సద్భావనే శుభాకాంక్ష
కాలగణనలో అనేక పద్ధతులున్నాయి. అవి ఎన్ని ఉన్నా, ప్రధానంగా లెక్కించదగినవి రెండు. ఒకటి- వ్యవహారం, మరొకటి- సంప్రదాయం. దేశ సంప్రదాయ పద్ధతుల్లో సౌరమాన, చాంద్రమాన, బార్హస్పత్యం అనేవి మూడు కాలమానాలు. వాటి ప్రకారమే ఏడాదులు, వాటన్నింటి ప్రారంభ రోజులు, విభిన్న పర్వదినాలను గణించుకుంటాం. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా స్వీకరించిన ‘జనవరి-డిసెంబరు’ కాలగణనను ‘వ్యవహార సంవత్సరం’ అని చెప్పవచ్చు.
సంప్రదాయ వత్సరాదులు ఈ దేశ సంస్కృతికి చెందినవి. కాలమానం అనుసరించి, సంవత్సరారంభాన్ని మహోత్సాహంతో పాటిస్తారు. వీటిని వీడకుండానే వ్యవహార సంవత్సరం మొదటిరోజున శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ అయింది. ఇదే ధోరణిలో అర్ధరాత్రి కేలండర్ మారగానే- కేరింతలు, సందడులు, హడావుడి అనివార్యాలయ్యాయి. హద్దు మీరనంతవరకు వీటిని కాదనలేం. నిత్యవ్యవహారంలో ‘ఉపయోగించుకొనే కేలండర్‌కి తొలినాడు’ ఈ ఏడాది బాగుండాలి అని ఆకాంక్షించడం దోషమేమీ కాదు. ఉత్సాహంగా ఉండటానికి, మంచిని కోరుకోవడానికి ఇదొక అవకాశంగా భావించడం సముచితమే.
ఏ లెక్కన చూసినా- రాబోయే కాలం అనుకూలంగా ఉండాలని ఆశించడం సహజం. భాష ఏదైనా, దేశమేదైనా మానవుడి స్వాభావిక లక్షణమిది. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలవారు, అన్ని భాషలవారు వారి పరంపరను అనుసరించి సంవత్సరంలో ఆది దినాన్ని ప్రధానంగా భావిస్తారు. ఈ రోజు మంచిని భావిస్తే ఏడాది పొడుగునా ఇదే ప్రసరిస్తుందని విశ్వసిస్తారు. ఒక చక్కని పరిణామాన్ని ఆశించడమే ‘ఆశీస్సు’. అది సమానుల నడుమ పంచుకుంటే ‘శుభాకాంక్ష’. పెద్దల ద్వారా లభిస్తే ‘దీవెన’. భగవంతుడి నుంచి పొందితే ‘వరం’. సత్సం కల్పంతో, సహృదయంతో పలికే శుభాకాంక్షల్ని, దీవెనల్ని కాల స్వరూపుడైన భగవంతుడు తన వరాలుగా కురిపించాలని ఆశిద్దాం.
‘ఏడాదిలో జరిగే మార్పులన్నీ మనకు హితం కలిగించాలి’ అనే భావంతో కూడిన మంత్రాలు వేదవాఙ్మయంలో లభిస్తాయి.
‘మేఘాలు సకాలంలో వర్షించుగాక- భూమి సస్యశ్యామలంగా, ఈ దేశమంతా క్షోభ లేకుండా ఉండు గాక/ మనమంతా ద్వేషం లేకుండా ఉందాం- పరస్పరం సౌమనస్యంతో జీవిద్దాం/ అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శుభాలనే అనుభవిస్తుండాలి, ఏ ఒక్కరూ దుఃఖితులు కారాదు’- ఈ భావాలు సనాతన ధర్మాలలోని వేదాలు, పురాణాలు యుగాల క్రితమే పలికిన శుభాకాంక్షలు, దివ్యాశీస్సులు. రుషులు వీటిని మంత్రభాషలో పలికారు. అదే భాషలో అందరూ స్వీకరించి నప్పుడు- అవి కేవలం ఆకాంక్షలుగా కాక, అమోఘమైన దేవభావనలుగా అనుభూతినిస్తాయి.
ధర్మానికి జయం కలుగు గాక , అధర్మం నశించు గాక, ప్రాణులలో సద్భావన నెలకొను గాక- అనే భావాలు మన సంప్రదాయ శుభ కామనలలో కనిపిస్తాయి. కేవలం మానవుల మధ్యనే కాక- ప్రకృతిలో సర్వజీవులలో సద్భావన స్థిరపడాలి, వృద్ధిచెందాలి... అనే విస్తారమైన విశ్వహిత కాంక్ష మన రుషుల వాక్యాల్లో స్పష్టంగా ప్రకాశిస్తోంది. భూమి, అంతరిక్షం, దిక్కులు, ఓషధులు, వాయువు, జలం ...అన్నీ శాంతంగా ఉండాలన్న వేద¿కాంక్ష ఉత్పాతాలు లేని, ప్రకోపాలు లేని ప్రకృతి శాంతిని సంభావిస్తోంది.
ఆదర్శ మానవుణ్ని చిత్రిస్తూ- ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సర్వభూత హితకాంక్షి, కృపాళువు, క్షమాస్వరూపుడు అనే వర్ణనను వాల్మీకి మహర్షి ఆవిష్కరించాడు. సకల లోక హితాన్ని, సర్వప్రాణి క్షేమాన్ని కోరుకొనేవాడు, వాటి కోసం ప్రయత్నించేవాడు పరిపూర్ణుడు. అటువంటి పరిపూర్ణత మానవుడికి ఆదర్శం కావాలన్నదే భారతీయ ఆర్షభావన. ఆ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని శ్రీరామ చంద్రమూర్తిగా ప్రత్యక్షం చేశాడు మహర్షి. మానవులు ఒకరి హితం కోసం ఒకరు ఉండాలి, ప్రకృతి క్షేమం కోరి వ్యవహరించాలి- అనే శుభాశయాన్ని నిరంతరం కొనసాగిద్దాం!
- సామవేదం షణ్ముఖశర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565