ఊరికి పండగొచ్చింది!
అవును... సంక్రాంతి అంటే సొంతూరే! ఆ ఊరి మధుర స్మృతులే!
గూగుల్ సీఈవోకైనా, రిలయెన్స్ అంబానీకైనా, దేశ ప్రధానికైనా, రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ఓ సొంతూరు... ఉంటుంది.
వారి చిరునామాలో అది ఉండకపోవచ్చు.
కానీ మనసులోని మధుర జ్ఞాపకాల అరలో తప్పకుండా ఉంటుంది.
అక్కడ బుడి బుడి నడకలే నడిచి ఉండ వచ్చుగాక...
అక్షరాలు మాత్రమే దిద్ది ఉండవచ్చుగాక...
కానీ ప్రయాణం మొదలెట్టింది అక్కడి నుంచేనని నిర్ద్వందంగా చెబుతారు.
హైదరాబాదైనా, అమెరికా అయినా పుట్టి పెరిగిన ఊరి తర్వాతేనంటారు.
చూడడానికి అది అందరికీ మామూలు ఊరే కావచ్చు.
కానీ ఊరికీ, ఆ ఊరి గడ్డమీద నడిచిన మనుషులకీ మధ్య గల బంధమే ఓ మధురజ్ఞాపకాల పుస్తకం. సంక్రాంతి పండగ... ఆ పుస్తకంలోని పేజీలను తిరగేసే సందర్భం.
అందుకే పండగొస్తే పట్టణం పిల్లాపాపల్ని చంకనేసుకుని పల్లెబాట పడుతుంది.
అంతఘనం ఏముందీ ఆ సొంతూళ్లో అంటే...
తప్పటడుగులేస్తూ దాటిన తొలి గడప ఉంది.
తొలిసారి ఎదురు దెబ్బ తగిలించుకున్న వాకిలి ఉంది.
తొలి అక్షరం దిద్దిన బడి ఉంది.
తొలిసారి దేవుడికి దణ్ణం పెట్టుకున్న గుడి ఉంది.
అవన్నీ ఒక్కసారి చూడాలి. పిల్లలకు చూపించాలి. ఇక్కడి నుంచీ బయల్దేరి అమ్మ హైదరాబాద్ వెళ్లిందనీ... ఇక్కడి నుంచీ బయల్దేరి నాన్న సిలికాన్ వ్యాలీలో సెటిలయ్యాడనీ... పిల్లలకు తెలియాలి. అందుకే శ్రీవారిని ఒప్పించి బయల్దేరడం.
‘ఏముంటుందీ ఆ పల్లెటూళ్లో. బోర్ కొడుతుంది’ అంటుంది కూతురు. ‘వైఫై ఉండదు... టీవీలో ఇంగ్లిష్ ఛానల్స్ రావు...’ బుంగమూతి పెడతాడు కొడుకు. వాళ్లను బ్రతిమాలో బుజ్జగించో చిన్న చిన్న లంచాల ఆశ చూపో ఎలాగైతేనేం బస్సెక్కేస్తే...
సగం నిశ్చింత.
బస్సు చెరువు గట్టు పక్కగా వెళ్తుంటేనే మనసు చెలియలికట్ట తెంచుకుంటుంది. పొలాల మీదుగా వీస్తున్న చల్లని గాలి చెవిలో ఏవేవో ఊసులు చెబుతుంది. మట్టి వాసన మరచిపోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. అప్పుడు... ఒక్కసారి బస్సు దిగి వెళ్లి ఆ నేలను ముద్దాడాలనిపించదూ!
ఇంటింటా పేరంటమే
ఎప్పుడో పాతిక ముప్పయ్యేళ్ల క్రితం... కాలేజీలో చేరడానికి పట్టణానికి తొలి ప్రయాణం కట్టిన రోజు ఇప్పటికీ గుర్తే. ఇరుగు పొరుగు అందరూ పెరట్లో పండిన కూరగాయలూ, వండిన పిండివంటలూ సంచుల్లో పట్టుకొస్తే... మొత్తం హాస్టల్లో ఉన్నవాళ్లందరికీ సరిపోతాయని నవ్వుకోలేదూ. ఎవరినీ నొప్పించకుండా వారు తెచ్చినవి తీసుకుని పేరు పేరునా వారికి వెళ్లొస్తానని చెప్పి బయల్దేరేసరికి మధ్యాహ్నం దాటింది. బస్టాండు దాకా వచ్చి అందరూ ఎన్ని జాగ్రత్తలు చెప్పారనీ! ఆ తర్వాత చదువుకున్నన్నాళ్లూ ఎప్పుడో హఠాత్తుగా ఇలా రావడం అలా వెళ్లిపోవడం తప్ప పదిమందిని నోరారా పలకరించిందే లేదు. ఇక ఉద్యోగంలో చేరాక ఎలా గడిచిపోయాయో ఇరవయ్యేళ్లు.
