కృష్ణ శక్తి
భక్తి, ప్రేమ నిండిన ఆరాధకులకు శ్రీకృష్ణ తత్వం బోధపడుతుంది. ఆయన లీల మధురామృతం, శక్తి అనంతం. మహావిష్ణువు ధరించిన రామావతారం మానవుడు ఎలా మెలగాలో ప్రస్ఫుటం చేస్తుంది. అందులో ఎటువంటి మహిమలూ ఉండవు. కృష్ణావతారం ఆది నుంచీ లీలల మయం.
మానవాళికి ఆయన మహోపదేశాల్ని ప్రసాదించాడు. జీవన ప్రస్థానంలో మానవుడు ఎప్పుడైనా స్తబ్ధుడైనప్పుడు- అతణ్ని తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ని చేయగలిగేది, నరనరాల్లోనూ ఉత్తేజాన్ని నింపేది కృష్ణ ప్రబోధమే!
కృష్ణభక్తిని రాధ ఆస్వాదించింది. అటువంటి నిష్కళంక ప్రేమకు మాత్రమే వశమవుతానని ఆయన నిరూపించాడు. తనను సేవించేందుకు పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) చాలునన్నాడు.సఖ్య భక్తిమార్గంలో సదా తనను స్మరించే కిరీటిని విజయుణ్ని చేశాడా భగవానుడు! గీతోపదేశంతో కటాక్షించాడు. పరమాత్మ మూలతత్వాన్ని మురళీ గాన ప్రియత్వం ద్వారా గోప గోపికా జనావళికి తేటతెల్లం చేశాడు.
విస్తృతంగా, రసపూర్ణంగా ఉండే మురళీకృష్ణ గాథ లోకానికి బాహ్యాంతర సౌందర్యాల్ని వివరించే వేదాంత గ్రంథం. శ్రీకృష్ణ సౌందర్యాన్ని, అవతార ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం అంటే- అనంతశక్తిని ఆవాహన చేయడమే!
కవిరాజు జయదేవ ‘గీతగోవిందం’, లీలాశుకుడి ‘శ్రీకృష్ణ కర్ణామృతం’, నారాయణ తీర్థులవారి ‘లీలా తరంగిణి’- నీలమేఘ శ్యాముడి వైభవాన్ని అపూర్వంగా వర్ణించాయి. రాధాకృష్ణుల ప్రణయ ప్రపంచాన్ని జయదేవ కవి ‘అష్టపదులు’ మనోహరంగా విశదీకరించాయి.
రాక్షస మాయలన్నింటినీ ఛేదించి, నందగోకులాన్ని సంరక్షించి, అందరినీ సంఘటితపరచి, వాస్తవిక దృక్పథాన్ని చాటిన దార్శనికుడు శ్రీకృష్ణుడు. జీవకోటిని పెంచి పోషిస్తున్న ప్రకృతినీ అర్చించాలని బోధించిన మార్గ నిర్దేశకుడు. ఆయన గోవర్ధన గిరిని ఎత్తే ఘట్టం ఈ సత్యాన్ని వెల్లడిస్తుంది.
కృష్ణుడు యశోదాదేవి ఇంట పెరిగాడు. బాల్యదశలోని మాధుర్యాన్ని లోకానికి చాటిచెప్పాడు. ఆయన ఎక్కడ ఉంటే- అదే బృందావనం, అదే యమునా తీరం, అదే మహదానందం. దాన్ని పొందగోరేవారికి భక్తి ఒక్కటే మార్గం. ఆనందాన్ని అందరికీ పంచేవాడాయన. తనను విశ్వసించినవారిని కాపాడే కారుణ్యమూర్తి.
తాను విశ్వం అంతటా నిండి ఉన్నానన్న సత్యాన్ని తల్లికి ఎరుకపరచాడు. మట్టి తిన్న నోటిలో విశ్వాన్ని చూపిన విరాట్ స్వరూపుడు.
నిష్కామ భక్తికి దాసుడు కృష్ణ భగవానుడు. మధురలో తన ప్రతిమను నిత్యమూ పూలదండలతో పూజించే సుదాముడి ఆతిథ్యాన్ని స్వీకరించి అనుగ్రహించాడు.స్నేహబంధం అంతరాలను పాటించదని, ఆ మధురిమ కలిమి లేములకు అతీతమైనదని కుచేలోపాఖ్యానం చెబుతుంది.
మహాభారత గాథ మొత్తం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. అన్నింటికీ ఆద్యంతాలు ఆయనే. కథను నడిపిన నాయకుడు. ఎందరినో ప్రభావితం చేసిన రాజనీతిజ్ఞుడు. పాండవ పక్షాన రక్షణ కోటగా నిలిచాడు. కృష్ణ ‘భగవద్గీత’ అందరి వ్యక్తిత్వ ఉన్నతికీ ఉపయుక్తమయ్యే దివ్య ప్రబోధిని. అది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను పెంచి; ఆధ్యాత్మికతను పంచిన వికాస వాహిని.
www.MohanPublications.com
ఎవరి వల్ల ఏది ఎలా జరగాలో అలా జరిపించాడు కృష్ణ భగవానుడు. అవతార ధర్మాన్ని పాటించాడు.ఆయనది ఓ దివ్య పురుషుడి చరిత్ర. ధర్మ, కర్మ, నీతి శాస్త్రాలకు అది నిలువెత్తు దర్పణం!
- దానం శివప్రసాదరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565