పవిత్ర ధామాలు
హిమాలయ పర్వతశ్రేణి ప్రపంచంలో ఒక అద్భుతం. ఈ పుణ్య గిరుల్లో పురాణ ప్రసిద్థమైన నాలుగు పవిత్ర క్షేత్ర-తీర్థాలను చతుర్థాలుగా వ్యవహరిస్తారు. 'చార్‌ధామ్'గా ప్రసిద్ధి చెందిన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బదరీధామం- ఈ నాలుగూ పౌరాణిక వైశిష్ట్యాన్నీ, చారిత్రక ప్రభావాన్నీ వ్యక్తపరుస్తున్నాయి.
యుగయుగాల నుంచి అనేకమంది ఈ నాలుగు ధామాల యాత్రలను భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. బదరీ నుంచి పై మూడు క్షేత్రాలు వైశాఖ శుద్ధ తృతీయ(అక్షయ తృతీయ) నుంచి, ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య వరకు మాత్రమే యాత్రకు అనుకూలం. ఆ తరవాత వీటిలో ప్రవేశానికి అనుమతించరు. ఈ నడిమి కాలంలో దేశం నలువైపులనుంచి ఎందరో యాత్ర చేస్తారు. ఈ యాత్రతో జన్మసాఫల్యం పొందినట్లుగా, చరితార్థత సాధించిన అనుభూతి భారతీయుల అంతరంగంలో పొంగుతుంది.
బదరికా క్షేత్రం శ్రీమహావిష్ణువు తపోభూమిగా పురాణాలు చెబుతున్నాయి. సర్వ విష్ణుక్షేత్ర శక్తి రాశీభూతమైన ఈ పుణ్యప్రాంతంలో నారాయణుడు తపోమూర్తిగా వెలసి ఉన్నాడని స్కాందపురాణ వచనం. ధర్ముడు, మూర్తి అనే దివ్య దంపతులకు తపోఫలంగా నారాయణుడు 'నర, నారాయణ' అనే నామాలతో రెండు మూర్తులుగా అవతరించాడని, ఇందులో నారాయణుడు పూర్ణస్వరూపంగా, నరుడు అంశావతారంగా పురాణాలు వర్ణించాయి. వీరుభయులూ తపోమార్గాన్నీ, జ్ఞానమార్గాన్నీ సముద్ధరణ చేసిన దివ్యావతారాలంటారు. నారాయణుడి తపస్సమయంలో లక్ష్మీదేవి గొప్ప బదరీవృక్షం(రేగుచెట్టు)గా మారి, ఆయనకు నీడపట్టి ఆశ్రయించి ఉన్న కారణంగా ఈ క్షేత్రం బదరీ క్షేత్రమైందని పురాణోక్తి.
నరనారాయణులు శాశ్వతావతారులనీ, సర్వ దివ్య విద్యలకు, రుషులకు ఆశ్రయమూర్తులనీ శాస్త్రాలు చెబుతున్నాయి. గంగానది 'అలకనందా' పేరుతో ప్రవహిస్తున్న పుణ్యప్రవాహ తీరంలో భవ్యమైన నారాయణ మందిరం ఉంది. తపోమూర్తిగా ఉన్న నారాయణ దివ్యవిగ్రహం కాలాంతరంలో నదిలో అదృశ్యమైందని, ఆదిశంకరుల యోగదృష్టికి గోచరమై, తిరిగి ప్రతిష్ఠితమైందని చరిత్ర.
