అయ్యప్ప 18 మెట్ల కథ
గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులూ, దిగే భక్తులూ మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచీ దీనికి ‘పొన్ను పదునెట్టాంబడి’గా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు.
1998లో, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్ మాల్య ఇచ్చిన మూడున్నర కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు. అప్పుడే ఆలయానికి ఉత్తర, దక్షిణ గోడల మీద సుమారు పదహారు చదరపుటడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు. గర్భగుడి ప్రధాన ద్వారానికీ, తలుపులకూ, హుండీకీ కూడా బంగారు పూత పూయించారు.
అరిగిపోయిన పద్ధెనిమిది మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్యే చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పులా రేకులు అమర్చారు. ఈ మెట్లు అయిదడుగుల పొడవు, తొమ్మిది అంగుళాల వెడల్పు, ఒకటిన్నర అడుగుల మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి రెండువైపులా పోలీసులుంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలినవారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు.
అయ్యప్ప వాహనం పులి కాదా?
అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు. పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు.
18అయ్యప్ప మెట్ల కథ
శబరిమల అయ్యప్పస్వామి దీక్షలో ‘పదునెట్టాంబడి’ (పద్ధెనిమిది మెట్ల)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ మెట్లను ఎక్కి, స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు! పవిత్రమైన ఆ మెట్ల వెనుక ఎంతో కథ ఉంది..
శబరిగిరి శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న పద్ధెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ లేదా ‘పదునెట్టు త్రిపాడికల్’ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికే ప్రతి భక్తుడూ విధిగా మండల దీక్ష (41 రోజులు) తీసుకుంటారు. ఈ మెట్లు అఖండ సాలగ్రామ శిలతో, పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని ‘పరశురామ క్షేత్రం’ అని కూడా అంటారు. ఈ మెట్లు మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీక.
ఆ 18 మెట్లు ఎందుకంటే ...
అసలు ఈ పద్ధెనిమిది మెట్లు ఎందుకున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్న సహజమైనదే. హరిహరసుతుడైన అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తరువాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం- దేవతా రూపాలు దాల్చి పద్ధెనిమిది మెట్లుగా అమరాయనీ, అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారనీ చెబుతారు. పట్టబంధాసనంలో ఆయన కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చారనీ, యోగసమాధిలోకి వెళ్ళి, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారనీ పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని ‘సన్నిధానం’ అని వ్యవహరిస్తారు.
మెట్టుకో దేవత!
అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ 41 రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్ష పాటించాలి. ఇరుముడి కట్టుకొని (స్వామివారి నెయ్యాభిషేకానికి అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి) మాత్రమే ‘పడి’ని ఎక్కాలి. ‘పదునెట్టాంబడి’ గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి...
పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు: 1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి
వదిలేయాల్సింది వీటినే!
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద... ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు. అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు.
ఆ మాయోపాయాలు ఏమిటంటే: 1.అష్ట రాగాలు- కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దర్పం, అహంకారం 2. పంచేంద్రియాలు- కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 3. త్రిగుణాలు సత్వ గుణం, రజో గుణం, తమో గుణం 4.సంస్కార రాహిత్యం... అంటే మంచి నడవడిక లేకపోవడం 5.చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం.
18 మెట్ల పేర్లేమిటంటే...
ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అవి: 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక
అయ్యప్ప విడిచిన అస్త్రాలు
అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. ఆ అస్త్రాలు: 1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం
పద్ధెనిమిది కొండలు
శబరిగిరి చుట్టూ ఉన్న 18 కొండలకు ఈ మెట్లు ప్రతీకలంటారు. అవి: 1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల
పవిత్ర ఆహుతి
‘పడి’కి ముందు భాగంలోని పవిత్ర ‘ఆహుతి’ సుమారు 70 రోజుల పాటు (ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకూ) అఖండంగా మండుతూనే ఉంటుంది.
ముద్ర టెంకాయలు (స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు) పగులగొట్టి, నెయ్యిని స్వామివారికీ, కొబ్బరి చిప్పలను ఈ ఆహుతికి సమర్పిస్తారు. ఇటువంటి పవిత్ర ఆహుతి మరే ఇతర దేవాలయాల్లోనూ లేదు. అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవదర్శనం చేసుకొనే ఆలయం కూడా మరొకటి లేదు.
విగ్రహ పునఃప్రతిష్ఠ
శబరిమలలో పరశురాముడు, పందళరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండూ రాతివే. 1910 మార్చి 27న ప్రభాకరన్ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తరువాత దేవాలయం అగ్నికి ఆహుతైన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952లో మరోసారి అగ్నిప్రమాదంలో విగ్రహం ఆహుతైంది. 1953లో తిరిగి ఒకటిన్నర అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంథరుర్ శంకర్ మేల్ తంత్రి చేతులమీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకు చెందిన అయ్యప్పన్, నీలకంఠన్. హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో, కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్‌లో ప్రతిష్ఠాపన చేశారు.
thanks mohan publications . really great information tq.
ReplyDelete