ఇప్పుడిలా పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్తే అందరూ ఎంత ఆనందిస్తారో.
అటు మూడు తరాలనూ ఇటు మూడు తరాలనూ గుర్తుచేస్తారు. పిల్లలకు ఎవరెవరి పోలికలొచ్చాయో చెబుతారు.
ఊళ్లో పుట్టి పెరిగినవారంతా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ పెద్దలను వెదుక్కుంటూ వస్తుంటే పల్లెకి అంతకన్నా ఏం కావాలి? అప్పుడు ఇంటింటా పేరంటమే. ఊరంతా ఉల్లాసమే. చిన్నప్పుడు ‘ఇవాళ పొలం వెళ్లలేదేమిటి’ అనడిగితే తాతయ్య అనేవారు... ‘పండక్కి మీ బడికి సెలవులు ఇచ్చినట్లే మాకూ దేవుడు సెలవులిచ్చాడు...’ అని. పంట చేతికొచ్చిన ఆనందం ఓ పక్క. అయినవాళ్లంతా వచ్చారన్న సంతోషం మరోపక్క. ఇంటిపట్టునే ఉండి వచ్చిన వారితో బోల్డన్ని కబుర్లు చెప్పేవాడు తాతయ్య.
ముగ్గులూ గొబ్బిళ్లూ
ముద్ద బంతులూ మువ్వ మోతలూ
నట్టింట కాలుపెట్టు పాడిపంటలూ
వెండి ముగ్గులూ పైడికాంతులూ
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ...
బస్సులో టీవీ పెట్టారు. సంక్రాంతి గురించి సినిమా పాట వస్తోంది. ఆ పాటలానే ఆ రోజులు కూడా ఎంత సందడిగా ఉండేవి! సంక్రాంతి నెలపట్టిన దగ్గర్నుంచీ అమ్మమ్మ గీతల ముగ్గులేసేది. ఒక్కో ముగ్గుకీ ఒక్కో కథ చెప్పేది. కార్తికమాసం అయిపోతూనే ధనుర్మాసపు పనులు మొదలు పెట్టేది. ముగ్గుపిండి కొట్టించి ఎండబెట్టేది. అందులో కాస్త సున్నం కలిపేది. ‘పక్షులు తినడానికి బియ్యప్పిండితో ముగ్గు వేస్తారని మా టీచర్ చెప్పింది. నువ్వు దాంట్లో సున్నం కలిపితే పాపం పక్షులకు కడుపునొప్పి రాదూ’
నా సందేహం. ‘అవన్నీ పాతరోజులు. సున్నం కలపనిదే ముగ్గు కర్ర పడదు, రాగి కలపనిదే బంగారం నగ అవదు’ అమ్మమ్మ సమాధానం. పండగ దగ్గరకొచ్చేకొద్దీ వాకిట్లో ముగ్గు విస్తీర్ణం పెరిగేది. అత్తయ్యలూ పిన్నమ్మలూ తోడు వచ్చేవారు. వాకిలంతా పరుచుకున్నట్లున్న ఆ గళ్ల చివర్లలో తలకట్లు కట్టడమూ; ముగ్గు తొక్కకుండా గడి మధ్యలోకి వెళ్లి పసుపూ కుంకుమా, బంతిపూరేకలూ, గొబ్బెమ్మలూ, రేగుపండ్లూ పెట్టడం పిల్లల బాధ్యత.
