MohanPublications Print Books Price List clik Here MohanBookList

లక్ష్య సాధన_Nirvana means goal


లక్ష్య సాధన Nirvana means goal AchieveingGoal HowtoAchieveGoal AchieveingAim AimToAchieve BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Eenadu Sunday Eenadu Antaryami Eenadu Sunday Magazine Sunday Magazine

లక్ష్య సాధనలక్ష్యం నిర్ణయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అక్కడకు చేరుకోవడమే కష్టం. మనిషి అంతరంగం దృఢంగా ఉంటే- ఏదో ఒక మార్గంలో, ఎప్పుడో ఒకప్పుడు నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవచ్చు. త్యాగం లేనిదే ఎవరూ ఏ గొప్ప కార్యాన్నీ సాధించలేరు. ప్రపంచాన్ని హాలాహలం బారి నుంచి రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన దేహాన్ని కష్టపెట్టుకొని ‘గరళ కంఠుడు’ కావాల్సి వచ్చింది.

నన్నయకు భారతాంధ్రీకరణ, చిన్నయసూరికి బాలవ్యాకరణ రచన లక్ష్యాలు. తొలి తెలుగు మహాకావ్యకర్తగా నన్నయ పొందిన కీర్తి అనంతం. లక్ష్యాన్ని సిద్ధింపజేసుకున్న రుషిగా ఆయన, అందరి హృదయాల్లోనూ శాశ్వతంగా నిలిచి ఉంటాడు. బాలవ్యాకరణం అనే దీపాన్ని వెలిగించి, కొండంత వెలుగును ప్రసాదించిన చిన్నయసూరి తన గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలిగాడు. వ్యాకరణకర్తగా అజరామర ఖ్యాతి పొందాడు.

ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే- గొప్ప పట్టుదల, అకుంఠిత దీక్ష అవసరమవుతాయి. అటువంటివారే ‘నేను సముద్రాన్నీ తాగేస్తాను’ అని ధైర్యంగా పలకగలరు. ‘నా ఆజ్ఞకు పర్వతాలూ కదిలి వస్తాయి’ అని చెప్పగల ధైర్య స్థైర్యాలు, శక్తిసామర్థ్యాలు ఉంటాయి. వారికి లక్ష్యసిద్ధి తప్పక కలుగుతుంది. అటువంటి ఆదర్శ మహాపురుషుల్లో ఆంజనేయుడు ప్రథమగణ్యుడు. ఆయన కార్యదీక్ష అనుపమానం. శ్రీరాముడి ఆనతిని శిరసా వహించి సముద్రాన్ని లంఘించాడు. హనుమ బుద్ధి, వివేకం అసామాన్యమైనవి. అవి అందరికీ ఆశ్చర్యకరాలు. ‘సేవ’ అనే ఉన్నతత్వమే ఆయనను ముందుకు నడిపింది. ప్రభువు మాట తలదాల్చడం, అమేయ బలపరాక్రమాలు ఉండీ వినయంతో వ్యవహరించడం హనుమంతుడి విజయ రహస్యాలు.

మహర్షులు ప్రపంచానికి ఒక దివ్యసందేశమిచ్చారు. ‘ఆకాశం నుంచి జలం భూమిపైన పడుతుంది. ఆ నీరు పిల్లకాలువలు, వాగులు, వంకల గుండా సాగి, నదీనదాల తరవాత సముద్రంలోకి చేరుతుంది. అలాగే ప్రపంచంలో వివిధ సంస్కృతులు నెలకొన్నాయి.ఈశ్వరుణ్ని పూజించే రీతులూ పలు విధాలుగా ఉంటాయి. ఎవరు ఏ విధంగా ఆరాధిస్తే, వారిని ఆ విధంగానే భగవంతుడు అనుగ్రహిస్తా’డని భగవద్గీత ఎలుగెత్తి చాటుతోంది.

గమ్యాన్ని చేరే ప్రయత్నంలో ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేనికీ వెరవక, ధీశాలి ముందుకు సాగుతాడు. ఇద్దరు సాధువులు ఓ ఏరు దాటాల్సి వచ్చింది. ఇంతలో అక్కడికి చేరిన ఒక స్త్రీ, తానూ ఏరు ఎలా దాటాలా అని చింతించసాగింది. వారిని చూసి ‘అయ్యా! మీరు సాయం చేస్తే, నేను కూడా దీన్ని దాటగలను. కనికరం చూపండి’ అని అర్థించింది. వారిలో ఒక సాధువు దయ చూపాడు. ఎంతో శ్రమించి ఆమెను ఏరు దాటించాడు.

రెండో సాధువుకు ఆ పని ఏ మాత్రం నచ్చలేదు. ‘అలా భుజాలమీద మోయడం తప్పు’ అని విమర్శించసాగాడు. అప్పుడు మొదటి సాధువు ‘మిత్రమా! ఆమె నా మాతృమూర్తి అనే భావనతో భుజాలపై మోశాను. ఏరు దాటించడం, ఆమె వెళ్లిపోవడం అంతా జరిగిపోయింది. నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నావు...మరవలేకపోతున్నావు. మన లక్ష్యమేదో, ఎటువైపు వెళ్లాలో అది మాత్రం మరిచిపోయావు. ఒక్కసారి గమ్యాన్ని గుర్తుకు తెచ్చుకో. దానిపైనే మనసుపెట్టి ప్రయాణం సాగించు’ అని హితవు పలికాడు.

హరిశ్చంద్రుడి లక్ష్యం- సత్యం. ఆ వ్రతంలో ఆయన, తనకు ఎదురైన అన్ని ఆటంకాల్నీ దాటిపోయాడు. కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా బెదరలేదు. పట్టు విడవకుండా సత్యవ్రత యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేసి, దేవతల మెప్పు పొందాడు.

తాను అన్నం తినేటప్పుడు, ఆకలితో ఎవరు వచ్చినా ముందు ఆ అతిథికి పెట్టడం ఓ వ్యక్తి లక్ష్యం. ఒకసారి అతడి వద్ద కొంత ఆహారమే మిగిలింది. ఇంటిల్లపాదీ దాంతోనే సర్దుకుపోవాల్సిన స్థితి! ఇంతలో అతిథి రానేవచ్చాడు. ఆయనకు తన భాగాన్ని ఇచ్చాడా వ్యక్తి! అతిథికి ఆకలి తీరలేదు. భార్య తన భాగం అందించింది. కుటుంబంలోని ఇతర సభ్యులూ తమ ఆహార భాగాల్ని అతిథికి ఇచ్చేశారు. ఆ వచ్చింది ఎవరో కాదు- ధర్మదేవత! ఆ కుటుంబమంతటికీ వరాలిచ్చింది. అతిథికి అన్నంపెట్టడమన్న లక్ష్యమే వారికి ఎంతో ఉన్నతి కలిగించింది. మోక్షం అంటే లక్ష్యసాధనే!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం