MohanPublications Print Books Online store clik Here Devullu.com

మాతృదేవత(1969) చిత్రంలోని "మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ_Maanavajaathi Manugadake Pranam Posindhi Maguva - Mathrudevatha (1969) - P.Susheela, B.Vasantha

మాతృదేవత(1969) చిత్రంలోని "మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ_Maanavajaathi Manugadake Pranam Posindhi Maguva - Mathrudevatha (1969) - P.Susheela, B.Vasantha

స్త్రీశక్తిని చూపిన పాట...

    మాతృదేవత(1969) చిత్రంలోని "మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" పాట పాట గురించి: గాయని - పి.సుశీల, బి.వసంత రచయిత - సి.నారాయణ రెడ్డి సంగీతం - కె.వి.మహదేవన్ చిత్రం గురించి: దర్శకత్వం - సావిత్రి నటీనటులు - సావిత్రి, ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు, చంద్రకళ, నాగభూషణం, రేలంగి, హేమలత, బేబిరాణి, రాజబాబు, మంజుల, సురభి బాలసరస్వతి, విజయలలిత, సాక్షి రంగారావు నిర్మాతలు - అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌‌ "Maanavajaathi Manugadake Pranam Posindhi Maguva" song from the film Mathrudevatha (1969). About the Song: Singer - P.Susheela, B.Vasantha Lyrics - C.Narayana Reddy Music - K.V.Mahadevan About the Film: Director - Savitri Starring - Savitri, N.T.RamaRao, Shobhanbabu, Chandrakala and others



అమ్మ (సావిత్రి) దర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ చిత్రంలో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. స్త్రీశక్తిని ప్రతిబింబించే పాట ఇది. ఈ పాటను డా. సి. నారాయణరెడ్డి ఎంతో అందంగా రాశారు. పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా ఉంటాయి. పాటలో ‘మాత్రలు’ (సిలబుల్స్‌) అలా పరుగులు పెడుతుంటాయి. చిన్నప్పుడు ఈ పాటకు నేను డాన్స్‌ చేసేదాన్ని.

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ...’ అంటూ పాట ఎత్తుగడలోనే మహిళ ఎంత శక్తివంతమైనదో వివరించారు సినారె. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో.మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సింపుల్‌గా... స్త్రీ అంటే చెలి, చెల్లి అనేది అందరూ చెబుతారు. ‘తల్లి’ అని సాధారణంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అని చెబుతూనే, ఆమె సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ స్థానాన్ని ఎంతో ఉన్నతంగా చూపారు సినారె.

‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది.రెండవ చరణంలో... ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు.

మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు...’’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం.

అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె.

మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్‌ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ చూపలేదేమో అనిపిస్తుంది.

ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది.
– వైజయంతి

----------------------------------

మామ ఒరవడిలో .. మహిళా విలువలకు పట్టం కడుతూ సాగిన మాతృదేవత లోని మరో ఆణిముత్యం .. ఆకాశవాణి శ్రోతలకు మరొక వీనుల విందు ఈ పాట.. గమనిక .. పాటవిన్నాకనే ఈ మాటలు చదవండి.. ప్రతిపాటకూ సంగీత దర్శకుడు బాణీ కడతాడు.. అది అందరికీ తెలిసిదే .. ఆ ఒరవడి అలా సాగిపొతుంది .. కానీ పాటలో ప్రతి పదాన్నీ విడమరిచి అర్ధం స్ఫురించే విధంగా మాటమాటకూ బాణీ ప్రత్యేకత నిలపటం మామ ప్రత్యేకత .. ఈ పాటకు చెందిన ఒక చరణంలో .. సీతగా ధరణి జాతగా సహన శీలం చాటింది .. అనేచోట ఆయన ఆ పదాలకు అనుసరించిన శైలీ ..మనకు నవనీతం పూసినట్లు వుంటుంది .. గమనించండి.. రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటింది .. అనే పదాలు పలికించేటప్పుడు .. ప్రణయ బాధ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది.. మూడవపదం .. మొల్లగా కవితలల్లగా తేనెజల్లులు కురిసింది .. అన్నప్పుడు వినిపించే వైవిధ్యం నిజంగానే తేనెజల్లు కురిపించలేదూ.. ఇక .. వెంటనే .. పూర్తిగా దిశ మరల్చి .. లక్ష్మిగా ఝాన్సి లక్ష్మిగా సమర రంగాన దూకింది .. అనే రచయిత మనోభావ పదాలు వినపడుతున్నప్పుడే .. సమరనాదం గాయనీమణుల గొంతులో గుదిగుచ్చటం.. ఆయనకే సొంతమేమో.. అలాగే మరో చరణం లో తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరియును ముత్యాల జల్లు .. కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురాసిరులూ .. అనేచోట భావోద్వేగానికి తీవ్రత పెంచి .. కన్నకడుపునా చిచ్చు రగిలెనా .. కరవుల పాలౌను దేశం అని హెచ్చరించేటప్పుడు.. చూపిన వైవిధ్యం . ఆయన సాహిత్యాన్ని ఎంతగా ఆకళింపు చేసుకొని పనిచేస్తాడో తెలుస్తుంది .. ఈవిషయంలో ఆయనకు భావాలు విశదీకరించేందుకు జీవితకాల సహాయకుడిగా పేరొందిన పుహళేంది కూడా చిరస్మరణీయుడే.. అందుకే ఈ పాట ఈన్నిసార్లు విన్నప్పుడైనా నాకు .. మామ ఇది ఒక పాటకు కట్టిన బాణీకాదు .. ఏమాటకు ఆమాటకే కట్టిన బాణీ అనిపిస్తుంది .. అంటే సరే అనగలరా......


savitri yama yamudu









No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list