ఈ ఏడాదైనా పెద్ద ముగ్గేయనివ్వవా అంటూ అమ్మమ్మ దగ్గర గారాలు పోవడం... నిన్న మొన్న జరిగినట్లు అన్పిస్తోంది. పదేళ్లు నిండాకే పిల్లల ముగ్గుల ప్రాక్టీసుకి పెరటి వాకిలి
వదిలేవారు. స్కూల్లో స్నేహితుల దగ్గర కొత్త ముగ్గులు నేర్చుకోవడం, మర్నాడు వాకిట్లో వేయడం, నాది బాగుందంటే కాదు నాది బాగుందంటూ పోట్లాటలూ అలకలూ. పేడతో గొబ్బెమ్మలు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రారని అమ్మమ్మ ముద్దు ముద్దుగా విసుక్కునేది. పేడకళ్లాపి చల్లిన వాకిట్లో తివాచీ పరిచినట్లుగా తెల్లని ముగ్గూ, దాని మీద గొబ్బిళ్లూ, పూలూ, రేగుపళ్లూ... పౌష్యలక్ష్మికి పలికే స్వాగతగీతం. మనోఫలకంపై ముద్రితమైన మరపురాని చిత్రం.
అరిసెల ప్రహసనం
కారపు చెక్కలూ, జంతికల్లాంటి పిండివంటలు చాలావరకూ ఇంట్లోవాళ్లే ఇద్దరు ముగ్గురు కలిసి చేసేసేవారు కానీ అరిసెలకు మాత్రం పెద్ద ప్రహసనమే అయ్యేది. కనీసం నలుగురైనా ఉండాలి. అందుకని ఇరుగూ పొరుగూ మాట్లాడుకుని ఏరోజు ఎవరింట్లో అరిసెలు చేయాలో ముందుగానే అనుకునేవారు. పెద్దవాళ్లు అరిసెలు చేస్తుంటే పిల్లలం చలిమిడి ముద్దలు తీసుకుని పరుగులు పెట్టేవాళ్లం. ‘చేతులు పెట్టకండర్రా, నేను తీసి
పెడతానుగా...’ అనే బామ్మ మాటలు చెవిలో ఇంకా విన్పిస్తూనే ఉన్నాయి. నగరంలోనూ స్వీటుషాపులకి వెళ్తే అరిసెలు దొరుకుతాయి. రుచిగానే ఉంటాయి. కానీ, బామ్మ పెట్టిన
ఆ చలిమిడి రుచీ, వేడి వేడి అరిసెల వాసనా రావు కదా. నాకు చలిమిడి అంటే ఇష్టమని వాయి వాయికీ తీపి చూడమనే వంకతో ఓ చలిమిడి ముద్ద నా చేతిలో పెట్టేది. ఓ పక్క అరిసెలు ఒత్తుతూనే కోడళ్లు అత్తల మీదా, అత్తలు కోడళ్ల మీదా బామ్మకి ఫిర్యాదు
చేయడమూ, బామ్మ వారికి సర్ది చెప్పడమూ, కొత్తగా పెళ్లైన వాళ్ళని సరదాగా ఆటపట్టించడమూ... ఆ ముచ్చలన్నీ ఎక్కడినుంచి వస్తాయి? పొయ్యి వేడికి బామ్మ మొహం మీద చిరుచెమటలూ, మసి చారికలూ,
బోసి నవ్వూ... ఎక్కడ కన్పిస్తాయి?
పండగ అక్కడా ఉంది కానీ...
నగరంలోనూ పండగ చేసుకుంటాం. అన్నయ్యవాళ్ల అపార్ట్‌మెంట్‌లో అందరూ కలిసి ప్రతి పండగనీ సరదాగా జరుపుకొంటారు. సెల్లార్‌లో పెద్ద పెద్ద ముగ్గులేసి రంగులు నింపుతారు. కేటరింగ్‌కి ఆర్డరిచ్చి అందరూ కలిసి పండగ భోజనం చేస్తారు. పిల్లలకు ముగ్గుల పోటీలూ పతంగుల పోటీలూ పెడతారు. మా అపార్ట్‌మెంట్లో అలా చేసుకోకపోయినా పండగనాడు పులిహోరా, గారెలూ, చక్కెరపొంగలీ అన్నీ స్వగృహాలో తెచ్చుకుంటాం. అయినా ఏదో వెలితి. ఇతర పండగలేమో కానీ సంక్రాంతి మాత్రం నగరంలో పండగలాగా ఉండదు. రోజంతా ఊరి సంగతులు సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లా మనసంతా గింగిరాలు తిరుగుతుంటాయి.