ఈ ఆలయ పరిసరాల్లో, పర్వత శ్రేణుల్లో ఎన్నో తీర్థాలు, తపోధామాలు ఉన్నాయనీ, వాటి మహిమ అపారమనీ ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
పరవళ్ళతో ప్రవహిస్తున్న గంగా నదీతీరంలో ఎన్నో పుణ్యఘట్టాలను పురాణం పేర్కొంది. తపోయోగ శక్తిగా నారాయణుడు కృతయుగం నుంచే అక్కడ నెలకొని, ధ్యాననిష్ఠులకు మాత్రమే హృదయంలో గోచరించేవాడనీ, తరవాత దేవతల ప్రార్థన మేరకు దివ్య శిలామూర్తిగా తన తపోముద్రను ప్రకటిస్తూ ఆవిర్భవించాడనీ 'స్కాందం' చెబుతోంది. ఈ క్షేత్రానికి 'విశాల' అనే నామాంతరం ఉంది. అపరిమితమైన విష్ణుశక్తిని ప్రకటించే ఈ విశాల నామంతో నేటికీ భగవానుని ఎలుగెత్తి కీర్తిస్తారు. 'బదరీ విశాల్' అని ఆ క్షేత్ర పరిసరాలు భక్తుల నినాదాలతో మారుమోగుతుంటాయి. దర్శనమాత్రం చేతనే పాపసంహరణం చేసే ఈ క్షేత్రంలో, స్వామి ప్రసాదానికి గొప్ప మహిమ ఉందని పురాణం వర్ణించింది.
ఇక్కడి ఆలయ సమీపాన బ్రహ్మకపాల తీర్థం ప్రత్యేకమైంది. గయ కంటే ఎనిమిది రెట్లు అధిక ఫలాన్ని ప్రసాదించే ఈ పితృతీర్థాన్ని పురాణాలు బహువిధాల ప్రస్తుతించాయి. దీనితోపాటు అగ్ని తీర్థం ప్రసిద్ధమైంది. ఆలయ సన్నిధిలో ఉన్న పంచశిలలు, పురాణాలు వర్ణించిన విధంగానే నేటికీ గోచరిస్తున్నాయి. నారది, నారసింహి, వారాహి, గారుడి, మార్కండేయ- అని ఆ శిలల పేర్లు. వీటికి ఐతిహ్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ అయిదు శిలల నడుమ గంగను గొప్ప తీర్థంగా అభివర్ణించారు.
నారాయణుడి వూరువు (తొడ) నుంచి ఆవిర్భవించిన వూర్వశీదేవి వ్యక్తమైన తీర్థం- వూర్వశీ తీర్థం. బదరీధామంలో మరో గొప్పతీర్థం- సరస్వతీ తీర్థం. ఒకప్పుడు అసుర శక్తులు వేదాలు అపహరించగా, బ్రహ్మదేవుడు బదరికాశ్రమాన తపస్సు ఆచరించాడనీ, అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంతో అసుర సంహారంచేసి వేదవిద్యను బ్రహ్మకు అనుగ్రహించాడనీ, ఆ వేదాలే ద్రవరూపంలో ఇక్కడ ప్రవహిస్తున్నాయనీ పురాణ ఐతిహ్యం. ఈ ద్రవరూపిణే 'సరస్వతీ తీర్థం'గా పూజలందుకుంటోంది. ఈ పుణ్య ప్రవాహ సమీపంలో మానసోద్భేద తీర్థం ఉంది. దాని సమీపానే 'వ్యాస గుహ' ప్రసిద్ధి. వేదవ్యాసులు ఇక్కడే వేదాలు, పురాణాలు రచించారని చెబుతారు.
ఉన్నత పర్వత శిఖరాల్లో వసుధారా జలపాత తీర్థం మరో విశిష్టత. అష్టవసువుల తపశ్శక్తి ప్రభావంవల్ల ఏర్పడిన ఈ పావన ధారను అద్భుతంగా స్కాంద పురాణం కీర్తించింది. ఈ మార్గం ద్వారానే పాండవులు స్వర్గారోహణ గావించినట్లు భారత వచనం. అనేక దివ్యత్వాలకు ఆలవాలమైన బదరీ విశాల క్షేత్రం ప్రపంచంలోని అన్ని దిశల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. మాటలకందని ఒక దివ్యానుభూతిని, శక్తిని ప్రసరిస్తూనే ఉంది.
- సామవేదం షణ్ముఖ శర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565