లేకుండా అందరినీ సంఘటితపరిచిన కర్మయోగి.


ఆదర్శ పరిపాలకుడు

పదివేల సంవత్సరాలు శ్రీరాముడు ఆదర్శమైన పాలననందించాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ యుగ కాలగణనకు, ఈ యుగపు కాలగణనకు వ్యత్యాసముంటుందని గమనించాలి. ప్రజారంజకంగా పరిపాలించాడు. పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ వేలెత్తి చూపడానికి, విమర్శించడానికి అవకాశం లేకుండా పరిపాలించాడు. సమస్త జీవరాశులు ఆకలి దప్పికలతో అలమటించకుండా ఉండేలా పాలించాడు. అందుకే ‘రామరాజ్యం’ కావాలన్నారు మహాత్మా గాంధీ. ఒక సమ్రాట్టు, సామ్రాజ్ఞి ఆదర్శంగా ఉండాలని ధర్మం చెప్తోంది. అపుడు ప్రజలు కూడ అలాగే ఉంటారు. గూఢచారిగా సేకరించుకువచ్చిన ఒక పౌరుని అభిప్రాయాన్ని శ్రీరాముడు పరిగణనలోకి తీసుకున్నాడు. అది నిజము కాదని తెలిసి కూడ ప్రజల అభిప్రాయానుగుణంగా రాజ్యపాలన చేయడం రాజు కర్తవ్యం కాబట్టి.
స్నేహం దయాంచ సౌఖ్యం చ! యది వా జానకీ మపి
ఆరాధనాయ లోకస్య! ముంచతే నాస్తి మే వ్యధా
లోకారాధన కోసం నా దుఃఖాన్ని కూడ లెక్కచేయకుండా ప్రాణప్రదమైన సీతాదేవిని పరిత్యజించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, సీతాదేవిని అడవిలో విడిచిపెట్టి రమ్మని లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు. ఆదర్శమైన పరిపాలన అంటే అలా ఉంటుంది. ఒకానొక సందర్భంలో రాజాజ్ఞను ధిక్కరించిన లక్ష్మణునికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. చట్టం ముందు తనవారు పరాయివారని ఉండదు. అది అందరికీ సమానం. దాని పని అది చేయవలసిందే. రామరాజ్యమంటే నీతి నిజాయితీలతో కూడిన ప్రజానురంజకమైన పరిపాలన. అది ఆదర్శం కావాలి. అందుకే మనం రామరాజ్యం కోరుకోవాలి.


ముగింపు
శ్రీరామునికి గుడి కడుతున్నాం. కట్టాల్సిందే తప్పులేదు. ఎందుకు కట్టాలి? ఆయన సద్గుణములు, ఆదర్శము రాశిపోసిన మానవమూర్తి కాబట్టి. రామాలయం అనగానే రాముని మూర్తి, ఆయన గుణములు ప్రజల మనస్సులోకి రావాలి. అందుకోసం విగ్రహ ప్రతిష్ఠలు. గుడి గోపురాల నిర్మాణం చేయడం భారతీయ సంప్రదాయంగా నెలకొన్నది. దుష్టత్వానికి, దుర్మార్గానికి ప్రతీకలైన వాటికి ఈ భూమిమీద ఆదరణ లేదు. అలాగే ప్రపంచంలో ఏ దేశమూ చెడును ప్రోత్సహించకూడదు. పోషించకూడదు కూడ.
అయితే గుళ్లు, గోపురాలు కట్టి పూజలు చేస్తుంటే సరిపోదు. పూజ చేస్తున్న సమయంలో ఆ సద్గుణాలన్నీ మదిలో మెదులుతుండాలి. రామోభూత్వా రామం యజేత్. రాముడిని పూజిస్తున్నామంటే తాము కూడ అంతటి ఉన్నతులు కావడానికి ప్రయత్నించాలి. ప్రతి మనిషీ రాముడు కావాలి. ప్రతి అణువూ రామతత్త్వమే. అంటే ధర్మతత్త్వమే. మానవత్వమే ధర్మం. అదే దైవము. అదే భారతీయము. అదే హైందవము. సనాతనము కూడ.
రామ కళ్యాణము చేస్తున్నారు, చేయాలి. కళ్యాణము శుభప్రదము. సమాజానికి శుభం కలగాలనే ఆకాంక్షతో కళ్యాణం చేయాలి. శ్రీరాముడు ఏ భేదాలు, వైషమ్యాలు లేని సమరసతా, సమైక్యతా బాటలో నడిచి- మనకు బాట చూపించాడు. అంటరానితనం వంటి దురాచారాలను నిర్మూలించుకుంటూ, కుల విభేదాలను తొలగించుకుంటూ, సంపూర్ణ భారతీయ సమాజం సామూహికంగా రామకళ్యాణం జరుపుకోవడమే జాతికి శ్రేయస్సు.
*
భర్తగా ఆదర్శం
ముందు తరాలకు కూడ సీతారాము ల దాంపత్య జీవనం ఆదర్శంగా ఉంటుందనడంలో ఎలాంటి విప్రతిపత్తి లేదు. రాముడు వనవాసానికి వెడుతూ సీతను వెంట రమ్మని చెప్పలేదు. అయినా కష్టసుఖాలు పంచుకోవాలని భావించి భర్త వెంట వెళ్లింది. సీతాదేవి రావణాపహృతయైన తరువాత- తన అనాలోచిత పనికి తనను తాను నిందించుకున్నది కాని రాముని పరుషవాక్కులతో తూలనాడలేదు. తన అగ్నిప్రవేశ సమయంలో గాని, అడవిలో విడిచిపెట్టిన సమయంలో గాని భర్త యశస్సు గురించి, ప్రజారంజకమైన పరిపాలన, ప్రజల సుఖసంతోషాలను గురించి ఆలోచించి సహకరించింది గాని కుటుంబాన్ని బజారుపాలు చేసుకోలేదు. రాముడికి కూడ సీతపట్ల అవ్యాజ ప్రేమ. అందుకే సీతాపహరణ తరువాత ఆమె జాడ కోసం రాముడు చేయని ప్రయత్నం లేదు. అదీ కుటుంబమంటే.
-డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం 











No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list