పండగంటే పిండివంటలూ కొత్తబట్టలే కాదుగా... ఎన్ని పనులు చేసేవాళ్లం! మామయ్య ఎడ్లను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులేసేవాడు. జాతరలో కొన్న రంగురంగుల ఊలు కుచ్చుల్ని కొమ్ములకు తగిలించేవాడు. లేగదూడల మెడలో మువ్వల పట్టీలు కట్టడం నా వంతు. పక్క ఊళ్లో ప్రభల ఊరేగింపుని ఎడ్లబండి కట్టుకుని వెళ్లి చూసొచ్చేవాళ్లం. పండగ నాడు ఎడ్లకు కూడా ప్రత్యేకంగా
ఉలవ గుగ్గిళ్లు పెట్టించేవాడు తాతయ్య. ఎడ్ల పందాలూ కోడి పందాలూ అంటే తాతయ్యకు కోపం. వాటిని బాధపెట్టడం తగదనేవాడు. అందుకని ఆయనకు తెలియకుండా మామయ్య చాటుగా ఆ పందాలు చూడడానికి వెళ్లివచ్చేవాడు. గంగిరెద్దుల వాళ్లూ, హరిదాసులూ వచ్చినప్పుడల్లా వారికి బియ్యం పోయడానికి పిల్లలం పోటీ పడేవాళ్లం.
నిద్రలో కలలూ, మెలకువ వస్తే జ్ఞాపకాలూ... మొత్తానికి ఊరి ప్రయాణం ఏమో కానీ మనసు మాత్రం టైమ్ మెషీన్‌లో గతమూ, వర్తమానాల మధ్య తెగ తిరిగేసింది. తెలతెలవారుతోంది. పొగమంచు మధ్య దూరంగా అక్కడోటీ ఇక్కడోటీ విసిరేసినట్లుగా పల్లెలు కన్పిస్తున్నాయి. మరికాసేపైతే ఊరు వచ్చేస్తుంది. ఊహూ ఊరు రాదు... మేమే ఊరికొచ్చేస్తున్నాం.
ఇదీ... మా ఊరే!
ఊరు చేరుకున్నాం. కాకపోతే అది మా ఊరేనని గుర్తు పట్టడానికి కాస్త సమయం పట్టింది. నా జ్ఞాపకాల్లోని ఊరికీ ఇప్పటి ఊరికీ చాలా మార్పు ఉంది. ఊరికి కాస్త ముందుగానే రోడ్డు పక్కగా పెద్ద రావిచెట్టుకింద ఓ ఆంజనేయ విగ్రహం ఉండేది. బడినుంచి వస్తూ రోజూ కాసేపు ఆ చప్టా మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. పరీక్షలప్పుడు దణ్ణం పెట్టుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడక్కడో చిన్న గుడి కట్టేశారు. ఊరి మొదట్లో ఉండే కరణంగారి పెంకుటిల్లు రెండంతస్తుల డాబా అయింది. కరణంగారూ లేరు కరణీకమూ లేదు కానీ ఆ ఇంటి పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది. కొన్ని ఇళ్ల వాకిళ్లలో ట్రాక్టర్లూ కార్లూ కన్పిస్తున్నాయి. అదిగో మా బడి. దాని పక్కనే బస్టాండు. మేం చదువుకున్న పాత బిల్డింగుని అలాగే ఉంచి పక్కన కొత్తది కట్టించారు కాదు, కట్టించాము. మీకు చెప్పలేదు కదూ మా ఊరికో ఫేస్‌బుక్ పేజీ ఉంది. ఊళ్లో జరిగే పనులన్నిటి గురించీ సర్పంచి అందులో రాస్తుంటాడు. సర్పంచి యువకుడు. అగ్రికల్చర్ బీఎస్‌సీ చదివి వ్యవసాయం చేస్తున్నాడు. ఊరిని అభివృద్ధి చేయాలని చాలా కోరిక. సోషల్‌మీడియాలో ఊరి వారందరినీ ఒక్కతాటిమీదికి తెచ్చాడు. అలా మా ఊరి అభివృద్ధిలో మేమూ పాలుపంచుకుంటున్నాం. నేనే కాదు, అప్పటి నాతోటివారు చాలామంది కూడా ఈసారి పండక్కి ఊరికొస్తున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌మీడియాలోనే టచ్‌లో ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నాం.
రోజులు క్షణాల్లా...
ఇంటి నిండా బంధువులూ ఊరి నిండా స్నేహితులూ... మూడు రోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. భోగినాడు పొద్దున్నే భోగిమంటలు వేశాం. చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగిపళ్లు పోశాం. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఒక్కచోట చేర్చి బొమ్మలకొలువు తీర్చాం. ఎవరికీ ఒళ్లు అలవకుండా అందరమూ అన్ని పనులూ చేసేశాం. రాత్రి రెండింటివరకూ కబుర్లూ మళ్లీ పొద్దున్నే ఐదింటికే కాఫీలూ... ఊరికి వెళ్దామంటే బుంగమూతి పెట్టిన పిల్లలు వచ్చాక మాతో మాట్లాడింది లేదు. వైఫై ఉన్నా ఏ పది నిమిషాలో తప్ప ఫోను పట్టుకోలేదు.
చుట్టాలందరినీ వరస కలిపి పరిచయం చేస్తే మనకు ఇంతమంది బంధువులున్నారా... అంటూ ఆశ్చర్యపోయారు. అందరితో సెల్ఫీలు దిగి ఆడుకోడానికి వెళ్లిపోయారు. నగరంలోని సౌకర్యాలనూ పల్లెటూరి సౌందర్యాలనూ
కలబోసినట్లున్న ఊరు వారికి బాగా నచ్చేసింది. బోలెడంతమంది స్నేహితులను చేసేసుకున్నారు. నేనూ నా మిత్రబృందాన్ని కలుసుకున్నాను. పెద్దలమంతా కాసేపు పిల్లలమైపోయి చిన్ననాటి స్నేహాలను గుర్తుచేసుకున్నాం. కుటుంబాలను పరిచయం చేసుకుని అడ్రసులు ఇచ్చిపుచ్చుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఓ తీర్మానం చేసుకున్నాం... ప్రతి సంక్రాంతికీ ఊరికి రావాలనీ, అందరమూ కలుసుకోవాలనీ.
మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్లే నలుగురు ఉంటే దినమూ కనుమే కాదా..!
అని పాడుకుంటూ జ్ఞాపకాల మధురోహల్లో చిక్కుకుపోయిన మనసును బలవంతంగా లాక్కుని కనుమ మర్నాడైనా తిరుగుప్రయాణం కాక తప్పదు. అయినా పర్వాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ కలుస్తాం కాబట్టి సంతోషంగానే బయల్దేరతాం.
అదే పండగ... పేరే వేరు!
తెలుగు లోగిళ్లలోనే కాదు, సంక్రాంతి భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద పండుగే. లోహ్రీ, ఉత్తరాయణ్, మకర సంక్రమణ్, తై పొంగల్, మాఘీ, కిచ్‌డీ, పౌష్ సంక్రాంతి... ఇలా పేర్లు మాత్రమే వేరు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పండగకి చేసుకునే ప్రత్యేక వంటల్లో పాయసం ఉంటుంది. పంజాబీలు పాయసంలో చక్కెర/బెల్లం బదులు చెరుకురసం వాడతారు. నువ్వులూ, నెయ్యీ అందరి వంటకాల్లో తప్పనిసరిగా ఉంటాయి. దిల్లీ, హరియాణా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహిత అయిన కుమార్తెకూ, ఆమె మెట్టినింటివారికీ పుట్టింటివారు బట్టలు పెట్టడం ఆనవాయితీ. పంజాబ్‌లో ఉదయమే నదీ స్నానం చేసి నువ్వుల నూనెతో దీపం పెడతారు. రాజస్థాన్‌లో కొత్తగా పెళ్లయిన కూతుర్నీ అల్లుణ్నీ ఆహ్వానించి పెద్ద ఎత్తున విందు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేయడం గుజరాత్, రాజస్థాన్‌లలో ఎక్కువ. తమిళనాడులో మార్గళి చివరి రోజున భోగితో మొదలుపెట్టి నాలుగు రోజుల తై పొంగల్ పండగ జరుపుకొంటారు. కర్ణాటక, రాజస్థాన్‌లలో వివాహిత మహిళలు వాయనాలు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. అస్సాంలో ‘బిహు’ పండగకి వెదురుతో గుడిసెలు వేసి అందులో విందులు చేస్తారు. మర్నాడు వాటిని తగలబెట్టేస్తారు. పాత వైరాలు మర్చిపోయి స్నేహంగా ఉందామంటూ మహారాష్ట్రలో నువ్వుండలను పంచుతారు. పశ్చిమ్‌బంగా, ఒడిశా, బిహార్, హిమాచల్... ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండగను అదే రోజున ఏదో ఒక రూపంలో జరుపుకోవడం భిన్నత్వంలో ఏకత్వంగా పిలుచుకునే భారతీయతకు అద్దం పడుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565