పోతన భాగవతం తెలుగు
Potana Bhagavatam telugu
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు[ఆధారం కోరబడినది]. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించారు. ఈ భాగవతము మొత్తము తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము.
ఇతఁడు కడుపేదవాఁడు. కృషివలన జీవించువాఁడు. ఇతఁడు బాల్యమున పశువులను మేపుచు తమ ఊరిచేరువను కల కొండమీఁద సంచరించుచు ఉండి తన పురాకృత సుకృతవిశేషము వలన చిదానందుఁడు అను ఒక యోగీశ్వరుని కనుఁగొని ఆమహాత్మునికి నమస్కరించి "స్వామీ మీరెవరో మహాత్ములు అని నాకు తోఁచుచు ఉన్నది. ఇట్టి మహిమ పడయుటకు తగిన ఉపాయమును నాకు ఉపదేశించి నన్ను కడతేర్పుఁడు" అని ప్రార్థించెను. అదివిని ఆయన ఇతఁడు మిక్కిలి బుద్ధిశాలి అని మెచ్చుకొని తారకమంత్రమును ఉపదేశించి పోయెను.
అంతట పోతన గురువు ఉపదేశము చొప్పున నియమముతో తారకమంత్ర జపముచేసి, ఆజపమహిమవలన పరమజ్ఞాన సంపన్నుఁడును మహాకవియును ఆయెను. ఆశ్రమములయందెల్ల గృహస్థాశ్రమము మేలు అయినది అని తలచి, కులశీలవయోరూపముల తనకు తగిన ఒక కన్యకను పరిగ్రహించి, సంతానమును పడసి, లోకోపకారముగా ఒక పురాణమును తెనిఁగింపఁగోరి ఎల్ల పురాణములయందును భాగవతము ఉత్తమము అని విచారించి దానిని తెనిఁగించుచు ఉండఁగా వేమభూపాలుని వద్ద ఆస్థానపండితుఁడును ఇతనికి అనుబంధుఁడును అయిన శ్రీనాథుఁడు ఇతఁడు భాగవతమును తన యేలిన వానికి అంకితముగా చేయింపవలెను అని పల్లకిమీఁద ఎక్కి ఒంటిమిట్ట పొలిమేర చేరరాఁగా అచ్చట దున్నపోతులను కట్టిన అరకను పూని చేను దున్నుచు ఉన్న పోతరాజు కొడుకును ఆచేని గనిమ మీఁద కూర్చుండి భాగవతము వ్రాయుచు ఉన్న పోతరాజును అతనికి కనఁబడిరి.
వారిని చూచి తాను సరస్వతీ ఉపాసకుఁడు కనుక తన మహిమ పోతనకు తెలుపవలెను అని ఎంచి పల్లకి మోచుచు ఉన్న బోయీలను పిలిచి మీరు ఒక ప్రక్క పల్లకి కొమ్మును వదలి రండి అని చెప్పెను. వారు అట్లే చేయఁగా దున్నుచు ఉన్న మల్లన ఒక తట్టుమాత్రము బోయీలు మోపఁగా వచ్చుచు ఉన్న పల్లకిని చూచి "నాయనా ఇదియేమి వింతగా ఉన్నది" అని తండ్రిని అడిగెను. అప్పుడు పోతన "అబ్బీ! నీవును ఒక తట్టు కట్టిన దున్నపోతును విడిచి దున్నుము" అని చెప్ప అతఁడు అట్లుచేసెను. అది చూచి శ్రీనాథుఁడు రెండవ కొమ్మును గూడవదలి పల్లకిని అంతరమున విడువుఁడు అని బోయీలకు ఉత్తరవు చేసెను. అది మల్లన చూచి "నాయనా రెండవతట్టును బోయీలులేక పల్లకి ఉత్తబయల నడచి వచ్చుచు ఉన్నది చూచితివా?" అనెను. "అట్ల అయిన నీవును రెండవదున్నను వదలి దున్నుము" అని చెప్పెను. అతఁడు ఆప్రకారముచేసెను.
అంతట శ్రీనాథుఁడు పోతన ఉన్నచోటికి దాపుగా వచ్చి హాలికులో అని పరిహసించెను. అది విని పోతన "ఉ. బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్, గూళుల కిచ్చి యప్పడుపు కూడుభుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల గౌధ్దాలికులైననేమి నిజదారసుతాదిక పోషణార్థమై."
అని ప్రత్యుత్తరము చెప్పెను. అంతట శ్రీనాథుఁడు పల్లకి దిగివచ్చి పోతనకు నమస్కరించి "బావా నీమహిమ నేనెఱుఁగనా బావమఱఁదులము కనుక కొంచెము మేలము చూపితిని" అనెను. అందులకు పోతనయు సరే అట్లుకాక ఇప్పుడు ఏమివిరుద్ధ ధర్మములు నడచెను అనుచు కొడుకును దుక్కి నిలిపి ఇంటికి పోయి అక్కతో శ్రీనాథకవి మనయింట విందారగింపఁవచ్చెను వేగవంటచేయమని చెప్పుము అని చెప్పిపంపి తానును అతనిని వెంటఁబెట్టుకొని తన కుటీరమునకు పోయెను.
ఇట్లు శ్రీనాథుఁడు పోతన ఇంటికి పోయి మిక్కిలి శిథిలమై సంకుచితమై ఉన్న ఆపూరియింటిని చూచి "బావా మహానుభావుఁడవు అగు నీవు ఈగుడిసెలో ఉండి ఈ పేదఱికమును అనుభవింపనేల ఎవరినేని గొప్ప రాజులను ఆశ్రయించి సంపదలు పడయరావా" అని పలికెను. ఇంతలో వంట అయినది స్నానమునకు యత్నము చేయుఁడు అని మల్లన వచ్చి చెప్పెను. అంత ఆయిరువురును స్నానముచేసి తమతమ అనుష్ఠానములు జరపుకొని భోజనము చేయ పోయిరి. అప్పుడు మనుష్య స్త్రీరూపము ధరియించి పోతనకు కూఁతురు అను పేర అతనియింట మెలఁగుచు ఉన్న సరస్వతీదేవి పళ్లెరమున అన్నమును కొనివచ్చి విస్తళ్లలో వడ్డించుచు కన్నుల నీళ్లు రాల్చెను. అది చూచి పోతన
"ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చెదో, కైటభరాజుమర్దనుని గాదిలికోడల యోమదంబ యో, హాటక గర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ"
అని చెప్పెను. అది విని ఆమె శోకము మాని సర్వపదార్థములు వడ్డింపఁగా భోజనముచేసి తగనమర్యాదతో పోతరాజు పంపఁగా శ్రీనాథుఁడు తానేమి చెప్పుటకును ఎడములేక తన వచ్చినదారిని పోయెను.
ఇట్లు పరమ వైరాగ్యపరుఁడై రామాంకితముగ భాగవతమును సమగ్రముగా తెనిఁగించి ముక్తుఁడు అయ్యెను. ఇదికాక వీరభద్రవిజయము అను దక్షాధ్వర ధ్వంసకథ ఒకటి ఈయన రచించినట్టు తెలియవచ్చుచు ఉంది. అది మాత్రము నరాంకితము చేయఁబడి ఉంది. అందులకు కారణము తెలిసినది కాదు. ఇతఁడు శాలివాహన శకము వేయిని మున్నూఱు అగుకాలమున జనియించినవాఁడు.
పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారములో ఉన్నాయి. పోతన వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.
పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.
మహాభాగవతం
భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.
ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది.
శ్రుతి-స్మృతి-పురాణం
శ్రుతి (వేదం), స్మృతి (ధర్మశాస్త్రం), పురాణం... ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. ఈ మూడింటిలోనూ చెప్పిన విషయం ఒకటే. కానీ తెలుసుకునేవారి స్థాయిని బట్టి చెప్పే తీరు మారుతుంది.
శ్రుతి చెప్పిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, అది చిరకాలం జ్ఞాపకం ఉండేట్లుగా భూతద్దంలో చూపించినట్లు విస్తారమైన వివరణ ఇస్తుంది స్మృతి.
