MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

శ్రీలక్ష్మీనరసింహస్వామి_ఆలయ_మోర్జంపాడు_LakshmiNarasimhaswamy_Morjampadu


LakshmiNarasimhaswamy_Morjampadu bhaktipustakalu

పల్నాడులో తిరునాళ్ల వేడుక!

ఏడాదిలో ఆ రెండు రోజులూ పల్నాడువాసులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే, భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ఆ రోజుల్లో ఘనంగా తిరునాళ్లు నిర్వహిస్తారిక్కడ. అసలు పేరు కంటే తిరునాళ్ల గ్రామంగానే ప్రసిద్ధి చెందిన మోర్జంపాడులో వెలసిన ఆ భక్తవత్సలుడు స్మరించినంతనే మనోభీష్టాలను నెరవేరుస్తాడన్నది భక్తుల విశ్వాసం. 

లోకకళ్యాణం కోసం ఆ శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఉగ్రనారసింహుని అవతారం అత్యంత శ్రేష్ఠమైనది. పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం స్వామి ఉగ్రస్వరూపుడై స్తంభంలోంచి ఆవిర్భవించి, హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. అనంతరం ఆ భక్తుని ప్రార్థనతో శాంతించిన దేవదేవుడు లక్ష్మీనరసింహుడిగా, నమ్మిన భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.

ఆ స్వామి కొలువైన క్షేత్రాల్లో మోర్జంపాడు ఒకటి. తిరునాళ్ల గ్రామంగా ప్రసిద్ధిచెందిన ఆ ఊరు గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఉంది. ఇక్కడ నెలవైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో (ఈ ఏడాది జనవరి 25న స్వామి సేవ, 26న కళ్యాణం) నిర్వహించే తిరునాళ్లకు ఈ ఊరు నెల రోజుల ముందు నుంచీ ముస్తాబైపోతుంది. తిరునాళ్ల సమయంలో పరిసర గ్రామాలనుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నరసింహస్వామి కళ్యాణాన్ని చూసి పరవశిస్తారు. ఇక్కడ కొలువైన ఆ లక్ష్మీపతి ఆర్తితో కొలిచిన వారి కోర్కెలు తప్పక తీరుస్తాడని ప్రతీతి. అందుకే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి తరలివచ్చి స్వామికి మొక్కుబడులు చెల్లిస్తారు. తిరునాళ్లను నిర్వహించే ఆ రెండు రోజులూ ఈ గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉత్సవశోభను సంతరించుకుంటుంది.

మొదట రాతిపలకే... 
రెండు రోజులపాటు నిర్వహించే ఈ తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మోర్జంపాడుకు సమీపంలోని తుమ్మలచెరువులో 400 ఏళ్ల కిందట ధన్‌జీ నాయక్‌, ఆయన భార్య లక్ష్మీదేవి నివసించేవారు. వాళ్లకు పెళ్లయ్యి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. పిల్లలకోసం ఆ దంపతులు మొక్కని మొక్కూ, చేయని పూజా లేదు. ఒకరోజు ధన్‌జీ నాయక్‌కి సాక్షాత్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామే కలలో దర్శనమిచ్చి, గ్రామానికి వచ్చే మార్గంలో తాను యంత్రం రూపంలో ఉన్నాననీ, దాన్ని తీసుకొచ్చి పూజలు చేయమనీ ఆజ్ఞాపించాడట. మెలకువ వచ్చిన అనంతరం ఆ స్వప్న వృత్తాంతాన్ని భార్యకూ ఊరివారికీ చెప్పగా, అందరూ కలసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికో మూట కనిపించింది. విప్పి చూస్తే అందులో రాతి యంత్రం ఉంది. భద్రంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే వీరికి సంతానం సిద్ధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏటా మాఘమాసంలో ఆ నరసింహస్వామికి రెండురోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అంతేకాదు, తరతరాలుగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులే స్వామికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆ స్వామిని ఆర్తితో పిలిస్తే పలకడమే కాదు సంతానం లేనివారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. దాంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మొదట కేవలం యంత్రం మాత్రమే ఉండే ఈ ప్రదేశంలో తొంభయ్యో దశకంలో ఓ ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి, నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శనివారం సందడి వాతావరణం నెలకొంటుంది. ఆ రోజు ఉదయం నుంచే భజనలూ, ప్రత్యేక పూజలూ ప్రారంభమవుతాయి. శనివారం నిర్వహించే స్వామివారి కళ్యాణం విశేషమైనదని భక్తుల విశ్వాసం.

రాష్ట్రస్థాయి పోటీలు 
ఈ తిరునాళ్లకు మరో విశేషం కూడా ఉంది. అవే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎడ్ల పందాలు. ఇందులో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ పెద్దసంఖ్యలో ఎద్దులను ముస్తాబు చేసి, ఇక్కడికి తీసుకువస్తారు. వీటిలో గెలవడానికి ఎద్దులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడానికే కాకుండా చూడటానికి కూడా భారీగానే జనం హాజరవుతారు.

ఇలా చేరుకోవచ్చు 
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లేదారిలో పిడుగురాళ్ల వద్ద దిగి అక్కడి నుంచి ఆటో, బస్సు ద్వారా ఇక్కడికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి పిడుగురాళ్ల, మాచర్ల బస్సు ఎక్కి పిడుగురాళ్లలో దిగి వెళ్లవచ్చు. రైలు మార్గమైతే పిడుగురాళ్ల స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 
ఆలయానికి చేరుకోవచ్చు.       - డి.నాగేష్‌బాబు, ఈనాడు, గుంటూరు 


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం