MohanPublications Print Books Online store clik Here Devullu.com

వసంత_పంచమి_విశిష్టత_VasantaPanchami

VasanthaPanchamiVisistatha VasanthaPanchami Vasant Panchami Lord Saraswathi Lord Saraswati




విద్యాధిదేవత ఉద్భవించిన వేళ...
విద్య, బుద్ధి, జ్ఞానం, వాక్కులకు అధినేత్రి సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం మాఘపంచమి లేదా శ్రీపంచమి. ఈ దినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి విశేష అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది.

సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆమె ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి. 


వసంత పంచమి
మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత, వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది.

వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్‌లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో శ్రీ పంచమి పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు.

ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది.
రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు.

వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది. ‘కృత్యసార సముచ్చయం’ లో వసంత పంచమి గురించిన సమగ్ర విశ్లేషణ ఉంది.

చైత్ర-వైశాఖాల్లో వచ్చే వసంతుడికి మాఘ-ఫాల్గుణ మాసాల్లోనే స్వాగతోపచారాలు మొదలవుతుండటం బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం, వైశిష్ట్యం అందరికీ అవగతమవుతుంది. అంటే, శిశిర రుతువే వసంత రుతువుకు పరమానందంతో స్వాగతం చెబుతోందన్న మాట!
వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది.

సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజిస్తారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు.
వసంత శోభను మహనీయులెందరో హృదయంగమంగా వర్ణించారు. సకల కళామయిగా సరస్వతిని కావ్యాల్లో స్తుతించారు. మార్కండేయ, స్కంద పురాణాలు; ‘ధర్మసింధు’ శ్రీవాణీ స్తుతిని రసరమ్యంగా వెలయించాయి.      - చిమ్మపూడి శ్రీరామమూర్తి

#వసంత_పంచమి_విశిష్టత

సరస్వతీదేవిని మాఘపంచమినాడు  శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.  ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.
మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.

‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list