స్మృతి చెప్పిన విషయాలను మరింత సరళతరం చేసి అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతాయి పురాణాలు. వేదవాఙ్మయం అత్యంత ప్రాచీనమైంది. వాటిని సృష్టించినవారు మానవులు కాదు (అపౌరుషేయాలు). కాబట్టి సంస్కృతి-ప్రవర్తన, నడక-నడత, జీవనవిధానం, విజ్ఞానం-వినాశనం, పురోగమనం-తిరోగమనం... లాంటి ఎన్నో విషయాలపట్ల కచ్చితమైన స్పృహ కలిగేటట్లు చేస్తాయవి. వాటిని చదవడానికి, అర్థం చేసుకోవడానికి విద్య, పరిజ్ఞానం, ఆసక్తి లాంటివి ఎక్కువ మోతాదులో ఉండాలి. చాలామందికి అవి సరిపోయినంత ఉండకపోవచ్చు. అందువల్ల వాటి ప్రయోజనం నెరవేరడానికి అవకాశం తక్కువ కావచ్చు.
ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి వేదాల సారాన్నంతా ధర్మశాస్త్రాల రూపంలోకి మార్చి చెప్పారు మహర్షులు. ఆ విషయాలనే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాసినవి పురాణాలు. పురాణం అంటే పూర్వం (ఇంతకుముందు) జరిగిన విషయం అని ఒక అర్థం.
పురుషార్థాలను సాధించడానికి, ఏది ధర్మం-ఏది అధర్మం... అనే స్పృహ కలిగించడానికి పురాణజ్ఞానం ఎంతైనా అవసరమని ఆర్యోక్తి.
‘పురాపి నవం’ (పాతదైనప్పటికీ కొత్తది) అని పురాణ పదానికి నిర్వచనం. అంటే ఎప్పుడో చెప్పినప్పటికీ ఇప్పటికీ ఉపయోగకరంగా ఉంటుందని భావం. అంటే ఏ కాలానికైనా సరిపోయే విషయాలు కలిగి ఉంటాయి అని అర్థం. అలాంటి పురాణాలు పద్దెనిమిది.
అవి- భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ, విష్ణు, వరాహ, వామన, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు. వీటితోపాటు అదే సంఖ్యలో ఉప పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాసుడు రచించాడని ప్రసిద్ధి.
జీవుడు ఏ శరీరం పొందాడు, ఈ శరీరంతో ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాడు? సన్మార్గంలో పయనిస్తే ఏం జరుగుతుంది లేకపోతే పరిణామాలు, వాటికి నివారణోపాయాలు ఏమిటి? ఏం చేస్తే ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తాడు? మళ్ళీ ఎలాంటి శరీరాన్ని పొందుతాడు? ఏం చేస్తే ఈ శరీర సంస్కారాలు (మంచి, చెడులు) అవతలి శరీరంలోకి వెళ్తాయి? మళ్ళీ ఆ సంస్కారం పోగొట్టుకోవడానికి లేదానిలబెట్టుకోవడానికి ఎలాంటి సాధన చెయ్యాలి? చేసిన పాపపుణ్యాలకు వాళ్ళు ఉత్తర జన్మల్లో ఏ శరీరం పొందుతారు? ఆ జన్మలో తరించిపోతారా? లేక ఇంకా జన్మలు ఎత్తవలసి ఉందా? ఇప్పటికీ ఏదైనా జన్మ వాసనా బలం వారిని వెంటాడుతూ ఉందా? ఉంటే అది ఎలా తొలగిపోతుంది...చివరిగా పరమేశ్వరుడిలో లీనమైపోవడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది? ఇటువంటి విషయాలను పురాణాలు వివరిస్తాయి.
అలాంటి పురాణాల్లో భాగవతాన్ని మొదటిదానిగా పేర్కొన్నారు. దానికి గల కారణాన్ని పరిశీలిస్తే- ఇందులో చెప్పిన విషయాలు, కథలు, విశేషాలు మొదలైనవన్నీ భక్తి, జ్ఞాన, వైరాగ్యభరితాలే. వాటితోపాటు చతుర్విధ పురుషార్థాల్లోని ధర్మార్థకామాలను నిర్వర్తిస్తూ మోక్షప్రాప్తికి మార్గం చూపేవి. ఈ మూడింటినీ వివరించి ఎవరు ఏ మార్గంలో పయనించాలో నిర్ణయించుకునే స్వాతంత్య్రాన్ని వారివారి బుద్ధికుశలతకే వదిలేసి స్వేచ్ఛనిచ్చింది భాగవతం. అందుకే అది ఎక్కువ మంది చదివే పురాణం, అందునా వాటిలో మొదటిదైంది!
- అయ్యగారి శ్రీనివాసరావు
Great job
ReplyDelete